మద్రాస్ ఎ.కన్నన్

కర్ణాటక సంగీత మృదంగ వాద్య విద్వాంసుడు, సంగీత గురువు

మద్రాస్ ఎ.కన్నన్ ఒక కర్ణాటక సంగీత మృదంగ వాద్య విద్వాంసుడు[1].

మద్రాస్ ఎ.కన్నన్
Madras Kannan.jpg
వ్యక్తిగత సమాచారం
జననం1920
రాయపేట్, మద్రాసు, తమిళనాడు
మరణం2019 ఏప్రిల్ 1(2019-04-01) (వయస్సు 99)
చెన్నై
సంగీత శైలికర్ణాటక సంగీతం
వాయిద్యాలుమృదంగం

విశేషాలుసవరించు

ఇతడు 1920లో మద్రాసు రాయపేట్‌లో జన్మించాడు. ఇతని తండ్రి ఆదిమూలం వ్యాపారవేత్త. ఇతడు మృదంగాన్ని తంజావూరు రామదాసరావు వద్ద నేర్చుకున్నాడు. ఇంకా ఇతడు వీణా వాదనను పీతాంబర దేశాయి వద్ద, గాత్ర సంగీతాన్ని కృష్ణస్వామి నాయుడు వద్ద నేర్చుకున్నాడు.

ఇతడు తన 8 యేళ్ళ వయసులో టైగర్ వరదాచారి సంగీత కచేరీకి తొలి సారి మృదంగం వాయించాడు[2]. ఇతడు తన సుదీర్ఘ సంగీత జీవితంలో ఎంతో మంది గాత్ర సంగీత విద్వాంసులకు, వాద్య కళాకారులకు మృదంగ సహకారాన్ని అందించాడు. వీరిలో చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై, ద్వారం వెంకటస్వామినాయుడు, హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్, గోటువాద్యం నారాయణ అయ్యంగార్, వీణ సుబ్బణ్ణ, అరియకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, జి.ఎన్.బాలసుబ్రమణియం, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, దండపాణి దేశికర్, టి.ఆర్.మహాలింగం మొదలైనవారు ఉన్నారు. ఇతడు ఆకాశవాణి చెన్నై కేంద్రం నిలయ విద్వాంసునిగా పనిచేశాడు. ఇతడు అన్నామలై విశ్వవిద్యాలయపు సంగీత కళాశాలలోను, అనేక ప్రైవేటు కళాశాలలోను సంగీత పాఠాలు బోధించాడు.

ఇతని శిష్యులలో రామకృష్ణన్, రాజన్, శ్రీనాథ్, సురేష్, దీనదయాళన్ మొదలైన వారు ఇతని సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు[2].

పురస్కారాలు, గుర్తింపులుసవరించు

ఇతడిని అనేక సాంస్కృతిక సంఘాలు, సంగీత సభలు సత్కరించాయి. 1955లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కె.కామరాజ్ ఇతడిని "లయరత్నాకర" బిరుదుతో సత్కరించాడు. 1959లో స్వామి శివానంద సరస్వతి "మృదంగ సామ్రాట్" బిరుదును ఇచ్చాడు. భారత ప్రభుత్వం ఇతడిని మూడు నెలలపాటు ఆఫ్రికా దేశాలలో పర్యటించడానికి సాంస్కృతిక బృందంలో సభ్యునిగా నియమించింది. ఈ పర్యటనలో ఇతడిని ఇథియోపియా రాజు, లైబీరియా అధ్యక్షుడు బంగారు పతకాలతో సత్కరించారు. 1974లో ఇంటర్నేషనల్ మ్యూజిక్ కౌన్సిల్ ఇతడిని, ఈమని శంకరశాస్త్రితో పాటు ఆహ్వానించింది. వీరిరువురూ నిర్వహించిన కచేరీ "శతాబ్దపు ఉత్తమ కచేరీ"గా ఎంపికయ్యింది. 1978లో ఇతనికి రష్యాలో ఇతనికి ఏషియన్ మ్యూజిక్ రోష్ట్రం అవార్డు ప్రకాటించారు.2002లో శృతి ఫౌండేషన్ ఇతడిని వెల్లూరు గోపాలాచారి అవార్డుతో సత్కరించింది. కర్ణాటక ప్రభుత్వం ఇతడిని "పంచనాద కళారత్న" బిరుదుతో సన్మానించింది. 2004లో కేంద్ర సంగీత నాటక అకాడమీ కర్ణాటక సంగీతం వాద్యపరికరాలు (మృదంగం) విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును ఇతడికి ఇచ్చింది[2].

మరణంసవరించు

ఇతడు 2019 ఏప్రిల్ 1వ తేదీన తన 99వ యేట చెన్నైలో మరణించాడు[2],[3].

మూలాలుసవరించు

  1. web master. "Madras A. Kannan". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 13 ఆగస్టు 2020. Retrieved 16 March 2021.
  2. 2.0 2.1 2.2 2.3 లలితారాం. "Madras Kannan – Interview". Carnatic Music Review. Retrieved 16 March 2021.
  3. NT Bureau (2 April 2019). "Noted mridangam vidwan Madras A Kannan passes away". Newstoday. Retrieved 16 March 2021.