పూర్ణ మాలావత్‌

భారతీయ పర్వతారోహకురాలు
(మాలవత్ పూర్ణ నుండి దారిమార్పు చెందింది)

పూర్ణ మాలావత్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్వతారోహకురాలు. ఈమె అతి పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించింది. ఆమె 2014 మే 25 న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 14 సంవత్సరాల పిన్న వయసులో సాహసాన్ని చేసి ప్రసిద్దిచెందారు.[1]

పూర్ణ మాలావత్‌
వ్యక్తిగత సమాచారం
జననం2000 జూన్ 10
పాఖాల్,సిరికొండ మండలం, నిజామాబాదు జిల్లా, తెలంగాణ, భారతదేశం
వృత్తి జీవితం
గుర్తించదగిన ఆధిరోహణలుమౌంట్ ఎవరెస్టు 2014
మౌంట్‌ కిలిమంజారో 2016
మౌంట్‌ ఎల్‌బ్రస్‌ 2017
మౌంట్‌ అకోన్‌కగువా 2019
మౌంట్‌ కార్టెన్జ్‌ 2019
మౌంట్‌ విన్‌సన్‌ 2019
మౌంట్‌ డెనాలి 2022
ఎవరెస్టు శిఖరంపై జాతీయ పతాకం ఎగురవేసిన పూర్ణ, ఆనంద్

జీవిత విశేషాలు మార్చు

మాలవత్ పూర్ణ నిజామాబాదు జిల్లా, సిరికొండ మండలం, పాఖాల్ గ్రామానికి చెందినవారు. ఎవరెస్టు శిఖరం అధిరోహించేనాటికి ఈమె నిజామాబాదు జిల్లాలోని తాడ్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది. ఈమె తల్లిదండ్రులు లక్ష్మీ, దేవదాస్ లు. వీరు వ్యవసాయ కుటుంబానికి చెందినవారు.

పర్వతారోహకరాలిగా మార్చు

మాలవత్ పూర్ణ ఎస్.ఆనంద్‌కుమార్‌ తో కలసి ఈ సాహసయాత్రను చేపట్టారు. ఆనంద్ కుమార్ ఖమ్మం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన లక్ష్మి, కొండలరావు దంపతుల కుమారుడు. ఆనంద్‌కుమార్(17) అన్నపురెడ్డిపల్లి ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌లో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. స్వచ్ఛందసంస్థ స్వైరోస్, పర్వతారోహణలో శిక్షణ ఇచ్చే ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ సంస్థల అండతో ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు నడుం బిగించారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వివిధ పరీక్షలు నిర్వహించి, వారిలో అర్హులైన ఇద్దరిని స్వైరోస్ సంస్థ ఎంపిక చేసింది. వారికి మెరుగైన శిక్షణ ఇచ్చి 2014 ఏప్రిల్ 4 న ఎవరెస్ట్ శిఖరాధిరోహణ యాత్రను ప్రారంభించింది. వీరిద్దరినీ ట్రాన్సెండ్ అడ్వంచర్స్ సంస్థ నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించిన బీ శేఖర్‌బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.ఎవరెస్ట్, చోయు, షిష పంగ్మా శిఖరాలను నాలుగు నెలల్లో అధిరోహించిన తొలి భారతీయునిగా ఖ్యాతి గడించిన శేఖర్ బాబు నేతృత్వంలో వీరికి శిక్షణ ఇప్పించారు. వీరితో పాటు వివిధ దేశాలకు చెందిన 30 మంది ఈ సాహసయాత్ర చేస్తున్నారు.

కఠోర శ్రమ మార్చు

హైదరాబాద్ కేంద్రంగా సాహస కార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ కంపెనీ ఈ విద్యార్థులు ఎవరెస్ట్ వెళ్లటానికి తగిన ఏర్పాట్లు చేసింది. గత కొద్ది సంవత్సరాలుగా ట్రాన్సెండ్ ఎడ్వెంచర్స్ సంస్థ భువనగిరిలో రాక్ క్లైంబింగ్‌లో విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. ఈ సంవత్సరం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులకు ఓపీ-ఎవరెస్ట్ అంటూ శిక్షణ ఇచ్చింది. నాలుగు దశల్లో ఇచ్చిన ఈ శిక్షణను గత సంవత్సరం నవంబర్‌లో ప్రారంభించారు. 150 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తే వారిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 20 మందిని మౌంట్ రెనాక్ పర్వతం (17 వేల అడుగుల ఎత్తు) అధిరోహించడానికి తీసుకుని వెళ్లారు. అక్కడ వీరిలో మంచి ప్రతిభ కనబరిచిన 9 మందిని లడక్ తీసుకుని వెళ్లారు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి తగిన శారీరక దారుఢ్యం, పట్టుదల కలిగిన పూర్ణ, ఆనంద్‌లను ఎంపిక చేశారు.

ప్రపంచ రికార్డు మార్చు

నేపాల్‌లో 16 సంవత్సరాల బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సష్టించింది. పూర్ణకు 13 ఏళ్ల 11 నెలల వయస్సు ఉంది. ఈ యాత్ర విజయవంతంగా పూర్తయినందున పూర్ణ అతి పిన్న వయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తిగా చరిత్ర సష్టించింది. 52 రోజులపాటు సాగిన వీరి యాత్ర మే 25, 2014 ఉదయం ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకుంది. ఊహించిన సమయంకన్నా ముందే ఎవరెస్టును అధిగమించిన పూర్ణా, ఆనంద్. పట్టరాని ఉద్వేగంతో ముందుగా మూడురంగుల జెండాను ఆ శిఖరంపై పాతారు. ఆ తర్వాత.. ఎస్సీ గురుకులం జెండాను పాతారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, పేదల పక్షపాతి రిటైర్డ్ ఐఏఎస్, దివంగత ఎస్.ఆర్.శంకరన్‌ల చిత్రపటాలను ప్రదర్శించారు. జాతీయగీతం ఆలపించి తమ దేశభక్తిని చాటుకున్నారు.

అధిరోహించిన పర్వతాలు మార్చు

  1. ఎవరెస్టు (ఆసియా)[2]
  2. మౌంట్‌ కిలిమంజారో (ఆఫ్రికా)
  3. మౌంట్‌ ఎల్‌బ్రస్‌ (యూరప్‌)
  4. మౌంట్‌ అకోన్‌కగువా (దక్షిణ అమెరికా)
  5. మౌంట్‌ కార్టెన్జ్‌ (ఓషియానియా)
  6. మౌంట్‌ విన్‌సన్‌ (అంటార్కిటికా)
  7. మౌంట్‌ డెనాలి (ఉత్తర అమెరికా)[3]

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (9 June 2022). "పూర్ణ ది గ్రేట్‌.. 7 ఖండాల్లో 7 శిఖరాల అధిరోహణం". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  2. Andhra Jyothy (26 May 2014). "ఎవరెస్టును జయించారు!". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 29 మే 2014 suggested (help)
  3. TV9 Telugu (9 June 2022). "మలావత్ పూర్ణ ఖాతాలో చేరిన మరో రికార్డ్.. 7 ఖండాల్లోని 7 పర్వతాలు అధిరోహించిన తెలంగాణ బిడ్డ." Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)


బయటి లంకెలు మార్చు