ప్రాకృతిక వ్యవసాయం

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రకృతి సిద్దమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసాయంగా వర్ణించవచ్చు.సేంద్రియ వ్యవసాయం జీవుల వైవిధ్యాన్ని, జీవుల వివిధ దశలను, నెలలో గల సూక్ష్మజీవుల పనితనాన్ని వృద్ది పరుస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయుటకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్నివిస్మరిస్తూ సేద్య, జీవసంబంధ, యాంత్రిక పద్ధతులతో వ్యవసాయం చేయుటకు అవకాశం కల్పిస్తుంది.

సేంద్రీయ వ్యవసాయం మూడు పద్ధతులుగా చెప్పవచ్చు.

మొదటి పద్ధతిలో కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, అనగా ఎండిన ఆవు/గేదె పేడ, ఆకు తుక్కు, వర్మీ కంపోస్టు (వానపాముల), వేప పిండి వంటి పదార్ధాలు వాడి పంటలు పండించడం జరుగుతుంది. ఇది సాధారణ పద్ధతి. ఈ పద్ధతి కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్నది. సేంద్రీయ వ్యవసాయంలో సిక్కిం ముందు స్థానంలో ఉంది.

రెండవ పద్ధతిని గో-ఆధారిత పద్ధతి, సుభాష్ పాలేకర్ పద్ధతి అని అంటారు. ఈ పద్ధతిలో సేంద్రీయ వ్యవసాయం జీవామృతం అను సహజ రసాయనంతో సాగుతుంది. ఇక కీటక నాశానులుగా నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం అను సహజ రసాయనాలు వాడబడతాయి.

మూడొ పద్ధతిని గో-ఆధారిత బహుళ అంచెల వ్యవసాయం ( Multi-Layer farming) ను శాస్త్రీయంగా ఒక సమగ్ర వ్యవసాయ వ్యవస్థగా నిర్వచించవచ్చు, దీనిలో మనం ఒకే భూమిలో (4-5) వివిధ రకాలైన పంటలను, అదే సమయంలో వేర్వేరు ఎత్తులో, వేర్వేరు సమయాల్లో పరిపక్వం చెందుతాయి. శ్రీ ఆకాష్ చౌరాసియా పద్ధతి

ఆవిర్భావం

మార్చు
 
జర్మనీలోని రోస్టాక్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ సంఘం సభ్యులు.. బీట్ రూట్ ఫీల్డ్ నుండి కలుపు మొక్కలను తొలగిస్తూ రైతుకు మద్దతు తెలిపారు

భారతదేశంలో క్రీస్తు పూర్వంనుండి బ్రిటీషు పాలన వరకూ వ్యవసాయం ప్రాకృతికంగానే జరిగిందని చెప్పవచ్చు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విదేశీ కంపెనీలు తమ కృత్రిమ ఎరువులు భారతదేశంలో విక్రయించడంతో రైతులు అత్యధిక దిగుబడులు వచ్చేస్తాయని భ్రమలో రసాయన వ్యవసాయాన్ని ఎంచుకోవడం జరిగింది. అదే హరిత విప్లవం (Green Revolution). మూడు నాలుగు దశాబ్దాలపాటూ ప్రాకృతిక వ్యవసాయం మరుగున పడి రసాయన వ్యవసాయం విరాజిల్లింది

సుమారు 1970వ శకం నుండి రసాయన పురుగుల మందుల ధరలు వందల రెట్లు పెరిగాయి. వీటితో రైతుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కాని వ్యవసాయం వల్ల వచ్చే రాబడి మాత్రం పెరగలేదు. వచ్చిన కొద్దిపాటి ఆదాయం కాస్తా పురుగుల మందులకు - కృత్రిమ ఎరువులకు ఖర్చు అయిపోతున్నది. రైతులు తమ పొలం పనులకు ట్రాక్టరు లేక ఎద్దులు, బండి కొనాలన్నా బ్యాంకులనుండి అప్పులు తీసుకోవలసివస్తున్నది. పురుగుల మందులు, రసాయన ఎరువులు వాడి పండిస్తున్న పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి, ఎన్నో మిత్ర పురుగులు, పక్షులు అంతరించిపోయాయి, భూమి సహజమైన సారాన్ని కోల్పోయి మందులు వాడితేగాని పంటలు పండని స్థితిలోకి వెళ్ళి నిస్సారమైపోయింది. ఆశించినమేరకు చేతికి పంట రాకపోవుటవలన, అప్పులు తీర్చలేక రైతులు ఆత్మ హత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడింది. రైతులు తమ పిల్లలను వ్యవసాయం వైపు మళ్ళకుండా చదువులు చెప్పించి ఉద్యోగాలవైపు, వ్యాపారాల వైపు మళ్ళేలా చేయడం జరుగుచున్నది. అంతే కాకుండా వ్యవసాయ భూములను కూడా రియల్ ఎస్టేట్ చేయడం వలన దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములు తగ్గిపోయి ఆహార ఉత్పత్తి కొరత ఏర్పడి కూరగాయలు-ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ భయంకరమైన కారణాలే రైతులు తిరిగి పూర్వపు సేంద్రీయ వ్యసాయంవైపు వెళ్ళేలా చేశాయి.

పాలేకర్ వ్యవసాయ పద్ధతి

మార్చు
సుభాష్ పాలేకర్
 
సుభాష్ పాలేకర్
జననం(1949-02-02)1949 ఫిబ్రవరి 2
జాతీయతఇండియన్
వృత్తివ్యవసాయ శాస్త్రవేత్త, రైతు, రచయిత
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తత్వశాస్త్రం, సహజ వ్యవసాయం
గుర్తించదగిన సేవలు
'సంపూర్ణ ఆధ్యాత్మిక వ్యవసాయం'

రసాయన ఎరువులు, పురుగుల మందులు, కలుపు మందులు అవసరం లేకుండా ఒక్క దేశీ ఆవుతో 30 ఎకరాల భూమిని సాగుచేయవచ్చు అనేది పాలేకర్ పద్ధతి. పాలేకర్ వ్యవసాయ విధానంలో 4 చక్రాలుంటాయి. అవి బీజామృతం (Seed Dresser), జీవామృతం (Fertilizer), అచ్చాదన (Mulching), వాఫ్స (Water Management). ఈ వ్యవసాయానికి ప్రథమంగా ప్రతి 30 ఎకరాలకి ఒక దేశవాళీ గోవు అవవసరం. ఈ వ్యవసాయానికి ద్రవ జీవామృతం, ఘన జీవామృతం వంటి సేంద్రీయ ఎరువులు, బీజామృతం వంటి విత్తన శుద్ధ రసాయనం, నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కీటక నాశనులు తయారు చేసుకొవాలి.

విత్తన శుద్ధ, సేంద్రీయ ఎరువులు, సేంద్రీయ కీటక నాశనులు

మార్చు

విత్తన శుద్ధ రసాయనం

మార్చు

బీజామృతం

మార్చు

కావాల్సిన పదార్ధాలు -

  • బోరు/బావి/నది నీరు 20 లీటర్లు,
  • నాటు ఆవు మూత్రం 5 లీటర్లు,
  • నాటు ఆవు పేడ 5 కిలోలు (7 రోజులలోపు సేకరించినది),
  • పొడి సున్నం 50 గ్రాములు,
  • పాటిమట్టి/పొలం గట్టు మన్ను దోసెడు.

తయారీ:

  • ఆవు పేడను ఒక పల్చటి గుడ్డలో మూటగా కట్టి 20 లీటర్ల నీరు ఉన్న తొట్టెలో 12 గంటలు ఉంచాలి.
  • ఒక లీటరు నీటిని వేరే పాత్రలో తీసుకొని అందులో 50 గ్రాముల సున్నం కలిపి ఒక రాత్రంతా ఉంచాలి.
  • రెండవ రోజు ఉదయాన్నే నానబెట్టిన పేడ మూటను చేతితో పిసికి ద్రవ సారాన్ని నీటి తొట్టెలో కలపాలి.
  • పేడ నీళ్ళున్న తొట్టెలో పొలం గట్టు మట్టిని పోసి కర్రతో కుడివైపునకు కలియ తిప్పాలి.
  • 5 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని, సున్నపు నీటిని పేడ నీరున్న తొట్టిలో పోసి కలిసిపోయే వరకూ కుడివైపునకు కలియ తిప్పాలి. అన్నీ కలిపిన తర్వాత 12 గంటలపాటు ఉంచాలి.
  • ఈ బీజామృతాన్ని ఒక రాత్రి అలాగే ఉంచి మరునాడు ఉదయం నుంచి 48 గంటలలోపే వాడుకోవాలి.
  • విత్తనాలకు బాగా పట్టించి వాటిని నీడలో ఆరబెట్టుకొని నాటడానికి సిద్ధం చేసుకోవాలి.

[1]

సహజమైన ఎరువులు

మార్చు

జీవామృతం

మార్చు

జీవామృతాన్ని సహజమైన ఎరువుగా చెప్పవచ్చు. ఇది ద్రవ రూపంలోను, ఘన రూపంలోను రైతులు నేరుగా తయారుచేసుకోవచ్చు.

జీవామృతం ద్రవ రూపం:

కావాల్సిన పదార్ధాలు -

  • దేశీ ఆవు పేడ 10 కేజీలు (వారం లోపు సేకరించినది),
  • దేశీ ఆవు మూత్రం 5 నుండి 10 లీటర్లు,
  • బెల్లం/నల్ల బెల్లం 4 కేజీలు / చెరుకు రసం 4 లీటర్లు,
  • ద్విదళ పప్పుల పిండి (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా) 2 కేజీలు,
  • బావి/బోరు/నది నీరు 200 లీటర్లు,
  • పాటి మన్ను / పొలంగట్టు మన్ను దోసెడు.

తయారీ:

  • నీడలో ఉంచిన తొట్టెలో గానీ డ్రమ్ములో గానీ 200 లీటర్ల నీటిలో ఈ పదార్ధాల్నింటినీ కలిపి నీడలో 48 గంటలపాటూ ఉంచాలి.
  • ప్రతి రోజు రెండు మూడు సార్లు కర్రతో కుడివైపునకు త్రిప్పాలి.
  • ఇది కేవలం ఎకరానికి మాత్రమే సరిపోతుంది. ఇలా తయారైన జీవామృతాన్ని 48 గంటల తర్వాత ఒక వారం రోజుల లోపే వాడేయాలి. అవసరమైతే ఎక్కువ మోతాదులో మరలా తయారుచేసుకోవాలి.
  • పంటకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పారేలా చేసి పొలం మొత్తానికి జీవామృతం అందేలా చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో పాటు భూమికి అందిస్తే చాలు.
  • జీవామృతం వాడితే పొలానికి ఎటువంటి ఎరువులు అవసరం ఉండదు.

జీవామృతం ఘన రూపం:

కావాల్సిన పదార్ధాలు -

  • దేశీయ ఆవు పేడ 100 కేజీలు, దేశీ ఆవు మూత్రం 5 లీటర్లు,
  • బెల్లం 2 కేజీలు లేదా చెరుకు రసం 4 లీటర్లు,
  • పప్పు ధాన్యం (శనగ, మినుము, పెసర, ఉలవ) 2 కేజీలు,
  • పొలం గట్టు మన్ను 1/2 కేజీ.

తయారీ: పై పదార్ధాలన్నింటినీ చేతితో బాగా కలిపి 10 రోజులు నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత బాగా చీకిన ఆవు పేడలో కలిపి 1 ఎకరం పొలంలో వెదజల్లి దున్నాలి. పంటకాలం మధ్యలో కూడా ఎకరానికి 100 కేజీల ఘన జీవామృతం వేసి మొక్కలకు ఆహారం అందించాలి.

జీవామృతం మరో ఘన రూపం: కావాల్సిన పదార్ధాలు - 200 కేజీల బాగా చీకిన ఆవు పేడ, తయారుచేసుకున్న 20 లీటర్ల జీవామృతం.

తయారీ: ముందుగా పేడ ఎరువును పలుచగా పరచాలి. తర్వాత జీవామృతాన్ని పరచిన ఎరువుపై చల్లాలి. దీనిని బాగా కలియబెట్టి ఒక కుప్పలా చేసి దానిపై గోనె పట్ట కప్పాలి. 48 గంటలు గడచిన తర్వాత దీనిని పలుచగా చేసి ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత గోనె సంచులలో నిల్వచేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవాలి. ఇలా తయారుచేసుకున్న ఘన జీవామృతం 6 నెలల వరకూ నిల్వవుంటుంది.

కీటక నాశనులు

మార్చు

నీమాస్త్రం

మార్చు

నీమాస్త్రం అనగా వేప (Neem) ప్రధాన ఔషధంగా కలిగిన రసాయనం.

కావాల్సిన పదార్ధాలు -

  • 200 లీటర్ల తాజా బోరు/బావి నీరు,
  • 2 కేజీ నాటు ఆవు పేడ,
  • 10 లీటర్ల నాటు ఆవు మూత్రం,
  • 10 కేజీల వేప గింజల పిండి లేదా 5 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు.

తయారీ: ఈ పదార్ధాలన్నింటినీ ఒక తొట్టెలో లేదా డ్రమ్ములో వేసి బాగా కలియ త్రిప్పాలి. తర్వాత 48 గంటలపాటు నీడలో పులియబెట్టాలి. గోనె సంచి కప్పివుంచాలి. రోజుకు రెండుసార్లు చొప్పున ఉదయం, సాయంత్రం 2 నిముషాలపాటు కుడివైపునకు కలియతిప్పాలి. 48 గంటల తర్వాత పల్చటి గుడ్డలో వడపోసుకోవాలి. ఇదే నీమాస్త్రం. ఇలా తయారైన నీమాస్త్రాన్ని ఒక డ్రమ్ములో నిల్వచేసుకోవాలి. నిమస్త్రాన్ని తయారు చేసిన వారము లోపు ఉపయోగించాలి.

ఉపయోగించే విధానం : నీమాస్త్రాన్ని 2 నుండి ౩ సార్లు పంట కాలంలో పిచికారీ చేసుకోవచ్చు పంట విత్తిన 20 రోజులకు, 45 రోజులకు, 60 రోజులకు చల్లుకోవచ్చు . అన్ని రకాల పురుగు గుడ్లను చంపుతుంది. రసం పీల్చే పురుగుల, ఇతర చిన్న చిన్న పురుగులను నివారిస్తుంది ఈ ద్రావణాన్ని నీటిలో కలుపకుండా నేరుగా పంటలపై సాయంత్రం పూట పిచికారి చేసుకోవాలి.

అగ్ని అస్త్రం

మార్చు

కావాల్సిన పదార్ధాలు - నాటు ఆవు మూత్రం 20 లీటర్లు, దంచిన మిరపకాయలు 500 గ్రాములు, దంచిన పొగాకు (Tobacco) 1 కిలో, దంచిన వెల్లుల్లి (Garlic) పేస్టు.

తయారీ: పై పదార్ధాలన్నింటినీ బానలో వేసి బాగా మరగ కాయాలి. 5 సార్లు పొంగు వచ్చే వరకూ మరగబెట్టి చల్లార్చాలి. 48 గంటలు పులియబెట్టిన తర్వాత పల్చటి గుడ్డతో వడబోసుకోవాలి. ఇదే అగ్ని అస్త్రం. ఎకరానికి 2 నుండి 2.5 లీటర్ల అగ్ని అస్త్రాన్ని 100 లీటర్ల నీళ్ళతో కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత పురుగు, కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగు, వేరు పురుగుల నివారణకు ఉపయోగపడే అగ్ని అస్త్రం 3 నెలలపాటు నిల్వవుంటుంది.

బ్రహ్మాస్త్రం

మార్చు

కావాల్సిన పదార్ధాలు - 2 కిలోల మెత్తగా నూరిన వేపాకు ముద్ద, 2 కిలోల సీతాఫలం ఆకుల ముద్ద, 2 కిలోల పల్లేరు (Tribulus Terrestris) / మారేడు (Aegle Marmelos) ఆకుల ముద్ద, 2 కిలోల ఉమ్మెత్త ఆకుల ముద్ద, 20 లీటర్ల నాటు ఆవు మూత్రం.

తయారీ: ముందుగా వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను ముద్దగా నూరి సిద్ధం చేసుకోవాలి. నూరిన ఆకు ముద్దను 20 లీటర్ల ఆవు మూత్రంలో బాగా ఉడికించాలి. 4 పొంగు వచ్చే వరకూ కాచి 24 గంటలపాటు చల్లారనివ్వాలి. తర్వాత ఆ ద్రవాన్ని పల్చటి గుడ్డతో వడబోసుకోవాలి. ఇదే బ్రహ్మాస్త్రం. దీన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో 6 నెలల వరకూ నిల్వచేసుకోవచ్చు.

ఎకరానికి 2 నుండి 2.5 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని 100 లీటర్ల నీళ్ళతో కలిపి పంటకు పిచికారీ చేసుకోవచ్చు.

దశపర్ణి కశాయం

మార్చు

కావాల్సినవి -

  • 200 లీటర్ల నీరు,
  • దేశీ ఆవు పేడ 2 కేజీలు,
  • దేశీ ఆవు మూత్రం 10 లీటర్లు,
  • పసుపు పొడి 200 గ్రాములు,
  • శొంఠి పొడి 200 గ్రాములు లేదా 500 గ్రాముల అల్లం పేస్టు,
  • పొగాకు 1 కేజీ,
  • పచ్చిమిర్చి పేస్టు / కారం పొడి 1 కేజీ,
  • వెల్లుల్లి పేస్టు 1 కేజీ,
  • బంతి పువ్వులు - ఆకులు - కాండం 2 కేజీలు.

వీటిని ముందుగా ఒక డ్రమ్ములో వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ దిగువ పేర్కొన్న పది ఆకులను కలుపుకోవాలి.

  • వేపాకు 3 కేజీలు,
  • గానుగ (Indian Beech) ఆకులు 2 కేజీలు,
  • ఉమ్మెత్త ఆకులు 2 కేజీలు,
  • జిల్లేడు ఆకులు 2 కేజీలు,
  • సీతాఫలం ఆకులు 2 కేజీలు,
  • మునగ ఆకులు 2 కేజీలు,
  • ఆముదం ఆకులు 2 కేజీలు,
  • బేలిఆకు/లేంతెనా (Lantana) 2 కేజీలు,
  • తులసి/అడవి తులసి 1/2 కేజీ,
  • వావిలి (Vitex Negundo) ఆకులు 2 కేజీలు.

పైన పేర్కొన్న వాటన్నింటినీ డ్రమ్ములో వేసి కలుపుకోవాలి. డ్రమ్ములో వేసిన పదార్ధాలను రోజుకు 3 సార్లు కుడిచేతివైపునకు మూడు నిముషాలపాటు త్రిప్పాలి. ఇలా 40 రోజులపాటు ప్రతిరోజు 3 నిముషాలు త్రిప్పాలి. ఇదే దశపర్ణి కషాయం. ఈ కషాయాన్ని 41వ రోజున పల్చటి కాటన్ గుడ్డతో వడబోసుకోవాలి. ఈ కషాయాన్ని 6 నెలలవరకూ వాడుకోవచ్చు. 200 లీటర్ల నీటిలో 6 నుండి 10 లీటర్ల కషాయాన్ని కలిపి వాడుకోవాలి. ఈ మోదాదు ఒక ఎకరానికి సరిపోతుంది. దశపర్ణి కషాయం వరిలో రసం పీల్చే పురుగులను, మామిడిలో బూడిద తెగులును నివారిస్తుంది.

శీలీంధ్ర/ఫంగస్ (Fungus) నాశనులు:

మార్చు

పుల్లటి మజ్జిగ

మార్చు

ఫంగస్ నుండి, కీటకాల నుండి మొక్కలను రక్షించేందుకు మొక్కలపై పిచికారీ చేయడానికి అద్భుతమైన పరిష్కారం. ఇది ఆకులపై నల్ల మచ్చలు, తుప్పు, బూజు తెగులు, బూజు తెగులు, ముడత మొదలైన వివిధ శిలీంధ్ర వ్యాధులను నిర్వహించడానికి పనిచేస్తుంది. ఇది తెల్ల ఈగలు మొదలైన వివిధ కీటకాలకు ప్రభావవంతమైన వికర్షకం వలె పనిచేస్తుంది. ఇది మొక్కలకు కాల్షియం, నైట్రోజన్, ఫాస్పరస్ మొదలైన వివిధ పోషకాలను అందించడమే కాదు, మొక్కలకు ఇది సూపర్ టానిక్ అని చెప్పవచ్చు.

వివిధ రకాల పుల్లటి మజ్జిగ

  1. పుల్లటి మజ్జిగ : 500 గ్రాముల పెరుగు, 500 ml నీరు జోడించి, ఏదైనా మిక్సీని లేదా మీ స్థలంలో అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ఎంపికను ఉపయోగించి దానిని కలపండి. 5-7 నిముషాలు మగ్గిన తర్వాత పైన ఏదైనా వెన్న కనిపిస్తే. తర్వాత ఆ వెన్న తీసి మజ్జిగ మాత్రమే సేకరించండి. ఇప్పుడు ఆ మజ్జిగను పాత్రలో సేకరించి 3-4 వారాలు వేచి ఉండండి, ఆపై మీ మజ్జిగ శిలీంద్ర సంహారిణి సిద్ధంగా ఉంది.
(కొందరు 60 రోజులు నిల్వ తరువాత ఉపయొగిస్తారు )
  1. రాగి లోహం - పుల్లటి మజ్జిగ : చిన్న రాగి ముక్క (రాగి తీగ, రాగి గోరు, రాగి స్క్రూ, ఏదైనా ఇతర రాగితో చేసిన వస్తువు) తీసుకోండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాటిల్‌లో మజ్జిగ తీసుకుని, ఆ బాటిల్‌లో రాగి ముక్కను కూడా వేసి మూత పెట్టాలి. తదుపరి 3-4 వారాలు నిల్వ చేయండి. ఆ తర్వాత, మీ మజ్జిగ శిలీంద్ర సంహారిణి ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది. రాగి మజ్జిగతో చర్య జరిపి కాపర్ సల్ఫేట్‌ను తయారు చేస్తుంది. ఈ కాపర్ సల్ఫేట్ అనేది శిలీంద్ర సంహారిణి లక్షణాన్ని కలిగి ఉన్న సహజంగా ఉత్పన్నమైన రసాయన సమ్మేళనం.
  1. ఇంగువ - పుల్లటి మజ్జిగ : 50 గ్రాములు ఇంగువని 5-10 లీటర్లు పుల్లటి మజ్జిగ, 100 లీటర్లు నీరు కలిపిన ద్రావణాన్ని స్ప్రే చేసుకోవచ్చు


మీ దగ్గర రాగి లేదా ఇత్తడితో చేసిన పాత్రలు లేకుంటే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్, ఏదైనా

మోతాదు : సాధారణంగా లీటరు నీటికి 50-100 మి.లీ మజ్జిగను కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి.

భవిష్యత్తులో ఉపయోగం కోసం మజ్జిగ శిలీంద్ర సంహారిణిని ఎలా నిల్వ చేయాలి?

మీరు మీ మజ్జిగ శిలీంద్ర సంహారిణిని సిద్ధం చేసిన తర్వాత, మీరు దానిని తదుపరి 6 నెలలు లేదా కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు.

మజ్జిగ స్ప్రేని ఉపయోగిస్తున్నప్పుడు పరిగణించవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు

పాత, పెద్ద మొక్కలకు ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన పుల్లని మజ్జిగ ఉపయోగించండి. చిన్న నారు కోసం, తక్కువ రోజులు (1 వారం) నిల్వ ఉంచిన మజ్జిగ ఉపయోగించండి. మీరు 10-15 రోజుల విరామంలో మజ్జిగ మళ్లీ స్ప్రే చేసుకోవచ్చు.


మొక్కలకు మజ్జిగ స్ప్రే యొక్క ప్రయోజనాలు 1. మజ్జిగ ఒక ప్రభావవంతమైన సేంద్రీయ శిలీంద్ర సంహారిణి, ఇది బూజు తెగులు, పసుపు తుప్పు, తెల్ల తుప్పు వంటి శిలీంధ్ర వ్యాధుల నుండి మొక్కలను నివారిస్తుంది.

2. మజ్జిగలో కాల్షియం, నైట్రోజన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇది అవసరమైన పోషకాలను అందిస్తుంది, మెరుగైన పెరుగుదలను ప్రేరేపిస్తుంది.

3. స్క్వాష్, టమోటాలు, మిరియాలు వంటి కూరగాయల మొక్కలలో బ్లూసమ్ ఎండ్ తెగులు సాధారణం, ఇది కాల్షియం లోపం వల్ల వస్తుంది. కాల్షియం, ఇతర పోషకాలతో మొక్కలను సుసంపన్నం చేయడానికి మజ్జిగ స్ప్రే ఒక గొప్ప మార్గం.

4. ఇది పోషకమైన ఆహారంగా పనిచేస్తుంది, గాఢమైన పుష్పాలు, పెద్ద-పరిమాణ కూరగాయలు, పండ్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఈ స్ప్రే ముఖ్యంగా గులాబీ, కరివేపాకు మొక్కలకు అద్భుతంగా ఉంటుంది.

5. పుల్ల మజ్జిగ + ఇంగువ ద్రావణం (ఒక ఎకరానికి 6 లీటర్ల పుల్లటి మజ్జిగ + 100 గ్రాముల ఇంగువ + 100 లీటర్ల నీరు) 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పంటపై పిచికారీ చేయడం వలన ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు నివారించబడుతుంది.

  • 100 లీటర్ల నీటిలో 6 లీటర్ల పుల్లటి మజ్జిగను కలిపి ఒక ఎకరం పంటపై పిచికారి చేస్తే పంటను ఫంగస్ బెడదనుండి కాపాడుకోవచ్చు. దీన్ని గోబాణం అని అంటారు.

శొంఠి అస్త్రం

మార్చు
  • 200 గ్రాముల శోంఠి పొడిని 2 లీటర్ల నీటిలో కలిపి ఒక లీటరు మిగిలేవరకూ మరగబెట్టాలి. వేరే పాత్రలో 5 లీటర్ల దేశీ ఆవుపాలు/గేదె పాలను తీసుకొని 2 లీటర్ల పాలు మిగిలేవరకు మరగకాయాలి. ఈ పాలలో పై మీగడను తీసివేయాలి. తర్వాత 200 లీటర్ల నీటిలో ముందుగా పాలను కలిపి, తర్వాత శొంఠి కషాయాన్ని కలిపి 3 నుండి 5 నిముషాలు కుడివైపునకు కలియ త్రిప్పాలి. ఇలా తయారైన శొంఠి అస్త్రాన్ని 48 గంటలలోపు ఒక ఎకరం పంటపై పిచికారీ చేయాలి.


  • 20 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటితో కలిపి ఒక ఎకరం పంటపై చల్లుకుంటే కీటకాలను నిరోధించవచ్చు.

పేడ సారం

మార్చు
  • బాగా ఎండిన 5 కేజీల దేశీ ఆవు పేడను పొడి చేసి గుడ్డలో మూటకట్టి 200 లీటర్ల నీటిలో వేలాడగట్టి ఉంచాలి. 48 గంటల తర్వాత పేడ మూటను బాగా పిండాలి. సారం అంతా నీటిలో దిగుతుంది. ఆ నీటిని వడబోసి 1 ఎకరం పంటపై చల్లుకోవాలి.

పంటల నాణ్యత పెంచే ద్రావణం:

మార్చు

మొలక ద్రావణం

మార్చు

నువ్వులు 100 గ్రాములు, పెసలు 100 గ్రాములు, మినుములు 100 గ్రాములు, ఉలవలు 100 గ్రాములు, బొబ్బర్లు (అలసందలు) 100 గ్రాములు, శెనగలు 100 గ్రాములు, గోధుమలు 100 గ్రాములు.

వీటన్నంటినీ మొలకలు వచ్చేలా తడిగుడ్డలో కట్టుకోవాలి. మొలకలు వచ్చిన తర్వాత తీసి రోటి పచ్చడిలా రుబ్బుకోవాలి. 200 లీటర్ల నీళ్ళు, 5 లీటర్ల దేశీ ఆవు మూత్రం కలిపిన డ్రమ్ములో ఈ పచ్చడిని వేసి 24 గంటలపాటు నీడలో ఉంచి మూడుపూటలా 3 నిముషాలపాటు కుడివైపునకు తిప్పాలి. తర్వాత గుడ్డతో వడబోసుకోవాలి. ఇదే పంటల నాణ్యత పెంచే ద్రావణం. పంటను కోసే 2 లేదా 3 వారాల ముందుగా ఈ ద్రావణాన్ని 1 ఎకరం పంటపై పిచికారీ చేస్తే గింజల్లో తాలు ఉండదు. ధాన్యం నిగనిగలాడుతూ ఎక్కువ బరువు తూగుతుంది. మామిడి కాయలు కోతకు వారం ముందు ఈ ద్రావణాన్ని కాయలపై పిచికారీ చేస్తే కాయలు నిగనిగలాడుతూవుండి ఎక్కువ కాలం నిల్వవుంటాయి.

అచ్చాదన (Mulching)

మార్చు

పొలంలో మట్టిని ఎండనుండి, వాననీటి కోత నుండి, గాలినుండి రక్షించుకోవాలి. దీన్నే అచ్చాదన కల్పించడం అని, మల్చింగ్ చేయడం అని అంటారు. అచ్చాదన వల్ల భూమిలో తేమ నిరంతరం కొనసాగుతుంది, భూమి సారవంతమవుతుంది. పదేపదే నీరు పెట్టవలసిన అవసరం కూడా వుండదు. కుళ్ళి నేలలో కలిసిపోయే గడ్డి, ఆకులు వంటి ఏ వ్యర్ధ పదార్ధంతోనైనా అచ్చాదన చేసుకోవచ్చు. భూమికి అచ్చాదన మూడు రకాలుగా కల్పించవచ్చు.

1.మట్టితో అచ్చాదన మట్టిని రెండు అంగుళాల లోతున గొర్రుతో దున్నాలి. దీనిని మట్టితో అచ్చాదన అంటారు.

2. పంట వ్యర్ధల అచ్చాదన ' ఎండు గట్టి, కంది కట్టెలు, చెరకు పిప్పి, చెరకు ఆకు, రెమ్మలు, రాలిన ఆకులు - వీటితో నేలను అచ్చాదన చేయవచ్చు. పంటకోత తర్వాత వీటిని కాల్చడం సరికాదు.

3. సజీవ అచ్చాదన 'నేలపై తక్కువ ఎత్తులో వ్యాపించే పంటలు వత్తుగా వేసుకోవడం లేదా వివిధ రకాల మొక్కలను వాటంతటవే పెరగనివ్వడం ద్వారా నేలకు అచ్చాదన కలిగించవచ్చు. దీన్నే సజీవ అచ్చాదన అంటారు.

వాఫ్స (Water Management)

మార్చు

వాఫ్స అనగా నీరు పెట్టే విధానం, సూక్ష్మ వాతావరణం కల్పించడం. పొలం భూమిలో మట్టికణాల మధ్య 50% నీటి ఆవివి, 50% గాలి ఉండేలా చేయడమే వాఫ్స ఉద్దేశం. పంట మొక్కలకు కావాల్సింది నీరు కాదు, నీటి ఆవిరి. మొక్క అవసరాన్ని గుర్తెరిగి సాగునీటిని అందిస్తేనే భూమిలో వాఫ్స ఏర్పడుతుంది. వాఫ్స క్రియ నిరంతరం జరుగుతూవుంటుంది. మద్యాహ్నవేళలో చెట్టు/పంట మొక్క నీడ పడే చోటులో వరకూ వేళ్లు విస్తరించివుంటాయి. ఆ పరిధికి వెలుపలికి నీరందిస్తే వాఫ్స ఏర్పడి నీరు సద్వినియోగమవుతుంది.

మరికొన్ని ద్రావణాలు/కాషాయాలు

మార్చు

అటవీ చైతన్య ద్రావణం

మార్చు

కావలసిన పదార్ధాలు :

  1. 20 లీటర్ల కుండ. - 1
  2. అడవి మట్టి - రెండు పిడికిళ్లు
  3. కొర్రలు/రాగి/ఉదలు పిండి (ఏదైనా ఒకటి ). - 250 గ్రాములు
  4. సెనగ పిండి/ ఉలవల పిండి / ద్విదళ జాతి గింజల పిండి (ఏదైనా ఒకటి ) - 250 గ్రాములు
  5. తాటి బెల్లం - 50 గ్రాములు
  6. 20 లీటర్ల నీరు

తయారు చేసే పద్ధతి : పై అన్ని కుండలో కలిపి, కుండను నీడలో కుండ మునిగే అంతవరకు గుంత తీసి, కుండను భూమిలో అంటే పై మూత నాలుగు అంగుళాలు పైకి ఉండే విధంగా కుండను పూడ్చి పైన మూత ఉంచి ఆ పైన ఎండ తగలకుండా చెత్త ( ఆకులు ) వేయాలి . దీనిని ప్రతి రోజు కలియ తిప్పాలి. ఈ అటవీ చైతన్య ద్రావణం 4 నుండి 5 రోజులలో తాయారు అవుతుంది.

వాడే విధానం: భూమిని దున్నిన తరువాత సాయంత్ర సమయాలలో పిచికారీ చేసుకోవాలి . ఈవిధంగా వారానికి ఒక సరి చెప్పున పిచికారీ చేసిన యడల 4 నెలల నుండి 6 నెలలలో భూమి మొక్కలకు కావలిసిన సూక్ష్మ జీవులతో సంవృద్ధి చెందుతుంది. దీనిని డ్రిప్ ద్వారా కానీ క్లాల్వల ద్వారా కానీ పారించవచ్చు.

నైట్రోజన్ ద్రవం

మార్చు

ఆకాష్ చౌరాసియా గారి ప్రకారం తాజా కోతలు లేదా కలుపు మొక్కల నుండి ద్రవ నత్రజనిని, పొడి ఆకు వ్యర్థాల నుండి కార్బన్ అధికంగా ఉండే ఎరువు తయారు విధానం

తయారు చేసే పద్ధతి : 1. గాలి చొరబడడానికి వీలులేని మూత ఉన్న (ఎయిర్ టైట్ టాప్ క్యాప్), క్రింద కుళాయి (బాటమ్ ట్యాప్ ) తో —— లీటర్లు/లేదా ఇతర కంటైనర్/టబ్ ని తీసుకోండి.

2. కలుపు మొక్కలను, పంటల కోతల తర్వాత వచ్చే వ్యర్థాలను నీళ్లలో వేయాలి. 1 కిలో పచ్చి ఆకులు లేదా స్థూల లేదా వ్యర్థ ఆకుపచ్చ కలుపు మొక్కలకు 1 లీటరు నీరు (1:1) చొప్పున కలిపి కంటైనర్ లో ఉంచి గాలి చొరబడడానికి వీలులేని మూతను బిగించండి.

అంటే 100 కిలోల పచ్చి ఆకులు లేదా స్థూల లేదా వ్యర్థ ఆకుపచ్చ కలుపు మొక్కలకు 100 లీటర్ల నీరు అవసరము అవుతాయి
200 కిలోల పచ్చి ఆకులు లేదా స్థూల లేదా వ్యర్థ ఆకుపచ్చ కలుపు మొక్కలకు 200 లీటర్ల నీరు అవసరము అవుతాయి

3. వీటి వ్యర్ధాల నుండి నత్రజని తయారవ్వడానికి సుమారుగా 60 రోజుల టైం పడుతుంది. 30 రోజులు అన్నారు కానీ 60 రోజుల టైం అయితే ఇంకా మంచిగా పనిచేస్తుంది.

వాడే విధానం:

ఒక లీటర్ నత్రజని నీళ్లని,500 లీటర్ల నీటిలో కలిపి పంటలకు ఇవ్వవచ్చు. ఒక ఎకరం భూమికి పైన తయారుచేసిన విధంగా 500 లీటర్ల నైట్రోజన్ ద్రవం అవసరం. ప్రతి మోతాదుకు 150-200 లీటర్లు చొప్పున 500 లీటర్లు పంట కాలంలో రెండు మూడు దఫాలుగా ఇవ్వాలి

వేప గింజల కషాయం

మార్చు

మూడు కిలోలు వేప గింజలు దంచి నూలి బట్టలో మూట కట్టి 200 లీటర్ల నిటీలో ఒక చిన్న కర్రకి మూట కట్టి వేలాడదీసి సాయంత్రం పొద్దున దాన్ని కదిలి ఇవ్వాలి మూడు రోజుల తర్వాత చేదు వాసన వస్తుంది అప్పుడు తయారైందని అర్థం 13 ట్యాంకులు ఎకరాకు చెట్టు బాగా తడిచే విధంగా కొట్టుకోవచ్చు.

నీమా అస్త్రం కంటే మంచిగా పని చేసే వేప గింజల కషాయం

జామ తోటకి 20 రోజులకు ఒకసారి పిచికారీ చేసిన యడల చేను నలుపుగా/పచ్చగా వస్తుంది.

వేప అగ్ని అస్త్రం

మార్చు

కావాల్సిన పదార్ధాలు ఆవు మూత్రం 20 లీటర్లు, దంచిన మిరపకాయలు 2 కేజీలు దంచిన పొగాకు (Tobacco) 2 కేజీలు, దంచిన వెల్లుల్లి (Garlic) పేస్టు 2 కేజీలు వేప ఆకు : 5 kg

తయారీ: పై పదార్ధాలన్నింటినీ బానలో వేసి బాగా మరగ కాయాలి. 5 సార్లు పొంగు వచ్చే వరకూ మరగబెట్టి చల్లార్చాలి. 48 గంటలు పులియబెట్టిన తర్వాత పల్చటి గుడ్డతో వడబోసుకోవాలి. ఇదే వేప అగ్ని అస్త్రం.

ఎకరానికి 2 నుండి 2.5 లీటర్ల అగ్ని అస్త్రాన్ని 100 లీటర్ల నీళ్ళతో కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత పురుగు, కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగు, వేరు పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. పంట కాలంలో 2 – 3 సార్లు పిచికారి చేసుకోవచ్చు

అగ్ని అస్త్రం ఆరు నెలలపాటు నిల్వవుంటుంది. కంటైనర్ లో ఉంచి గాలి చొరబడడానికి వీలులేని మూతను బిగించండి

బెండ, వేరే కూరగాయల మొక్కలకు

౩౦ రోజులు ఉన్నప్పుడు 5౦౦ ml ఒక ట్యాంక్ (15 లీటర్ )

40 రోజులు ఉన్నప్పుడు 750 ml ఒక ట్యాంక్ (15 లీటర్ )

50 నుండి 60 రోజులు ఉన్నప్పుడు 1 లీటర్ ఒక ట్యాంక్ (15 లీటర్ )


వరికి పొట్ట దిశలో ఉన్నప్పుడు 1 లీటర్ ఒక ట్యాంక్ (15 లీటర్ )

వావిలాకు కషాయం

మార్చు

రసం పీల్చు పురుగుల, చిన్న దశలో ఉన్న లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, ఆకులను తిని పురుగుల నివారణకు సహజమైన క్రిమి సంహారకంగా వావిలాకు కషాయం

వావిలి ఒక రకమైన ఔషధ మొక్క. ఈ మొక్క ఆకులను వినాయక చవితికి పత్రపూజలో ఉపయోగిస్తారు. వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమంలో ఈ ఆకు 14 ఆకు. ఈ వావిలి మొక్క రెండు రకాలు.. తెలుపు, నలుపు. సాధారణంగా నీటి వనరులు ఉన్న గట్ల మీద ఆంధ్రప్రదేశ్ అంతటా బంజరు భూముల్లో పెరుగుతుంది. ఈ మొక్క సాంప్రదాయ వైద్యంలో అనేక రకాలుగా ఉపయోగిస్తారు. అయితే ఈ వావిలాకుని సహజ సిద్ధమైన రసాయనిక క్రిమి సంహారకంగా కూడా ఉపయోగించవచ్చు.

వావిలాకులో ఉండే “కాస్టిసిస్” అనే రసాయనం క్రిమి సంహారంగా పనిచేస్తుంది. వావిలి నిలువుగా పెరిగే గుబురు లేదా చిన్న వృక్షం. ఇది 2 – 8 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. బెరడు ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది. ఆకులు ఐదు విభాగాలుగా ఉంటాయి. ప్రతి చిన్న ఆకు 4 నుండి 10 సెంటీమీటర్లు పొడవు ఉంటుంది. పూలు తెలుపు లేదా ఊదా లేదా నీలి రంగులో ఉంటాయి. దీని కషాయాన్ని సహజమైన ఎరువుగా ఉపయోగించవచ్చు.


కావాల్సిన పదార్ధాలు:

  • వావిలాకు - 5 కిలో
  • నీరు - పది లీటర్ల
  • 100 గ్రాముల సబ్బు పొడిని లేదా 500 గ్రాముల కుంకుడు కాయ రసం


తయారీ:

కషాయం తయారు చేసే విధానం: 5 కిలోల వావిలాకు తీసుకుని కొంచెం మెత్తగా దంచి పది లీటర్ల నీటిలో అరగంట సేపు బాగా ఉడకబెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన ద్రావణం సుమారు ఐదు లీటర్ల వరకు ఉంటుంది. ఉడుకుతున్న ద్రావణాన్ని మధ్యమధ్యలో కర్రతో కలుపుతూ ఉండాలి. ద్రావణం బాగా ఉడికిన తరువాత కషాయాన్ని బాగా చల్లార్చి, పలుచటి గుడ్డతో వడపోయాలి. కషాయానికి 100 గ్రాముల సబ్బు పొడిని లేదా 500 గ్రాముల కుంకుడు కాయ రసాన్ని కలపాలి.


ఈ ద్రావణానికి నూరు లీటర్ల నీటికి చేర్చి ఒక్క ఎకరాకు సాయంత్రం సమయంలో పంటపై పిచికారి చేసుకోవాలి.

ఈ కషాయాన్ని పంటలో.. రసం పీల్చు పురుగుల పైన, చిన్న దశలో ఉన్న లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, ఆకులను తిని పురుగుల నివారణకు ఉపయోగిస్తారు. పంట కాలంలో పంట దశను, పురుగు ఉధృతిని బట్టి 2 – 3 సార్లు పిచికారి చేసుకోవచ్చు

తయారు / పిచికారీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వావిలాకు కషాయం తయారు చేసే సమయంలో ముక్కుకు తప్పనిసరిగా గుడ్డ కట్టుకోవాలి. అంతేకాదు ఈ కషాయం ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలీ. అంతేకాని.. ముందుగా తయారు చేసుకొని నిల్వ చేసుకోరాదు. వావిలాకులో ఆవిరి అయ్యే ఘాటైన తైలాలు వుండటం వలన పై జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రస్తుత స్థితి, భవిష్యత్తు

మార్చు

'ఉద్యోగంతో రోజులు గడుపుకోవడమే గాని సంపాదన ఉండదు, ఆస్తులు సంపాదించలేము, చదువుకి - సంపాదనకి సంబంధం లేదు, సంపాదనకి కావాల్సింది తెలివితేటలే గాని చదువు కాదు, నగరాల్లో ఎంత సంపాదించినా మనశ్శాంతి ఉండదని, వాహనాలు మరియూ ఫ్యాక్టరీల నుండి వచ్చే కాలుష్యం వల్ల ఆరోగ్యం ఉండదని తెలుసుకొని ఇటీవల చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి పట్టుదలతో సేంద్రీయ వ్యవసాయంలోకి అడుగు పెడుతున్నారు. నగరాలకు చేరువలో లేదా స్వగ్రామాల్లో భూములను కొని లేదా కవులకు (లీజుకు) తీసుకొని సేంద్రీయ కూరగాయల పంటలు పండిస్తూ నగరాల్లోకి ఎగుమతి చేస్తూ అధిక లాభాలు పొందుతున్నారు.

వ్యవసాయం చేస్తే అమ్మాయిని ఇవ్వం అని అలోచించే ఆడపిల్ల తల్లిదండ్రులు, పట్నంలో చిన్నా చితకా ఉద్యోగమైనా పర్వాలేదు, వ్యవసాయం వద్దని వారించే అబ్బాయిల తల్లిదండ్రులు, తమ ఆలోచనలను మార్చుకునే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మా అబ్బాయి రైతు, మా అమ్మాయి భూమి పుత్రిక అని ప్రతి తల్లితండ్రీ గర్వంగా చెప్పుకొనే సమయాలు మునుముందు రానున్నాయి. అయితే ప్రాకృతిక వ్యవసాయం చేసేవారిలో చిన్నకారు రైతులు కూడా ఉన్నారు. అటువంటి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తే భారతదేశం ఎంతో అభివృద్ధి సాధిస్తుంది.

ఈ వ్యవసాయంలోకి ఎలా మారాలి?

మార్చు

సేంద్రీయ వ్యవసాయం పెట్టుబడి లేని వ్యవసాయం. చాలా మంది "సేంద్రీయ వ్యవసాయం అందరూ చేయలేరు. అది చాలా కష్టంతో కూడినది. మన వల్ల కాదు. రసాయన వ్యవసాయంలోనే సరైన ఆదాయాలు రావడంలేదు, ఇక సేంద్రీయ వ్యవసాయంలో ఆదాయాలు వస్తాయా?" అని అంటుంటారు. కాని మనసు వుంటే మార్గం ఉంటుంది. కృషి వుంటే ఏదైనా ఫలిస్తుంది. అయితే సేంద్రీయ వ్యవసాయం ఒక్కసారిగా మొదలుపెట్టరాదు. 3, 4 సంవత్సరాలపాటూ రసాయనాల వాడకం తగ్గిస్తూ జీవామృతం వాడకం పెంచుతూ వుండాలి. భూమిలో రసాయన ఎరువులు, కలుపు మందుల అవశేషాలు, పురుగు మందుల అవశేషాలు పూర్తిగా తొలగిపోవాలంటే సుమారు 3 నుండి 4 సంవత్సరాలు పడుతుంది. తొలుత మూడు, నాలుగు సంవత్సరాలు దిగుబడులు, ఆదాయాలు ఆశించిన రీతిలో రాకపోవచ్చును. తర్వాత సంవత్సరములనుండి తీసుకున్న శ్రద్ధను బట్టి అధిక దిగుబడులు, అధిక లాభాలు వస్తాయి.

విమర్శలు, వ్యతిరేకత

మార్చు

ప్రాకృతిక వ్యవసాయంలో రైతులు విక్రయ కేంద్రాల నుండి సంకర విత్తనాలు, రసాయనిక లేదా సేంద్రియ ఎరువులు కొనడం వుండదు. ఉత్పత్తి, ఖర్చు తగ్గినప్పటికి నికర లాభం వస్తుందని ప్రాకృతిక వ్యవసాయం ఆచరిస్తున్నామని రైతులు చెప్పినప్పటికి కృషి విఙ్ఞాన కేంద్రాల, విత్తనాల విక్రయ కేంద్రాల, రసాయనిక కేంద్రాల వ్యతిరేక ప్రకటనల వల్ల ప్రాకృతిక వ్యవసాయం రైతులకు చేరలేకపోతుంది. దేశంలోని రైతులందరూ ప్రాకృతిక వ్యవసాయం చేయడం వల్ల కృత్రిమ ఎరువులు, పురుగుల మందులు, కలుపు మందులు తయారు చేస్తున్న కంపెనీలు క్రమంగా మూత పడిపోతాయని, తయారుచేసుకున్న సేంద్రీయ ఎరువులు, క్రిమి సంహారకాలు ఆర్థికంగా రైతుని ఇంకా కృంగజేస్తాయని శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

ఇతర విషయాలు

మార్చు
  • మట్టిలో వానపాములు, సూక్ష్మజీవులు ఉంటే పంటలు అధ్బుతంగా పండుతాయి.
  • వానపాములు రోజుకు 150 జతల ఎడ్లు చేసినంత పని చేస్తాయి. ఇవి భూమికి బొరియలు చేస్తూ నేలను గుల్లబరచడమే కాకుండా 15 అడుగుల లోతు మట్టిలో నుంచి పోషకాలను మొక్కల వేళ్ళకు అందిస్తాయి. వానపాముల ద్వారా ఎకరానికి ఏటా 90 కిలోల నత్రజని సహజంగానే అందుతుంది.[2]
  • అచ్చాదనం (మల్చింగ్) లో చెట్లనుండి రాలిన ఆకులు, పువ్వులు మట్టిలో కలిసేలా చూడాలి.
  • పంట కోత కాలం తర్వాత ఆకులను, మొక్కలను కాల్చకూడదు. వాటిని అచ్చాదనకు ఉపయోగించవచ్చు.
  • ఒక్క దేశీయ ఆవుతో 30 ఎకరాల భూమిని సాగు చేయవచ్చు.
  • దేశీయ ఆవు పేడలో కోట్ల మిత్ర సూక్ష్మ జీవులు ఉంటాయని పాలేకర్ రుజువు చేశారు.
  • ఆవు పేడ వాడే అన్ని మిశ్రమాల్లోను 7 రోజుల లోపు పేడనే వేయాలి.
  • ఏదో ఒకే రకం పంట వేయకూడదు. అనేక రకాల పంటలు, ఏళ్ళ తరబడి పెరిగే చెట్లను కలిపి పెంచాలి.
  • రైతు వేసే ప్రధాన పంటలతోపాటు ఒకటి, రెండు అంతరపంటలు కూడా వేసుకుంటే అధిక ఆదాయం పొందవచ్చు.
  • కలుపు మొక్కలను అచ్చాదన కోసమే ఉపయోగించాలి. కనుక కలుపు మందులు వాడరాదు.
  • పురుగు మందులు వాడరాదు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి అవసరాన్ని బట్టి ఏదో ఒక కీటకనాశని వాడితే సరి.
  • ఏ పంట అయినా మొక్కకు మొక్కకు మధ్య సరిపోయే దూరం ఉండాలి.
  • సేంద్రీయ వ్యవసాయంలో కూలీల ఖర్చు తప్ప రసాయన మందుల ఖర్చు ఉండదు.
  • సేంద్రీయ వ్యవసాయం మొదలుపెట్టిన 2, 3 సంవత్సరాల వరకూ ఎటువంటి ఆదాయాలు కనిపించవు. స్వల్ప ఆదాయం మాత్రం కనిపిస్తుంది. 4వ/ 5వ సంవత్సరాల నుండి అధిక లాభాలు కనిపిస్తాయి.
  • ప్రాకృతిక వ్యవసాయంలో పెట్టుబడి వుండదు కావున రైతుల ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోతాయి.
  • సేంద్రీయ వ్యవసాయం వలన ఆరోగ్యకరమైన, విషరహితమైన, నాణ్యమైన పంటలు చేతికి అందుతాయి.
  • రసాయన పద్ధతిలో పండించే పంటలకంటే పాలేకర్ పద్ధతిలో పండించే పంటలకు ఎక్కువ మద్దత్తు ధర లభిస్తుంది.
  • సేంద్రీయ వ్యవసాయంలో నీటి ఖర్చు, కరెంటు ఖర్చు తగ్గుతుంది.
  • సేంద్రీయ వ్యవసాయానికి రైతులు బ్యాంకులనుండి అప్పులు చేయక్కర్లేదు, ప్రభుత్వము రైతులకు రుణమాఫీలు చేయక్కర్లేదు.
  • సేంద్రీయ వ్యవసాయం వలన వాతావరణ కాలుష్యం నివారింపబడుతుంది.
  • ప్రతి పంటలో కూడా అంతరపంటలు తేనేటీగలు

వేసుకుంటే పరాగ సంపర్కం వీలుగా ఉంటుంది.

ఇవీ చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు

ఇతర లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. ప్రకృతి వ్యవసాయం - పాలేకర్ విధానం, సంకలనం: త్రినాధ్ సి.హెచ్, Vachakam Publications
  2. వాచకం, వార్తా పక్ష పత్రిక, ఫిబ్రవరి 1-15, 2015