బద్రీ విశాల్ పిత్తి

బద్రీ విశాల్ పిత్తి హైదరాబాదుకు చెందిన పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త, కళాపోషకుడు, దాత.[1] హైదరాబాదులో స్థిరపడిన సంపన్న మార్వాడీ కుటుంబానికి చెందిన బద్రీ విశాల్ 1928లో కలకత్తాలో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం అలహాబాదులో సాగింది.[2] వీరి కుటుంబం 200 ఏళ్ల క్రితం హైదరబాదులో స్థిరపడి, నిజాం యొక్క నమ్మకాన్ని, సాన్నిహిత్యాన్ని చూరగొన్నారు. ఈయన ముత్తాత సేఠ్ మోతీలాల్ కు రాజా బహాదుర్ అనే పట్టం ఇవ్వబడింది. ఈయన తాత రాయ్ బహాదుర్ సేఠ్ బన్సీలాల్ ను బ్రిటీషు ప్రభుత్వం సర్ బిరుదాంకితున్ని చేసి గౌరవించింది. ఈయన తండ్రి పన్నాలాల్ పిత్తి నిజాం యొక్క గౌరవ ఆర్థిక సలహాదారు. హైదరాబాదుపై పోలీసు చర్య జరిగినప్పుడు నిజాం, భారతీయ సేనలకు లొంగిపోవటంలో కీలక పాత్ర పోషించాడు.[3]

బద్రీ విశాల్ పిత్తి
జననం1928
మరణం2003

బద్రీ విశాల్‌, 1949 ఆగస్టులో, 21 ఏళ్ల వయసులో, హైదరాబాదులో కల్పన అనే ప్రముఖ హిందీ సాహిత్య పత్రికను స్థాపించాడు. ప్రారంభించిన కొన్నాళ్ళకే హిందీ సాహిత్వంలో ఉన్నతమైన పత్రికగా పేరుతెచ్చుకొన్నది. ఇది 1978 వరకు నిరంతరాయంగా ప్రచురించబడింది. దీని యొక్క పతాకశీర్షికను ఎం.ఎఫ్.హుస్సేన్ రూపొందించాడు. హుస్సేన్ యొక్క చిత్రాలు తరచూ కల్పన యొక్క ముఖచిత్రంపై కనిపించేవి.[3] అప్పటి హిందీ రచయితలు కల్పన పత్రికలో తమ రచనలను ప్రచురించబడటం చాలా గొప్ప విషయంగా భావించేవారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నిర్మల్ వర్మ తన రచనలు కల్పనలో ప్రచురించబడిన తర్వాతనే తనను రచయితగా హిందీ సాహితీప్రపంచం అమోదించిందని భావించానని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చాడు.[4]

బద్రీ విశాల్‌కు, సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియాతో పరిచయం ఏర్పడి, ఆయన భావాలచే ప్రభావితుడై, జీవితాంతం సోషలిష్టుగా ఉన్నాడు. నిజాంతో తన కుటుంబానికున్న సాన్నిహిత్యాన్ని కూడా లెక్కచేయకుండా హైదరాబాదు రాష్ట్ర కాంగ్రేసు యొక్క తొలి సమావేశంలో పాల్గొని హైదరాబాదులో ప్రజాస్వామ్యానికై పిలుపునిచ్చాడు. 1951లో పెరుగుతున్న ధాన్యపు ధరలు తగ్గించాలని ఆందోళన చేసి అరెస్టయ్యాడు. 1955లో సోషలిష్టు పార్టీ స్థాపనలో కీలకపాత్ర పోషించాడు. 1960లో లోహియా పిలుపునిచ్చిన పౌర నిరాకరణోద్యమంలో పాల్గొని మారోమారు జైలుకెళ్ళాడు.

బద్రీ విశాల్‌ 1967లో సంయుక్త సోషలిష్టు పార్టీ అభ్యర్థిగా, కొత్తగా ఏర్పడిన మహారాజ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు.[5] ఈయన 1972లో సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా, 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ఇదే నియోజకవర్గం నుండి పోటీచేసి ఓడిపోయాడు.[6] బద్రీ విశాల్‌ 1969లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి గట్టి మద్దతునిచ్చాడు.

బద్రీ విశాల్‌, సోషలిష్టు అయినా, తన రాజకీయాలకు అతీతంగా కళలను, కళాకారులను పోషించాడు.[3] ఎం.ఎఫ్.హుస్సేన్ వంటి చిత్రకారున్ని తొలిదశ నుండే సన్నిహితంగా ప్రోత్సహిస్తూ వచ్చాడు.[7] హుసేన్ తన ప్రసిద్ధ రామాయణం, మహాభారతం చిత్రాలను సోమాజీగూడలోని బద్రీ విశాల్‌ ఇంట్లో ఉంటూనే చిత్రీకరించాడు.[8] ఈయన ఎం.ఎఫ్.హుసేన్ 1940వ దశకపు చివరి నుండి 1970వ దశకపు చివరి వరకు చిత్రించిన నాలుగు వందలకు పైగా చిత్రాలను సేకరించాడు.[9] బద్రీ విశాల్ మరణించిన తర్వాత 2013లో ఈయన సేకరణలో ఉన్న ఎం.ఎఫ్.హుస్సేన్ చిత్రాలు, వేలంలో దాదాపు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.[10]

మూలాలు మార్చు

  1. "Selected for award". The Hindu. Apr 26, 2005. Retrieved 27 October 2014.
  2. NMML manuscripts: an introduction. Nehru Memorial Museum and Library. 2003. p. 396. Retrieved 28 October 2014.
  3. 3.0 3.1 3.2 Kumar, Kuldeep (September 5, 2014). "A socialist who patronised art". The Hindu. Retrieved 27 October 2014.
  4. Bharadwaj, Bharat. "Hindi Literary Journalism Since Bhartendu Age To The Twentieth Century" (PDF). Hindi Language Discourse Writing. 4 (July-September 2010): 66. Archived from the original (PDF) on 16 అక్టోబరు 2012. Retrieved 31 October 2014.
  5. Leach, Edmund; Mukherjee, S.N. (1970). Elites in south asia. London: Cambridge University Press. p. 138. Retrieved 28 October 2014.
  6. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 218.
  7. "CITY BIDS ALVIDA TO FIDA". Times of India. Aug 30, 2014. Archived from the original on 6 జూలై 2009. Retrieved 29 October 2014.
  8. Farida, Syeda (June 10, 2011). "Husain's bonding with the Pittis". The Hindu. Retrieved 29 October 2014.
  9. Nag, Ashoke (Dec 13, 2012). "Mumbai's Pundole gallery to auction 400 works by MF Husain in January". The Economic Times. Retrieved 29 October 2014.
  10. Dhiman, Anisha. "City art collection sells for Rs 18 crore". Deccan Chronicle. Retrieved 29 October 2014.[permanent dead link]