తెలంగాణ ఉద్యమం

తెలంగాణఉద్యమం

తెలంగాణ ఉద్యమంభాషాప్రయుక్త రాష్ట్రాల ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నిజాం పాలించిన కొన్ని జిల్లాలను వేరుచేస్తూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని మొదలైన ఉద్యమం. ఇది దాదాపు 60 సంవత్సరాలు కొనసాగింది.

నేపధ్యము

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 1953 డిసెంబరులో, రాష్ట్రాల పునర్విభజన కమిషనును నియమించడం జరిగింది.[1] ప్రజాభిప్రాయం ప్రకారం ఈ కమిషన్ హైదరాబాదు రాష్ట్రాన్ని విభజించి అందులో మరాఠీ భాష మాట్లాడే ప్రాంతాలను బొంబాయి రాష్ట్రం లోనూ, కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలను మైసూరు రాష్ట్రం లో కలిపివేయాలని సిఫారసు చేసింది. ఈ కమిషన్ నివేదిక (SRC) లో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రం లో విలీనం చేయడం వలన కలిగే లాభనష్టాలను చర్చించి విలీనానికి మద్దతు ఆంధ్రభాగంలో ఎక్కువగా వున్నప్పటికి, తెలంగాణా భాగంలో స్పష్టంగా లేకపోవటంతో తెలంగాణా భాగాన్ని హైద్రాబాదు రాష్ట్రంగా ఏర్పాటు చేసి సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత హైదరాబాద్ రాష్ట్రం ప్రజాభిప్రాయం ప్రకారం విధానసభలో విలీనం తీర్మానానికి మూడింట రెండువంతుల ఆధిక్యత వస్తే విలీనం జరపాలని సూచించారు.

అయినప్పటికీ, జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పెద్దమనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణ భద్రతలను అందించడం తర్వాత 1956, నవంబరు 1 న ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ విలీనం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగింది.

1969 తెలంగాణ ఉద్యమం

1948లో పోలీస్‌ యాక్షన్‌ తర్వాత 1952లో సాధారణ ఎన్నిక జరిగి ప్రభుత్వం ఏర్పడే వరకు హైదరాబాద్‌ రాష్ట్ర పాలనా యంత్రాంగం మిలిటరీ, సివిల్‌ అధికారుల పాలనలో ఉండటంవల్ల ఆంధ్ర ప్రాంతంనుంచి వలసలు నిరాటకంగా కొనసాగాయి. అదివరకే ఆంధ్ర ప్రాంతంలో బ్రిటీష్‌ వారి క్రింద శిక్షణ పొంది అనుభవం ఉన్న ఆ అధికారులను తెలంగాణకు రప్పించుకున్నారు. అప్పటికే హైదరాబాద్‌ రాష్ట్రంలో అమల్లో ఉన్నా ముల్కీ నిబంధనలను కాదని వలసవాదులకు ఉద్యోగాలు ఇచ్చారు. 1956లో ఆంధ్రరాష్ట్రం హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనమైన తర్వాత వలసలు మరింత పెరిగాయి. స్థానికులకు కేటాయించిన ఉద్యోగాలు స్థానికేతరుల పరమవుతూవచ్చాయి. పెద్దమనుషుల ఒప్పందంను గాలికొదిలేయడంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నిప్పు రాజుకుంది. ఖమ్మం జిల్లా పాల్వంచ లోని థర్మల్‌ స్టేషన్‌లో పనిచేసే ఉద్యోగుల్లో మెజార్టీ ఉద్యోగలు ఆంధ్ర ప్రాంతం వారు కావడంతో 1969, జనవరి 5న తెలంగాణ ఉద్యోగులు నిరసనకు దిగారు. అప్పటి ఉద్యమ ప్రారంభానికి పాల్వంచనే పాదు వేసింది. జనవరి 10 నుంచి నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు.

తెలంగాణ రక్షణలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ దినసరి వేతన కార్మిక నాయకుడు కృష్ణ నిరాహార దీక్షకు దిగాడు. దీంతో ఉద్యమం జిల్లా కేంద్రం ఖమ్మం పట్టణానికి పాకింది. జనవరి 9న పట్టణంలో బి.ఎ. స్టూడెంట్‌, నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ నాయకుడైన రవీంధ్రనాథ్‌ గాంధీచౌక్‌ దగ్గర నిరవధిక దీక్ష ప్రారంభించాడు. అతనితో పాటు ఖమ్మం మున్సిపాల్టీ ఉపాధ్యక్షుడు, కవి అయిన శ్రీ కవిరాజమూర్తి కూడా నిరాహారదీక్షలో పాల్గొన్నారు.

తెలంగాణ రక్షణ సమితి పేరుతో సంస్థను స్థాపించి తెలంగాణ అభివృద్ధి కోసం వంద కోట్లు ఖర్చు చేయాలని, పోచంపాడు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణకు ప్రాముఖ్యత ఇవ్వాలని, తెలంగాణేతర ఉద్యోగుల్ని వెనక్కి పంపి ఆ స్థానాల్లో తెలంగాణ నిరుద్యోగులను నింపాలని తీర్మానాలు చేశారు. ఆ మరునాడు అంటే జనవరి 10న ఉద్యమం నిజామాబాద్‌కు పాకింది. ఉద్యమంలోకి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేరారు.

జనవరి 13న ఉస్మానియా యూనివర్సిటీలో 'తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి'ఏర్పడింది. ఆ రోజు మొట్టమొదటిసారిగా ప్రత్యేక తెలంగాణ సాధనను తమ లక్ష్యంగా విద్యార్థులు ప్రకటించుకున్నారు. విద్యార్థుల కార్యాచరణ సమితి మెడికల్‌ విద్యార్థి మల్లిఖార్జున్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. విద్యార్థులు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాని మల్లిఖార్జున్‌ పిలుపునిచ్చారు. జనవరి 13న నగర ప్రముఖులందరు ఒక సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ పరిరక్షణ కమిటీని స్థాపించారు. విద్యార్థులకు పూర్తి మద్దతును ప్రకటించారు. జనవరి 20న శంషాబాద్‌లో పాఠశాల విద్యార్థుపై తొలిసారిగా కాల్పులు జరిపారు.

ఉద్యమ ఉధృతిని గమనించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మిగుల నిధు లెక్కలు తేల్చాలని జస్టిస్‌ భార్గవ అధ్యక్షతన ఒక కమిటీని వేసింది. జనవరి 22న తెలంగాణ రక్షణలను అమలు చేయడానికి ప్రభుత్వం జి.వో జారీ చేసింది. ఫిబ్రవరి 28లోగా నాన్‌ ముల్కీ ఉద్యోగును వాపస్‌ పంపిస్తామని, జి.వోను నిర్లక్ష్యం చేసే అధికారుపై చర్యు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. జనవరి 24న సదాశివపేటలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 14 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 17 ఏళ్ల శంకర్‌ మరుసటి రోజు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్‌.

కాల్పులకు నిరసనగా కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్‌ సమితిని ఏర్పాటు చేశారు. జూన్‌ 4న తెంగాణలో పరిస్థితి తీవ్రతను తెలుసుకున్న ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హైదరాబాద్‌ నగరానికి వచ్చి విద్యార్థి నాయకులు, తెలంగాణ ప్రజా సమితి నాయకులతో చర్చలు జరిపింది. దాదాపు ఏడాది పాటు తెలంగాణ ఉద్యమం యుద్ధభూమిని తలపించింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగాయి. మొత్తం 95 సార్లు కాల్పులు జరిగాయి. హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో కర్ఫ్యూ విధించారు.

ఉద్యమంలో 369 మంది చనిపోగా, ప్రభుత్వ లెక్కలు మాత్రం 57 మంది చనిపోయినట్టుగా చెప్పాయి. తెలంగాణ ప్రజా సమితి నేతతో కేంద్రం చర్చలు జరిపింది. సెప్టెంబరులో మర్రి చెన్నారెడ్డి ఢిల్లీలో చర్చలు జరిపి వచ్చిన తర్వాత విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని చెన్నారెడ్డి, విద్యార్థి నాయకుడు మల్లికార్జున్‌ గౌడ్‌ ఒక ప్రకటన చేశారు. చదువులు కొనసాగిస్తూనే ఉద్యమంలో పాల్గొనాని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా ఉద్యోగులను, విద్యార్థును ఉద్యమం నుంచి పక్కకు తప్పించారు.

తెలంగాణా ఉద్యమ ప్రస్థానం 2001

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమం 2001 ఏప్రిల్‌ 27 న అధికారికంగా తెలంగాణా రాష్ట్ర సమితిని ఏర్పాటు చెయ్యడంతో ప్రారంభమయింది. అప్పటి నుండి, ఈ ఉద్యమం ఎలా పురోగమించిందో, అక్షర బద్ధం చేసే విధం ఇది. కేవలం ఏమి జరిగింది, ఎవరు చెప్పారు, ఏమి చెప్పారు వంటి వాస్తవాల నివేదిక ఇది.

ఏప్రిల్‌ 27: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, కె చంద్రశేఖర రావు తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర స్థాపనకై ఉద్యమించాడు. ఇందుకు గాను తెలంగాణా రాష్ట్ర సమితి పేరిట ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాడు. శాసనసభకు పూర్వపు సభాపతి - జి నారాయణ రావు కూడా ఆయనతో విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. మే 17కరీంనగర్‌లో నిర్వహించే తెలంగాణా సింహగర్జన ద్వారా తమ బలప్రదర్శన చేస్తామని ఆయన ప్రకటించాడు. మే 2: తెలంగాణా రాష్ట్రం కొరకు జరిపే ఉద్యమం శాస్త్రీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా జరుగుతుందని, ఇతర ప్రాంతాల ప్రజలు భయపడనవసరం లేదని చంద్రశేఖర రావు చెప్పాడు.

తీవ్రత

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ గత 50 సంవత్సరాలనుండి పలు ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడిన తర్వాత ఇవి తీవ్ర రూపం దాల్చాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009, నవంబరు 29న దీక్షా దివస్ పేరుతో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించాడు.[2][3] తెలంగాణ మలిదశ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష కీలక ఘట్టం అయితే.....స్వరాష్ట్రం కోసం 2009 డిసెంబరు 3వ తేదీన ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు కాసోజు శ్రీకాంతచారి. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణసమితి ఆధ్వర్యంలో వివిధ ఉద్యమాలని రూపొందించారు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చి వీటిలో చెప్పుకోదగినవి. ఈ ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వమి 2009 డిసెంబరు 9 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైందని అధికారికంగా ప్రకటించింది.[4] ఈ నిర్ణయంపై సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలు మిన్నంటి సమైక్యాంధ్ర ఉద్యమం ఏర్పాటుకు పరిస్థితులు దారితీసాయి.

 
మిలియన్ మార్చి సందర్భంగా నిరసనకారులు హైదరాబాద్, ట్యాంక్‌బండ్ పై ప్రతిష్ఠించిన 12 వ శతాబ్దం నాయకుడు పలనాటి బ్రహ్మనాయుడు విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న చిత్రం

సకలజనుల సమ్మె

సమ్మెకు ఒక రోజుముందు, 2011 సెప్టెంబరు 12 న టి ఆర్ ఎస్ ప్రజా సదస్సు కరీంనగర్ లో నిర్వహించింది. దీనిలో టిజెఎస్ నాయకులు, బిజెపి, న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.[5]

2011 సెప్టెంబరు 13 నుండి ప్రారంభమై 42 రోజులపాటు జరిగిన సమ్మెలో తెలంగాణాలోని ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సింగరేణి కార్మీకులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, విద్యుత్ సంస్థ ఉద్యోగులు ఈ సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు.దీని ప్రభావం వలన తెలంగాణ ప్రాంతంలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.[6][7][8][9][10]

దీనిలో భాగంగా రైళ్ల నిలిపివేత చేపట్టబడింది. విద్యుత్ ఉద్పాదన తగ్గింది. ఢిల్లీలో ప్రధానమంత్రితో సంప్రదింపులు జరిగినవి.[11][12][13][14][15][16]

2011 అక్టోబరు 16 న రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మె నుండి వైదొలగగా తదుపరి ఇతర సంఘాలు కూడా సమ్మె విరమించాయి.ప్రొఫెసర్ కోదండరాం ఈ సమ్మె ఫలితంగా కేంద్రం ఆలోచన మార్చగలిగిందని ఉద్యమం వేరేవిధంగా కొనసాగుతుందని ప్రకటించాడు.[17]

జులై 31 2013 ప్రకటన

2013 జూలై 31 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో, సమైక్యాంధ్ర ఉద్యమం మరల రగిలింది.

రాజకీయ పార్టీలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా పలు రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. మచ్చుకు కొన్ని

తెలంగాణ ఉద్యమంలో అమరులైన వ్యక్తులు

ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు

పుస్తకాలు

ఇవీ చూడండి

మూలాలు

  1. "SRC submits report". The Hindu. Chennai, India. 1 October 2005. Archived from the original on 1 మార్చి 2006. Retrieved 9 October 2011.
  2. వి6 (29 November 2017). "దీక్షా దివస్.. తెలంగాణను నిలబెట్టిన దీక్ష". Archived from the original on 13 సెప్టెంబరు 2018. Retrieved 6 December 2018. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)CS1 maint: numeric names: authors list (link)
  3. 10టీవి (29 November 2016). "టీ.ఎస్ దీక్షా దివస్ డే." Archived from the original on 1 డిసెంబరు 2016. Retrieved 6 December 2018.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. టి.ఆర్.ఎస్. పార్టీ వెబ్సైట్. "నేడు దీక్షా దివస్". trspartyonline.org. Archived from the original on 26 నవంబరు 2020. Retrieved 6 December 2018.
  5. "Telangana is angry and will erupt in flames: KCR". Rediff.com. Retrieved 9 October 2011.
  6. "Telangana: Administrative work affected". IBNLive.com India. Archived from the original on 17 అక్టోబరు 2012. Retrieved 9 October 2011. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  7. "Strike at Singareni Collieries may hit power production". The Hindu Business Line. Retrieved 9 October 2011.
  8. "Telangana collieries strike hits power supplies in south India". Daijiworld Media Pvt Ltd. Archived from the original on 14 అక్టోబరు 2012. Retrieved 9 October 2011.
  9. "Govt teachers join hands for Telangana". The Times of India. India. 17 September 2011. Archived from the original on 27 సెప్టెంబరు 2012. Retrieved 9 October 2011. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  10. "Transport employees' strike paralyse Telangana". The Times of India. India. 19 September 2011. Retrieved 9 October 2011.{{cite news}}: CS1 maint: url-status (link) [dead link]
  11. Singh, S. Harpal (19 September 2011). "Telangana activists block highway". The Hindu. Chennai, India. Retrieved 9 October 2011.
  12. "Statehood protests paralyse transport in Telangana". The Times of India. India. 25 September 2011. Retrieved 9 October 2011.{{cite news}}: CS1 maint: url-status (link) [dead link]
  13. "People power driving Telangana agitation". India Today. Retrieved 9 October 2011.
  14. "Telangana crisis: Bandh in Hyderabad, talks in Delhi". NDTV. Archived from the original on 10 అక్టోబరు 2011. Retrieved 9 October 2011.
  15. "Telangana issue: PM steps in, meets KCR and says working on solution". The Indian Express Limited. Retrieved 9 October 2011.
  16. "Telangana stir, energy crisis could hit economy of Andhra Pradesh". The Times of India. India. 5 October 2011. Archived from the original on 31 మే 2012. Retrieved 9 October 2011.
  17. "42-day Telangana strike ends". Business Line. Archived from the original on 3 ఫిబ్రవరి 2013. Retrieved 31 October 2011.

బయటి లంకెలు