బ్రిటిషు భారతదేశంలో రెసిడెన్సీలు

బ్రిటిషు భారతదేశంలో రెసిడెన్సీలు అనేవి భారత ప్రభుత్వానికి, రాచరిక సంస్థానాలకూ మధ్య సంబంధాలను నిర్వహించేందుకు నెలకొల్పిన రాజకీయ కార్యాలయాలు. ఈ కార్యాలయాలకు రెసిడెంటు అనే అధికారి నేతృత్వం వహిస్తాడు.

హైదరాబాదు లోని బ్రిటిష్ రెసిడెన్సీ

చరిత్ర

మార్చు

1757 లో జరిగిన ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిషు వారు రూపొందించిన సైన్య సహకార ఒప్పందం వ్యవస్థలో ఈ రెసిడెన్సీ వ్యవస్థకు మూలాలున్నాయి. స్నేహపూర్వక స్థానిక రాజ్యాలలో ఈస్టిండియా కంపెనీ వారి బెంగాల్ సైన్యపు దళాలను మోహరించడం ద్వారా బెంగాల్‌ను దాడి నుండి రక్షించే ఒప్పందం అది.[1] ఈ వ్యవస్థ ద్వారా, ఈ స్థానిక రాజ్యాలలో కంపెనీ దళాలను మోహరించి, అంతర్గత లేదా బాహ్య దురాక్రమణల నుండి ఆ రాజ్యాల రాజులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. బదులుగా వారు ఆ దళాల నిర్వహణ ఖర్చులను చెల్లించవలసి ఉంటుంది. దాంతోపాటు, ఆ రాజుల సభలో (దర్బారు) బ్రిటిషు వారి ప్రతినిధి ఒకరు (రెసిడెంటు) ఉంటాడు. రెసిడెంటు ఆయా రాజ్యాల రాజధానుల్లో బ్రిటిషు ప్రభుత్వం నియమించే ఒక సీనియర్ బ్రిటిషు అధికారి. సాంకేతికంగా చూస్తే దౌత్యవేత్త. అయా రాజ్యాల పాలకులను తమ కూటమిని అతిక్రమించకుండా తమతో కలిసి ఉంచడానికి కూడా బాధ్యత వహిస్తాడు.[2] ఇది బ్రిటిష్ రెసిడెంటు జాగ్రత్తగా నియంత్రించే పరోక్ష పాలన వ్యవస్థగా పరిగణించబడింది. అతని పాత్ర (రెసిడెంట్లు అందరూ పురుషులే) పాలనలో సలహాలు ఇవ్వడం, వారసత్వ వివాదాలలో జోక్యం చేసుకోవడం, ఆయా రాజ్యాల అంతర్గత భద్రతకు అవసరమైన మేరకు మించి, ఇతర సైనిక దళాలను నిర్వహించకుండా చూసుకోవడం, సాటి రాజ్యాలతో దౌత్యపరమైన పొత్తులను ఏర్పరచుకోకుండా ఉండడం వంటివి ఉన్నాయి.[2][3] ప్రగతిశీల ప్రభుత్వం అనే యూరోపియన్ భావాలను ప్రచారం చేయడం ద్వారా రెసిడెంట్లు ఈ స్థానిక రాజ్యాలను ఆధునీకరించడానికి ప్రయత్నించారు.[2]

అటువంటి అనుబంధ కూటమిలోకి ప్రవేశించిన మొదటి స్థానిక రాజ్యాలు ఆర్కాట్, ఔధ్, హైదరాబాద్.[2] 1857 తిరుగుబాటుకు ముందు, క్షీణిస్తున్న మొఘల్ సామ్రాజ్యం, అభివృద్ధి చెందుతున్న ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య ఉన్న ఉద్రిక్తతల కారణంగా, ఇతర రెసిడెంట్ల కంటే ఢిల్లీ లోని బ్రిటిష్ రెసిడెంటుకు ఉన్న పాత్ర చాలా ముఖ్యంగా మారింది.[4] 1858 లో బ్రిటిష్ రాజు పాలనను స్థాపించిన తర్వాత, భారతీయ రాజులు పాలించే స్వదేశీ రాష్ట్రాలు రాజకీయ, పరిపాలనా నియంత్రణ పరంగా తమ అంతర్గత స్వయంప్రతిపత్తిని నిలుపుకున్నాయి. వారి విదేశీ సంబంధాలు, రక్షణ మాత్రం బ్రిటిషు వారి చేతుల్లో ఉండేది. అప్పట్లో భారత ఉపఖండంలో ఐదింట రెండు వంతుల ప్రాంతం స్థానిక రాజుల పాలనలో ఉండేది.[5] అయితే జనాభా పరంగా ఇది అంత పెద్ద నిష్పత్తిలో ఉండేది కాదు.

 
కొల్లం నగరంలోని బ్రిటిష్ రెసిడెన్సీని కల్నల్ జాన్ మున్రో నిర్మించారు

రాచరిక పాలనను కొనసాగనివ్వడం వలన, బ్రిటిషు వారు తమ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న, మరింత ఆర్థికంగా ముఖ్యమైన ప్రాంతాలపై తమ వనరులను కేంద్రీకరించడానికి వీలు కలిగింది. ఆ రాజ్యాల విదేశీ సంబంధాల నిర్వహణలో స్వతంత్రం కోల్పోయాయి.[2]

స్వదేశీ పాలకులకు, యూరోపియన్ శక్తికీ మధ్య అనుబంధ సంబంధాన్ని రెసిడెంటు అనే పదవి అనేది శాశ్వతంగా గుర్తు చేస్తుంది.[3] దీని భౌతిక అభివ్యక్తి స్వయానా రెసిడెన్సీయే. ఇది ఆ రాచరికపు సౌందర్య విలువల ప్రకారం నిర్మించిన భవనాలు, భూమి వగైరాల సముదాయం. ఆ రాజ్యపు రాజధానిలో దాని పరిమాణం, స్థానం కారణంగా, రెసిడెన్సీ అనేది అధికారానికి చిహ్నంగా ఉండేది.[6] అనేక సందర్భాల్లో, స్థానిక రాజులు బ్రిటిషు వారి పట్ల తన మద్దతు, విధేయతకు సూచనగా ఈ రెసిడెన్సీల నిర్మాణానికి అయ్యే ఖర్చును పెట్టుకునేవారు. ధనవంతులైన స్థానిక రాజులలో ఒకరైన ఔద్ నవాబు, పౌర సౌకర్యాలను మెరుగుపరచే విస్తృతమైన కార్యక్రమంలో భాగంగా లక్నోలో అద్భుతమైన రెసిడెన్సీని స్వంత ఖర్చులతో నిర్మించాడు.[5]

రెసిడెన్సీల జాబితా

మార్చు

ఉత్తర భారతదేశం

  • కాశ్మీర్ రెసిడెన్సీ

సెంట్రల్ ఇండియా ఏజెన్సీలో భాగం

  • ఇండోర్ రెసిడెన్సీ

రాజ్‌పుతానా ఏజెన్సీలో భాగం

  • జైపూర్ రెసిడెన్సీ
  • ఉదయపూర్‌లోని మేవార్ రెసిడెన్సీ
  • వెస్ట్రన్ రాజ్‌పుతానా స్టేట్స్ రెసిడెన్సీ

ఇతర రెసిడెన్సీలు

పూర్వ రెసిడెన్సీలు

  • బరోడా రెసిడెన్సీ 1937లో బరోడా అండ్ గుజరాత్ స్టేట్స్ ఏజెన్సీలో విలీనం చేసారు
  • కొల్హాపూర్ రెసిడెన్సీ 1933లో దక్కన్ స్టేట్స్ ఏజెన్సీలో విలీనం చేసారు
  • అడెన్ రెసిడెన్సీ (1859–1873), యెమెన్‌లోని బ్రిటిషు భూభాగం, 1932 వరకు బొంబాయి ప్రెసిడెన్సీ కింద ఉండేది, తర్వాత నేరుగా 1937 వరకు భారతదేశ ప్రధాన కమిషనర్ ప్రావిన్స్‌గా ఉంది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Spear, Percival, India: A Modern History (Ann Arbor: The University of Michigan, 1961); Spear, Percival, The Oxford History of Modern India : 1740–1947 (London: Oxford University Press, 1965)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Metcalf, Barbara D., and Thomas R. Metcalf, A Concise History of India (Cambridge: Cambridge University Press, 2002)
  3. 3.0 3.1 King, Anthony D., Colonial Urban Development: Culture, Social Power and Environment (London: Routledge and Kegan Paul, 1976)
  4. Gupta, Narayani, Delhi Between Two Empires 1803–1931: Society, Government and Urban Growth (New Delhi: Oxford University Press, 1981)
  5. 5.0 5.1 Davies, Philip, Splendours of the Raj: British Architecture in India, 1660–1947 (New York: Penguin Books, 1987
  6. Nilsson, Sten, European Architecture in India 1750–1850 (New York: Taplinger Publishing Company, 1969)
  7. Cassell's illustrated history of India