భీష్మ సహనీ

భారతీయ రచయత ,నాటక రచయిత మరియు నటుడు

భీష్మ సహానీ (8 ఆగష్టు 1915 - 11 జూలై 2003) ఒక హిందీ రచయిత, నాటకకర్త, నటుడు. ఇతడు దేశవిభజన అంశంపై వ్రాసిన తమస్ అనే నవల (టెలీ ఫిలిమ్‌గా రూపొందించబడింది.) ఇతనికి పేరుతెచ్చింది. 199లో భారతప్రభుత్వం ఇతడికి పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది.[1] 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. హిందీ సినిమా నటుడు బలరాజ్ సహానీ ఇతని తమ్ముడు.

భీష్మ సహానీ
పుట్టిన తేదీ, స్థలం(1915-08-08)1915 ఆగస్టు 8
రావల్పిండి, బ్రిటీష్ ఇండియా
మరణం2003 జూలై 11(2003-07-11) (వయసు 87)
ఢిల్లీ, భారతదేశం
వృత్తిరచయిత, నాటకరచయిత,విద్యావేత్త, నటుడు, సామాజికవేత్త
కాలం1955–2003

సంతకం

జీవిత చరిత్ర మార్చు

భీష్మ సహానీ 1915, ఆగష్టు 8న రావల్పిండిలో జన్మించాడు. ఇతడు లాహోర్‌లోని ప్రభుత్వ కళాశాల నుండి ఆంగ్ల సాహిత్యంలో స్నాతకోత్తర పట్టాను పొందాడు. పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్ నుండి 1958లో పి.హెచ్.డి. పట్టా పొందాడు.

ఇతడు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నాడు. దేశవిభజన సమయంలో ఇతడు జాతీయ కాంగ్రెస్‌లో చురుకుగా పనిచేశాడు. 1947 మార్చిలో అల్లరి మూకలు రావల్పిండిలో విధ్వంసకాండ సృష్టించినప్పుడు శరణార్థులకు సహాయ కార్యక్రమాలు చేపట్టాడు. 1948లో ఇతడు తన సోదరుడు బలరాజ్ సహానీతో కలిసి ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా)లో దర్శకుడిగా, నటుడిగా పనిచేయడం మొదలుపెట్టాడు. ఇప్టాతో అనుబంధం మూలాన ఇతడు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. తరువాత ఇతడు బొంబాయి వదిలి పంజాబ్‌కు వెళ్లాడు. అక్కడ మొదట అంబాలాలో ఒక కాలేజీలో లెక్చరర్‌గా స్వల్పకాలం పనిచేశాడు. ఆ తర్వాత అమృత్‌సర్‌లోని ఖల్సా కాలేజీకి మారాడు. ఆ సమయంలో ఇతడు ఇప్టాతో పాటు పంజాబ్ కాలేజ్ టీచర్స్ యూనియన్‌ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఢిల్లీ కాలేజి (ప్రస్తుతం జాకీర్ హుసేన్ కాలేజి)లో ఇంగ్లీషు అధ్యాపకునిగా ఉద్యోగం రావడంతో ఢిల్లీకి తరలి వెళ్లాడు.

1956 నుండి 1963 వరకు ఇతడు మాస్కోలోని ఫారిన్ లాంగ్వేజస్ పబ్లిషింగ్ హౌస్‌లో అనువాదకుడిగా పనిచేశాడు. ఈ సమయంలో ఇతడు లియో టాల్‌స్టాయ్ వ్రాసిన కథలు, పునరుత్థానము అనే నవల వంటి ముఖ్యమైన రచనలను హిందీలోనికి అనువదించాడు. భారత దేశానికి తిరిగి వచ్చాక ఢిల్లీ కాలేజీలో తిరిగి అధ్యాపకుడిగా కొనసాగాడు. 1980లో పదవీ విరమణ గావించాడు. 1965-1967 మధ్యకాలంలో ఇతడు హిందీ సాహిత్య పత్రిక నయీ కహానియాకు సంపాదకునిగా ఉన్నాడు. ఇతనికి పంజాబీ, ఇంగ్లీషు, ఉర్దూ, సంస్కృతము, హిందీ భాషలు ధారాళంగా వచ్చు.

భీష్మ సహానీ అనేక సాంస్కృతిక, సాహిత్య సంస్థలతో అనుబంధాన్ని కలిగివున్నాడు. అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శి (1975-85)గా, ఆఫ్రో - ఆసియన్ రైటర్స్ అసోసియేషన్‌కు వ్యవహార కార్యదర్శిగా, ఆ సంస్థకు చెందిన పత్రిక లోటస్‌కు సంపాదకునిగా పనిచేశాడు. సఫ్దర్ హష్మి హత్యానంతరం అతని స్మారకార్థం ఏర్పాటైన సహ్‌మత్ అనే సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు.

సాహిత్యం మార్చు

ఇతడు రచించిన ముఖ్యమైన నవల తమస్ 1947 నాటి భారత్-పాక్ విభజన సమయంలో రావల్పిండిలో తన కళ్లెదుట జరిగిన అల్లర్లను ఆధారం చేసుకుని వ్రాయబడింది.[2] హింసాత్మక మతరాజకీయాలను, విభజనానంతరం జరిగిన మారణకాండ, విధ్వంసం, బలవంతపు వలసలను ఈ నవల చిత్రీకరించింది. ఈ నవల ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషలలోనే కాక తమిళము, గుజరాతీ, మలయాళం, కాశ్మీరీ, మణిపురి వంటి భారతీయ భాషలలోకి అనువదించబడింది. 1975లో ఈ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1987లో గోవింద్ నిహలానీ ఈ నవలను టెలీఫిలింగా మలచాడు. భీష్మ సహానీ వ్రాసిన కథలలో పాళీ, అమృత్‌సర్ ఆ గయా హై అనే రెండు కథలు కూడా దేశవిభజనకు సంబంధించినవే.

ఇతని విస్తృతమైన రచనల్లో ఝరోఖే (1967), కడియా (1971), బసంతి (1979), మయ్యాదాస్‌కి మారి (1987), కుంతో (1993), నీలూ,నీలిమా, నీలోఫర్ (2000) అనే ఆరు హిందీ నవలలు, వందలకొద్దీ కథలు, పది కథాసంపుటాలు, ఐదు నాటకాలు, గులాల్ కా కీల్ అనే బాలల కథాసంపుటం ఉన్నాయి.

ఇతడు కుమార్ సహానీ నిర్మించిన కస్బా (1991) చిత్రానికి స్క్రీన్‌ప్లే సమకూర్చాడు.

ఇతడు తన జీవితచరిత్ర ఆజ్ కే అతీత్ (Today's Pasts, Penguin 2016) అనే పేరుతో, తన సోదరుడు బలరాజ్ సహానీ జీవిత చరిత్రను ఇంగ్లీషు భాషలో బలరాజ్ మై బ్రదర్ పేరుతో రచించాడు.[3]

అవార్డులు సన్మానాలు మార్చు

ఇతడు తన జీవితకాలంలో ఎన్నో పురస్కారాలను, సన్మానాలను పొందాడు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:

  • 1979 - శిరోమణి అవార్డు
  • 1975 - తమస్ నవలకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ అవార్డు
  • 2004 - రష్యాలో జరిగిన అంతర్జాతీయ నాటకోత్సవాలలో మాధవి అనే నాటకానికి కలర్ ఆఫ్ నేషన్ అవార్డు
  • 1975 - ఇతని నాటకం హనుష్‌కు మధ్యప్రదేశ్ కళాసాహిత్య పరిషత్ అవార్డు
  • 1981 - ఆఫ్రో ఏషియన్ రైటర్స్ అసోసియేషన్ వారి లోటస్ అవార్డు
  • 1983 - సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు
  • 1998 - భారత ప్రభుత్వంచే సాహిత్యంలో పద్మ భూషణ పురస్కారం
  • 1999 - శలాక సమ్మాన్, న్యూఢిల్లీ
  • 2000 - మైథిలీ శరణ్ గుప్త సమ్మాన్, మధ్యప్రదేశ్
  • 2001 - కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు
  • 2002 - ఉత్తమ హిందీ కథా రచయితగా సర్ సయ్యద్ జాతీయ పురస్కారం
  • 2002 - సాహిత్య అకాడమీ ఫెలోషిప్[4]

భారత తపాలాశాఖ వారు 2017 మే 31న ఇతని జ్ఞాపకంగా ఒక తపాళాబిళ్ళను విడుదల చేసింది.[5]

మూలాలు మార్చు

  1. "పద్మ పురస్కారాలు" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 1 అక్టోబరు 2017.
  2. Tamas Archived 22 అక్టోబరు 2006 at the Wayback Machine
  3. Bhishma Sahni at U.S. Library of Congress
  4. Sahitya Akademi Fellowships Archived 30 జూన్ 2007 at the Wayback Machine
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-05. Retrieved 2017-10-01.

బయటి లింకులు మార్చు