బుర్రా రాఘవాచారి

ఆంధ్ర నాటకరంగంలో కలియుగ అర్జునుడుగా ప్రఖ్యాతి వహించిన బుర్రా రాఘవాచారి 1883లో బందరులో జన్మించాడు[1]. తండ్రి నరసింహాచారి, తల్లి ఆండాళమ్మ. 'రాఘవాచారి సోదరుడైన నారాయణాచారి బందరు హిందూ థియేటరులో వివిధ పాత్రలను ధరించేవాడు. మరో సోదరుడు నంబెరుమాళ్లాచారి ప్రసిద్ధ హార్మోనిస్టుగా ప్రఖ్యాతి గాంచాడు. వీరిలో ఎక్కువ ప్రజాభిమానాన్ని చూరగొన్న వ్యక్తి బుర్రా రాఘవాచారి. ఇతడు మంచి గాయకుడు. పాటలన్నా,పద్యాలన్నా చెవి కోసుకునే వాడు. ఇతడు తన మేనమాను తిరువెంగళాచార్యులు వద్ద సంగీతాన్ని నేర్చుకుని పాట కచ్చేరీలు చేస్తూ ఉండేవాడు. కంచు గంటలా మోగే ఇతని కంఠం విన్న ప్రతి వారూ ఈయవ ఉజ్జ్వల భవిష్యత్తును గురించి వర్ణించేవారు. ఇతడు ప్రారంభంలో కాండూరి తిరువెంగళాచార్యుల ఆధ్వర్యంలో చిన్నచిన్న పాత్రలు ధరించేవాడు. ఇతడి పాటలకు, పద్యాలకు ముగ్ధులైన ప్రేక్షకులు కరతాళధ్వనులు చేసేవారు. దానితో ఇతనికి నాటకాలమీద ఆసక్తి ఎక్కువైంది. స్వయంకృషితో అనతి కాలంలోనే ఉత్తమ గాయకుడిగా, నటుడిగా పైకిచెవచ్చాడు. కళాతృష్ణతో ఇతడు రాయల్ థియేటర్‌ను 1903లో స్థాపించారు. అప్పటికే ముంజులూరి కృష్ణారావు కృష్ణ పాత్రధారణలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన సమర్థుడైన అర్జునపాత్రధారికై వెదుకుతున్న తరుణంలో బుర్రా రాఘవాచారి ఆయన కళ్లముందు మెరిశాడు. అదే స్థితిలో కృష్ణ పాత్ర కొరకు ఎదురు చూస్తున్న రాఘవాచారికి ముంజులూరి కృష్ణారావు దొరికాడు. రాయల్ థియేటర్ ఆధ్వర్యంలో 'పాండవోద్యోగం', 'పాండవ విఙయం', 'పాండవ జననం", పాండవ ప్రవాసం','గయోపాఖ్యానం', 'పాండవ ఆశ్వమేధం' మొదలైన భారత నాటకాలలో వీరిరువురూ కలియుగ కృష్ణార్జునులుగా సాక్షాత్కరించి, రాయల్ థియేటర్‌కు, బందరు నాటక రంగానికి , ఎనలేని కీర్తినీ, ప్రతిష్టనూ చేకూర్చారు. ఆ విధంగా వారు వందలాది నాటకాలను అద్భుతంగా ప్రదర్శించారు. ఇతనితో పాటు నటించిన ప్రముఖ నటులలో పింగళి లక్ష్మీకాంతం, ఇందుపల్లి గోవిందరావు, మాదిరెడ్డి సుబ్బారావు, పింగళి వీరయ్య, పింగళి నర్సయ్య, కలపటపు రాజేశ్వరరావు, శ్రవణం తాతయ్య, పెదసింగు రంగయ్య, ఆమాను సుబ్బారావు మొదలైనవారు వున్నారు. ఇతని నటనను మెచ్చుకున్నవారిలో త్రిపురనేని రామస్వామి చౌదరి, బాలగంగాధర తిలక్, మాధవపెద్ది వెంకటరామయ్య మొదలైనవారున్నారు.

ఇతడు స్థాపించిన రాయల్ థియేటర్ దాదాపు 40 సంవత్సరాలు అజరామరంగా నడిచింది. ఎంతోమంది నటులకు రాయల్ థియేటర్ ఒక కళాకేంద్రంగా వర్ధిల్లింది.

ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాక, రాష్ట్రేతర ప్రాంతాలైన బర్మా, రంగూన్, సింగపూర్ మొదలైన ప్రాంతాలలో పర్యటించి, భారత నాటకాల నన్నిటినీ ప్రదర్శించి పలువురి ప్రశంసలందుకున్నాడు. ఇతడు పేరు తెచ్చుకున్న పాత్రలలో ముఖ్యమైనది నరకాసురవధలో శ్రీకృష్ణుడు, వేణీ సంహారంలో ధర్మరాజు, బొబ్బిలి యుద్ధంలో హైదర్‌జంగ్, చిత్రనళీయంలో నలుడు, ప్రతాపరుద్రీయంలో ప్రతాపరుద్రుడు మొదలైనవి.

ఈయన మరణించేవరకూ సంగీత నాటక అకాడవిూ నెలకు 75 రూపాయలను వృద్ధకళాకారుల వేతనంగా ఇస్తూవచ్చింది. రాఘవాచారి దాదపు 80 సంవత్సరాల వరకూ జీవించాడు. ఇతడు ఆజన్మాంతమూ బ్రహ్మచారిగానే ఉన్నాడు. ఆంధ్ర నాటక రంగ యుగకర్తలలో ఒకడిగా, కలియుగార్జునిడిగా పేరుపొందాడు.

మూలాలు

మార్చు
  1. "నటరత్నాలు - [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]] - ఆంధ్రప్రభ వారపత్రిక - తేదీ:29-03-1972, పేజీ:53". Archived from the original on 2016-03-05. Retrieved 2015-12-20.