మద్దుకూరి చంద్రశేఖరరావు

మద్దుకూరి చంద్రశేఖరరావు తెలుగు సాహిత్యానికి, జర్నలిజానికి మార్క్సిస్టు చూపునిచ్చిన దార్శనికుడు. ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమానికి బలమైన పునాదులు వేసినవాడు[1].

Maddukui chandrasekahrarao.jpg

జీవిత విశేషాలుసవరించు

ఇతడు కృష్ణాజిల్లా, పెదపారుపూడి మండలం, వెంట్రప్రగడ గ్రామంలో 1907లో జన్మించాడు. ఇతడు విద్యార్థి దశలో జాతీయోద్యమంలో పాల్గొని దాని నుంచి కమ్యూనిస్టు ఉద్యమానికి వచ్చాడు. ఇతడు ఇంజినీరింగ్‌ విద్యార్థిగా 1930లో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లాడు. 1932లో వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొన్న సందర్భంలో పోలీసులు ఇతడిని చిత్రహింసలు పెట్టారు. రెండేళ్ల కఠిన జైలు శిక్ష విధించారు. జైలులోనే మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేసి అవగాహన చేసుకున్నాడు. తన పంథా నిర్ధారించుకున్నాడు. తనతోపాటు అనేక మంది యువకులను సమీకరించి పార్టీకి సుశిక్షితులైన సైనికుల్లా మార్చాడు. పుచ్చలపల్లి సుందరయ్య, కంభంపాటి సత్యనారాయణ, చలసాని వాసుదేవరావుతో కలిసి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి తనదైన ముద్రతో పనిచేశాడు. క్షేత్రస్థాయిలో పనిచేయడంతోపాటు ఓ మేధావిగా శైశవ దశలో కమ్యూనిస్టు పార్టీకి కొన్ని విషయాల్లో ఇతడు మార్గదర్శకం చేశాడు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం, మాతృదేశ దాస్య విముక్తి ఉద్యమాన్ని సమన్వయం చేసి పార్టీని నడిపించడంలో ఇతడు చూపిన మార్గమే దిక్సూచిలా నిలిచింది. సోవియట్‌ యూనియన్‌పై నాజీల దాడి నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న వైఖరికి జాతీయవాదుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఆంధ్ర కమ్యూనిస్టులు ఇతడి నాయకత్వాన సంయమనంతో ముందుకు సాగారు. సుభాష్‌చంద్రబోస్‌లాంటి పొరబడిన దేశభక్తులపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేయడాన్ని తొలినుంచి ఇతడు వ్యతిరేకించాడంటే ఈయన ముందుచూపు, పరిస్థితులపై ఈయన అవగాహన స్పష్టమవుతోంది. ఇతడు రాసిన వ్యాసాలు 'గాంధీ-ఇర్విన్‌ నాటినుంచి జమీందారీ పోరాటం వరకు' కాంగ్రెస్‌ నిర్వహించిన రాజకీయాలు ఏమిటో అర్థమవుతాయి. ఒక దశలో కమ్యూనిస్టు పార్టీపై జరిగిన కువిమర్శలను తిప్పికొట్టడంలో ఇతడు తన వ్యాసాలను ఆయుధాలుగా ఎక్కుపెట్టాడు.

పాత్రికేయజీవితంసవరించు

మద్దుకూరి చంద్రశేఖరరావు పాత్రికేయ జీవితం 1937లో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభించిన పత్రిక నవశక్తి సంపాదకునిగా ప్రారంభమయ్యింది. పార్టీ రహస్యపత్రిక స్వతంత్ర భారత్‌, 1942-45 మధ్య ప్రజాశక్తి వారపత్రి కకు, 1946నుంచి 1948 నిర్బంధ కాలంలో మూసివేసే వరకు ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులుగా పనిచేశాడు. 1948లో అరెస్టు అయ్యాడు. 1952లో విశాలాంధ్ర దినపత్రిక ప్రారంభంలో ప్రధాన సంపాదకునిగా వ్యవహరించాడు. 1964నుంచి68 వరకు సంపాదక వర్గంలో ఒకనిగా ఉన్నాడు. ప్రగతి సచిత్రవారపత్రికకు 1969 నుండి 1974 వరకు ప్రధాన సంపాదకునిగా వ్యవహరించాడు. జయభారత్, రెఢీ అనే రహస్య పత్రికలు ఇతడి నాయకత్వంలో నడిచాయి. ఇతని పత్రికారచన ఎంతో సులువుగా, సూటిగా, సరళంగా పల్లె ప్రజలను లక్ష్యంగా చేసుకొని సాగింది.

రాజకీయజీవితంసవరించు

ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి ఇతడు చేసిన కృషి గణనీయమైంది. మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు కమ్యూనిస్టు పార్టీ ఇతని నాయకత్వంలో నిజమైన పోరాటం చేసింది. నాగరికత, చరిత్ర, సంస్కృతి, సాహిత్యంపై కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొనడానికి ఇతని చొరవే ప్రధాన కారణం. సోషలిస్టు భావాలను, మార్క్సిస్టు సిద్ధాంతాలను ప్రజల్లో ప్రచారం చేయడానికి, ప్రజల సమస్యలు వెలుగులోకి తెచ్చి, వాటి పరిష్కారానికి సాగే ఉద్యమాలకు ఊతంగా నిలవడానికి పత్రికల ద్వారా ఇతడు కృషి చేశాడు. కమ్యూనిస్టు ఉద్యమాభివృద్ధికి, ప్రజాతంత్రశక్తుల సమీకరణకు తన వ్యాసాలు, సంపాదకీయాల ద్వారా ఇతడు తపించాడు. 1951నుంచి 56వరకు రాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. ఇతడు ఏనాడు పదవుల్ని ఆశించలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పదవుల కన్నా పార్టీ నిర్మాణమే ముఖ్యమని నమ్మినవాడు. 1952లో రాజ్యసభకు పంపాలని పార్టీ నిర్ణయిస్తే సున్నితంగా తిరస్కరించాడు. పార్టీలో ముఠాతత్వానికి నిరసనగా అన్ని బాధ్యతలు వదిలి కర్నూలు వెళ్లి సామాన్య రైతు జీవితం గడిపాడు. అక్కడ కూడా సామాన్య కార్యకర్తగా పార్టీ నిర్మాణానికి కృషిచేశాడు.

రచనలుసవరించు

  1. చంద్రం వ్యాసావళి
  2. ఆంధ్రసాహిత్య పునర్వికాసం[2]

మూలాలుసవరించు

  1. ముత్యాల, ప్రసాద్‌ (2014-07-26). "మంచి కమ్యూనిస్టు మద్దుకూరి చంద్రం". విశాలాంధ్ర దినపత్రిక. Retrieved 15 March 2015. CS1 maint: discouraged parameter (link)
  2. మద్ధుకూరి, చంద్రశేఖరరావు (1958-10-01). ఆంధ్ర సాహిత్య పునర్వికాసం. విజయవాడ: విశాలాంధ్ర ప్రచురణాలయం. Retrieved 15 March 2015. CS1 maint: discouraged parameter (link)