మంగోలుల ఖ్వారెజ్మియా దండయాత్ర

13వ శతాబ్ది సైనిక దండయాత్ర

మంగోలుల ఖ్వారెజ్మియా దండయాత్ర 1219 నుంచి 1221 జరిగిన చారిత్రక ఘటన.[1] దీనితో ఇస్లామిక్ దేశాలపై మంగోలుల విజయం ప్రారంభమైంది. తర్వాతికాలంలో పశ్చిమ ఐరోపా, స్కాండివేనియా, బైజాంటియన్ సామ్రాజ్యం, అరేబియా, భారత ఉపఖండంలో ప్రధాన భాగం, జపాన్, ఆగ్నేయాసియా దేశాలు తప్పించి మిగతా ఐరోపా, ఆసియా అంతా మంగోలులు ఆక్రమించి విస్తరించారు.


ఖ్వారెజ్మియా సామ్రాజ్యంపై యుద్ధం చేసే ఉద్దేశం మొట్టమొదట మంగోల్ సామ్రాజ్యానికి లేదు. పర్షియన్ చరిత్రకారుడు జజ్జానీ ప్రకారం ఛెంఘిజ్ ఖాన్ మొదట ఖ్వారెజ్మిద్ సామ్రాజ్యానికి పాలకుడైన అల్లాఉద్దీన్ మహమ్మద్‌కు వ్యాపారాన్ని కోరుకుంటూ, పొరుగు వానిగా అభినందనలతో కూడిన సందేశం పంపారు. ఆ సందేశంలో ఛెంఘిజ్ ఖాన్, "సూర్యుడు ఉదయించే భూమికి సర్వాధికారిని నేను, సూర్యుడు అస్తమించే  ప్రాంతానికి సుల్తాన్ మీరు. స్నేహం, శాంతి కోరుతూ ఓ ఒప్పందాన్ని చేసుకుందామ"ని పేర్కొన్నారు.[2] అప్పటికి జిన్ పాలకవంశంపై మంగోలుల దండయాత్రలు జరుగుతున్నాయి. ఇవి మంగోల్ లోని వివిధ సంచార తెగల ఏకీకరణ లాంటివాటితో పోలిస్తే తక్కువ రక్తపాతం, దాదాపు ఏమీ ఆస్తినష్టం లేకుండానూ జరిగింది. అయితే జిన్ పాలక వంశంపై చేసిన దండయాత్రల్లో మంగోలులు ఎంత క్రూరంగా ఉండగలరో కూడా తెలిసింది. షా మహమ్మద్ ఈ శాంతి ఒప్పందానికి అయిష్టంగానే అంగీకరించారు, అయితే ఆ ఒప్పందం ఎంతోకాలం నిలవలేదు. సంవత్సరంలోపే మంగోల్ వ్యాపార బిడారును ఖ్వారెజ్మియన్ల నగరమైన ఓత్రార్‌లో ఊచకోత కోసి, ఆ విషయంపై క్షమాపణ కోరేందుకు వచ్చిన రాయబారుల తలలు నరికి పంపడంతో  యుద్ధం మొదలైపోయింది.


రెండేళ్ళ పాటు సాగిన యుద్ధంలో ఖ్వారెజ్మిడ్ సామ్రాజ్యం నాశనమైంది.

విభేదాల ప్రారంభం మార్చు

కారా ఖైతాన్లను మంగోల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన ఛెంఘిజ్ ఖాన్ ఓడించాకా, ఖ్వారెజమిద్ సామ్రాజ్యంతో సరిహద్దు సంపాదించుకున్నారు. షా అప్పుడప్పుడే కొంత భూభాగాన్ని తన అధీనంలోకి తీసుకుని, బాగ్దాద్ ఖలీఫా అన్-నాసిర్ తో వివాదంలో తలమునకలై ఉన్నారు. ఇస్లాం మతానికి లాంఛనయుతమైన నాయకునిగా ఖలీఫాకు విధిగా చేయాల్సిన మర్యాదను తిరస్కరించి, సాధారణంగా చెల్లించుకునే కానుకల పనిలేకుండానే తనను తన రాజ్యానికి సుల్తానుగా గుర్తించాలని పట్టుబట్టారు. ఆయన దక్షిణ సరిహద్దు అంతటా ఈ ఒక్క వివాదం సమస్యలు సృష్టించింది. ఆ ప్రాంతం విపరీతమైన వేగంతో విస్తరిస్తున్న మంగోల్ సామ్రాజ్యం ఖ్వారెజ్మియా సామ్రాజ్యపు సరిహద్దు స్పృశించగా మూడు రాజ్యాల హద్దు అయింది.[3] మంగోల్ చరిత్రకారులు చాలా స్పష్టంగా చెప్పేదేమంటే ఆ సమయానికి ఛెంఘిజ్ ఖాన్‌కు ఖ్వారెజ్మిద్ సామ్రాజ్యాన్ని ఆక్రమించాలన్న ఉద్దేశం ఏ కోశానా లేదు, కేవలం వాణిజ్య, రాజకీయ కూటమి ఏర్పరచాలన్న ఆసక్తి తప్ప వేరేమీ లేదు.[4]

ఛెంఘిజ్ ఖాన్ కోరుకుంటున్న వాణిజ్య ఒప్పందం విషయంలో షా చాలా అనుమానంతో ఉన్నాడు, జొంగ్డు (బీజింగ్)లో ఉన్న షా రాయబారి జిన్ రాజవంశంతో మంగోలులు యుద్ధంలో ఉన్నప్పుడు వారు నగరంపై చేసిన దాడిలో వారి హింసాప్రవృత్తిని అతిశయోక్తులతో అతిగా చెప్పారు.[5] దీనికి తోడు కొన్నేళ్ళ ముందు మంగోల్, షాల మధ్య యుద్ధాన్ని రగిలించేందుకు బాగ్దాద్ ఖలీఫా ప్రయత్నించాడు. నాసిర్ కీ, షాకీ మధ్య వివాదం ఉండడంతో ఛెంఘిజ్‌తో ఒప్పందం చేసుకున్నారు. అయితే నిజానికి ఛెంఘిజ్ ఖాన్‌కు బాగ్దాద్ ఖలీఫాతో ఒప్పందం కుదిరేందుకు వీలు లేదు, ఎందుకంటే ఖాన్‌కు లాంఛనానికైనా, మరెందుకైనా అంతిమ అధికారం తనదే అని చెప్పుకునే ఏ పాలకుడితోనూ కూటమి ఏర్పరుచుకునే ఆసక్తి లేదు. ఈ విషయం ఛెంఘిజ్ మనవడు హులెగు హయాంలో ఖలీఫత్ నిర్మూలం కావడంతో ధ్రువీకరణ అయింది. ఖ్వారెజ్మ్ సుల్తానుగా షాను ఖలీఫా గుర్తించకపోవడంతో ఎంత లాంఛనయుతమైనా, ఊహాత్మకమైనా ఖలీఫాగా నసీర్‌ను షా అంగీకరించలేదు. ఏదేమైనా ఛెంఘిజ్ ఖాన్ జిన్ సామ్రాజ్యంతో యుద్ధంలో ఉండడంతో, సంపద పెంచుకునేందుకు వాణిజ్యం కొరకే ఖ్వారెజ్మిద్ సామ్రాజ్యంతో ఒప్పందం చేసుకున్నారు.

ఛెంఘిజ్ ఖాన్ అప్పటికే ఒప్పందం కుదిరివుండడంతో 500 మంది ముస్లిం వ్యాపారులతో బిడారును పంపి అధికారికంగా ఖ్వారెజ్మియాతో వ్యాపార సంబంధాలు స్థిరపరుచుకోవాలని ప్రయత్నించారు. ఖ్వారెజ్మియా సామ్రాజ్యంలోని ఓర్తార్ నగర గవర్నర్ ఇనాల్చుక్ ఖ్వారెజ్మియాకు వ్యతిరేకంగా కుట్ర చేసేందుకు వచ్చారంటూ ఆ మంగోల్ బిడారు వర్తకులను నిర్బంధించాడు. ఏనాటి నుంచో వాణిజ్యంలో ఉన్న వర్తకులు గూఢచర్యం చేయడం సాధారణంగా జరగదు. అలానే ఛెంఘిజ్ ఖాన్ ఈశాన్య చైనాలో జిన్‌లతో వివాదిస్తూనే ఖ్వారెజ్మిద్ సామ్రాజ్యాన్ని సంఘర్షణకు రెచ్చగొట్టే పని చేస్తాడన్నది కూడా సామాన్యంగా సరైన ఊహ కాదు.[4]

ఛెంఘిజ్ ఖాన్ ముగ్గురు రాయబారులను (ఒకరు ముస్లిం, ఇద్దరు మంగోలులు) షాను కలుసుకుని ఓత్రార్ లోని బిడారుపై నిర్బంధం తొలగించమని, గవర్నర్ ను శిక్షించేందుకు అప్పగించమని డిమాండ్ చేశారు. ఇద్దరు మంగోలల జుత్తు గొరికించి, ముస్లిం తల నరికి ఛెంఘిజ్ ఖాన్ వద్దకు పంపారు. బిడారు సభ్యులను చంపివేయమని ఆదేశించారు. తన రాయబారులు పవిత్రమైనవారనీ, హింసించదగ్గవారు కాదనీ భావించిన ఖాన్ కు ఇది తనకు చేసిన తీవ్రమైన అవమానంగానే తీసుకున్నారు.[6] ఇది ఛెంఘిజ్ ఖాన్ ఖ్వారెజ్మియన్ సామ్రాజ్యంపై దాడిచేయడానికి పురిగొలిపింది. మంగోలులు తీన్ షా పర్వతాలు దాటి 1219లో షా సామ్రాజ్యంలోకి దాడివచ్చారు.[7]

మొదటి దాడి మార్చు

ప్రాథమికంగా సిల్క్ రోడ్డు వెంబడి ఉన్న గూఢచారులు సహా అనేక నిఘా వర్గాల సమాచారాన్ని సమన్వయం చేసుకుని చాలా జాగ్రత్తగా తన సైన్యాన్ని సిద్ధం చేశారు, అంతకుముందు దండయాత్రలకన్నా భిన్నంగా వర్గీకరించి సమీకరించారు.[8] తేలికైన, బరువైన ఆశ్విక దళాలన్నిటికీ సహాయ యూనిట్లు కలిపారు. అప్పటికీ వేగంగా కదిలే సంచార తెగల ఆశ్విక దళానికి ఉన్న సంప్రదాయిక ప్రయోజనాలపై నమ్మకం పెట్టుకుంటూనే చైనా యుద్ధంలో స్వీకరించిన కొత్త పద్ధతులు ప్రధానంగా ముట్టడి యుద్ధతంత్రానికి చెందిన అంశాలు చేర్చుకున్నారు. యుద్ధ సామానుల బిడారులో కోటగోడలు బద్దలుగొట్టే ఆయుధాలు, గన్ పౌడర్, విపరీతమైన సంఖ్యలో ముట్టడిలో 20 అడుగుల బాణాలను విసిరి శత్రువు రక్షణ భేదించే యంత్రాలు చేర్చారు. అంతేకాక మంగోలుల నిఘా వ్యవస్థ చాలా బలమైనది. మంగోలులు ఎప్పుడూ ప్రతిఘటించేందుకు సైనిక, ఆర్థిక శక్తి, ఆసక్తి ఉన్న ప్రత్యర్థి సామ్రాజ్యాన్ని, యుద్ధరంగాన్ని పూర్తిస్థాయిలో వెతికి సమాచారం పొందకుండా యుద్ధానికి సిద్ధపడలేదు. ఉదాహరణకు తర్వాతి దశలో సుబుటాయ్, బటు ఖాన్ రెండు వేర్వేరు యుద్ధాల్లో రెండు రోజుల వ్యవధిలో హంగేరీ, పోలాండ్లకు చెందిన సైన్యాలను నాశనం చేయడానికి ముందు సంవత్సరం కాలం మధ్య ఐరోపాను పూర్తిగా తెలుసుకునేందుకు స్కౌట్ చేశారు.[9]

ఛెంఘిజ్ ఖాన్ సైన్యం పరిమాణం ఏమిటన్నది సామాన్యంగా వివాదాస్పదమైన అంశం. షా రాజ్యమంతా 4 లక్షల సైన్యం ఉంటే, ఛెంఘిజ్ ఖాన్ సైన్యం 6 నుంచి 8 లక్షల వరకూ ఉంటుందని, మంగోల్ సైన్యం షాతో పోలిస్తే చాలా పెద్దదని చాలామంది సమకాలీన ముస్లిం చరిత్రకారులు రాశారు. అప్పుడప్పుడు కొందరు ఛెంఘిజ్ సైన్యం 8 లక్షలనీ రాశారు. ఏదేమైనా ఈ సంఖ్యలు ఆనాటి మంగోల్ జనాభానే అనేకరెట్లు మించిపోయింది, వ్యవసాయం లేకపోవడంతో సరిపడా ఆహారోత్పత్తి లేక అధిక సంఖ్యలో జనాభాను పోషించి నిలుపుకోగల సత్తువ సంచార జాతులకు ఉండదు. ఆధునిక చరిత్రకారులు ఇప్పటికీ ఈ సంఖ్యలు ఏమాత్రం వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయన్న అంశంపై వాదప్రతివాదాలు చేస్తూనే ఉన్నారు. డేవిడ్ మోర్గాన్, డెనిస్ సినర్, తదితరులు ఈ సంఖ్యలు వాస్తవికంగానో, పోలికపరంగానో నిజం కావచ్చనడాన్ని సందేహిస్తున్నారు. ఐతే జాన్ మాసన్ స్మిత్ ఇవి కచ్చితమైనవని అంచనా వేస్తున్నారు. సినర్ ఖ్వారెజ్మియన్ల మొత్తం సైన్యం నాలుగు లక్షలు ఉంటుందని ఒప్పుకుంటూనే మంగోల్ బలగాన్ని లక్ష నుంచి లక్షా యాభై వేల మందిగా భావిస్తున్నారు. 13వ శతాబ్దానికే చెందిన రషీద్ అల్-దిన్, ఇంకా కొన్ని సమకాలీన చారిత్రిక ఆకరాలు మంగోల్ సైన్యం 1206లో లక్షా ఐదువేల సంఖ్యలోనూ, 1227లో లక్షా 29 వేల సంఖ్యలోనూ ఉందని పేర్కొన్నాయి.[10]

జాన్ ఫ్రాన్స్ వివిధ మూలాలను, అంచనా విధానాలను ఉపయోగించి మంగోల్ సైన్యం 75 వేలు, ఖ్వారెజ్మియన్ సైన్యం 40 వేలు ఉండడం సాధ్యమన్నారు.[11] ఛెంఘిజ్ అత్యంత సామర్థ్యం కల తన సైన్యాధ్యక్షులను తన సహాయానికి తీసుకువచ్చారు. ఆయన పెద్ద సంఖ్యలో విదేశీయులు, ప్రాథమికంగా చైనీయ మూలాలున్నవారిని తీసుకువచ్చారు. ఈ విదేశీయుల్లో ముట్టడిలో నిపుణులు, వంతెనల నిర్మాణంలో సిద్ధహస్తులు, వైద్యులు,  వివిధ ప్రత్యేకతలు కలిగిన సైనికులు ఉన్నారు.

ట్రాన్సోక్సానియా దండయాత్రలో 1219లోనూ,1229లోనూ ఛెంఘిజ్ ఖాన్ మంగోల్ ప్రధాన బలగంతో పాటు యుద్ధంలో చైనీస్ కాటపుల్ట్ యూనిట్ ఒకదాన్ని ప్రయోగించారు. చైనీయులు అప్పటికే ప్రయోగిస్తున్న కాటపుల్ట్ తో గన్ పౌడర్ బాంబులు వేయడం ఇక్కడా చేసివుండవచ్చు.[12] ట్రాన్సోక్సానియా, పర్షియా ప్రాంతాలను ఛెంఘిజ్ ఖాన్ ఆక్రమిస్తున్న నాటికి గన్ పౌడర్ వినియోగంపై గట్టి పట్టు ఉన్న పలువురు చైనీయులు ఛెంఘిజ్ ఖాన్ సైన్యంలో పనిచేస్తున్నారు.[13] చరిత్రకారులు చైనీయుల గన్ పౌడర్ ఆయుధాలను మధ్య ఆసియాకు మంగోల్ దండయాత్ర తీసుకువచ్చిందని అంచనావేస్తున్నారు. హ్యుయోచాంగ్ అనే ఓ చైనీస్ ఆయుధం వీటిలో ఒకటి.[14]

 
మద్రసా కుకల్దాష్ (తాష్కెంట్)

ఈ దండయాత్రలో ఖాన్ మొట్టమొదటగా పరోక్ష దాడిని ప్రయోగించారు. ఆ తర్వాత ఛెంఘిజ్ ఖాన్ కీ, ఆయన కుమారులు, మనవలు చేసి దండయాత్రల ప్రధాన లక్షణంగా ఈ వ్యూహం నిలిచింది. ఛెంఘిజ్ ఖాన్ తన సైన్యాలను విభజించి, ఒక విభాగాన్ని పూర్తిగా షాను పట్టుకుని చంపమని ఆజ్ఞాపించి పంపారు, తద్వారా ఛెంఘిజ్ ఖాన్ కు సమానమైన భూభాగాన్ని, సైన్యాన్ని కలిగివున్న సామ్రాజ్యానికి చక్రవర్తి తన రాజ్యంలోనే ప్రాణం నిలబెట్టుకోవడానికి పరిగెత్తే పరిస్థితి ఏర్పడుతుంది.[3] మంగోల్ దళాల విభజన వ్యూహం షా బలగాలను చెదురుమదురుగా విడగొట్టి రాజ్యాన్ని తీవ్రమైన వినాశనానికి గురిచేసింది, ఇది వారి తర్వాతి దండయాత్రల్లోనూ కనిపిస్తుంది.

 
వాలియాన్ యుద్ధం (1221). జామి అల్-తవారిఖ్, రషీద్ అల్-దిన్.

40 వేల నుంచి 4 లక్షల వరకూ ఏ సంఖ్యలో ఉన్నదో తెలియదు కానీ షా సైన్యం ప్రధానమైన నగరాల మధ్య విభజించబడింది. సామ్రాజ్యంలోని చాలా భూభాగాన్ని అప్పుడప్పుడే గెలుచుకున్నారు, ఛెంఘిజ్ ఖాన్ వేర్వేరు దళాలను వేర్వేరు వైపులుగా పంపడంతో వివిధ ప్రదేశాల మధ్య షా బలగం విడదీశారు. పైగా చైనా నుంచి షాకు అందిన సమాచారంలో మంగోల్ సైన్యం ముట్టడించి, కోటలను స్వాధీనం చేసుకునే యుద్ధ తంత్రంలో పెద్ద నిపుణులు కాదనీ, కోటలు గెలిచేప్పుడు ఇబ్బందిపడ్డారనీ తెలిసంది. షా సైన్యాన్ని విభజించిన పద్ధతి, నడిపిన విధానం తనకే చేటు చేసేదన్నది తర్వాత్వరాతి యుద్ధం ముగిసేనాటికి తేలింది.

ప్రయాణంలో అలసిపోయినా, మంగోలులు ఖ్వారెజ్మియన్ సైన్యంపై తొలి యుద్ధంలో విజయాలు నమోదుచేశారు. జోచి కింద ఉన్న 25 నుంచి 30 వేల మందితో కూడిన మంగోల్ సైన్య విభాగం దక్షిణ ఖ్వారెజ్మియాలో షా సైన్యంపై దాడిచేసి, పెద్ద సంఖ్యలో ఉన్న షా సైన్యం మంగోలుల్ని పర్వాతాల్లోకి నెట్టకుండా అడ్డుకోగలిగారు.[15] మరో సైన్య విభాగం ఖ్వారెజ్మియా నగరంపై దాడిచేసి షా సైన్యాన్ని విభజించేలా చేసింది. ఈలోపు అనూహ్యంగా స్వయంగా ఛెంఘిజ్ ఖాన్ నేతృత్వంలోని మంగోలు ప్రధాన సైన్యం 1219 నాటికి ఓత్రార్ నగరానికి చేరుకున్నారు. ఉత్తరాన ఉన్న విశాలమైన, వినాశనకరమైన ఎడారి నుంచి ఏ సైన్యం కూడా దండయాత్ర చెయ్యలేదన్న షా అంచనాను పూర్తిగా దెబ్బతీసి ఆ మార్గం గుండా ప్రయాణించి అనూహ్యంగా ప్రత్యక్షమయ్యారు ఖాన్. వరుస ఒయాసిస్సుల మార్గాన్ని పట్టుకుని ప్రయాణం చేసి ఇది సాధించారు. ఓర్తార్లో ఐదు నెలల పాటు ముట్టడి చేశాకా నగరంలోకి ఓ బలహీనమైన ప్రదేశాన్ని పట్టుకుని లోపలికి వచ్చేశారు.[15]

ఓత్రార్ నగరంలోని కోట ప్రదేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు మరో నెల పట్టింది. గవర్నర్ ఇనాల్చుక్ కోటలోకెల్లా ఎత్తైన ప్రదేశం ఎక్కి, అక్కడి నుంచి ముట్టడిలో ఆఖరి సమయంలో ఎక్కి వస్తున్న మంగోల్ సైనికులపై రాళ్ళు విసిరాడు. మొదట మంగోల్ బిడారును పట్టుకుని అవమానించి, ఆ వ్యాపారుల మరణానికి కారణమైన ఓత్రార్ గవర్నర్ ఇనాల్చుక్ ని పట్టుకుని చెవుల్లో, కళ్ళలో కరిగించిన వెండి పోసి చంపారు. ఛెంఘిజ్ ఖాన్ చాలామంది నివాసుల్ని చంపారు, మిగిలిన వారిని పట్టుకుని బానిసలుగా చేశారు.[16]

 
ఉర్గెంక్ లో ముహమ్మద్ స్థలపు శిథిలాలు.

బుఖారా, సమార్ ఖండ్, ఉర్గెంక్ ల ముట్టడి మార్చు

ఛెంఘిజ్ ఖాన్ తన సైన్యాధ్యక్షుడైన జెబెకు చిన్న సైన్యాన్ని ఇచ్చి దక్షిణంగా పంపారు, షా రాజ్యంలో ఆ సగభాగానికి అతను పారిపోయే ప్రతి అవకాశాన్ని నిరోధించడం దీని లక్ష్యం. ఛెంఘిజ్, టోలుయై దాదాపు 50వేల మంది కలిగిన సైన్యానికి నాయకత్వం వహిస్తూ సమర్ ఖండ్ ను చుట్టుతిరిగి, పశ్చిమంగా సాగి మొదట బుఖారా నగరాన్ని ముట్టడించడానికి ప్రయత్నం ప్రారంభించారు. బుఖారా చేరుకునేందుకు దాదాపు దాటశక్యం కాని కైజైల్ కుమ్ ఎడారిని వివిధ ఒయాసిస్సుల వరుసను తెలుసుకుని, అక్కడ మజిలీలు చేస్తూ దాటారు. ఈ ప్రయాణానికి బందీలుగా పట్టుబడ్డ ఖ్వారెజ్మియా సంచార జాతివారిని గైడ్లుగా పెట్టుకున్నారు. మంగోల్స్ బుఖారా ముఖద్వారం వద్దకు దాదాపుగా ఎవరికీ తెలియకుండా ప్రత్యక్షమయ్యారు. అనేక సైనిక వ్యూహకర్తలు బుఖారాకు అనూహ్య ప్రవేశాన్ని ప్రపంచ యుద్ధ చరిత్రలో అత్యంత విజయవంతమైన అనూహ్య దాడిగా భావిస్తారు.[17]

బుఖారా పెద్దగా పటిష్ఠంగా లేదు, ఒక కందకం, ఒకటే గోడ, నగరానికి రక్షణ గోడ ఉన్నాయి. బుఖారియన్ రక్షణ దళం టర్కిష్ సైనికులతోనూ, టర్కిష్ సైన్యాధక్షుల నాయకత్వంలోనూ ఉంది, వీరు ముట్టడి ప్రారంభమైన మూడో రోజున 20వేల బలగంతో బయటకు వచ్చి పోరాడే ప్రయత్నం చేశారు. ఆ 20వేల దళం ముఖాముఖి యుద్ధంలో నాశనమైపోయింది. నగర నాయకులు ముట్టడి తట్టుకోలేక, రక్షణకు వేరే దళం బలమైనది లేక నగరపు తలుపులు తెరిచి మంగోలులకు లొంగిపోయారు. టర్కిష్ రక్షణ దళం వారు మరో 12 రోజుల పోరాటాన్ని నగర రక్షణ కోటగోడ పట్టుకుని కొనసాగించారు. రక్షణ గోడలోపల దొరికిపోయినవారిని చంపేశారు, చేతివృత్తుల వారు, కళాకారులు, శిల్పులను మంగోలియాకు పంపారు, మంగోల్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడని యువకులను సైన్యంలోకి తీసుకుని, మిగిలిన జనాభాను బానిసలుగా చేశారు. మంగోలు సైన్యం నగరాన్ని కొల్లగొట్టగా మంటలు మొదలై వ్యాపించి నగరంలోని చాలా భాగం ఆహుతి అయిపోయింది.[15]

బుఖారా తర్వాత ఛెంఘిజ్ ఖాన్ ఖ్వారెజ్మి రాజధాని సమర్ ఖండ్ కి బయలుదేరి, మార్చి 1220లో చేరుకున్నారు. బుఖారాతో పోలిస్తే సమర్ ఖండ్ మరింత మెరుగైన పటిష్ఠమైన రక్షణ వ్యవస్థ, దాదాపు లక్షమంది రక్షణ సైన్యంతో ఉంది. ఛెంఘిజ్ తన ముట్టడిని ప్రారంభించగా, కుమారులు చగుటాయ్, ఓగెడాయ్ ఓత్రార్ కూల్చివేతను పూర్తిచేసుకుని చేరగా, సంయుక్త మంగోల్ సైన్యం నగరంపై దాడిని ప్రారంభించింది. బందీల శరీరాలే కవచాలుగా ఉపయోగిస్తూ మంగోల్ సైన్యం దాడిచేసింది. పోరాటంలో మూడోరోజున సమర్ ఖండ్ రక్షణ సైన్యం ఒక ఎదురుదాడిని ప్రయత్నించారు. ఉపసంహరించుకుంటున్నట్టు భ్రమింపజేసి రక్షణ దళంలోని 50వేల సైన్యాన్ని కోట బయటకు రప్పించిన ఛెంఘిజ్ ఖాన్, ముఖాముఖి పోరులో వారందరినీ ఊచకోత కోశారు. నగరాన్ని ముట్టడి నుంచి తప్పించేందుకు షా ముహమ్మద్ రెండుసార్లు ప్రయత్నించినా మంగోల్ సైన్యం తిప్పికొట్టింది. ఐదవ రోజున 2 వేల మంది మినహా మిగిలిన షా సైన్యం లొంగిపోయింది. మిగిలిన సైన్యం ప్రాణం పోయేంతవరకూ షా మహమ్మద్ కి విశ్వాసంగా నిలిచి రక్షణ గోడను పట్టుకుని నిలిచారు. కోట పతనమయ్యాకా ఛెంఘిజ్ లొంగుబాటు నిబంధనలు అమలు చేశారు, తనపై సమర్ ఖండ్ లో కత్తి ఎత్తిన ప్రతి సైనికుణ్ణీ చంపేశారు. సమర్ ఖండ్ ప్రజల్ని నగరానికి బయట ఉన్న మైదానంలో సమావేశం కమ్మని ఆదేశించారు, అక్కడ వారందరినీ చంపేశారు.[18]

సమర్ ఖండ్ పతనమయ్యేనాటికి ఛెంఘిజ్ ఖాన్ తన సైన్యాధ్యక్షుల్లో అత్యున్నత హోదా కలిగిన సుబుటాయ్, జెబెలకు షా ముహమ్మద్ ను వేటాడి చంపమని ఆదేశమిచ్చారు. పశ్చిమానికి కాస్పియన్ సముద్రంలోని చిన్న దీవికి షా అత్యంత నమ్మకస్తులైన సైనికులు, కుమారుడు జలాల్ అల్-దిన్ లతో పారిపోయాడు. 1220 డిసెంబరులో షా చనిపోయాడు, కొందరు చరిత్రకారులు న్యూమోనియా సోకి మరణించారని అంటే, మరికొందరు సామ్రాజ్యాన్ని కోల్పోయి బికారిగా మారిన హఠాత్పరిణామాన్ని తట్టుకోలేక మరణించారని చెప్తారు.

ఈలోగా ఉర్గెంచ్ అన్న సంపన్న వాణిజ్య నగరం ఖ్వారెజ్మియన్ దళాల చేతిలోనే ఉంది. గతంలో షా తల్లి ఉర్గెంచ్ ను పరిపాలించేవారు, కానీ ఆమెకు తన కుమారుడు, చక్రవర్తి షా కాస్పియన్ సముద్రంలోకి పారిపోయాడని తెలియగానే తనూ నగరాన్ని విడిచి పారిపోయింది. ఆమెను పట్టి బంధించి మంగోలియా పంపేశారు. మొహమ్మద్ సైన్యాధ్యక్షుల్లో ఒకరైన ఖుమార్ తెజిన్ ఉర్గెంచ్ సుల్తానుగా ప్రకటించుకున్నారు. దండయాత్ర తొలినాళ్ళ నుంచీ ఉత్తర భాగాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న జోచి ఆ మార్గం నుంచీ, ఛెంఘిజ్ ఖాన్, ఓగెడెయ్ ఖాన్, ఛగటాయ్ ఖాన్ దక్షిణం నుంచి నగరాన్ని సమీపించారు.

 
ఖ్వారెజ్మియన్ సామ్రాజ్ఞి, టర్క్ ల రాణిగా పిలవబడ్డ తెర్కెన్ ఖాటూన్ ను మంగోల్ సైన్యం బంధించింది.

ఉర్గెంచ్ దాడి మంగోల్ దండయాత్రలో అత్యంత కఠినమైనదిగా మిగిలింది. నగరం అము దర్యా నదీతీరంలో చిత్తడి డెల్టా ప్రాంతంలో నిర్మితమైంది. తడి, మెత్తని నేల ముట్టడి తరహా యుద్ధానికి అనుకూలంగా లేకపోవడం, రాళ్ళు విసిరే కాటపుల్ట్ యంత్రం ద్వారా విసరేందుకు పెద్ద రాళ్ళు సమీపంలో పెద్దగా లభించకపోవడం వంటివి మంగోల్ సైన్యానికి సమస్యలయ్యాయి. ఈ సమస్యలు ఎలా ఉన్నా వాటి ప్రభావం తమ ఓపికపై పడకుండా మంగోలులు దాడిచేస్తూనే ఉన్నారు, నగరం తీవ్రమైన ప్రతిఘటనతోనే మంగోల్ సైన్యానికి లొంగింది. ఒక్కో వీధి, ఒక్కో ప్రదేశం పట్టుపట్టి రక్షణ కల్పిస్తూ పోరాడుతూండడంతో పతనం చాలా ఆలస్యమైంది. మంగోలియన్ ఎత్తుగడలు నగర పోరాటానికి అనువుగా మలుచుకోవడంలో చాలా ఇబ్బందులు ఉండడంతో మంగోలులకు సైనిక నష్టం చాలా సంభవించింది.

ఉర్గెంచ్ ను స్వాధీనం చేసుకోవడం ఖాన్ కీ, ఆయన పెద్ద కొడుకు జోచికీ మధ్య ఉన్న సమస్యల వల్ల సంక్లిష్టమైపోయింది. జోచికి ఛెంఘిజ్ ఖాన్ నగరాన్ని బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చారు. అతని ముగ్గురు సోదరుల వలెనే జోచి తల్లి కూడా ఛెంఘిజ్ ఖాన్ చిననాటి పెళ్ళికూతరు, జీవితకాలపు ప్రేయసి అయిన బుర్టీయే. ఆమె కుమారులే ఛెంఘిజ్ ఖాన్ అధికారిక కుమారులు, వారసులుగా పరిగణింపబడ్డారు. 500, అంతకుమించిన సంఖ్యలో ఉన్న ఆయన భార్యలు, ఉంపుడుకత్తెల ద్వారా కలిగిన సంతానానికి ఆ గుర్తింపు లేదు. కానీ జోచి జననం వివాదంతో కూడింది, ఖాన్ తెగల మధ్య అధికారాన్ని కైవసం చేసుకుంటున్న తొలినాళ్ళలో బుర్టీని శత్రువులు పట్టుకుని, బందీగా ఉండగా అత్యాచారం చేశారు. ఆపైన తొమ్మిది నెలలకు జోచి జన్మించారు. ఛెంఘిజ్ ఖాన్ జోచికి తన పెద్ద కుమారునిగా గుర్తింపును ఇచ్చేందుకు అంగీకరించినా (ప్రాథమికంగా బుర్టీపై ఉన్న ప్రేమ వల్ల ఇది జరిగింది, ఆమె కొడుకుని తన కొడుకు కాదని నిరాకరిస్తే ఆమెను నిరాకరించినట్టే అవుతుంది కనుక), జోచి వారసత్వంపైనా, అతని అసలైన తండ్రి ఎవరన్న దానిపైనా ఎప్పుడూ ప్రశ్నలు ఉంటూనే వచ్చాయి.[19]

నగరాన్ని సాధ్యమైనంత దెబ్బతినకుండా నిలుపుకోవాలన్న ఉద్దేశంతో జోచి ఖ్వారెజ్మియన్లతో సంధి చర్చలకు కూర్చొన్నప్పుడు ఇలాంటి వాదాలు, సమస్యలు వచ్చాయి. చగటాయ్ కి ఈ చర్చల వల్ల ఆగ్రహం కలిగింది, ఛెంఘిజ్ ఈ సోదర వివాదానికి విసిగిపోయి ఉర్గెంచ్ పతనమయ్యాకా ముట్టడి సేనలకు సైన్యాధ్యక్షునిగా ఓగెడాయ్ ను నియమించారు. కానీ సేనానాయకత్వం నుంచి జోచిని తొలగించడం, తనకు ఇస్తానని అంగీకరించిన నగరాన్నుంచి తప్పించడం జోచిని రెచ్చగొట్టి, తండ్రి, తమ్ములపై విరోధం కల్పించింది.[3]

యధావిధిగా కళాకారులు, చేతివృత్తుల వారు, శిల్పులను మంగోలియాకు పంపారు, యువతులను, పిల్లలను మంగోల్ సైనికులు బానిసలు చేసుకున్నారు, మిగిలిన జనాభా మొత్తాన్ని నరికేశారు. పర్షియన్ పండితుడు జువయ్ని చెప్పినదాని ప్రకారం 50వేలమంది మంగోల్ సైనికులకు ఒక్కొక్కరూ 24 మంది ఉర్గెంచ్ పౌరుల్ని చంపమని ఆదేశాలు ఇచ్చారు. దీని ప్రకారం 12 లక్షల మంది మరణించారని అంచనా. ఈ అంచనా అత్యుక్తి అయినా, మానవ చరిత్రలో అత్యంత రక్తసిక్తమైన నరమేధాల్లో ఉర్గెంచ్ ఊచకోత ఒకటిగా నిలస్తోంది. ఆపైన అరల్ సముద్రానికి దక్షిణాన ఉన్న గుర్జంగ్ నగరాన్నీ ధ్వంసం చేశారు.

ఖోరసన్ యుద్ధం మార్చు

మంగోలులు ఉర్గెంచ్ ను ముట్టడి చేస్తూండగానే ఛెంఘిజ్ ఖాన్ తన కొడుకుల్లోకెల్లా చిన్నవాడైన తొలుయ్ కి సేనా నాయకత్వం ఇచ్చి పశ్చిమ ఖ్వారెజ్మిద్ ప్రావిన్సు అయిన ఖోరసన్ పైకి పంపారు. ఖోరసన్ లో అప్పటికే జెబే, సుబుటాయ్ ప్రావిన్సు అంతటా ప్రయాణిస్తూ షాను వేటాడుతున్నప్పుడు మంగోల్ యుద్ధ తాకిడి పొందింది. ఐతే అణచివేయబడ్డ ప్రాంతానికి చాలా దూరంగా ఉండడం, చాలా నగరాలు మంగోల్ పాలనలో లేకపోవడంతోషా కొడుకు జలాల్ అల్-దిన్ మంగోలులపై పోరాడేందుకు ఓ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాడన్న పుకార్ల కారణంగా అప్పటికి కొద్ది సంఖ్యలో ఉన్న మంగోల్ దళాలపై తిరుగుబాట్లు ఈ ప్రాంతంలో ఊపందుకున్నాయి. తొలుయ్ సైన్యం మౌలికంగా మంగోల్ సైనికులు, వారికి తోడు టర్క్ లు, చైనా, మంగోలియాలకు చెందిన విదేశీయులతో పాటుగా 3వేల బాణాలు విసిరే యంత్రాలు, 300 కాటపుల్ట్ లు, 700 మాగ్నోనెల్ లు (వాడి మొన కలిగిన బరువైన వస్తువులు గోడలపైకి విసిరే యంత్రం) సహా మొత్తం 50వేల మందికి అటూఇటుగా సైన్యం కలిగుంది.[6] పతనమైన మొదటి నగరాల్లో తెర్మెజ్, ఆపైన బల్ఖ్ ఉన్నాయి. తొలుయ్ సైన్యానికి పతనమైన ప్రధాన నగరం మెర్వ్. మెర్వ్ గురించి జువయ్నీ ఇలా రాశారు: విస్తీర్ణతలో ఖోరసన్ భూముల్లోకెల్లా గొప్పది, శాంతి, భద్రతలనే పక్షులు నగర సరిహద్దుల నడుమ ఎగురుతూంటాయి. ముఖ్య నాయకుల సంఖ్య ఏప్రిల్ వాన చినుకుల సంఖ్యతో పోటీపడుతూండగా, నగరం స్వర్గంతో సమానంగా తులతూగుతుంది.[20]

కేవలం 12వేలమంది మాత్రమే మెర్వ్ రక్షణ దళం, నగరం తూర్పు ఖ్వారెజ్మియా నుంచి పారిపోయి వచ్చిన శరణార్థులతో కిటకిటలాడుతోంది. ఆరు రోజుల ముట్టడి అనంతరం తొలుయ్ నగరంలోకి దాడి చేయగిగారు. ఏదేమైనా రక్షణ దళం దాడిని తిప్పికొట్టి, ఎదురుదాడి ప్రారంభించింది. రక్షణ దళాన్ని తిరిగి నగరంలోపలికి నెట్టేశారు. తర్వాతి రోజు నగర గవర్నర్ నగరాన్ని తొలుయ్ కి నగర పౌరుల ప్రాణాలు విడిచిపెట్టేసే షరతు మీద అప్పగించారు. నగరం లొంగిపోయిన వెనువెంటనే తొలుయ్ దాదాపు లొంగిపోయిన ప్రతి వ్యక్తినీ చంపేశారు, ఈ ఊచకోత ఉగ్రెంచ్ కన్నా పెద్ద స్థాయిలో జరిగిందని భావిస్తారు. మెర్వ్ తర్వాత తొలుయ్ పశ్చిమానికి సాగి నిషాపూర్, హెరత్ నగరాలపై దాడికి పాల్పడ్డారు.[21] మూడురోజుల తర్వాత నిషాపూర్ పతనమైంది, పోరాటంలో ఛెంఘిజ్ మనవడు తొకుచార్ మరణించారు, తొలుయ్ నగరంలోని మనుషులే కాక, కుక్కలు, పిల్లులు వంటి జంతువులను కూడా వదలకుండా నరికేశారు. ఈ హత్యాకాండకు తొకుచార్ భార్యకి నేతృత్వం ఇచ్చారు.[20] నిషాపూర్ పతనం తర్వాత హెరాత్ పోరాటం లేకుండా లొంగిపోయి, హత్యాకాండ తప్పించుకుని మిగిలిపోయింది. హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని బమియన్ ముట్టడిలో తీవ్ర ప్రతిఘటన వల్ల ఛెంఘిజ్ మనవడు మరణించారు. దీని వల్ల లొంగుబాటు తర్వాత దారుణ మారణహోమం జరిగింది. తూస్, మాషాద్ నగరాలు తర్వాత పతనమయ్యాయి. 1221 వసంతం నాటికి ఖురాసన్ ప్రావిన్స్ పూర్తిగా మంగోల్ పాలనలో ఉంది. రక్షణ దళాలను వదిలి తొలుయ్ తన తండ్రిని చేరుకునేందుకు తూర్పుకు ప్రయాణమయ్యారు.

ఆఖరి యద్ధం, దండయాత్ర పరిణామాలు మార్చు

ఖురాసన్ లో మంగోల్ దండయాత్ర ముగిశాకా, షా సైన్యం ముక్కచెక్కలు అయింది. తండ్రి మరణానంతరం, అతని వారసత్వాన్ని స్వీకరించిన జలాల్ అల్-దిన్ ఖ్వారెజ్మిద్ సైన్య అవశేషాలను సమీకరించే ప్రయత్నాలు దక్షిణాన, ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో చేయడం ప్రారంభించారు. జలాల్ అల్-దిన్ సమీకరిస్తున్న సైన్యాన్ని వేటాడేందుకు ఛెంఘిజ్ సైన్యాన్ని పంపించారు, 1221 వసంతంలో ఇరు పక్షాలూ పర్వాన్ పట్టణం వద్ద కలుసుకున్నాయి. యుద్ధంలో మంగోల్ బలగాలు దారుణమైన ఓటమి చవిచూశాయి. ఈ యుద్ధంతో కోపావేశభరితుడైన ఛెంఘిజ్ ఖాన్ దక్షిణానికి స్వయంగా బయలుదేరి సింధు నది వద్ద జలాల్ అల్-దిన్ ను ఓడించారు. ఓడిపోయిన జలాల్ అల్-దిన్ భారతదేశానికి పారిపోయారు. ఛెంఘిజ్ ఖాన్ కొంత సమయాన్ని సింధు నది దక్షిణ తీరంలో కొత్త షాను వెతుకుతూ గడిపారు, కానీ అతను దొరకలేదు. షాను భారతదేశానికి తరిమిన సంతృప్తితో ఖాన్ ఉత్తరానికి బయలుదేరారు.

మిగిలిన ప్రతిఘటనా కేంద్రాలు కూడా నాశనమయ్యాకా, ఛెంఘిజ్ ఖాన్ రక్షణ దళాలను నియమించి, మంగోలియా తిరిగివెళ్ళారు. ఖ్వారెజ్మియన్ సామ్రాజ్య నాశనం, విలీనం ఇస్లామిక్ ప్రపంచానికి, తూర్పు ఐరోపాకు రానున్న రోజుల్లో ఏం జరగనుందో సంకేతంగా చూపించింది.[15] మంగోల్ సైన్యాలు ఛెంఘిజ్ ఖాన్ కుమారుడు ఓగెడాయ్ ఆధ్వర్యంలో కేవన్ రుస్ (నేటి రష్యాలోని భాగం), పోలాండ్ లపై దండయాత్ర చేసేప్పుడు ఈ కొత్త భూభాగం ప్రధానమైన పునాదిగా ఉపయోగపడింది, ఆ తర్వాతి దండయాత్రలు ఆస్ట్రియా, బాల్టిక్ సముద్రం, జర్మనీ ప్రాంతాలకు మంగోల్ సైన్యాలను తీసుకువెళ్ళాయి. ఇస్లామిక్ ప్రపంచం విషయానికి వస్తే, ఖ్వారెజ్మియా పతనం ఇరాక్, టర్కీ, సిరియాలపై దాడి చేయడానికి మంగోల్ సైన్యానికి తలుపులు బార్లా తెరిచినట్టు అయింది. భావి కాలపు ఖాన్ లకు ఈ మూడు ప్రాంతాలు తర్వాతి కాలంలో అధీనమయ్యాయి.

ఖ్వారెజ్మియాతో యుద్ధం వారసత్వం అన్న అత్యంత కీలకమైన ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఛెంఘిజ్ ఖాన్ యుద్ధం ప్రారంభమయ్యేనాటికే పోరాట యోధులు, ఎవరికి వారికి వేర్వేరుగా నమ్మకస్తులైన అనుచరులు ఉన్న నలుగురు కుమారుల తండ్రి. అలాంటి యోధులైన అన్నదమ్ముల మధ్య వివాదాలు ఉర్గెంచ్ ముట్టడి సమయానికి తారాస్థాయికి చేరుకున్నాయి, దీంతో ఇక ఛెంఘిజ్ ఖాన్ ఈ వివాదాల వల్ల ముట్టడి ముగించేందుకు తన మూడవ కుమారుడైన ఓగెడాయ్ పై నమ్మకం పెట్టుకోవలసి వచ్చింది. ఉగ్రెంచ్ విధ్వంసం పూర్తయ్యాకా ఛెంఘిజ్ ఖాన్ తన వారసునిగా ఓగెడాయ్ ని అధికారికంగా ఎంపికచేశారు. ఇదెలా ఉన్నా నలుగురు కుమారులు ఒకరినొకరు దెబ్బతీసుకోసాగారు, ఈ పరిణామం ఛెంఘిజ్ ఖాన్ సృష్టించిన ఖానేట్ లోని అస్థిరతను తెలుపుతోంది.

జోచి తన తండ్రిని ఎప్పటికీ క్షమించలేదు, ఆదేశాలు అందినా తండ్రి వద్దకు రాలేదు, ఆ తర్వాత ఉత్తరాన సాగిన మంగోల్ యుద్ధాల నుంచి విరమించుకున్నారు.[19] అయితే తిరుగుబాటు చేసిన జోచి మీద మరణకాలంలో కూడా ఖాన్ దండయాత్ర చేసేందుకు ఆలోచించారు. ఈ పరిణామాల దుష్ప్రభావం వారి కుమారుల మీద, ఇంకా ప్రధానంగా కేవన్ రస్ ను జయించిన మనవలు బాటు ఖాన్, బెర్కే ఖాన్ లపై పడింది.[9] ఈజిప్టుకు చెందిన మమ్లుక్లు మంగోలియన్లను ఐన్ జలుత్ యుద్ధంలో 1260లో చరిత్రలోకెల్లా అత్యంత ప్రముఖమైన మంగోల్ ఓటమి చవిచూసేలా చేశారు. ఛెంఘిజ్ ఖాన్ కుమారుడు తొలుయ్ కొడుకులు 1258లో బాగ్దాద్ ను ముట్టడించినా ప్రతీకారం తీర్చుకోలేకపోతూండగా అతనిపై దాయాది సోదరుడు బెర్కే ఖాన్ (ఇస్లాంలోకి మారారు) ట్రాన్స్-కాస్కసస్ వద్ద ఇస్లాం మతం కోసం అంటూ యుద్ధం ప్రారంభించారు. ఇది ఛెంఘిజ్ ఖాన్ ఖాఖాన్ (నాయకుల నాయకుడు) అయ్యాకా మంగోల్ వారు, మరో మంగోలీయునిపై కత్తిదూయడం అదే చరిత్రలో ప్రప్రథమం. ఈ యుద్ధ బీజాలు ఖ్వారెజ్మియా దండయాత్రలో వారి తండ్రులు అధినాయకత్వం కోసం పోరాడినప్పుటివి.[15]

నోట్స్ మార్చు

  1. "The Islamic World to 1600: The Mongol Invasions (The Il-Khanate)". Archived from the original on 2013-10-15. Retrieved 2016-08-31.
  2. Ratchnevsky, Paul.
  3. 3.0 3.1 3.2 Saunders, J. J. The History of the Mongol Conquests
  4. 4.0 4.1 Hildinger, Eric.
  5. Soucek, Svatopluk A History of Inner Asia
  6. 6.0 6.1 Prawdin, Michael.
  7. Ratchnevsky 1994, p. 129.
  8. See "Mongol military tactics and organization" for overall coverage.
  9. 9.0 9.1 Chambers, James.
  10. France, p. 109-110
  11. France, p. 113
  12. Kenneth Warren Chase (2003).
  13. David Nicolle; Richard Hook (1998).
  14. Chahryar Adle; Irfan Habib (2003).
  15. 15.0 15.1 15.2 15.3 15.4 Morgan, David The Mongols
  16. John Man (2007). Genghis Khan: Life, Death, and Resurrection. Macmillan. p. 163. ISBN 0-312-36624-8.
  17. Greene, Robert "The 33 Strategies of War"
  18. "Central Asian world cities". Archived from the original on 2012-01-18. Retrieved 2016-09-09.
  19. 19.0 19.1 Nicolle, David. The Mongol Warlords
  20. 20.0 20.1 Stubbs, Kim. Facing the Wrath of Khan.
  21. Mongol Conquests