భూపటలం

భూమి బయటి పొర

భూపటలం అనేది భూమికి ఉండే మందపాటి బయటి కవచం. దీన్ని భూమి పై పెంకు అని కూడా అనవచ్చు. ఇది భూమి వ్యాసార్థంలో, ఘనపరిమాణంలో 1% కంటే తక్కువగా ఉంటుంది. ఇది భూమి శిలావరణంలో అన్నిటి కంటే పైన ఉండే భాగం. పటలం, మాంటిల్ పై భాగం - రెండూ శిలావరణంలో భాగాలు.[1] లిథోస్పియరు టెక్టోనిక్ ఫలకాలుగా విభజించబడింది. ఈ ఫలకాల కదలిక వలన భూమి లోపల ఉండే వేడి అంతరిక్షంలోకి తప్పించుకోవడానికి వీలు కలుగుతుంది.

భూపటలంలో ప్లేట్లు

భూపటలం మాంటిల్‌కు పైన ఉంటుంది. ఎగువ మాంటిల్ పెరిడోటైట్‌తో కూడుకుని ఉండడం వలన అది పటలం కంటే చాలా సాంద్రంగా ఉంటుంది. అందుచేత భూపటలం స్థిరంగా ఉంటుంది. పటలం, మాంటిల్‌ల మధ్య సరిహద్దు మొహొరోవిచిక్ డిస్కంటిన్యుటీ వద్ద ఉంటుంది. ఈ సరిహద్దు సీస్మిక్ వేగంలో ఉండే వైరుద్ధ్యాన్ని బట్టి నిర్వచించబడింది.

Geologic provinces of the world (USGS)

పెంకు ఉష్ణోగ్రత లోతుకు వెళ్ళేకొద్దీ పెరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత సాధారణంగా సుమారు 100 °C (212 °F) నుండి మ్యాంటిల్ సరిహద్దుకు చేరేసరికి 600 °C (1,112 °F) ఉంటుంది. పెంకు పై భాగంలో ఉష్ణోగ్రతలు లోపలికి పోయే కొద్దీ ప్రతి కిలోమీటరుకు 30 °C (54 °F) వరకు పెరుగుతాయి.[2]

కూర్పు

మార్చు
 
భూమి పెంకు మందం (కి.మీ.)

భూమి పెంకు రెండు విభిన్న రకాలుగా ఉంటుంది:

  1. సాముద్రిక : 5 కి.మీ. (3 మై.) నుండి 10 కి.మీ. (6 మై.) మందంతో,[3] ప్రధానంగా బసాల్ట్, డయాబేస్, గాబ్రో వంటి సాంద్రమైన, మాఫిక్ శిలలతో కూడి ఉంటుంది.
  2. ఖండాంతర : 30 కి.మీ. (20 మై.) నుండి 50 కి.మీ. (30 మై.) మందంతో, ఎక్కువగా గ్రానైట్ వంటి తక్కువ సాంద్రమైన, ఫెల్సిక్ రాళ్లతో కూడి ఉంటుంది. టిబెటన్ పీఠభూమి, ఆల్టిప్లానో, తూర్పు బాల్టిక్ షీల్డ్ వంటి కొన్ని ప్రదేశాలలో, ఖండాంతర పటలం మందంగా ఉంటుంది (50 కి.మీ. (30 మై.) నుండి 80 కి.మీ. (50 మై.).

పెంకు మందం సగటున సుమారు 15 కి.మీ. (9 మై.) నుండి 20 కి.మీ. (12 మై.) ఉంటుంది.

కాంటినెంటల్, ఓషియానిక్ పటలాలు రెండూ క్రింద ఉన్న మాంటిల్ కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి కాబట్టి, ఈ రెండు పటలంలూ మాంటిల్‌పై "తేలుతూంటాయి". మందంగా, తక్కువ సాంద్రంగా ఉండే ఖండాంతర పటలం ఉపరితలం, సముద్రపు పటలం ఉపరితలం కంటే గణనీయంగా ఎక్కువగా ఉంటుంది ( ఐసోస్టాసీకి ఒక ఉదాహరణ). ఫలితంగా, ఖండాలు, లోతైన సముద్రపు బేసిన్లతో చుట్టుముట్టబడిన ఎత్తైన భూమిని ఏర్పరుస్తాయి.[4]

ఖండాంతర పటలం సగటు కూర్పు యాండెసైట్ మాదిరిగానే ఉంటుంది.[5] ఈ కూర్పు ఏకరీతిగా లేనప్పటికీ, ఎగువ పటలం సగటు డాసైట్ మాదిరిగానే ఫెల్సిక్ కూర్పును కలిగి ఉంటుంది. అయితే దిగువ పటలం ఎక్కువగా బసాల్ట్‌ను పోలి ఉండే మాఫిక్ కూర్పును కలిగి ఉంటుంది.[6] భూమి ఖండాంతర పటలం‌లో అత్యధికంగా లభించే ఖనిజాలు ఫెల్డ్‌స్పార్‌లు. ఇవి పటలం బరువులో 41% వరకు ఉంటాయి. దాని తర్వాత క్వార్ట్జ్ 12%, పైరోక్సీన్‌లు 11% ఉంటాయి.[7]

భూమి పెంకులో అత్యంత

సమృద్ధిగా ఉన్న మూలకాలు

బరువు ద్వారా % ఆక్సైడ్ బరువు ద్వారా

% ఆక్సైడ్

O 46.6
Si 27.7 SiO2 60.6
Al 8.1 Al2O3 15.9
Fe 5.0 Fe

(FeO రూపంలో)

6.7
Ca 3.7 CaO 6.4
Na 2.7 Na2O 3.1
K 2.6 K2O 1.8
Mg 1.5 MgO 4.7
Ti 0.44 TiO2 0.7
P 0.10 P2O5 0.1

నీరు మినహా మిగిలిన అన్ని పదార్థాలు చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే ఉంటాయి. వీటి మొత్తం 1% కంటే తక్కువ.[8]

ఖండాంతర పటలం బసాల్టిక్ సముద్ర పటలంతో పోల్చితే అననుకూల మూలకాలతో సమృద్ధిగా ఉంటుంది. అంతర్లీన మాంటిల్‌తో పోలిస్తే చాలా సుసంపన్నంగా ఉంటుంది. అత్యంత అసంగత మూలకాలు ఆదిమ మాంటిల్ రాక్‌కు సంబంధించి ఖండాంతర పటలం‌లో 50 నుండి 100 రెట్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే సముద్రపు పటలం దాదాపు 10 రెట్లు అసంగత మూలకాలతో సమృద్ధిగా ఉంటుంది.[9]

ఖండాంతర పటలం సగటు సాంద్రత 2.835 g/cm 3. పై పొరలో సగటున 2.66 g/cm 3 ఉన్న సాంద్రత, పటలం అడుగుకు వెళ్ళే సరికి 3.1 g/cm 3 వరకు పెరుగుతుంది.[10]

ఖండాంతర పటలానికి విరుద్ధంగా, సముద్రపు పటలం ప్రధానంగా పిల్లో లావా, షీటెడ్ డైక్‌లతో మిడ్-ఓషన్ రిడ్జ్ బసాల్ట్ కూర్పుతో, పలుచని పై పొర అవక్షేపాలతో, దిగువ పొర గాబ్రోతో కూడి ఉంటుంది.[11]

నిర్మాణం, పరిణామం

మార్చు

భూమి సుమారు 460 కోట్ల సంవత్సరాల క్రితం అప్పుడే కొత్తగా ఏర్పడిన సూర్యుని చుట్టూ తిరుగుతున్న ధూళి, వాయువుల చక్రం నుండి ఏర్పడింది. ఈ చక్రం లోని ఇక్కడ సూక్ష్మగ్రహాలు, ఇతర చిన్న రాతి వస్తువులు అక్రీషన్ ద్వారా ఢీకొని మిళితమై పోయి, క్రమంగా గ్రహంగా పెరుగుతాయి. ఈ ప్రక్రియలో అపారమైన వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి వలన ప్రారంభంలో భూమి పూర్తిగా ద్రవరూపంలో ఉండేది. గ్రహాల ఎక్రీషన్ మందగించడంతో, భూమి చల్లబడటం ప్రారంభించి, దాని మొదటి పటలం ఏర్పడింది. దీనిని ప్రాధమిక లేదా ఆదిమ పటలం అంటారు.[12] పెద్దపెద్ద గుద్దుడుల కారణంగా ఈ పటలం పదేపదే నాశనమౌతూ, ఆ ప్రక్రియలో ఏర్పడిన శిలాద్రవ సముద్రం నుండి పటలం తిరిగి ఏర్పడింది. ఆ తొలినాళ్ళ నాటి పెంకు భాగమేదీ ప్రస్తుతం మనుగడలో లేదు; గత కొన్ని కోట్ల సంవత్సరాలలో కోత, గుద్దుడులు, ప్లేట్ టెక్టోనిక్స్ చర్యలు మొదలైనవాటి కారణంగా ఆ పటలం అంతా నాశనమైంది.[13]

అప్పటి నుండి, భూమి ద్వితీయ, తృతీయ పెంకులను ఏర్పరుచుకుంది. ఇవే సముద్ర, ఖండాంతర పటలాలు. ద్వితీయ పటలం సముద్రాల మధ్యన ఏర్పడింది. ఇక్కడ మాంటిల్ పాక్షికంగా కరగడంతో ఏర్పడిన బసాల్టిక్ శిలాద్రవం నుండి కొత్త సముద్రపు పటలం ఏర్పడింది. ఈ "రిడ్జ్ పుష్" ప్లేట్ టెక్టోనిక్స్ యొక్క చోదక శక్తులలో ఒకటి. ఇది నిరంతరం కొత్త సముద్రపు పెంకును సృష్టిస్తూ ఉంటుంది. పర్యవసానంగా, పాత పటలం నాశనం అవుతుంది. దాంతో, వ్యాప్తి చెందుతున్న కేంద్రానికి ఎదురుగా, సబ్‌డక్షన్ జోన్ ఉంటుంది: సబ్‌డక్షన్ జోన్ అంటే సముద్రపు పలక తిరిగి మాంటిల్‌లోకి మునిగిపోయే కందకం. కొత్త సముద్రపు పటలం ఏర్పడడం, పాత సముద్రపు పటలం నాశనం అవడం అనే ఈ స్థిరమైన ప్రక్రియ కారణంగా ఈ రోజు భూమిపై ఉన్న అత్యంత పురాతన సముద్రపు పటలం వయస్సు కేవలం 20 కోట్ల సంవత్సరాలు మాత్రమే. [14]

దీనికి విరుద్ధంగా, ఖండాంతర పెంకులో ఎక్కువ భాగం చాలా పాతది. భూమిపై ఉన్న పురాతన ఖండాంతర క్రస్టల్ శిలల వయస్సు సుమారు 370 నుండి 428 కోట్ల సంవత్సరాల వరకు ఉంటుంది.[15][16] పశ్చిమ ఆస్ట్రేలియాలోని నార్యర్ గ్నీస్ టెర్రేన్‌లో, కెనడియన్ షీల్డ్‌లోని వాయువ్య భూభాగాల్లోని అకాస్టా గ్నీస్‌లో, ఫెన్నోస్కాండియన్ షీల్డ్ వంటి ఇతర క్రాటోనిక్ ప్రాంతాలలో వీటిని కనుగొన్నారు. 430 కోట్ల సంవత్సరాల వయస్సు గల కొన్ని జిర్కాన్‌లు నార్యర్ గ్నీస్ టెర్రేన్‌లో లభించాయి. ఖండాంతర పటలం అనేది తృతీయ పటలం. ఇది సబ్‌డక్షన్ జోన్‌లలో సబ్‌డక్టెడ్ సెకండరీ (సముద్ర) పటలం రీసైక్లింగ్ అవడంతో ఏర్పడుతుంది. [14]

ప్రస్తుత ఖండాంతర పటలం సగటు వయస్సు సుమారు 200 కోట్ల సంవత్సరాలు అని అంచనా వేసారు.[17] 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన చాలా క్రస్టల్ శిలలు క్రేటన్స్‌లో ఉన్నాయి. అటువంటి పాత ఖండాంతర పటలం, దాని కింద ఉండే మాంటిల్‌లు భూమిలోని ఇతర ప్రాంతాల కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి. అందుచేత అవి సబ్డక్షన్ ద్వారా అంత తేలిగ్గా నాశనం కావు. కొత్త ఖండాంతర పటలం ఏర్పడటం అనేది తీవ్రమైన ఒరోజెనితో ముడిపడి, రోడినియా, పాంజీయా, గోండ్వానా వంటి సూపర్ ఖండాల ఏర్పాటుకు సమకాలికంగా ఉంటుంది. గ్రానైట్, మెటామార్ఫిక్ ఫోల్డ్ బెల్ట్‌లతో సహా ద్వీపం ఆర్క్‌ల సముదాయం ద్వారా పెంకులో కొంత భాగం ఏర్పడింది. కొంత భాగం అంతర్లీన మాంటిల్ క్షీణించడం వలన తేలియాడే లిథోస్పిరిక్ మాంటిల్‌ ఏర్పడుతుంది. ఖండాలలో పటలాల కదలిక భూకంపాలకు దారితీయవచ్చు, అయితే సముద్రగర్భం కింది కదలికలు పెద్ద అలలకు, సునామీలకూ దారి తీస్తుంది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Robinson, Eugene C. (January 14, 2011). "The Interior of the Earth". U.S. Geological Survey. Retrieved August 30, 2013.
  2. Philpotts, Anthony R.; Ague, Jay J. (2009). Principles of igneous and metamorphic petrology (2nd ed.). Cambridge, UK: Cambridge University Press. p. 14. ISBN 978-0-521-88006-0.
  3. Structure of the Earth. The Encyclopedia of Earth. March 3, 2010
  4. Levin, Harold L. (2010). The earth through time (9th ed.). Hoboken, N.J.: J. Wiley. pp. 173–174. ISBN 978-0-470-38774-0.
  5. R. L. Rudnick and S. Gao, 2003, Composition of the Continental Crust. In The Crust (ed. R. L. Rudnick) volume 3, pp. 1–64 of Treatise on Geochemistry (eds. H. D. Holland and K. K. Turekian), Elsevier-Pergamon, Oxford ISBN 0-08-043751-6
  6. Philpotts & Ague 2009, p. 2.
  7. Anderson, Robert S.; Anderson, Suzanne P. (2010). Geomorphology: The Mechanics and Chemistry of Landscapes. Cambridge University Press. p. 187. ISBN 978-1-139-78870-0.
  8. Klein, Cornelis; Hurlbut, Cornelius S. Jr. (1993). Manual of mineralogy : (after James D. Dana) (21st ed.). New York: Wiley. pp. 221–224. ISBN 0-471-57452-X.
  9. (November 1988). "Chemical differentiation of the Earth: the relationship between mantle, continental crust, and oceanic crust".
  10. (10 June 1995). "Seismic velocity structure and composition of the continental crust: A global view".
  11. Philpotts & Ague 2009, pp. 370–371.
  12. Erickson, Jon (2014). Historical Geology: Understanding Our Planet's Past. Infobase Publishing. p. 8. ISBN 978-1-4381-0964-0. Retrieved September 28, 2017.
  13. . "The Evolution of Continental Crust".
  14. 14.0 14.1 Taylor & McLennan 1996.
  15. "Team finds Earth's 'oldest rocks'". BBC News. September 26, 2008. Retrieved March 27, 2010.
  16. P. J. Patchett and S. D. Samson, 2003, Ages and Growth of the Continental Crust from Radiogenic Isotopes. In The Crust (ed. R. L. Rudnick) volume 3, pp. 321–348 of Treatise on Geochemistry (eds. H. D. Holland and K. K. Turekian), Elsevier-Pergamon, Oxford ISBN 0-08-043751-6
  17. A. I. S. Kemp and C. J. Hawkesworth, 2003, Granitic Perspectives on the Generation and Secular Evolution of the Continental Crust. In The Crust (ed. R. L. Rudnick) volume 3, pp. 349–410 of Treatise on Geochemistry (eds. H. D. Holland and K. K. Turekian), Elsevier-Pergamon, Oxford ISBN 0-08-043751-6
"https://te.wikipedia.org/w/index.php?title=భూపటలం&oldid=3906601" నుండి వెలికితీశారు