చెరబండరాజు
చెరబండరాజు (1944 - జూలై 2, 1982[1]) కలం పేరుతో దిగంబరకవులలో ఒకనిగా సుపరిచితమైన "బద్ధం భాస్కరరెడ్డి"[2] ఆలోచన, అక్షరం, ఆచరణ ఏక రూపం దాల్చిన విప్లవ కవి, నవలా రచయిత, పాటల రచయిత.[3] అతను ప్రపంచ పురోగతి సాంతం శ్రమజీవి నెత్తుటి బొట్టులోనే ఇమిడివుందని గాఢంగా నమ్మిన వ్యక్తి. అతనికి మహాకవి శ్రీశ్రీ తన "మరోప్రస్థానం" కావ్యాన్ని అంకితమిచ్చాడు.
చెరబండరాజు | |
---|---|
జననం | బద్దం భాస్కరరెడ్డి 1944 అంకుషాపూర్ |
మరణం | జూలై 2, 1982 మెదడు కాన్సర్ |
వృత్తి | హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా |
ప్రసిద్ధి | విప్లవ కవి |
జీవితం
మార్చుచెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కరరెడ్డి. అతను మేడ్చల్ జిల్లా, ఘటకేసర్ మండలంలోని అంకుషాపూర్ లోని ఒక పేద రైతు కుటుంబంలో 1944లో పుట్టాడు. హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అతను ఆరుగురు దిగంబరకవులలో ఒకడు. "నన్నెక్కనివ్వండి బోను" అనే కవితతో కవితాలోకంలో సూర్యుడిలా ఉదయించాడు. దిగంబర కవిత్వంలో గొప్ప కవితగా చెరబండరాజు "వందేమాతరం" గేయం పలువురి ప్రశంసలు పొందింది. విరసం వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు, కార్యదర్శిగా 1971-1972 లో పనిచేసాడు. దిగంబరకవి నుండి విప్లవకవిగా మారాక విప్లవ సాహిత్యానికి పాట అవసరాన్ని గుర్తించి విరివిగా పాటలు రాశాడు. 1975 ఏప్రిల్‌లో ప్రపంచ తెలుగు మహా సభలను బహిష్కరించిన సందర్భంలో మహాకవి శ్రీశ్రీతో పాటు అరెస్టు అయ్యాడు.
1971 నుండి 1977 మధ్యకాలములో మూడేళ్ల పాటు జైళ్లో గడపడం వలన ఈయన ఆరోగ్యము క్షీణించింది. జైళ్లో మొదలైన తీవ్ర తలనొప్పి మెదడు క్యాన్సర్ గా పరిణమించింది. 1977 నుండి 1981 మధ్యలో ఈయనకు మూడుసార్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈయన అనారోగ్యముతో ఉండగానే ప్రభుత్వం ఉద్యోగం నుండి తొలగించింది. అయితే ప్రజాందోళన వల్ల తిరిగి చేర్చుకోవలసి వచ్చింది.
అనారోగ్య బాధితుణ్నే
అయితేనేం యోధుణ్నే
పోరాటం డైరెక్షన్
పాట నాకు అక్సిజన్
అంటూ కలవరిస్తూ, పలవరిస్తూ కన్నుమూసిన చెరబండరాజు నిబద్దతకు మరోపేరు.
అనారోగ్యానికి గురైన చెరబండరాజు మెదడు కాన్సర్‌తో 1982 జూలై 2న మరణించాడు.
ఏరోజైనా
ప్రజాపోరాటాల విజయాల్ని రచించకపోతే
ఆరోజు జీవించినట్టుండదు
అని చెప్పుకున్న చెరబండరాజు చరిత్ర తెలుగు సాహిత్య చరిత్రలో ఎర్ర అక్షరాలతో లిఖించబడింది.
చెరబండరాజు రచనలు
మార్చు- దిగంబర కవితా సంకలనాలు (1965,1966,1968)
- దిక్చూచి (1970)
- ముట్టడి (1972)
- గమ్యం (1973)
- కాంతి యుద్ధం (1973)
- గౌరమ్మ కలలు (1975)
- జన్మహక్కు (1978)
- పల్లవి (1980)
- చెరబండరాజు కవితలు (1982)
- కత్తి పాట (1983)
నవలలు
మార్చు- మాపల్లె (1978)
- ప్రస్థానం (1981)
- నిప్పులరాళ్లు (1983)
- గంజినీళ్లు (1983)
కథలు
మార్చు- చిరంజీవి చెరబండరాజు కథలు (1985)
పురస్కారం
మార్చు- 1970లో దిక్సూచి కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది.
మూలాలు
మార్చు- ↑ Vaḍali Mandēśvararāvu (1998). Modern Poetry in Telugu. V. Mandeswara Rao. p. 43. Retrieved 13 November 2018.
- ↑ Datta, Amaresh (2005). Encyclopedia of Indian Literature. New Delhi: Sahitya Akademi. pp. 1043–1044. ISBN 978-81-260-1194-0.
- ↑ "Showcasing great Telugu literature". The Hans India. 23 Dec 2016. Retrieved 1 Sep 2018.