బిందేశ్వర్ పాఠక్

భారతీయ సమాజశాస్త్రవేత్త

బిందేశ్వర్ పాఠక్ (హిందీ: बिन्देश्वर पाठक) సంఘ సేవకులు, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు.

బిందేశ్వర్ పాఠక్

వీరు బీహారు రాష్ట్రంలోని వైశాలీ జిల్లాకు చెందిన రాంపూర్ బఘేల్ అనే గ్రామంలో 1943 ఏప్రిల్ 2 న జన్మించారు.

సామాజిక శాస్త్రంలో పట్టభద్రుడై గాంధీ శతజయంతి వేడుకల్లో భంగీ ముక్తి విభాగంలో భాగస్వామిగా మల విసర్జన సమస్యా పరిష్కారంలో విశిష్టమైన కృషిచేశారు.

భంగీలతో రెండేళ్ళపాటు కలిసిమెలిసి జీవించిన పిమ్మట బిందేశ్వర్ సులభ్ శౌచాలయ నమూనాను తయారుచేశారు. ఈ నమూనాతో భారతదేశంలోని ఆరోగ్య వ్యవస్థను, పారిశుధ్య సమస్యను చక్కదిద్దగలవనుకున్నాడు. 1970లో సులభ్ శౌచాలయ సంస్థాన్ ను ప్రారంభించారు. క్రమంగా అది అంతర్జాతీయ సులభ్ సామాజిక సేవా సంస్థగా రూపుదాల్చింది. ఈయన ప్రవేశపెట్టిన కొత్త మరుగుదొడ్డి లేదా శౌచాలయం ని ప్రజలు వాడేందుకు సంశయించారు, కొందరు గేలిచేశారు. హరిజనులతో కలిసి తిరగడం కుటుంబ సభ్యుల్ని కన్నెర్రజేసే దశకు చేర్చింది.

బిందేశ్వర్ కనుగొన్న సులభ్ మరుగుదొడ్డి నిర్మాణం చాలా సరళమైనది. దానికి కావలసింది రెండు గుంటలు, ఒక మూత మాత్రమే. ఒక గుంటను వాడే సమయంలో రెండవ గుంటలోని మలం ఎరువుగా మారుతుంది. పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ సెయింట్ ఫ్రాన్సిస్ పారితోషికాన్ని పోప్ జాన్ పాల్ 1992లో బిందేశ్వర్ కు అందించారు. మొదట గేలిచేయబడిన సులభ్ శౌచాలయం సర్వోత్కృష్ట నాగరిక పద్ధతిగా 1996లో ఇస్తాంబుల్ లో నిర్వహింపబడిన హేబిటాట్ 2 సదస్సులో ప్రకటించారు. అప్పుడు ఐక్యరాజ్య సమితిలోని ఆర్థిక, సామాజిక సంస్థ సులభ్ ఇంటర్నేషనల్ సేవలకు ప్రత్యేక గుర్తించునిచ్చింది.

రెండు వేల నుండి ఐదు వేల మంది వరకు వాడే మరుగుదొడ్ల సముదాయాల నుండి లభించే మలమూత్రాలను బయోగాస్ ఉత్పత్తికి ఉపయోగపడే ఆలోచనను కూడా పంచారు. ఆరేళ్ళ పరిశోధన తరువాతు మొట్టమొదటిసారిగా ఇటువంటి కర్మాగారాన్ని పాట్నాలో నెలకొల్పారు. ఇది సత్ఫలితాలను సాధించడంతో దేశం మొత్తం మీద 68 కేంద్రాలలో ఈ పథకాన్ని విస్తరింపజేశారు.

క్రీ.పూ. 2500 సంవత్సరం నాటి నుండి వాడుకలో వున్న మరుగుదొడ్లను గూర్చిన సమాచారాన్ని, కళాత్మక ఆకృతుల్ని కొత్త ఢిల్లీలోని సులభ్ మ్యూజియమ్ ఆఫ్ టాయిలెట్స్ ప్రదర్శిస్తుంది.

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అరవై సంవత్సరాల తర్వాత ఇంకా ఇప్పుడు కూడా ఈ దేశంలో బహిరంగ ప్రదేశాల్లో లక్షలాది మంది మల విసర్జన జరుపుతుండడం మనమందరం సిగ్గుపడాల్సిన విషయం. జలాశయాల వద్ద, ఆహారపు నిల్వలున్న చోట్ల మానవులు, జంతువులు మలమూత్రాలు విసర్జించిన కారణంగా అవి కాలుష్యానికి గురై అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంది. మరుగుదొడ్లకు, స్నానాలకు సరైన సదుపాయాలు లేకపోతే మహిళలు మరింత ఇబ్బంది ఎదుర్కొనవలసి వస్తుంది. ఏదో అడ్డు ఉండి లేనట్లున్న చోట వాళ్ళు స్నానం చేయడం గాని, బహిర్భూమికి వెళ్ళవలసి రావడం గాని జరుగుతుంది. కనుక వాళ్ళు ఆ పనులు సూర్యోదాయానికి ముందో లేదా సూర్యాస్తమయం తరువాతనో చేయవలసి వస్తుంది. ప్రతిరోజు సుమారు పది కోట్ల గృహాలలో మరుగుదొడ్ల సౌకర్యం లేకుండానే గడిచిపోతుంది. మరో పది కోట్ల గృహాలలో ఇంకా బకెట్లతో శుభ్రం చేసే మరుగుదొడ్లనే ఉపయోగిస్తున్నారు. వీటి వలన ప్రబలే విరేచనాల వల్ల నీరసించి ప్రతీ సంవత్సరం దాదాపు అయిదు లక్షల మంది పిల్లలు అంటురోగాల బారినపడి మరణిస్తున్నారు. "ఇందువలన ఎవరూ మల విసర్జన చేసేందుకు బయటికి వెళ్ళరాదు. భారతదేశంలోని ప్రతి గృహంలోనూ మరుగుదొడ్డి ఉండితీరాలి." అనేది బిందేశ్వర్ జీవితధ్యేయం.

సులభ్ వారి సముదాయక మరుగుదొడ్లు 1974లో మొదటిసారిగా వాడుకలోకి వచ్చాయి. ఒక్కొక్క యూనిట్ లో స్నానానికి, మలమూత్ర విసర్జనకు, బట్టలు ఉతికేందుకు సదుపాయాలుండేట్లు రూపొందించి డబ్బు చెల్లించే పద్ధతిపై రోజంతా సేవలందించే ఏర్పాట్లుచేశారు. మొదటగా పాట్నాలో ప్రారంభమైన ఈ సేవలు భారతదేశంలోని వివిధ పట్టణాలలో 5,500 వరకు నెలకొల్పడం జరిగింది. విద్యుత్తు, 24 గంటల నీటి సదుపాయం, స్త్రీలకు, పురుషులకు వేర్వేరు సదుపాయాలు, పరిశుభ్రంగా ఉంచటంలో ప్రామాణికతను నెలకొల్పటం వల్ల ఇవి జనాదరణకు పొందాయి. సులభ్ సాంకేతికతను ఒకదాని తరువాత మరో పట్టణం స్వీకరించడం వల్ల దాదాపు 240 పట్టణాలలోని 50,000 మంది పారిశుధ్య కార్మికులు మానవ మలాన్ని ఎత్తి శుభ్రపరిచే పని నుండి విముక్తిపొంది సులభ్ వారి ఇతర వృత్తులలో కుదురుకున్నారు. 2000 సంవత్సరానికి సులభ్ 25 రాష్ట్రాలలో 38 జిల్లాలకు విస్తరించింది.

మూలాలుసవరించు

  • సామాజిక రంగంలో ప్రతిభా మూర్తులు: ఆంగ్లమూలం - శారదా బెయిల్, తెలుగు అనువాదం - రావెల సాంబశివరావు, అలకనంద ప్రచురణలు, విజయవాడ, 2005.