లక్కవరం (మలికిపురం)

ఆంధ్రప్రదేశ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండల గ్రామం

లక్కవరం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలానికి చెందిన గ్రామం.[1]

లక్కవరం
—  రెవిన్యూ గ్రామం  —
లక్కవరం is located in Andhra Pradesh
లక్కవరం
లక్కవరం
అక్షాంశరేఖాంశాలు: 16°24′34″N 81°48′12″E / 16.4094°N 81.8033°E / 16.4094; 81.8033
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కోనసీమ
మండలం మలికిపురం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,944
 - పురుషులు 3,436
 - స్త్రీలు 3,508
 - గృహాల సంఖ్య 1,808
పిన్ కోడ్ 533254
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన మలికిపురం నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నరసాపురం నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,780.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,372, మహిళల సంఖ్య 3,408, గ్రామంలో నివాస గృహాలు 1,700 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1807 ఇళ్లతో, 6944 జనాభాతో 507 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3436, ఆడవారి సంఖ్య 3508. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1671 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 40. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587844[3].పిన్ కోడ్: 533254.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల  ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మలికిపురంలోను, ఇంజనీరింగ్ కళాశాల నర్సాపురంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల అమలాపురంలోను, పాలీటెక్నిక్‌ పోడూరులోను, మేనేజిమెంటు కళాశాల నర్సాపురంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల శివకోడులోను, అనియత విద్యా కేంద్రం అమలాపురంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజోలు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

లక్కవరంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

లక్కవరంలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

లక్కవరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 82 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 30 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 395 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 134 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 261 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

లక్కవరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 261 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

లక్కవరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

వరి

పారిశ్రామిక ఉత్పత్తులు మార్చు

ఇటుకలు, నార ఉత్పత్తులు

చేతివృత్తులవారి ఉత్పత్తులు మార్చు

లేసుల అల్లిక

శ్రీ వేణు గోపాలస్వామి దేవాలయం మార్చు

తూర్పు గోదావరి జిల్లా తాటిపాక సీమ అనబడే రాజోలు మండలంలో లక్కవరం గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ప్రసిద్ధమైనది. చుట్టూ ప్రాకారం, ధ్వజస్తంభం, వైభావాత్మక కళలతో అందంగా ఉన్న గర్భాలయం, కళ్ళను ఆకర్షించే చిత్రాలు ఉంటాయి. ముందు భాగంలో ముఖమంటపం కళ్యాణ మండపం ఉంటాయి. ఆలయ గోపురం రమ్యంగా చూడముచ్చటగా ఉంటుంది. ఆలయంలో జయ ఘంట నాదం ఓంకారధ్వనితో వీనులకు విందు చేస్తుంది. మనసుకు హత్తుకొనే శిఖరాలున్నాయి. స్వామి పూజకు పెంచిన పూలతోట వివిధరకాల పుష్పాలతో అలరారుతుంది. ఆలయ ద్వార బంధం దాటీగా ఉంటుంది. దానికున్న తలుపులలో చిరు ఘంటల రవళి మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. స్వామి ఊరేగింపునకు ఉపయోగపడే అనేక వాహనాల వరుస నయనమనోహరం. స్వామి ఉత్సవ విగ్రహాలు వెలలేని శోభతో ఆగమ రీతిలో ఉంటాయి. స్వాములకు పట్టేతెల్లగొడుగుల కాంతి శరత్కాల పౌర్ణమి చంద్రకాంతితో ధగదగ మెరుస్తాయి. వెండి వింజామరలు స్వామికి మలయా నిలం అందిస్తాయమంగళ తోరణాలు శుభప్రదమై కాంతు లీనుతూ కనిపిస్తాయి.

గర్భ గృహంలో సకల సౌభాగ్య శృంగార సంయుతమైన ఎత్తైన పీఠంపై ముద్దులొలికే శ్రీ రుక్మిణీ సత్యభామల మధ్య శ్రీ వేణుగోపాలస్వామి నయనా నందకరంగా ముద్దులు మూటకట్టుతూ, భక్తులకు కొంగు బంగారంగా భక్త వరదుడుగా దర్శన మిస్తాడు. వేణు గోపాల స్వామి ఆలయానికి శంఖు చక్రాలు ధరించిన జయవిజయ అనే ద్వార పాలకులు ఇరువైపులా ఉంటారు. వేణుగోపాల స్వామికి తూర్పు దిశలో పరమ భక్తాగ్రగాన్యుడు స్వామి వాహనం అయిన వైనతేయుడు పరమ భక్తతో వందనం చేస్తూ దర్శన మిస్తాడు. నంద దీపాలు స్వామికి  భక్తజనులకు ఆనంద సంధాయకంగా ఉంటాయి.

శ్రీ కృష్ణాష్టమి నాడు అశేష భక్తజన సందోహం స్వామి వార్లను దర్శించి పూజించి తరిస్తారు. ఆలయంలో నిత్య అస్టోత్తర, సహస్రనామ పూజ ధూప దీప నైవేద్యాలు, భోగాలు వైభవంగా రెండు పూటలా జరుగుతాయి. స్వామి వారల ఏకాంత సేవ చూసి తరించాల్సిందే. ధనుర్మాసంలో నిత్య ప్రాతః పూదికాలు, అత్యంత వైభవంగా గోదాదేవి కల్యాణం నిర్వహిస్తారు. సంక్రాంతి పర్వదినాన ఆలయ ధర్మకర్త వంశ స్త్రీలంతా ఆలయానికి విచ్చేసి స్వామిని మనసారా అర్చిస్తారు. ఆలయం నిత్యపూజలు నిత్యభోగాలు, చక్రపొంగలి, వేణు పొంగలి పులిహోర వంటి ప్రసాదాలతో కలియుగ వైకుంఠం లాగా కనిపిస్తుంది, వైశాఖ శుద్ధ ఏకాదశినాడు ఉభయ దేవేరులతో శ్రీ వేణు గోపాలస్వామి కల్యాణం రంగరంగ  వైభవంగా నిర్వహిస్తారు.

ఈ ఆలయానికి ఇరువైపులా రెండు చిన్న దేవాలయాలున్నాయి. ఒకదేవాలయం శ్రీ లక్ష్మీ దేవి, మరియొకదానిలో శ్రీ జానకీ రామ లక్ష్మణుల దివ్య విగ్రహాలు భక్తానుగ్రహంగా ఉంటారు. ఆలయ ధర్మకర్తలు మంగెన వంశం వారు.1921 దుర్మతి నామ సంవత్సర వైశాఖ బహుళ దశమి బుధవారం ఉదయం 8-04 గంటలకు ఉత్తరాభాద్ర నక్షత్ర యుక్త మిధున లగ్నంలో  వీరు నిర్మించిన లక్కవరం అనే బ్రాహ్మణ అగ్రహారంలో శ్రీ వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠించి సర్వాంగ సుందరంగా వైభవోపేతంగా సకల సౌకర్యాలతో ఆలయనిర్మాణం చేశారు. ఆ వంశంలో గంగయగారు ఉత్తముడు  వేణుగోపాల భక్తుడు భార్య సుబ్బాంబ. ఈ దంపతులకు పంచ పాండవుల వంటి బుద్ధిమంతులైన అయిదుగురు కొడుకులు.సర్వారాయుడు,వెంకటస్వామి, ముత్యాలు మొదలైనవారు.

మంగెన వంశం వారు పరమభక్తితో భద్రాద్రి రామదాసులాగా శ్రీ వేణుగోపాల స్వామికి గోపురప్రాకార మంటప వాహనాలు చక్కగా అమర్చారు. చక్కని కోనేరు త్రవ్వించారు. పేదలకు అన్నోదకాలు కల్పించారు. వివాహాదులకు ధన సహాయం అందించారు. బ్రాహ్మణులను ఆదరించి సకల సౌకర్యాలు కల్పించారు. భూతదయతో జాతిమత భేదం లేకుండా అందరి మనసులను రంజింపజేసి కీర్తి పొందారు. ప్రజల క్షేమమే పరమావధిగా జీవించారు.

ఆధారం – లక్కవర శ్రీ వేణుగోపాల శతకం – కవి – భగవత్కవి లక్కాకుల వేంకట రత్నదాసు – నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా కుల్లూరు పురంలో జన్మించారు . తండ్రి రామ చంద్రార్య. తల్లి యరుకలాంబ. కవిగారికి స్వప్నంలో ఈ స్వామి దర్శనమివ్వగా  భక్తితో 180 సీస పద్యాలతో భక్తిజ్ఞాన వైరాగ్య బోధకాలుగా లక్కవర శ్రీ వేణుగోపాల శతకం 1937లో రాసి ధన్యులవగా, మంగెన వంశీకులు దాన్ని ముద్రించి లోకానికి అందించారు. సంక్షిప్తంగా ఆలయ చరిత్ర ధర్మకర్త వంశావళి కూడా రాసి తెలియని విషయాలెన్నో లోకానికి తెలియ జేశారు.’’లక్కవర పురపాల హిరణ్య చేల –వేణు గోపాల రుక్మిణీ ప్రాణ లోల‘’ అనేది మకుటం. ఒకటి రెండు పద్యాలు మచ్చుకు చూద్దాం –

‘’రాధామనోహర మాధవ పరమాత్మ –పరమ పదనివాస శరణు శరణు –పార్ధ సారధి దేవభక్త సంరక్షకా –మురళీధరా శౌరి శరణు శరణు –నారాయణా ,భక్త కల్పద్రుమా –సర్వేశ శ్రీ కృష్ణ శరణు శరణు –మందరోద్ధార ,గోవింద హరే కృష్ణ –పరమార్ధ గోవింద శరణు శరణు –శరణు నీకిదే నిక్కంబు  సారసాక్ష –భక్త హృత్పద్మసంవాస ధర్మవాస –లక్కవర పురపాల హిరణ్య చేల –వేణుగోపాల రుక్మిణీ ప్రాణ లోల ‘’

‘’శారద చంద్రికా సమరుచి హైయంగ -వీణ౦బు నొక చేత  వేడ్క నమర –అమృ తోపమానమై

యలరారు పాయస –భక్తంబు నొక చేత పరిఢవిల్ల –పుండరీక నఖంబు, నిండు చందురు గేరు –కాంతులు మెడక్రింద గంతులిడగ-కనక సూత్ర స్ఫీత ఘంటా వితానంబు –దిసమొల మ్రోగుచు తేజరిల్ల –తల్లి  వెను వెంట ముద్దుగా తప్పటడుగు –లలర దిరిగెడుదివ్య దిగంబరుండు –పద్మ పత్రాక్ష నీవె శ్రీపతి ముకుంద –‘’

‘’సద్గురు పాద కంజాతముల్ సేవింప –కనులేదు వైరాగ్య ఘనసుపదవి –దేశికు నపాదతీర్ధంబు గ్రోలక –గానరాదట్టి విజ్ఞాన మహిమ –దేశి వర్యుని దివ్య ప్రసాదంబు- గొనక కల్గునె భక్త మనన దీక్ష –సద్గురు బోదార్ధ సారంబు దెలియక –కలుగునే ముక్తి యు ఘనతగాను –అట్టి సద్గురు మూర్తి వై యమరు దీవె-నీ గురూప దేశమే నాకు నిత్య సుఖము ––

‘’గోపాల శ్రీ కృష్ణ గోపరిపాలకా –మందర నగధీర మంగళంబు –నీరజ దళ నేత్ర ,నీల తోయద గాత్ర –మౌని సన్నుత పాత్ర మంగళంబు –పాండవ పాలనా ,భక్త జనోద్ధార-మధుసూదనా శౌరి మంగళంబు –కమలామనః ఖేల కాంచనమయ చేల –మహనీయ గుణ శీల మంగళంబు –మన్మధాకార ,యదు వీర మంగళంబు –మాధవాననంత గోవింద మంగళంబు –లక్కవర పుర పాల ,హిరణ్య చేల –వేణు గోపాల రుక్మిణీ ప్రాణ లోల ‘’

అంటూ శతకం పూర్తి చేశారు దాసుకవి.[4] మందార మకరంద మాధుర్యంగా భక్తి తత్వ సుబోధకంగా  పద్యాలున్నాయి. ఈ కవి మనమహాకవుల దృష్టిలో పడక పోవటం ఆశ్చర్యం. భక్తకవిగా పేరు పొందాల్సిన కవి వరేణ్యులు ఈ కవి. వారు ఈదేవాలయ శతకం రాయకపోతే దాని చరిత్ర తెలిసేదికాదు. వారికి ఆంధ్ర సాహితీ లోకం, భక్తజనం రుణపడి ఉంటారు.

మూలాలు మార్చు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-12.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-12.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. https://ia801603.us.archive.org/34/items/in.ernet.dli.2015.331988/2015.331988.Lakkavarashriiveinugoopaala-Shatakamu.pdf