ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్

ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు.

ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ (9 ఏప్రిల్ 1899 – 25 మార్చి 1975) ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇతడు 1920-1940ల మధ్యకాలంలో అనేక సంగీత ప్రదర్శనలు చేశాడు. కచేరీలు చేయడం మానుకొన్న తర్వాత కర్ణాటక సంగీత గురువుగా శాస్త్రీయ సంగీత ప్రపంచంలో తలమానికంగా నిలిచాడు. ఇతని భావయుక్తమైన గీతాలాపన కొన్ని తరాలవరకూ సంగీతకారులకు కొలబద్దగా పనిచేసింది. 20వ శతాబ్దపు సంగీత విద్వాంసులలో ఇతని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్
తపాలాబిళ్ళపై సుబ్రహ్మణ్య అయ్యర్
జననం9 ఏప్రిల్ 1899
బొమ్మలపాళ్యం, తిరుచిరాపల్లి జిల్లా, తమిళనాడు
మరణం1975 మార్చి 25(1975-03-25) (వయసు 75)
వృత్తికర్ణాటక గాత్రవిద్వాంసుడు
జీవిత భాగస్వామినాగలక్ష్మి
తల్లిదండ్రులుశంకరశాస్త్రి, సీతాలక్ష్మి

ఆరంభ జీవితం, వృత్తి

మార్చు

ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ తమిళనాడు రాష్ట్రం, తిరుచిరాపల్లి జిల్లా, బొమ్మలపాళ్యం అనే గ్రామంలో 1899, ఏప్రిల్ 9న ఒక పేదకుటుంబంలో జన్మించాడు.ఇతని తండ్రి శంకరశాస్త్రి సంస్కృత పండితుడు. తల్లి సీతాలక్ష్మి ఇతని బాల్యంలోనే మరణించింది. ఇతడు తన 14వ యేట నాగలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఇతడు 17వ యేటికే ఇంగ్లీషులో బాగా చదవడం, మాట్లాడటం, వాయటం నేర్చుకున్నాడు. ఆ రోజులలో పేరుపొందిన నటగాయకుడు ఎస్.జి.కిట్టప్ప ప్రేరణతో ఇతడు సంగీతం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. కిట్టప్ప పాడిన పాటలను ఇతడు అలవోకగా అనుకరించేవాడు. ఇతడు మొదట సంగీతాభ్యాసం ఎస్.నారాయణస్వామి అయ్యర్ వద్ద రెండు సంవత్సారాలు చేశాడు. తరువాత మద్రాసు వెళ్ళి అక్కడ వయొలిన్ విద్వాంసుడు కరూరు చిన్నస్వామి అయ్యర్ వద్ద పట్టుదలగా నేర్చుకోవడానికి చేరాడు. అయితే చిన్నస్వామి అయ్యర్‌కు సమయం సరిపోనందువల్ల ఇతడిని టి.ఎస్.సభేశ అయ్యర్ వద్దకు పంపాడు. ఇతడు సభేశ అయ్యర్ వద్ద 9 సంవత్సరాలు సంప్రదాయ గురుశిష్య పరంపర పద్దతిలో సంగీతాన్ని అభ్యసించాడు. ముఖ్యంగా నెరవల్ పద్దతిలో ఆలాపన చేయడం నేర్చుకున్నాడు.

ఇతడు తన మొదటి కచేరీ 1920లో మద్రాసులో చేశాడు. ఇతడు కేవలం 10 సంవత్సరాలలోనే దేశవ్యాప్తంగా కర్ణాటక విద్వాంసుడిగా పేరుగడించాడు.

ఇతని 78ఆర్.పి.ఎం.గ్రామఫోను రికార్డులు చాలా ప్రచారంలోని వచ్చాయి. నగుమోము కృతిని మొదలుకొని అన్ని రికార్డులు ఎక్కువగా అమ్ముడుపోయాయి. ఇతనికి ముందు నగుమోము కీర్తనను అందరూ ఆభేరి రాగంలో ఆలపించేవారు. కర్ణాటక వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి ఈ కీర్తనను ఆభేరి రాగంలో వ్రాశాడని అందరూ భావిస్తారు. అయితే ఈ కీర్తన దేవగాంధారి రాగంలో అయితే ఎక్కువ భావావేశాన్ని కలిగి ఉంటుందని భావించి ఆ రాగంలో పాడాడు. ఛాందసవాదులు ఇలా త్యాగరాజస్వామి కీర్తనను అసలైన రాగంలో కాక మరొక రాగంలో పాడటాన్ని జీర్ణించుకోలేక పోయారు. అయితే సుబ్రహ్మణ్య అయ్యర్ వారి విమర్శలను లెక్కచేయక తన నిర్ణయానికే కట్టుబడి కర్ణాటక దేవగాంధారి రాగంలోనే ఆలపించేవాడు. నిజానికి నగుమోము కీర్తన దేవగాంధారి రాగంలోనే చక్కగా ఇమడడంతో బెంగుళూరు నాగరత్నమ్మ,ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, భానుమతీ రామకృష్ణ మొదలైన వారందరూ "ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్" బాటలోనే నడవసాగారు.ఈ కీర్తనతో పాటు సరస్వతి మనోహరిరాగంలో ఎంత వేడుకొందు, తోడి రాగంలో ఎందు దాగినదో, కాంభోజి రాగంలో తిరువాడి శరణం, ముఖారి రాగంలో ఎన్రైక్కి శివకృపై, వృత్త షెంజదై అదా రాగమాలిక మొదలైన కీర్తనలు ఇతనికి పేరు తెచ్చిపెట్టాయి.

ఇతడు 1938లో విడుదలైన తుకారాం సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా ప్రింట్లు ఇప్పుడు లభ్యం కాకపోయినా దానిలో ఇతడు పాడిన పాటలు నేటికీ వినిపిస్తున్నాయి. 1945లో తన 46 యేళ్ళ వయసులో ఇతడు కచేరీలలో పాల్గొనడానికి స్వస్తి పలికాడు.

అయితే ఇతడు కర్ణాటక సంగీతంతో అనుబంధాన్ని మాత్రం వదులుకోలేదు. 1949లో ఇతడు మద్రాసులోని కేంద్ర కర్ణాటక సంగీత కళాశాలకు మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా చేరి 1965 వరకు ఆ పదవిలో కొనసాగాడు. తిరువయ్యూరులో త్యాగరాయ ఆరాధనోత్సవాలను నిర్వహించే శ్రీ త్యాగరాయ బ్రహ్మ మహోత్సవ సభకు ఇతడు గౌరవ కార్యదర్శిగా, కోశాధికారిగా ఉన్నాడు.

కర్ణాటక సంగీతంలో స్థానం

మార్చు

ఇతడు హెచ్చు శృతిలో, భావయుక్తంగా, పాడిన ప్రతి పాటను ఆవేశంతో పాడేవాడు. అనేక కీర్తనలకు ఇతడి పాఠాంతరాలు తమదైన ముద్రను కలిగి ఉండి వాటిని అతని శిష్యబృందం ఆలపించినప్పుడు సులభంగా గుర్తించ గలిగేవారు. ఇతడు నెరవల్ ఆలాపనలోను, విలంబ సంగీతంలోను నిపుణుడిగా పేరుపొందాడు. ఇతని సమకాలీకుడైన సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ ఇతడిని తమ వృత్తికి గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తిగా ప్రశంసించాడు.

ఇతడు గాయకునిగానే కాకుండా సంగీత గురువుగా కూడా ప్రశంసలందుకున్నాదు. ఇతడు ఇంటి వద్ద అనేక మంది శిష్యులకు తర్ఫీదునిచ్చాడు. ఇతని "శిష్య పరంపర" బాగా గుర్తింపును తెచ్చుకుంది. ఇతడూ కీర్తనలు నేర్పించే తీరు "ముసిరి స్కూల్" గా పిలువబడింది. ఇతని శిష్యులలో ఎన్.రాజం, ముసిరి ఎం.ఆర్.గోపాలరత్నం, టి.కె.గోవిందరావు, బాంబే సిస్టర్స్ సి.సరోజ & సి.లలిత, తైలంబ కృష్ణన్, మణి కృష్ణస్వామి, కె.ఎస్.వెంకటరామన్, సుగుణ పురుషోత్తమన్, సుగుణా వరదాచారి మొదలైన వారున్నారు. కె.గాయత్రి, విద్యా కళ్యాణరామన్, ప్రసన్న వెంకట్రామన్, జయం వెంకటేశ్వరన్ మొదలైన వారు ఇతని బాణీని అనుసరిస్తున్నారు.

అవార్డులు

మార్చు

మద్రాసు సంగీత అకాడమీ సంగీత కళానిధి పురస్కారం నెలకొల్పడానికి ముందు ఆ సంస్థ జరిపే వార్షిక సభలకు అధ్యక్షునిగా ఆహ్వానించడం ఆ సంగీత కళాకారునికి ఇచ్చే అత్యంత గౌరవంగా భావించేవారు. 1939లో జరిగిన మద్రాసు సంగీత అకాడమీ వార్షిక సమావేశానికి ఇతడిని అధ్యక్షునిగా ఆహ్వానించి గౌరవించారు. 1942లో సంగీత కళానిధి పురస్కారం ప్రారంభించిన వెంటనే ఈ పురస్కారాన్ని ఇతనికి 1939 సంవత్సరానికి ప్రకటించారు. ఈ పురస్కారం పొందిన పిన్నవయస్కుడిగా (39 సంవత్సరాలు) ఇతడు రికార్డు సృష్టించాడు. 1957లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి కర్ణాటక గాత్ర సంగీతంలో అవార్డును ప్రకటించింది.[1] తమిళ్ ఇసై సంఘం ఇతనికి 1963లో ఇసై పేరరిజ్ఞర్ పురస్కారాన్ని ఇచ్చింది. ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, మద్రాసు ఇతనికి "సంగీత కళాశిఖామణి" బిరుదును ప్రదానం చేసింది. 1967లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ను ప్రకటించింది. 1971లో భారత ప్రభుత్వం ఇతడికి పద్మభూషణ్ పురస్కారం ప్రకటించి సత్కరించింది. తమిళనాడులో కొన్ని వీధులకు ఇతని పేరు పెట్టి గౌరవించుకున్నారు. 1999 భారత తంతి తపాలాశాఖ ఇతని స్మారక తపాలాబిళ్ళను విడుదలచేసింది.

మూలాలు

మార్చు
  1. "సంగీత నాటక అకాడమీ అవార్డు సైటేషన్". Archived from the original on 2017-09-09. Retrieved 2021-02-10.

ఇవి చదవండి

మార్చు