ఫణిహారం రంగాచారి
ఫణిహారం రంగాచారి తెలంగాణ రైతాంగ సాయుధపోరాట యోధుడు.[1] నిజాం పాలనకు రజాకార్ల రాక్షసత్వానికి భూస్వాముల దోపిడికి వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం పోరాటం సాగించాడు.[2]
జీవిత విశేషాలు
మార్చుఆయన కామారెడ్డి పట్టణానికి మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి లక్ష్మణాచారి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. అదే పాఠశాలలో చదువుతున్న రంగాచారి చిత్రలేఖనంలో మంచి ప్రావీణ్యం సాధించారు. తరు వాత హైదరాబాద్‌లోని ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చేరారు. 1943లో ఆయన తండ్రి మరణంలో ఆర్థిక యిబ్బందులు మొదలయ్యాయి. దీంతో అతని మిత్రుడు విఠల్‌రావు సహాయంతో ట్యూషన్స్ చెబుతూ మెరిట్ స్కాలర్‌షిప్‌తో అతని చదువును కొనసాగించారు. ఆయన కళాశాలలో చదివే కాలంలో రజాకార్ల కార్యకలాపాలు ఎక్కువగా ఉండేవి. దీనికి ఆర్యసమాజ్ తీవ్రంగా పోరాటం చేసేది. దీనితో ఆయన ఆర్యసమాజం పై ఆకర్షితులై అందులో చేరారు. ఆర్యసమాజం హిందువులకూ మాత్రమే ప్రాతినిధ్యం వహించడాంతో ఆయన విఠల్ రావుతో కలసి హైదరాబాదు వచ్చి విద్యార్థిసంఘంలో చేరి విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అదే సమయంలో కామ్రేడ్ అసోసియేషన్ నాయకులైన రావి నారాయణరెడ్డి, మఖ్దూం మొహియోద్దీన్, రాజ్ బహదూర్ గౌడ్ లతో సంబంధాలు యేర్పరచుకున్నారు.[3] హైదరాబాదు సంస్థానంలో ప్రజకు జరుపుతున్న ఉద్యమాలపై సామాజిక సమస్యలపై చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. భూస్వాముల దోపిడీపై నిర్బంధ పన్నుల వసూళ్లపై రంగాచారి ఎన్నో తైలవర్ణ చిత్రాలు వేసేవారు. 1946లో భారత కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ సంస్థానంలో నిషేధానికి గురికావడం, ఆ పార్టీ కార్యదర్శి రాజ్‌బహదూర్ గౌడ్ అరెస్టు కావడం జరిగింది. దీంతో రంగాచారితో పాటు మరికొందరు నాయకులు పార్టీ దళితుల కోసం వివిధ వర్గాల నుంచి ఆయుధాలను సేకరించి తెలంగాణ పోరాట ప్రాంతం నుంచి రహస్యంగా ఆయుధాలను చేరవేసేవారు. ఆయుధాలను చేరవే స్తుండగా జరిగిన అపాయంలో గాయపడ్డ డాక్టర్ రాజ్ బహదూర్ గౌడ్‌ను పోలీసు కస్టడీలో ఉన్నప్పటికీ ఉస్మానియా ఆస్పత్రి నుంచి ఆయన్ను తప్పించడంలో రంగాచారి కీలకపాత్ర వహించారు. అంతే కాకుండా నాటి విద్యార్థి నాయకుడు చెన్నమనేని రాజేశ్వర్‌రావును సైతం మతోన్మాద గుండాల నుంచి రక్షించినట్లు చరిత్ర చెబుతుంది. రహస్య స్థావరాల్లో ఉన్న కార్యకర్తలను అనేక విధాలుగా రక్షణ కల్పి స్తూ ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలను రంగాచారి ఇచ్చేవారు.[4]
1946 సంవత్సరంలో హైదరాబాద్ సంస్థానంలో నిర్భంధ పన్నులపై వేసిన తైల వర్ణ చిత్రం నేటికి భద్రంగా ఉంది. 1946 సంవత్సరంలో సిపిఐని హైదరాబాద్ సంస్థానంలో నిషేధించారు. హైదరాబాద్ పార్టీ కార్యదర్శి రాజ్‌బహదూర్‌గౌడ్‌ను అరెస్టు చేయడం జరిగింది. నాటి పరిస్థితుల్లో కెఎల్ మహేంద్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. రహస్య స్థావరం రక్షకునిగా, స్టేట్ కమిటీ కోరియర్‌గా రంగాచారి పనిచేశారు. సూర్యాపేటకు చెందిన వెదిరె రాజిరెడ్డితో కలసి హైదరాబాద్‌లోని చిలుకలగూడలో మరోక రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేశారు. రంగాచారి, బాసిత్, షానూర్ అలీ, నర్సింగ్‌రావులతో కలసి సాయుధ పోరాటాలు జరుపుతున్న పార్టీ దళాల కోసం ఆయుధాలను సేకరించి తెలంగాణలోని పోరాట కేంద్రాలకు చేరవేసే వారు. అనేక సార్లు ప్రాణపాయం నుండి తప్పించుకున్నాడు. ఉస్మానియా ఆసుపత్రి నుండి డా.రాజ్‌బహదూర్‌గౌడ్‌ను తప్పించడంలో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ప్రసాద్‌ను పోలీసు కస్టడీ నుంచి తప్పించడంతో రంగాచారి ప్రముఖ పాత్ర వహించాడు.[5]
మరణం
మార్చుఆ కాలంలో నల్గొండ ప్రాంతానికి చెందిన రాంచంద్రారెడ్డి అనే దళ సభ్యుడిపైన ఒక ఎలుగుబంటి దాడి చేయడం వల్ల ఆయన గాయపడ్డాడు. గాయపడిన అతనిని ఒక ఎడ్లబండిపై చిలుకలగూడ రంగాచారి నిర్వహిస్తున్న రహస్య స్థావరానికి చికిత్స నిమిత్తం తీసుకురావడం జరిగింది. రంగాచారి వెంటనే గాయపడిన రాంచంద్రారెడ్డిని వేరేక రహస్య స్థావరానికి తరలించడం జరిగింది. ఎడ్లబండిలో రక్తం మరకలను గమనించిన పోలీసులు బండిని అతని ద్వారా చిలుకలగూడ రహస్య స్థావరంపై దాడి చేసి రంగాచారిని, రాజిరెడ్డిలను జూలై 23, 1949 సంవత్సరంలో పోలీసులు అరెస్టు చేశారు.
రంగాచారి, వెదిరె రాజిరెడ్డిలను అరెస్టు చేసిన అనంతరం వారిని చంచల్‌గూడ జైలుకు తరలించి పార్టీ దళానికి చెందిన రహస్యాల కోసం వారిని చిత్రహింసలకు గురి చేశారు. ఐనా ఆయన నుండి రహస్యాలు రాబట్టలేని పోలీసులు రంగాచారిని, రాజిరెడ్డిలను విచారణకై చంచల్‌గూడ జైలు నుండి వరంగల్ జైలులోని మామునుర్ క్యాంపుకు తరలించడం జరిగింది. అనేక రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసిన రహస్యాలు రాబట్టలేని పోలీసులు అక్టోబరు 29 1949 న బూర్గంపాహడ్ వద్ద చట్ట విరుద్ధంగా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడనే సాకుతో వారిని కాల్చి చంపడం జరిగింది.
విగ్రహావిష్కరణ
మార్చుఫణిహారం రంగాచారి గారి విగ్రహ ఆవిష్కరణ తేది 22-11-2015 న విగ్రహావిష్కరణ కమిటి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద శ్రీ ఫణిహారం రంగాచారి గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.[6]
మూలాలు
మార్చు- ↑ రేపు ఫణిహారం రంగాచారి విగ్రహావిష్కరణ[permanent dead link]
- ↑ నేడు ఫణిహరం రంగాచారి 66వ వర్థంతి
- ↑ ఫణిహారం రంగాచారి వర్ధంతి[permanent dead link]
- ↑ సాయుధపోరాటంలో ఇందూరు బిడ్డలు 17-09-2015[permanent dead link]
- ↑ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఫణహరం రంగాచారి
- ↑ కామారెడ్డిలో తెలంగాణా పోరాటయోధుడు శ్రీ ఫణిహారం రంగాచారి గారి విగ్రహ ఆవిష్కరణ.[permanent dead link]