ప్రేమం (మలయాళం:പ്രേമം) అనేది 2015 లో విడుదలైన ఒక మలయాళ సినిమా. ఇందులో ప్రధాన పాత్రధారులుగా నివిన్ పాలీ, అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్ నటించారు. ఇది ఒక సంగీత భరిత ప్రేమకథా చిత్రం.

ప్రేమం
(2015 మలయాళం సినిమా)
దర్శకత్వం ఆల్ఫోన్స్ పుత్రన్
నిర్మాణం అన్వర్ రషీద్
కథ ఆల్ఫోన్స్ పుత్రన్
తారాగణం నివిన్ పాలీ,
అనుపమ పరమేశ్వరన్,
సాయి పల్లవి,
మడోన్నా సెబాస్టియన్
సంగీతం రాజేష్ మురుగేశన్
ఛాయాగ్రహణం ఆనంద్ సి చంద్రన్
కూర్పు యూసఫ్ ఖాన్
నిర్మాణ సంస్థ అన్వర్ రషీద్ ఎంటర్టైన్మెంట్స్
పంపిణీ A & A release
నిడివి 157 నిమిషాలు
భాష మలయాళం

కథ మార్చు

2000వ సంవత్సరంలో ఆలువలో నూనూగు మీసాల 16 ఏళ్ళుగల జార్జి (నివిన్ పాలీ) మేరీ జార్జి (అనుపమ పరమేశ్వరన్) ను మనసా వాచా కర్మణా ప్రేమిస్తూ ఉంటాడు. (కేవలం జార్జి యే కాదు, ఆ ఊరిలో కుర్రాళ్ళు మొత్తం ఆమెను అదే విధంగా ప్రేమిస్తూ ఉంటారు.) ప్రతిరోజూ పాఠశాలకు ఇంటికి మధ్య దారిలో మేరీ, ఆమె చెల్లి, మేరీ స్నేహితుడి వెంట అనేక మగపిల్లలు పడుతూ ఉంటారు. జార్జి స్నేహితులు శంభు (శబరీష్ వర్మ), కోయ (కృష్ణ శంకర్)లు అతనికి సహాయపడుతూ ఉంటారు. కానీ మేరీ తండ్రి ఎవరైతే తన కూతుర్ని ప్రేమిస్తున్నాను అని చెబుతారో వారిని చావ చితకగొడతూ ఉంటాడు. ఇది కళ్ళారా చూసిన జార్జి బృందం తటపటాయిస్తూ ఉంటారు. జార్జి తన ప్రేమను వ్యక్తం చేయాలనుకొన్న ప్రతిమారు, ఏదో ఒక అడ్డంకి తగులుతూనే ఉంటుంది. ఒకరోజు ధైర్యాన్ని అంతా కూడబలుక్కొన్న జార్జికి, మేరీ, తాను జార్జి అనే మరో కుర్రాడిని ప్రేమిస్తున్నాని, అతనినే పెళ్ళి చేసుకొంటానని, ఈ మరో జార్జిని చేసుకొంటే తాను ఇంటి పేరు కూడా మార్చుకోనక్కరలేదని చెప్పగనే, భగ్నహృదయుడౌతాడు అసలు జార్జి. జార్జి బృందం మేరి పిచ్చిలో పడి చదువును ఎంత నిర్లక్ష్యం చేశారో తెలుసుకొనగలగటంతో చిత్రంలోని మొదటి భాగం ముగుస్తుంది.

2005 నాటికి జార్జి బృందం ఒక డిగ్రీ కళాశాలలో బీ ఎస్ సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు. అది వరకు మీసాలు, గడ్డం లేని జార్జి బృందం, వాటిని పూర్తిగా పెంచి కనబడతారు. కాలేజీ గొడవల్లో ప్రత్యర్థి మైఖేల్ జాక్సన్ పాట బీట్ ఇట్కు స్టేజీ మీద నృత్యం చేస్తుండగా అదే స్టేజీ క్రింద బాంబుని వెలిగించి చోద్యం చూడటానికి బయటికి వచ్చే జార్జి బృందంతో రెండవ భాగం మొదలవుతుంది. బాంబు పేలుడు తర్వాత జరిగిన గలాటాలో ప్రత్యర్థుల బృందాన్ని చిత్తుచిత్తుగా కొట్టిన జార్జి బృందం, రెండు నెలల సస్పెన్షన్ కు గురౌతుంది. సస్పెన్షన్ కాలం పూర్తవగానే కాలేజీకి తిరిగి వచ్చిన జార్జి బృందంలో అల్లరి ఏ మాత్రం తగ్గదు. ర్యాగింగ్ మొదలు పెడతారు. అయితే గెస్ట్ లెక్చరర్ గా, తమిళనాడు నుండి వచ్చిన మలర్ మిస్ (సాయి పల్లవి) ని కూడా విద్యార్థినే అనుకుని ర్యాగింగ్ చేయబోయి, తాను అధ్యాపకురాలని తెలుసుకుని నాలుక కరచుకుంటారు. తరగతి గదిలోకి మద్యం సేవించి మరీ వచ్చిన జార్జి బృందాన్ని అమ్మాయిలు ఓరచూపులు చూడగా, అబ్బాయిలు మాత్రం జార్జి బృందానికి భయపడుతూ ఉంటారు. మద్యం సేవించి ఉన్నారని తెలుసుకొన్న మలర్ మిస్ జార్జి బృందాన్ని తరగతి గది నుండి బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తుంది. వెళ్ళే ముందు జార్జి మాత్రం, "Please don't think that I am saying this because I am drunk, but you look so very beautiful. Very...beautiful" అంటాడు. మలర్ మిస్, జార్జిల మధ్య అనుబంధం పెరుగుతుంది. కానీ మలర్ మిస్ ను విమల్ సర్ ఇష్టపడుతూ ఉంటాడు. మలర్ మిస్, జార్జి ల మధ్య ప్రేమ గురించి తెలియక, విమల్ సర్, జార్జినే తన ప్రేమ రాయబారిగా ఎంచుకోవటం కొన్ని హాస్యాస్పద సన్నివేశాలకు దారి తీస్తుంది. తర్వాత జరిగే కళాశాల ఉత్సవాలలో నాట్యం చేయాలనే ఉద్దేశంతో జార్జి బృందం నృత్యంలో శిక్షకుల కోసం అన్వేషిస్తూ ఉంటారు. కానీ ఒకరిద్దరు శిక్షకుల ప్రవర్తన వారికి రుచించదు. ఇంతలో మలర్ మిస్ తాను వారికి శిక్షకురాలుగా ఉండటానికి అంగీకరిస్తుంది. జార్జి తాము వేయబోయేది శాస్త్రీయ నృత్యం కాదని తెలుపుతాడు. మలర్ మిస్ తను చెప్పేది కూడా బ్రేక్ డ్యాన్స్ గురించేనని తెలుపుతుంది. జార్జి బృందం సంశయంతోనే అంగీకరిస్తుంది. అయితే మలర్ మిస్ వేసే మొట్టమొదటి స్టెప్ కే జార్జి బృందం నిశ్చేష్టులౌతారు. "కొద్దిగా నిదానంగా వేసి చూపుతారా?" అని జార్జి అడుగగా, దానికి మలర్ మిస్ అంగీకరిస్తుంది. జార్జి బృందానికి మెల్లగా నాట్యంలో ప్రావీణ్యతను తీసుకువస్తుంది మలర్ మిస్. ఒక తమిళ పాటకు చేసిన జార్జి బృందం నాట్యం తమ ప్రత్యర్థులను సైతం మెప్పిస్తుంది. విమల్ సర్, కాలేజీ ఉత్సవానికి ప్రేమికుడు చిత్రంలో ఓ చెలియా, నా ప్రియ సఖియా అనే గీతాన్ని ఆలాపించటానికి ఎంచుకొంటాడు. అతడు గాత్రం మొదలు పెట్టగనే జార్జి మిత్రుడొకడు మైక్ కున్న వైరును లాగేయటం, అది విమల్ సర్ కాలికి చుట్టుకుపోయి, అతను క్రిందపడి గాయపడటం జరుగుతాయి. ఒక రోజు మలర్ మిస్ జార్జికి ఫోన్ చేసి, తాను గుడికి వెళ్ళబోతోందని, తనకు మల్లెపువ్వులు అంటే చాలా ఇష్టమని, కొని తీసుకురమ్మని చెబుతుంది. గుడిలో పూజ ముగించుకువచ్చిన మలర్ మిస్ కు జార్జి మల్లెపూలు ఇవ్వగా, అతని నుదుట ఆమె కుంకుమ పెట్టేసి నవ్వుకొంటూ వెళ్ళిపోతుంది. (జార్జి పట్ల తనుకున్న ప్రేమను, మలర్ మిస్ ఆ విధంగా వ్యక్తపరుస్తుంది.) మలర్ మిస్ కోసం ఊరి నుండి తన బావ వెదుక్కొంటూ కాలేజీకి రావటంతో విశ్రాంతి ప్రకటించబడుతుంది.

జార్జి బృందానికి మలర్ మిస్ తన బావను పరిచయం చేస్తుంది. అందరు కలసి కాలేజీ క్యాంటీన్ లో భోంచేస్తారు. కుటుంబాన్ని చూడటం కోసం మలర్ మిస్ తన బావతో కలసి ఊరు బయలుదేరుతుంది. కొద్దిరోజుల తర్వాత తరగతికి ఒక సర్కులర్ వస్తుంది. దారిలో మలర్ మిస్ కు యాక్సిడెంట్ అయ్యింది అని, ఇక తాను తిరిగి కళాశాలలో పని చేయలేకపోవచ్చని. మలర్ మిస్ ఊరికి హుటాహుటిన బయలుదేరిన జార్జి బృందానికి చేదు అనుభవం ఎదురౌతుంది. తలకు బలమైన గాయం అవ్వటంతో మలర్ గతం మరచిపోయి ఉంటుంది. తన కుటుంబ సభ్యులను సైతం గుర్తు పట్టలేని మలర్, జార్జి తాను ఆమె కోసం మల్లెపువ్వులు తెచ్చానని చెప్పిననూ ఆమె జార్జిని గుర్తుపట్టలేకపోవటంతో జార్జి హతాశుడౌతాడు. మలర్ తన బావను వివాహమాడుతోందని తెలిసిన జార్జి, స్నేహితులు వారిస్తున్ననూ ఆ వివాహానికి హాజరౌతాడు. వివాహం నాటికి కూడా మలర్ కు గతం గుర్తు ఉండదు. దీనితో చిత్రంలో రెండవ భాగం ముగుస్తుంది.

2014వ సంవత్సరంతో చిత్రం మూడవ భాగం మొదలౌతుంది. ముప్పయ్యవ పడిలో ఉన్న జార్జి ఒక కేఫేను నడుపుతూ ఉంటాడు (మీసం ఉంటుంది, గెడ్డం మాత్రం తీసివేస్తాడు). 22 ఏళ్ళ సిలైన్ (మడోన్నా సెబాస్టియన్) అనే యువతి జార్జి కేఫేకు వస్తుంది. తొలిచూపులోనే జార్జి (మూడవ మారు) సిలైన్ తో ప్రేమలో పడతాడు. ఈడు-జోడులో భేదం ఉన్ననూ, జార్జి తన ప్రేమను సిలైన్ కు తెలుపుతాడు. సిలైన్ ఎవరో కాదు అని, స్వయానా మేరీ చెల్లెలే అని, మేరీని ప్రేమిస్తున్న కాలంలో సిలైన్ చాలా చిన్న పిల్ల అనీ తెలుస్తుంది. కానీ అప్పటికే సిలైన్ కు వేరొకరితో నిశ్చితార్థం నిశ్చయం అయిపోయి ఉంటుంది. అయితే వరుడు మాదకద్రవ్యాలు వాడుతూ ఉండటం, సిలైన్ ను మానసికంగా వేధిస్తూ ఉండటం వలన వారి నిశ్చితార్థం రద్దు అవుతుంది. ఇది తెలుసుకొన్న జార్జి బృందం వరుడిని చితకగొడతారు.

అంతంలో జార్జి సిలైన్ ను వివాహమాడతాడు. ఆ వివాహానికి పతీ సమేతంగా మలర్ మిస్ హాజరు అవుతుంది. మలర్ మిస్ కు నయమవ్వటంతో, ఇప్పుడు జార్జి ఎవరో తనకు తెలుసు. అయినా, సిలైన్ తో జార్జి సంతోషంగా ఉండటం చూచిన మలర్ మిస్, జార్జితో ఎటువంటి చర్చలు జరుపకుండా, భర్తతో సహా ఆ వివాహం నుండి నిష్క్రమిస్తుంది.

విశేషాలు మార్చు

  • మొదటి భాగంలో ఆలువ అందాలు.
  • యౌవనంలో అపరిపక్వతతో జార్జి బృందం చేసే అల్లరి (ఒక సందర్భంలో మేరీను చూస్తూ చర్చిలో ఏకంగా ప్రేమగీతాన్నే అందుకొంటాడు జార్జి. ఫాదర్ రాకతో మరల భక్తి పాటకు ప్లేటు ఫిరాయిస్తాడు)
  • అనుపమ పరమేశ్వరన్ పాత్ర. వత్తైన రింగుల జుట్టును అచ్చు కేరళ అమ్మాయిలా జడగానీ, ముడిగానీ వేయక, అలానే వదిలివేయటం. తనను చాలా మంది కుర్రాళ్ళు ప్రేమిస్తున్నారన్న విషయాన్ని (చివరకు జార్జి ప్రేమను కూడా) అతి తేలికగా తీసుకొనటం. తన ప్రేమ పట్ల స్పష్టంగా ఉండటం
  • రెండవ భాగంలో జార్జి బృందం రూపాంతరం. అమాయకంగా, సాదాసీదాగా ఉన్న ఒక యువకుడు, కాలేజీ గొడవలలో అతి పెద్ద హస్తం కావటం. పరిచయ సన్నివేశంలో నేపథ్యంలో వినిపించే బీభత్స రసభరిత గీతం.
  • మలర్ మిస్ పాత్ర. చూడటానికి పెద్దగా అందంగా ఏమీ ఉండదు. మొటిమల ముఖం. అయినా చీర కట్టుకుని, హుందాగా ఉండటం. పెద్ద అందగత్తె కాకపోయినా, జార్జి ఆమెను అందంగా ఉన్నావని పొగడటం. (ఒకప్పుడు కేరళ కూడా తమిళనాడులో భాగమే. విడిపోయిననూ, రెండు రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలున్ననూ, కేరళ యువకుడు, తమిళ యువతిని, అదీ, అధ్యాపకురాలినే ప్రేమించటం.)
  • మలర్ మిస్ మొట్టమొదట చూపించే నృత్య సన్నివేశానికి జార్జి బృందం నిశ్చేష్టులవ్వటం. (అంత వరకూ ప్రక్కింటి అమ్మాయి వలె ఎంతో హుందాగా కనబడిన మలర్ మిస్ స్టెప్పుతో వీక్షకులు సైతం నిశ్చేష్టులౌతారు)
  • మలర్ మిస్ జార్జిని గుర్తు పట్టలేకపోయినపుడు, మారు మాట్లాడక, జార్జి బృందం అక్కడి నుండి నిష్క్రమించటం. నేపథ్యంలో వినిపించే Unfinished Hope వాయిద్య గీతం. జార్జి పాత్రలో నివిన్ పాలీ పలికించిన హావభావాలు.
  • జార్జి యొక్క మూడు భిన్న రూపాంతరాలు. ప్రతి రూపాంతరంలోనూ జార్జి ప్రేమకై పరితపించే ఒకే తీరు, ఆ ప్రేమ తనకు అందకపోవటం
  • కథ కన్నా కథనంలో కనబడే ప్రత్యేకత. అక్కడక్కడా నా ఆటోగ్రాఫ్ ఛాయలు కనబడిననూ, తామరాకు పై నీటి బిందువు వలె, రెండు చిత్రాల కథలు, కథనాలు అంటీ అంటనట్లు ఉంటాయి.

సంగీతం మార్చు

జార్జి స్నేహితుడైన శంభు పాత్రధారి శబరీష్ వర్మ ఐదు పాటలను తానే స్వయంగా వ్రాశారు. 2015 సంవత్సరానికి గాను, యాపిల్ మ్యూజిక్ ఈ చిత్రాన్ని ఉత్తమ మలయాళ ఆల్బంగా ఎన్నుకోవటం విశేషం.

క్రమసంఖ్య పేరుగీత రచనSinger(s) నిడివి
1. "Aluva Puzhayude"  Shabareesh VarmaVineeth Sreenivasan 3:03
2. "Kaalam Kettupoi"  Shabareesh VarmaShabareesh Varma 2:47
3. "Pathivai Njan"  Shabareesh VarmaShabareesh Varma, Rajesh Murugesan 3:31
4. "Scene Contra"  Shabareesh VarmaShabareesh Varma 2:26
5. "Kalippu"  Shabareesh VarmaMurali Gopy, Shabareesh Varma 3:02
6. "Rockaankuthu"  Pradeep PaalarAnirudh Ravichander 3:01
7. "Malare"  Shabareesh VarmaVijay Yesudas 5:16
8. "Chinna Chinna"  Shabareesh VarmaRanjith, Aalap Raju 2:18
9. "Ithu Puthan Kalam"  Shabareesh VarmaShabareesh Varma, Rajesh Murugesan 3:46
22:26
క్రమసంఖ్య పేరు నిడివి
1. "First Love"   1:38
2. "High Speed Drifting"   3:28
3. "Looper Theme"   2:41
4. "Lush love"   0:57
5. "Malare Unplugged"   1:51
6. "Red Velvet"   1:10
7. "The Encore"   2:50
8. "Unfinished Hope"   3:26
16:01

పైరసీ మార్చు

జూన్ 2015 లో ప్రేమం చిత్రం ఆన్లైన్ లో కనబడింది. నిర్మాత అన్వర్ రషీద్ దీనిపై చర్యలు తీసుకొనకపోతే తాను ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోషియన్ కు రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. పైరసీతో సంబంధం ఉన్నదని నమ్మిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సినిమ థియేటర్ యాజమాన్యాలు పైరసీకి వ్యతిరేకంగా తమ థియేటర్ లను మూసివేశారు.

ఇవి కూడా చూడండి మార్చు