మార్పు పద్మనాభం
మార్పు పద్మనాభం కమ్యూనిస్టు నేత.
జీవిత విశేషాలు
మార్చుఆయన కాంగ్రెస్ పార్టీలోఉంటూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. ఆయన మార్చి 5 1896 న శ్రీకాకుళం జిల్లా లోని మందస మండలానికి చెందిన భిన్నళ మదనాపురం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. జాతీయోద్యమ కాలంలో మందస ఎస్టేట్ కాంగ్రెస్ సంఘ అధ్యక్షునిగా, జిల్లా రైతు సంఘం అద్యక్షునిగా, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లాలో జరిగిన పలు ఉద్యమాల్లో అగ్రభాగాన నిలిచారు. గాంధీజీ పిలుపు మేరకు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆనాడు ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు జరిగిన రైతు రక్షణ పాదయాత్రలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న కారణంగా ఆయనకు బ్రిటిష్ వారు రెండున్నరేళ్ళు జైలు శిక్ష విధించారు. 1940 లోజరిగిన పలాసలో జరిగిన చరిత్ర ప్రసిద్ధి గాంచిన అయిదో అఖిల భారత కిసాన్ మహాసభల నిర్వాహకుల్లో ఆయన ముఖ్యులు. ఈ సభలో జమీందారుల దిష్టి బొమ్మల్ని తగులబెట్టి రైతులు నిరసన వ్యక్తం చేసారు. ఆ తర్వాత కొద్ది రోజులకే గుడారిరాజమణిపురంలో బ్రిటిష్ ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపింది. వీరగున్నమ్మతో పాటు నలుగురు రైతు నాయకులు మృతి చెందారు. ఇందులో పద్మనాభం ప్రత్యక్షంగా పాల్గొని బ్రిటిష్ పోలీసులకు ఎదురొడ్డి ధైర్యసాహసాలను ప్రదర్శించాడు. జమీందార్లు ఈయనపై కసితో పెట్టిన కేసుల ఫలితంగా రెండున్నరేళ్ళు జైలు శిక్ష అనుభవించాడు. గుడారి రాజమణిపురం కాల్పుల తరువాత ఆయన గానుగుల తరుణాచారి, బెందాళం గవరయ్య వంటి రైతు సంఘ నాయకులు శ్రామిక రాజ్య దృక్పధాన్ని అనుసరించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమమ్లో పాల్గొన్నందుకు మరలా జైలు శిక్ష అనుభవించాడు. బళ్ళారి జైలులోనే ఆయన కమ్యూనిస్టు ఉద్యమాలపై ఆకర్షితులయ్యారు. మందస కాల్పుల కాల్పుల సంఘటన తరువాత ఆయనను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సర్దార్ బిరుదు యిచ్చి సత్కరించింది. 1944లో జైలు నిర్బంధం నుంచి బయటికి వచ్చిన తరువాత ఉత్తరాంధ్రలో అరుణ పతాక ఆశయాలను ప్రచారం చేసి కట్టుబడిన తొలితరం కమ్యూనిస్టుగా ఆయన చరిత్రలో నిలిచారు.[1]
లక్ష్యసిద్ధికి పోరాటం
మార్చుతెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం ఉవ్వెతున సాగుతున్న కాలంలో పద్మనాభం భార్య వియోగాన్ని పొందినా ఆ పోరాట స్ఫూర్తితొ 1947-48లో జమీందారీ వ్యవస్థ రద్దును కోరుతూ పోరాటం చేశారు. దాంతో అప్పటి భారత ప్రభుత్వం 1948 జూన్ లో అరెస్టు చేసి కడలూరు జైలులో నిర్బంధించింది, "శత్రు శిబిరంలోనైనా ఉగ్ర నరసింహుడ్నే' అని రుజువు చేస్తూ 1949లో రాజకీయ ఖైదీల హక్కుల కోసం జైలు అధికారులతో పోరాటం చేసిన దీరుడు పద్మనాభం. పోలీసులు తీవ్ర చిత్రహింసల వల్ల క్షయ వ్యాధిగ్రస్తుడై కడలూరు జైలునుంచి 1951 ఫిబ్రవరిలో విడుదలయ్యాడు, కమ్యూనిసు పార్టీ నిర్ణయం మేరకు 1952, 55 సంవత్సరాల్లో సోంపేట నుంచి శాసనసభకి పోటీచేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1953లో టెక్కలిలో సత్యాగ్రహం 19రోజులు నడిపి విజయాన్ని సాధించారు.
నిస్వార్థపరుడు
మార్చురోజురోజుకీ తన ఆరోగ్యం &ణిస్తున్నా ఆర్థికంగా అవస్థపడుతున్నా చలించలేదు. శ్రీకాకుళం జిల్లాలో కమ్యూనిసు పార్టీ నిర్మాణానికి అహర్నిశలు శ్రమించారు. కడలూరు వైలు డిటెన్యూలు చందాలు వసూలుచేసి తనకి రూ.500 పంపిస్తే ఆ డబ్బును పార్టీ నిధికి అప్పగించిన నిస్వార్థపరుడు. ఎంతో దారిద్ర్యాన్ని అనుభవించి కోట్లాది శ్రమ జీవుల బాగుకోసం ఉద్యమించిన కార్యదీక్షాపరుడు పద్మనాభం. నేటితరం హృదయాల్లో '"సర్దర్ మార్పు వద్మనాభం తాత"గా చెరగని ముద్ర వేసిన రైతాంగ ఉద్యమ మార్గదర్శి మార్పు పద్మనాభం. 1920లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటినుంచి తన తుదిశ్వాన విడిచే వరకు ప్రజా ఉద్యమాల్లో నిజాయితీగా నిలబడాడు. చివరికి 1986 జనవరి 14న 'సంక్రాంతి' పర్వదినాన తన జన్మస్థలమైన భిన్నళ మదనాపురంలో అమరత్వం పొందారు. నమ్మిన సిద్దాంతం పట్ల విశ్వాసం, నిర్బంధాన్ని లక్ష్యపెట్టని దైర్యం, నిస్వార్ణం, కార్యదీక, పటుదల, నిజాయితీ మార్పు పద్మనాభానికి మిగిలిన ఆస్తి.
మూలాలు
మార్చు- ↑ "నిస్వార్థపరుడు మన పద్మనాభం". Archived from the original on 2016-09-14. Retrieved 2016-11-20.