బమ్మెర పోతన డిజిటల్ మ్యూజియం
బమ్మెర పోతన డిజిటల్ మ్యూజియం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్లులోని పోతన విజ్ఞాన పీఠంలో ఉన్న మ్యూజియం.[1] సహజ పండితుడు, మహాకవి బమ్మెర పోతన తాళపత్ర గ్రంథాలను ఆధునిక సాంకేతికతతో డిజిటలైజ్ చేసి, భావితరాలకు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయలతో ఈ మ్యూజియాన్ని ఏర్పాటుచేసింది.[2]
Established | 2017 |
---|---|
Location | పోతన కళా పీఠం, వరంగల్లు, తెలంగాణ, భారతదేశం |
రూపకల్పన
మార్చుతెలుగు సాహిత్యానికి మకుటాయమానంగా నిలిచిన కవి 'బమ్మెర' పోతన వారసత్వాన్ని పరిరక్షించడంతోపాటు కళలు, సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి అప్పటి విదేశాంగ మంత్రి, మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు కృషితో 1980లో పోతన విజ్ఞాన పీఠం స్థాపించబడింది.[3] పునరుద్ధరణలో (సాహిత్యం డిజిటలైజేషన్, భవన పునరుద్ధరణ) భాగంగా, పోతన మాన్యుస్క్రిప్ట్‌లతోపాటు అందుబాటులో ఉన్న అన్ని సాహిత్యాల డిజిటలైజేషన్ కోసం ఇంటాక్ కన్వీనర్, నిట్ మాజీ ప్రొఫెసర్ ఎం. పాండురంగారావు, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యుల కృషితో 2017 సెప్టెంబరులో ఈ పునరుద్ధరణ ప్రాజెక్ట్ ప్రకటించబడింది.[4]
ప్రారంభం
మార్చు2022 ఏప్రిల్ 15న పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, పంచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తదితరులు ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, కుడా వీసీ పి. ప్రవిణ్య, కుడా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈ అజిత్ రెడ్డి, ప్రొఫెసర్ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.[4]
మ్యూజియం వివరాలు
మార్చుసందర్శకులు డిజిటల్ మ్యూజియంలోకి అడుగుపెట్టగానే ఎల్‌ఈడీ స్క్రీన్‌పైన పోతన రాసిన రచనల వివరాలు తెలుగు, ఆంగ్లంలో కనిపిస్తాయి. వాటని కొనవేలితో తాకినపుడు నచ్చిన పద్యం తాత్పర్య సహితంగా (ఆడియో, వీడియో) తెరమీదకి ప్రత్యక్షమవుతుంది. అలా భాగవత పద్యాలను భావయుక్తంగా డిజిటల్ స్క్రీన్‌పైన చదువుకోవచ్చు. అంతేకాకుండా పోతన జీవిత విశేషాలను తెలిపే వీడియోలను కూడా చూడవచ్చు. ఈ మ్యూజియంలో 12 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, నాలుగు పెద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. నాలుగు పెద్ద స్క్రీన్‌పైన జీవిత చరిత్ర, కుటుంబ నేపథ్యం, సాహిత్యం తదితర అంశాలు ప్రదర్శితం అవుతుంటాయి. ‘సత్కవుల్ హాలికులైన నేమి..’ అంటూ సేద్యానికి, అక్షర సేద్యానికి సమన్యాయం చేసిన పోతన జీవిత ఘట్టాలను తలపించేలా మ్యూజియం ఆవరణలో ఎడ్ల బండిని కూడా ఏర్పాటుచేశారు. 30 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం కూడా అభివృద్ధి చేయబడింది. మ్యూజియం ముందు భాగంలో తామరల కొలను కూడా నిర్మించబడింది.[2]
మూలాలు
మార్చు- ↑ "భాగవతామృతానికి డిజిటల్ తళుకు". EENADU. 2022-04-15. Archived from the original on 2022-04-17. Retrieved 2022-04-17.
- ↑ 2.0 2.1 telugu, NT News (2022-04-17). "పోతనకు.. డిజిటల్ పీఠం". Namasthe Telangana. Archived from the original on 2022-04-17. Retrieved 2022-04-17.
- ↑ Telanganatoday (2021-05-06). "Pothana Vignana Peetham in Warangal gets facelift". Telangana Today. Archived from the original on 2021-05-07. Retrieved 2022-04-17.
- ↑ 4.0 4.1 Telanganatoday (2022-04-15). "Bhadrakali mini-bund, Pothana digital museum inaugurated in Warangal". Telangana Today. Archived from the original on 2022-04-17. Retrieved 2022-04-17.