పులి వేషం

(పులివేషం నుండి దారిమార్పు చెందింది)
పులివేషం
నెమలినృత్యం
ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భాగంగా 2019 ఆగస్టు 31న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో పులివేషం కళాకారుల ప్రదర్శన

గద్దరించే పెద్దపులి నృత్యం

మార్చు

పులివేషం శతాబ్దాలుగా ఆంధ్ర దేశంలో వర్థిల్లుతూన్న జానపద కళా రూపం. దీనినే వేత నృత్యమని కూడ పిలుస్తూ వుంటారు. హిందూ, ముస్లిం అనే మత వివక్షత లేకుండా, హిందువులు దసరా, సంక్రాంతి ఉత్సవాలలోనూ ముస్లిములు పీర్ల పండుగ, మొహరం సందర్భాల్లోనూ ఏదైనా ఆపద వచ్చినప్పుడూ లేదా జబ్బు చేసినప్పుడూ, పులి వేషం వేస్తామని పీర్లకు మొక్కుతూ వుంటారు మహమ్మదీయులు.

ఈనాడు పులి నృత్యాలు అంతగా ప్రదారంలో లేక పోయినా, ఒకప్పడు ఆంధ్ర దేశంలో ప్రతి పల్లె లోనూ ఈ పులి నృత్యాలను చూసి వుంటారు.

జంతు నృత్యాల అనుకరణ

మార్చు

పులి వేషం జంతు నృతుయాలకు అనుకరణ, నెమలి నృత్యం, గరుడ నృత్యం, సింహ నృత్యం, అశ్వ నృత్యం మాదిరే ఈ పులి నృత్యం కూడా, పులి నృత్యాన్ని ఎక్కువగా ప్రాచారంలోకి తెచ్చిన వారు పల్లె ప్రజలు. దక్షిణ దేశంలో ఈ పులి వేషాన్ని, పులి వాలకోలు అనడం కద్దు. ఆంధ్ర దేశంలో పులి వేషమనీ, పెద్ద పులి వేషమనీ, దసరా పులి వేషమనీ పిలుస్తూ వుంటారు. పులి వేషాల వారు వారి వారి నైపుణాన్ని వీథుల్లో ప్రదర్శించి ఆ తరువాత ఇంటింటికీ తిరిగి యాచిస్తూ వుంటారు. పిల్లలు, పెద్దలు భయపడేటంత సహజంఆ పెద్దపులి నృత్యంలో తమ నైపుణ్యాన్ని చూపిస్తారు. పులి వేషం గ్రామంలో బయలు దేరిందంటే పిల్లలకీ, పెద్దలకీ అదొక పండగ.

వేష ధారణ

మార్చు

పులి వేష ధారణ చాల కష్టమైది. మామూలు వేషాల్లాగ, ఎదో ముఖానికి ఇంత రంగు పూసి తుడిచి వేయడం లాంటిది కాదు. శరీరంలో అన్ని భాగాలనూ వార్నీషు రంగులతో ముంచి వేస్తారు. వార్నీషుతో గానీ, కర్పూర తైలంతో గానీ, పసుపు రంగు పొడి కలిపి, శరీర్ఫమంతా చిత్రిస్తారు. రంగుతో చారలను చిత్రిస్తారు. ఈ నల్లటి చారలు వల్ల పెద్ద పులి ఆకారం వస్తుంది. తలకు, కరాణం, మాస్క్ ధరిస్తారు. వీటిలో రెండు రకాలున్నాయి. ఒకటి తోలుతో కుట్టబడిన పెద్దపులి తల ఆకారాన్ని కలిగి వుంటుంది. రెండవది, ముఖాన్ని కూడ కప్పబడే పులి తల మాదిరి కవచాన్ని ధరిస్తారు. అయితే సర్వ సాధారణంగా తలకు మాత్రం పులి తల ఆకారాన్ని తగిలించి, కళ్ళకు నల్ల కళ్ళ అద్దాలను ధరిస్తారు. మొలకు లంగోటీని ధరిస్తారు. నడుముకు బెల్టు వేసి ఆ బెల్టుకు వెదురు బద్దలతో ఎటుపడితే అటు వంగ గల పులి తోకను తయారు చేసి, తోక చివర గుండ్రని ఆకారంలో రంగు కాగితాలతో అలంకరించ బడిన బుట్టను తయారు చేస్తారు. ఆ తోకను మరొకరు పట్టుకుంటారు.

 
2018 భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, పులివేషం కళాకారుల ప్రదర్శన

హంగులన్నీ సమకూర్చుకున్న తరువాత ఈ పులి వేషం బజారులోకి వస్తుంది. నిజంగా పెద్ద పులే వచ్చిందా అన్నంత భ్రమలో ముంచేది.

డప్పుల హంగు

మార్చు

పెద్ద పులి ప్రవేశానికి హంగుగా రెండు డప్పులు గంభీర ధ్వనులు చేస్తూ వుంటే, ఆ ధ్వనులతో ఉత్తేజం పొందిన పులి వేష ధారి, హుందా అయిన పులి నడకలతో గంభీరపు చూపులతో వాయిద్యానికి తగినట్లు నృత్యం చేస్తూ చికు చిక్కు చిక్కు చికు చిక్కు అంటూ ఎగిరి పల్టీలు కొడుతూ ఉధృత వాయిద్యానికి అనుగుణంగా నృత్యం చేస్తూ, పిల్ల జంతువులను వేటాడినట్లు ఆకలి గొన్న పులి లాగా వివిధ చేష్టలు చేస్తూ, పొంచి వుండి ఆమాంతం ఏ మేక పిల్లనో నోటితో కరచి పట్టి నట్లు నటిస్తారు. ఒక్కొక్క సారి ఇరువురు పులి వేషాలను ధరించి ఎదురు బొదురుగా నిలబడి రెండు పులులూ పోట్లాడు కుంటున్నట్లు వాయిద్యాల ధ్వనులతో భయంకరంగా పోట్లాడుతూ ఎగిరి గంతులు వేస్తూ, తొడగొట్టి అరుపులతో, కేకలతో నానా హంగామా చేస్తారు. ఈ నృత్యంలో పెద్దపులి - వేటగాడు అనె రెండు పాత్రలు ప్రవేశిస్తాయి. వేట గాడు పులిని చంపాలనే, ఎత్తులతో పులి వేషాన్ని కవ్విస్తూ వివిధ వాయిద్య గతుల్లో అడుగులు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ బరిసెతో పులిని చంపడానికి ఎగిరి గంతేస్తాడు. తప్పించు కోవడానికి పులి వేష ధారి ఎగిరి పల్టీలు కొడుతాడు. ఇలా రెండు పాత్రలూ ప్రజలకు ఉత్తేజం కలిగిస్తూ చివరికి పులిని వధించి నట్లు కొందరు చూపుతారు. చని పోయేముందు పులి, వేటగాని మీదకు లంఘించి అతని గాయ పరిచినట్లు చూపుతారు.

అడవిలో పులి:

మార్చు

మరి కొందరు ఒక రెండెడ్ల బండి మీద కొమ్మలు, ఆకులు, వగైరాలతో అడవిలా అమరుస్తారు. ఆ బండి మీద అడవి మధ్య పులి వేషం పచార్లు చేస్తూ బండి మీద కలియ దిరుగుతూ వుంటుంది. నేల మీద వేటగాడు పులిని కొట్టాలని, తప్పించు కోలాలని పులి, చివరకు దెబ్బతిన్న పులి వేటగాని మీదకు ఉరక బోయినట్లు విలయ తాండవం చేసి చని పోయి నట్లు నటిస్తారు. పులి నృత్యానికి హంగుగా వున్న డప్పు వాయిద్య కాండ్రు కాళ్ళకు గజ్జలు కట్టి, పులి నృత్యానికి అనుగుణంగా వెఱ్ఱి ఆవేశంతో నృత్యం చేస్తారు. బహిరంగ ప్రదేశంలో జరిగే ఈ పులి నృత్య ప్రదర్శనానికి ఊరు ఊరంతా కదలి వస్తారు. ప్రేక్షకుల్ని చూచిన కొద్దీ పులి వేష గాళ్ళు ఉత్తేజంగా అడుగులు వేస్తూ వుంటే ప్రేక్షకుల్లో కొందరు, ఈలలతో చప్పట్లతో, కేకలతో హుషారు చేస్తారు. పులి వేషధారి అప్పుడప్పుడు చుట్టు మూగి విన్న పిల్లల్ని భయపెడుతూ వుంటాడు. పులి వేషధారి నృత్యం చేసే టప్పుడు రెండు చేతుల్లోనూ రెండు నిమ్మకాయలను పుంచు కుంటూ, నిమ్మరసం మింగి తన దాహాన్ని, అదుపులో పెట్టుకుంటాడు.

పులి వేష ధారి ఎండలో నృత్యం చేసే టప్పుడు తాన వంటికి పూసుకున్న వార్నీషు రంగులు బిర్రున బిగదీస్తాయి. చర్మం మంట పుడుతుంది. ఉపశమనంగా కడవలతో నీళ్ళు పోసుకుని తాపాన్ని పోగొట్టుకుంటాడు. వేషం ధరిస్తే వారం రోజులు అలాగే వుంచుకుంటాడు. ఈ పులి వేషాన్ని మంచి చిత్రకారులు అతి సహజంగా చిత్రీకరిస్తారు. చివరి రోజున ఇంటింటికీ తిరిగి పారితోషాకలను పొందుతారు. తరువాత కిరసనాయిలు తో, ఆ రంగు వదిలించి స్నానం చేస్తారు. ఈ నృత్యాన్ని ఎవరు పడితే వారు చేయలేరు. బాగా వ్వాయామం చేసి కండలు తిరిగిన యువకులే పులి వేషాన్ని ధరిస్తారు. ఈ నృత్యంలో అత్యంత ప్రావీణ్యాన్ని చూపించే పులి వేషధారులు విజయనరంలో వుండే వారు. ప్రజలను అలరించి ఆనంద పర్చే కళా రూపాలలో పులి నృత్యం ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పులి_వేషం&oldid=4351122" నుండి వెలికితీశారు