మాసూమా బేగం (అక్టోబరు 7, 1901 - మార్చి 2, 1990) సంఘ సేవకురాలు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్టంలో తొలి మహిళా మంత్రి. దేశంలో మంత్రి పదవిని అధిష్టించిన తొలి ముస్లిం మహిళ కూడా ఈమెనే! హైదరాబాదీ అయిన మాసూమా బేగం చిన్నప్పట్నుంచే సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తల్లి ద్వారా సరోజనీనాయుడితో పరిచయం ఏర్పడింది. 1928లో బొంబాయిలో తొలిసారిగా నిర్వహించిన అఖిల భారత మహిళా సదస్సులో పాల్గొన్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో జరిగిన ఎన్నికల్లో శాలిబండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు విలీనం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో పత్తర్‌గట్టి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1960 జనవరిలో రెండో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రభుత్వంలో మంత్రిగా చేరారు. కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు.

మసూమా బేగం
మసూమా బేగం

నియోజకవర్గం శాలిబండ నియోజకవర్గం (1952)
పత్తర్ ఘట్టీ నియోజకవర్గం (1957)

వ్యక్తిగత వివరాలు

జననం అక్టోబరు 7, 1901
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మరణం మార్చి 2, 1990
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయురాలు
తల్లిదండ్రులు ఖదివే జంగ్ బహాదుర్ (మిర్జా కరీంఖాన్), తయ్యబా బేగం
జీవిత భాగస్వామి హుసేన్ అలీఖాన్‌
సంతానం (నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి) అలీఖాన్, అనీస్ హస్నైన్, మీర్జా ఆసిఫ్ అలీఖాన్, నాసిర్ అలీఖాన్, రషీద్ అజర్ అలీఖాన్
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

జననం మార్చు

మసూమా బేగం 1901, అక్టోబరు 7హైదరాబాదులో విద్యావంతుల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి ఖదివే జంగ్ బహాదుర్ (మిర్జా కరీంఖాన్), తల్లి తయ్యబా బేగం భారతదేశపు ముస్లిం మహిళలలో తొలి పట్టభద్రురాలు.[1] ఈమె మాతామహుడు హైదరాబాదులో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ స్థాపకుడైన ఇమాదుల్ ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ. ఈమె సోదరుడు అలీ యావర్ జంగ్ హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈమెకు చిన్నతనం నుండి సంఘసేవలో ఆసక్తి ఎక్కువ. మసూమా విద్యాభ్యాసం మహబూబీయా బాలికల పాఠశాలలో జరిగింది.

రాజకీయ జీవితం మార్చు

వీరు ఇరవై సంవత్సరాల వయసులో 1921లో ఈమె తల్లి తయ్యబా బేగం మరణించడంతో,[1] తల్లిచే స్థాపించబడిన "అంజుమన్-ఏ-ఖవాతీన్" అనే జాతీయ మహిళా సంస్థకు[2] అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1927లో హైదరాబాదులో ఏర్పడిన అఖిల భారత మహిళా సంస్థ యొక్క ఆంధ్ర శాఖ కార్యదర్శిగా తరువాత అధ్యక్షురాలిగా పనిచేశారు.

ఈమె 1952లో శాలిబండ నియోజకవర్గం నుండి, 1957లో పత్తర్ ఘట్టీ నియోజకవర్గం నుండి శాసన సభకు ఎన్నికయ్యారు. ఈమె నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేసింది. 1962లో తిరిగి పత్తర్‌ఘట్టి నియోజకవర్గం నుండి పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి సలావుద్దీన్ ఒవైసీ చేతిలో ఓడిపోయింది. ప్రపంచంలో ద్వేషం, అసూయ నిర్మూలించేందుకు ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన సంఘంలో వీరు సభ్యురాలు.

వ్యక్తిగత జీవితం మార్చు

1922లో ఈమె ఆక్స్‌ఫర్డులో చదివి తిరిగివచ్చిన తన కజిన్ హుసేన్ అలీఖాన్‌ను పెళ్ళి చేసుకొంది.[3] ఈమె భర్త డాక్టర్ హుసేన్ ఆలీ ఖాన్ ఆ తరువాతి కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖాధిపతిగా పనిచేశారు. వీరికి ఐదుగురు సంతానం (నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి) - అలీఖాన్, అనీస్ హస్నైన్, మీర్జా ఆసిఫ్ అలీఖాన్, నాసిర్ అలీఖాన్, రషీద్ అజర్ అలీఖాన్

మరణం మార్చు

మసూమా బేగం 1990, మార్చి 2హైదరాబాదులో మరణించింది.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Tyaba Begum Sahaba Bilgrami". HelloHyderabad.com. Archived from the original on 6 మార్చి 2016. Retrieved 3 November 2014.
  2. Ray, Bharati (Sep 15, 2005). Women of India: Colonial and Post-colonial Periods. SAGE Publications India. p. 569. ISBN 8132102649. Retrieved 3 November 2014.
  3. Srivastava, Gouri (Jan 1, 2003). The Legend Makers: Some Eminent Muslim Women of India. New Delhi: Concept Publishing Company. pp. 90–92. ISBN 8180690016. Retrieved 3 November 2014.