మాల దాసరి
మాల దాసరి అనేది ఎస్.సి. కులము లోని ఒక ఉప కులము.[1] వీరు హరిజనవాడలందు పూజలు, వైదిక కార్యములు చేయుచుంటారు. దాసన్ (సేవకుడు) అన్న మాటనుంచి దాసరి అనేది ఏర్పడింది. వీరికున్న ప్రత్యేకత సంక్రాంతి పండుగ సమయంలో తెలుస్తుంది. నుదుటున నిలువు నామాలు, నెత్తిన కలశం, చేతిలో చిడతలతో వీధుల్లోకి వచ్చి దేవుని కీర్తనలు పాడుతూ గ్రామాలలో తిరుగుతూ భజన చేస్తారు దాసరివారు. ప్రేమతో ఎవరేదిచ్చినా ఆనందంగా స్వీకరిస్తారు. ప్రతి ఇంటికీ వెళ్ళి వారి కుటుంబ పూర్వీకులను గురించి వారు చేసిన మంచి పనుల గురించి తంబూర, చిడతలసహాయంతో వీరు చేసే గానం సంక్రాంతికే వన్నె తెస్తుంది.
దాసరులు రకాలు
మార్చుదాసరుల్లో ఆరు ఉపకులాలు ఉన్నాయి. వారు బలిజ దాసరి, జానప్ప దాసరి, పల్లి దాసరి, వల్లువ దాసరి, గంగెద్దుల దాసరి, గొల్ల దాసరి. అయితే వీరు కలిసి భోంచేయడం కాని, వివాహ సంబంధాలు కలుపుకోవటం కానీ చేయరు. వారికి పెద్దగా సాంఘిక కట్టుబాట్లు అంటూ ఉండేవి కావు.[2]
- బుక్క దాసరి : బుక్కదాసరి అనగా చిన్న అద్దాలు, గులాలు, కుంకుమ, దశనపొడి (కాల్చిన పొగాకుతో తయారైన పళ్ళపొడి) అమ్మేవారు.
- దండె దాసరి : మోటలకు తాళ్ళు నేసేవాళ్ళు (పేనేవారు, అల్లేవారు)
- బుట్టదాసరి : బుట్టదాసరి అనగా ఈతనారతో, ఈత ఆకులతో తాటి కమ్మలతో చాపలు, బుట్టలు అల్లుచు జీవించేవారు.
- గంటె దాసరి : దీపంలో ఆముదంపోసి వెలిగించి, ఆ వెలుగులో భాగవతాన్ని ప్రదర్శించేవారు, వీరు ఎక్కువగా మెదక్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో ఉంటారు.
- మాల దాసరి : మాల కులస్థుల అయ్యవార్లు (పెళ్ళిళ్ళ పంతుళ్ళు), మాలకులంలో వివాహాది శుభకార్యములు నిర్వహించే కులపెద్దలు వీరే.
- బోడదాసరి : అయ్యరోళ్ళు (హరికథలు) చెప్పేవారు.
- హరిదాసులు : సంక్రాంతిరోజుల్లో భిక్షాటన చేసేవారు, వీరు ఎక్కువగా ఆంధ్రప్రాంతంలో కనబడతారు.
- హౌళియదాసరి : హౌళి పట్టి భిక్షాటన చేసేవారిని హౌళియదాసరులు అంటారు.
దాసరిగా మారినప్పుడు
మార్చుదాసరి కులం ప్రధానంగా భిక్షాటన వృత్తిగా కలిగిన కులం. వీరు వైష్ణవులు. నిజానికి వీరు అనేక కులాల సంగమం అని చెప్పవచ్చు. శూద్ర కులాలవారిలో కొందరు తమ పిల్లలను దేవునికి వదిలివేయడం వల్ల ఏర్పడిన కులం ఇది. అయితే శూద్రులలో తక్కువ కులాలుగా భావించబడేవారి కుటుంబాలకు చెందిన పిల్లలకు తిరుపతి దేవస్థానం వంటి దేవాలయాల్లో ఉండే గురువులు దాసరిగా ముద్రవేసి వారికి కొన్ని నియమ నిబంధనలు విధించడంతో ఈ కులం ఆవిర్భవించిందంటారు. వైష్ణవ గురువులు శూద్ర కులాల వారిని దాసరులుగా మార్చే క్రమంలో ముద్రలు వేయడానికి కూడా దాసరులనే ఉపయోగించుకునేవారు. దాసరిగా ముద్ర వేయవలసి వచ్చినప్పుడు శంఖం, చక్రం ఉన్న లోహపు పరికరాన్ని ఎర్రగా కాల్చి దాన్ని దాసరులకు అందచేస్తే వారు దాసరిగా మారే తక్కువ కులాలవారికి ఆ ముద్రలు వేసేవారు. వివాహాల సందంర్భంలోను, సాంఘిక సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించుకోవడానికి, ఇతర సమావేశాల కోసం దాసరులు తిరుపతి, తిరుత్తని, తిరువల్లూరు వంటి పుణ్యక్షత్రాల్లో ఒకచోటికి చేరేవారు.
చారిత్రక ప్రస్థావనలు
మార్చు- గుణాడ్యుని బృహత్కథ'ను పరిశీలించినచో ఈ విషయం తేటతెల్లమగును. 'బృహత్కథ'లో 'మాల కుమారుని కథ', మాల కుమారి' కథ వుంది
- కాశీఖండము సప్తమాశ్వాసమున.
సీ. ప్రార్దింప నున్నాడు పాదాగ్రముల వ్రాలి
వెలివాడవాడు తద్విప్రకులుని...
ఇత్యాది పద్యమున.
దీవింప నున్నాడు తెలిసి దోహరిబంటు
జెవి నక్షత్రమాలిక జెరివి ద్విజుడు (7-240)
అన్నచోట 'దోహరి బంటు ' ఉన్నాడ్. ఈతడిక్కడ మఱియు చండాలుడు - మాల - వెలివాడవాడు అనియు జెప్పబడినాడు.
- కూచిమంచి తిమ్మకవి పార్వతీ వల్లభ శతకం, కుక్కుటేశ్వర శతకంలో ప్రస్తావించిన కొన్ని కులాలు :
అబ్బబ్బ కిందటే డప్పయ్య తీర్తాన
జోలె జంగమ కిస్తి సోలెడప్పు
సాతాని జియ్యరు సతికితే పోయిస్తి
కొల్లగా గుల్లెడు సల్ల బొట్టు
లంక సత్తెల వాడు పొంకాన పొగిడితే
మాలదాసరి కిస్తి మానెదూడ
లేదాలు వాగితే యెల్లుబొట్టయ్యకు
కొలకుండ దోసెడు కొర్రలిస్తి
దాసరి ఉమ్మిన ప్రసాదం
మార్చుకోయంబత్తూరు జిల్లాలోని కారమడాయి దేవాలయంలో ప్రతి ఏడాది జరిగే ఉత్సవాలకు శూద్రకులాలవారు (మరీ తక్కువ కులాలుగా భావించబడినవారు) అధిక సంఖ్యలో హాజరై తమ కోరికలు తీరినందుకు దాసరులకు 'కవళం' వేసేవారు. ఈ కవళాన్ని అనేక పండ్ల ముక్కలు, పంచదార, బెల్లం, అటుకులు వంటి మిశ్రమంతో తయారుచేసేవారు. ఈ దేవాలయానికి అనుసంధానించబడిన దాసరులు మొల చుట్టూ చిన్న చిన్న గంటలు వేలాడదీసుకొని డ్రమ్స్ మోగిస్తూ ముందుకు కదులుతారు. ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చిన భక్తులు వారినోట్లో కొద్దిగా కవళం పెడతారు. దాసరి తన నోట్లో పెట్టిన కవళాన్ని కొద్దిగా తిని, మిగిలినదాన్ని భక్తుల దోసిళ్లలో ఊసేవారు. అలా దాసరి తమ చేతిలో ఊసిన కవళాన్ని భక్తులు మహా ప్రసాదంగా భావించి తినేవారు. ఈ ప్రసాదం తింటే తమకు ఉన్న జబ్బులు నయమవుతాయని, పిల్లలు కలుగుతారని భక్తులు విశ్వసించేవారు. కొందరు కవళం బదులుగా తమలపాకుల్ని దాసరి నోట్లో పెడితే అతడు వాటిని నమిలి భక్తుల నోళ్లలో ఊసేవాడు.
శంఖుదాసర్లు
మార్చువిశాఖపట్టణం ప్రాంతంలో ఉండే దాసరులను శంఖుదాసర్లు అని పిలిచేవారు. అయితే వీరు తిరిగి అనేక విభాగాలుగా జీవించారు. వీరు మేనమామ కూతుర్ని పెండ్లిచేసుకోవడం తప్పనిసరి. వితంతు వివాహాలకు అనుమతి ఉంది కాని విడాకులు తీసుకోవడానికి వీల్లేదు. చనిపోయిన తరువాత దహనం చేయడం, పెద్ద దినం, చిన్నదినం చేయడం వీరిలో ఉంది. అయితే ఆర్కాట్, అనంతపురం దాసరుల దగ్గరున్నట్లు వీరిదగ్గర రాగి భిక్షాపాత్ర, శంఖం, హనుమాన్ల బొమ్మ, దీపపు కుంచె వంటివి ఉండవు. విశాఖపట్టణ దాసర్లు అనేక చారిత్రక సంఘటనలు, స్త్రీపురుషులకు చెందిన కథలను జానపద గేయాల రూపంలో గానం చేయడంలో ఎంతో పేరుగాంచారు.
దాసరుల జీవన విధానం
మార్చుగొప్ప కళారూపా లను ప్రదర్శించే ఈ దాసరి కళాకారులు ఆనాడు తమ కళకోసం మగవారు సిగలను పెంచుకునేవారు ఎందుకంటే బాగోతంలోని స్త్రీ, పురుష పాత్రలను రెండూ వీరే పోషించేవారు కనుక స్త్రీ పాత్రల కోసం జుట్టఉ పెంచేవారు. అయితే నేడు ఈ కళారూపానికి ఆదరణ కరువై వారు తమ సిగలను పెంచడం లేదు. సాధారణంగా దాసరులు తప్పాయి వంటి వాయిద్యాన్ని వాయిస్తూ పాటలు, మంత్రాలు వల్లెవేస్తూ భిక్షాటన చేసేవారు. కొంతమంది శూద్ర కులాలవారి కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే శవం ముందు దాసరివారు శంఖం ఊదుతూ, పాటలు పాడ్నిందుకు కొంత డబ్బులు ఇచ్చేవారు. అప్పట్లో కాలినడకనే తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారు యాత్రికులు. అటువంటి యాత్రికుల గుంపు ముందు దాసరులు నడుస్తూ భగవంతుని కీర్తించే పాటలు పాడుతూ ఉండేవారు. దారి పొడవునా యాత్రికుల బృందంలో భక్తి భావం రగిలించేందుకు ఇట్లా వీరి సేవలను ఉపయోగించుకునేవారు. ఈ దాసరుల్లో కొందరు ఎరుదండులుగా పేరు పొందారు. దేవునికి కొన్ని కోడె గిత్తలను వదిలేవారు రైతులు. వాటి ఆలనా పాలనా చూసి వాటికి రకరకాల విన్యాసాలు నేర్పి ఆడమన్నట్లు ఆడేలా తయారుచేసి ప్రదర్శనలు ఇవ్వడం ఎరుదండుల పని.
దాసరి బాగోతం
మార్చుతెలంగాణలో యక్షగానాన్ని భాగవతం, బాగోతం అని కూడా పిలుస్తారు. ఈ బోగాతాన్ని ఆడేవారిని భగవతులు, బాగోతులు అంటారు. దాసరోళ్ళ బాగోతం సంగీత, సాహిత్య, నృత్య అభినయాలతో కూడిన సమాహార కళారూపం, వీధుల్లో బాగోతం ఆడడం వలన వీధి బాగోతం అనే పేరు వచ్చింది. జానపదులు దాసరిబాగోతాన్ని ఒకప్పుడు అన్ని కులాల వారు ఆదరించేవారు. దాసరి బాగోతం ఆడుతున్నారంటే ఆ గ్రామంలోని ప్రజలు ప్రదర్శన తిలకించడానికి ముందుగానే వెళ్ళి అక్కడ స్థలాన్ని ఆపుకునేవారు. దాసరివాళ్ళు ఆడుతున్నారంటే ఆ ఊరిలో అందరికి ఆనందమేనట. దాసరోళ్ళు ఆడే బాగోతాలు. అల్లీరాణి, హరిచంద్ర, లవకుశ, కీచకవధ, దేవయాని వంటివాటిని రాత్రంతా ప్రజలు కుటుంబ సమేతంగా చూసేవారట, పాత్రలతో పాటు ప్రజలు లీనమై చూసేవారట. ప్రహ్లాదలో నరసింహస్వామి వేషం రాగానే కొబ్బరికాయలు కొట్టేెవారట కొందరు. కోళ్ళు మేకలు కోసేవారట, నిజంగానే నరసింహస్వామి వచ్చినట్టుగా దాసరివాళ్ళు అభినయించేవారట. దాసరి కళాకారులు వేసవి కాలంలో తమ సొంత గ్రామాలకు చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలను వంతులుగా చేసుకొని గ్రామాలకు వెళ్ళి బాగోతం ఆడేవారట. దీనినే ఊరి మీది ఆట అంటారు. ఈ దాసరి కళాకారులు ఒకరి వంతుకు వచ్చిన ఊరిలో ఇంకొకరు బాగాతాన్ని ఆడేవారు కాదట. అంటే ఒక ఊరు ఒక్క కళాకారునికి మాత్రమే సొంతమన్నమాట. ఊరిమీది ఆట అంటే అందరు కుటుంబ సమేతంగా (ఉచితంగా) తిలకించేది అనివారు చెపుతున్నారు. ఈ దాసరి కళాకారులు ఎక్కువగా నిరక్షరాష్యులు, కాని జ్ఞాపకశక్తి మాత్రం ఎక్కువగా ఉంటుంది. వీరి బాగోతం మొదట అంబ కీర్తనతో ప్రారంభం అవుతుంది. అంబ బ్రోవుమా, జగదాంబ గావుమా అనే అంబ కీర్తనతో బాగోతం మొదలవుతుంది. బుడ్డన్‌ఖాన్ వేషంతో బాగోతం మొదలైన తరువాత రాజు, రాణి అనేక పాత్రలతో బాగోతం రక్తి కట్టిస్తూ మంగళ హారతితో ముగిస్తారు. వీరు తబల, హార్మోనియం, గజ్జెలు, తాళం వంటి వాయిద్యాలను ఉపయోగిస్తారు.
చారిత్రక పాట గానం
మార్చుబొబ్బిలి పాట పేరుతో వారు పాడిన బొబ్బిలి యుద్ధం చరిత్ర ఎంతో పేరు పొందించి. అట్లాగే అమ్మినాయుడు పాట మరొకటి. పాలకొండ తాలూకాలో అమ్మినాయుడనే దుష్టుడయిన గ్రామ పెద్దను అతడి దగ్గరే పనిచేసే ఒక సేవకుడు ఎట్లా చంపేశాడో రికార్డు చేసిన పాట ఇది. ఇటువంటి చారిత్రక సంఘటనలను ఇద్దరు దాసరులు గానం చేస్తారు. ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తూ ఇంటిటికీ తిరుగుతూ పాడతారు. అట్లాగే వారాంతపు సంతల్లోను ఈ పాటలు గానం చేస్తారు. ఒకరు పాడుతూ ఉంటే మరొకరు వంతపాడతారు.
మాతాదాసు లేదా బాణార్ ఆళ్వార్ కథ
మార్చుదివ్యదేశాలలో అగ్రస్థానం పొందిన శ్రీ రంగం కావేరీనదికి ఒక ఒడ్డున ఉండగా మరో ఒడ్డున ఉంటుంది చోళరాజుల ఒకప్పటి రాజధాని, ఒక దివ్యదేశం అయిన ఉరయూరు. ఆ ప్రాంతానికి అన్నదాత కావేరి. అలాంటి సస్యశ్యామల భూమిలో వరికంకుల మధ్య "మాతాదాసు" (మాలదాసరి | బాణర్)[3] అనే అంటరాని కులానికి చెందిన వ్యక్తికి లభించాడు బోసి నవ్వులు చిందించే పసిబాలుడు. సంతతి లేని మాతాదాసు బాలుని మగా పెంచాడు. అప్పట్లో ఈ కులం వారికి ఆలయ ప్రవేశమే కాదు కావేరీ నదిలో స్నానం కూడా నిషేధమే. కాని ఆలయ ఉత్సవాలలో, ఊరేగింపులలో వీరు ఉండవలసిందే. శ్రీ మహావిష్ణువును కీర్తిస్తూ కీర్తనలను పాడటంలో వీరు నేర్పరులు. మానవులు దూరం పెట్టినా మధురమైన గళం ప్రసాదించి దగ్గరకు చేర్చుకున్నాడు పరమాత్మ. తనకు పుష్ప పత్రి అర్చన కంటే గాత్రార్చపైపై తికరమని పెరుమాళ్ ఈ విధంగా తెలియజెప్పాడు. చక్కని స్వరంతో మధురంగా హరికీర్తనలు గానం చేస్తూ నిరంతరం వీణ ధరించి కనపడటం వలన తిరుప్పానన్ అని పిలిచేవారు. ప్రతిరోజు ఉషోదయానికి ముందే కావేరి ఒడ్డున నిలిశ్రీ రంగ విమానం వైచూ సుశ్రీ రంగనాథుని కీర్తిస్తూ, తనకెప్పటికైనా ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించే భాగ్యం ఉన్నదా అని బాధపడుతుండేవాడు. కాని అతని సమక్షం ఆలయ పూజారులకు కంటగింపుగా ఉండేది. తమ మడి ఆచారాలు అతని వలన మంటకలుస్తున్నాయన్న వంకతో ఒకనాడు అతని మీద రాళ్ళు విసిరారు. తలపైన గాయం అయి బాధతో పక్కకు తప్పుకున్నాడు తిరుప్పానన్. పూజారులు ఆలయానికి చేరుకుచూ డగా తిరుప్పానన్ కి ఎక్కడైతే గాయం అయిందో అక్కడే మూలవిరాట్టుకు రక్తస్రావం అవుతూ కనిపించింది. నిర్ఘాంతపోయారు వారు. నాటి రాత్రీ రంగనాథుడు ఆలయ ప్రధాన పూజారి సారంగనాథునికి స్వప్నంలో కనిపించి తనకు రక్తం కారడానికి కారణం తెలిపి తిరుప్పానన్ ని తన సమక్షానికి తీసుకొని రమ్మన్నాడు. పరంధాముని ఆనతి మేరకు వెళ్ళిన సారంగనాథుడు ఎంత బ్రతిమాలినా భయంతో రానన్న తిరుప్పాననను బలవంతంగా తన భుజాల మీద కూర్చోబెట్టుకుని గర్భాలయం చేరుకున్నాడు. ఎంతో కాలంగా ఎదురుస్తున్న క్షణం రావడం కనులముందు ఆరాధ్య దైవ రూపం. ఆనందాన్ని అణచుకోలేని తిరుప్పానన్ స్వామిని కీర్తిస్తూ పది పాశురాలను గానం చేసి సశరీరంగా శ్రీ రంగనాథునిలో ఐక్యం అయ్యాడు. ధన్యజీవి తిరుప్పానన్ ఆళ్వార్. ఈయన గానం చేసిన పది పాశురాల సంకలనాన్ని శ్రీ అమలానంద పిరన్" అంటారు.
ఆముక్త మాల్యదలో మాలదాసరి కథ
మార్చుగోదాదేవీ రంగనాథుల పరిణయ కథే ఆముక్తమాల్యద. విశిష్టాద్వైత మతానికి చెందిన ఈ చిన్న కథను ఆధారంగా చేసుకొని, నాటి సమాజాన్ని నిశిత దృష్టితో పరిశీలించి ప్రబంధాన్ని ప్రౌఢంగా తీర్చిదిద్దాడు శ్రీకృష్ణదేవరాయలు. అందులో నాటి కులవ్యవస్థను ఎలా చిత్రించాడో చూద్దాం. నాటి వర్ణ వ్యవస్థలోని అన్ని కులాల జీవన స్థితులనూ చిత్రించాడు.[4] [5]
“ | ఉ. అంచు నతండు వల్క దరహాసత జెక్కిళి గొట్టి లెస్స పం డించితి వోయి దాసరి వనిం దెరువాటులు గొట్టి కొట్టి మే |
” |
—ఆముక్త మాల్యద |
మాల దాసరికథలో కథానాయకుడు ఎలా ఉన్నాడో చూద్దాం. ‘‘చమురైన తోల్కుబుసంబు టెంకియును నిత్తడి శంఖ చక్ర కుండలము లమర/ దివెదారి కొమ్ముదోల్తి త్తియు జోడమ్ము మెడమీది మొగులాకు గొడుగు దనర/ మత్పాదరక్షయు మావు పెన్వెఱక గుట్టిన యోటి తిపిరి దండెయును మెరయ/ జిటితాళములు సంక పుటిక నొక్కొకమాటు గతిరయంబున దాకి కలసి మొరయ/ వలుద వనమాలకంటెయు మలిన తనువు/ బట్టె తిరుమన్ను బెదరు గెంపుట్టు జూపు/ బసుపు బొడి తోలు వల్వంబు నెసక మెసగ/ వచ్చు సేవింప సూరియాళు వైష్ణవుండు!’’- దళితుల జీవనంలో జంతుమాసం, తోలు పనిముట్లు ప్రధానభూమిక వహిస్తాయని రాయలు వర్ణించిన మాలదాసరి ఆహార్యాన్ని బట్టి తెలుసుకోవచ్చు. అతని చొక్కా, సంచి, టోపీ మూడూ తోలువే. పసుపు పొడితో నిండిన సంచి కూడా తోలుదే. ఇవన్నీ చమురు అంటినట్టు జిడ్డుగా వున్నాయట. కాకపోతే మాలదాసరి విష్ణు భక్తుడు గనుక చెవులకు ఇత్తడి శంఖచక్రాలు, కుండలాలు, విష్ణుమూర్తి పాదుక, మెడలో తులసిపూసల హారం, పట్టె వర్ధనాలు కలిగి ఉన్నాడు. గాయకుడు గనుక గుర్రపు వెంట్రుకతో కుట్టిన చిన్న కిన్నెర, తాను నడుస్తున్నప్పుడు చంకలోనున్న బుట్టకు తగిలి శబ్దించుచున్న చిన్నతాళాలు తగిలించుకొన్నాడు.[6] వేకువ ప్రయాణం కాబట్టి దారి చూడడానికి దీపస్తంభం, క్రూర మృగాల నుంచి రక్షణకు చేతిలో ఒక బాణం, ఎండ వానల నుంచి రక్షణకు మొగలిరేకు గొడుగు ధరించాడు. సమాజంలో ఎవరివల్ల ఏమి మాట పడవలసి వస్తుందోనన్న బెంగతో కూడిన ఎరుపు తేరుచున్న బెదరుచూపులతో మలిన దేహుడైన దాసరి విష్ణుమూర్తిని స్తుతిస్తూ మంగళకైశికిని గానం చేయడానికి ప్రతిరోజూ దేవాలయానికి వెళుతున్నాడు. ఇత్తడి శంఖ చక్రాలు, కుండలాలు, మలినదేహం అతని పేదరికానికి, సమాజంలో గల నిమ్నత్వానికి సూచికలుగా వర్ణించాడు. రాయలు ఈ పద్యంలో దళితుడు వైష్ణవుడు అయిన దాసరిని ‘సూరియాళు వైష్ణవుడు’ అనే పదబంధంలో ఇమిడ్చి చెప్పాడు. గర్భాలయం కడిగిన నీరు లోపలి రాతి తొట్టె నిండి, కాలువ ద్వారా బైటికి ప్రవహించగా, ఆ నీటిని ఒక శూద్రుడు పోయగా దాసరి తాగేవాడు. ఉత్తమ కులాలవారిని చూచినంతనే దూరంగా తొలగి పోయేవాడు. ఎండలో గాలిలో ప్రసాదం పంపిణీ జరిగినంతసేపూ ఉండి, అతని మంచిగుణం తెలుసుకొన్న శూద్రుడు ప్రసాదాన్ని ఇవ్వగా దాన్ని తన కిన్నెర దండెపై నుండి పుచ్చుకొనేవాడు. అతడు ఇచ్చిన నీటిని త్రాగేవాడు. గుడి వెలుపలే నిల్చుండి ప్రదక్షిణ చేసి ఇంటికి పోయేవాడు.[7] ‘‘అహరహంబు నమ్మహాత్ముండు’’ అని శ్రీహరిచేత మాలదాసరిని మహాత్ముడుగా చెప్పించిన వెంటనే ‘‘జాత్యుచిత చరిత్రమ మ/ త్ర్పీత్యర్థం బూది, తనదు హృదయము శుచితా/ నిత్యంబుగ దత్తను సాం/ గత్యము మసిపాత మానికంబై యొదుగున్.’’ అని విష్ణుని చేత చెప్పించాడు. విష్ణుని ప్రీతికొరకు మాలదాసరి తన జాతికి ఉచితమైన జీవనాన్ని అవలంబించాడని రాసినా అది రాయలకే ఇష్టమని చెప్పవచ్చు. మనస్సు శుచి, మాలదేహము కలిగి దాసరి మసిపాతలోని మాణిక్యంలా ఉన్నాడట. అయితే మూల ఆముక్త మాల్యదలో మాలదాసరి అనిలేదని తెలుగు అనువాదంలో దాసరిని మాలదాసరిగా మార్చారని ఎండ్లూరి సుధాకర్ గారి అభిప్రాయం అంటూ పులికొండ సుబ్బాచారి గారు చెప్తున్నారు. [8]
తిరుమల లో మాలదాసరి విగ్రహం
మార్చుపూర్వం అలిపిరిని అడిపుళీ అని పిలిచేవారు. అడి అంటే పాదం పుళ అంటే చింత చెట్టు. పూర్వం పెద్ద చింత చెట్టు వున్నందున ఇది అలిపిరిగా పిలువబడింది. ఈచెట్టు క్రిందే తిరుమల నంబి రామానుజునికి రామాయణ రహస్యాలను ఉపదేశించాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. అలిపిరి నుంచి మెట్లదారిలో బయలు దేరగానే మొదట్లోనే మాలదాసరి విగ్రహం సాష్టాంగ నమస్కారంతో కన్పిస్తుంది[9] కొన్ని వందల ఏళ్లక్రితం హరిదాసుడైన ఓ మాల దాసరి శ్రీవారిని దర్శించుకోవటానికికని తిరుమలకు బయలుదేరాడు.అలిపిరికి చేరినతరువాత అక్కడ తొలి మెట్టు ఎక్కబోతూవుండగా శ్రీవారికి సాష్టాంగనమస్కారం చేసాడు.అప్పుడు ఆ మాల దాసరి శిలగా మారిపోయాడుఅని అంటారు[10]
ఒక కథ
మార్చుమిత్తిలి వారు మాలలకు ఎట్లా ఆశ్రితులుగా, పూజారులుగా అయ్యారనడానికి మౌఖికంగా ప్రచారంలో ఉండే ఒక కథను చెపుతారు. జమ్మికుంట మండలం వావిలాల గ్రామానికి చెందిన మధుర కవి రాములు, కృష్ణ చెప్పిన కథనం ప్రకారం పూర్వం ఒక ఊరిలో చెరువు కింద ఆ ఊరి పటేలుకు సంబంధించిన వరి చేను ఉంటేది. ఆ చెరువుకు మాల కులస్థుడైన వ్యక్తి నీరడిగా ఉంటాడు. పటేలు వరిచేను పొట్టకు వచ్చి చేనంతా ఈనుతూ ఉంటుంది. అయితే ఆ చేనులో ఒక వరిగంట మాత్రం ఈనకుంట అట్లాగే ఉంటుంది. ఈ విషయం గమనించిన నీరడిగాడు పటేలుకు చెప్పగా, అతను కొంతమంది ఆ సాములతో వచ్చి చేనులోని గంటను చూసి ఆశ్చర్యపోతాడు. మరుసటి రోజు వరకు వేచి చూద్దామని అక్కడి నుండి వెళ్తాడు. మరుసటి రోజు కూడా ఆ వరిగంట (కర్ర) ఈనకుండా, పైగా అన్ని వరి గంటల కంటే పెద్దగా మారుతుంది. ఈ నీరడిగాడు ఆత్రుతతో అందులో ఏమైనా ఉంటుందా అని, దాన్ని చీల్చగా అందులో నుండి తలపై సర్వ, నుదిటిన పట్టినామాలు, చేతిలో తాంబుర, చిరతలు పట్టుకొని హరినామస్మరణ చేసుకుంటూ ఎంగిలి పిండం బయటపడుతుంది.
అతను ఆశ్చర్యపోయి ఆ బాలున్ని ఎత్తుకొని పటేలు దగ్గరికి వెళ్లగా, ఆ పటేలు బిత్తరపోయి ఏమి చేయాలో తోచక ఊరి గుడి దగ్గర పూజలు జరుగుతున్నాయని, అక్కడ శాతానులు, బ్రాహ్మణులు, పెద్దలున్నారని అక్కడికి తీసుకెళ్లమంటాడు. బాలున్ని భుజంపై ఎత్తుకొని గుడి దగ్గరికి వెళ్లి, అక్కడి వారందరితో జరిగిన విషయాన్ని చెప్పి బాలున్ని తీసుకోండని కోరుతాడు. వారంతా నువ్వు మాల కులానికి చెందిన వాడివని, నువ్వు ముట్టుకున్నవాడు మాకు ఎందుకని పరిహాసం చేసి పంపిస్తారు. నీరడు అవమానంతో బాలుణ్ణి ఎత్తుకొని గుడి వెనుక భాగంలో నిలబెట్టి పూజించగా, గుడి ముఖ ద్వారం బాలుని వైపు తిరుగుతుంది. అంతేకాకుండా గుడిలోని విగ్రహం కూడా బాలుని వైపు తిరుగగా, అక్కడి వారంతా ఆశ్చర్యపోయి బాలుని వద్దకు చేరుకొని “అయ్యామీరు ఎవరో తెలియకుండా తప్పు చేశాం, క్షమించమని బాలుని రూపంలో ఉన్న హరిహరుడిని వేడుకుంటారు. అప్పుడు హరి నీరడి వైపు తిరిగి ‘నన్ను ఆదరించిన నువ్వు శాస్త్ర విద్యలు నేర్చి మాల కులానికి పురోహితుడుగా ఉంటూ , వారికి కథలు చెప్పుతూ జీవించ’మని వరం ప్రసాదిస్తాడు. ఆ తర్వాత “నన్ను అవమానించిన ఈ భూమి మీద నేనుండలేనని , భూమాతను తీసుకెళ్ల’ మని కోరగా భూమి పగులుతుంది. ఆ బాలుడు తలకిందులుగా భూమిలోకి వెళుతుండగా, “అయ్యో స్వామివారు వెళుతున్నారని చెప్పి, ఆయన పాదాలైనా భూమి మీద ఉండాలని పాదాల వరకు కోస్తారు. అప్పుడే ఆకాశవాణి ఆయన పాదాలు తిరుపతి, శ్రీరంగంలోనే కాకుండా ఎక్కడ హరి ఉంటాడో అక్కడ ఆయన పాదాలుంటాయని, ప్రతిగుడిలో శఠగోపంగా కూడా ఆయన పాదాలే ఉంటాయని పలుకుతుంది.
ఆ తర్వాత బ్రాహ్మణులు నీరడితో నిత్య పూజలు చేస్తున్న మాకు హరి సాక్షాత్కారం కాలేదని, నువ్వు స్వచ్ఛమైన హరిభక్తుడవని, ఆ హరినే ఎత్తుకునే భాగ్యాన్ని పొందావని, నిన్ను అవమానించినందుకు క్షమించమని కోరుకుంటారు.[11]
కన్నమ దాసు
మార్చు1100 శతాబ్దం లో మాచర్ల సేన లకు సర్వ సైనాని గా భాద్యత నిర్వర్తించి, బ్రహ్మనాయుడికి నమ్మిన బంటు గా కడవరకు నిలిచి చరిత్ర లో, పల్నాటి ప్రజల గుండెల్లో నేటికి నిలిచిన మహా వీరుడు కన్నమదాసు. కన్నమదాసు తండ్రి తెప్పల నాయన్న,తల్లి పెమ్మసాని.బ్రహ్మనాయుడు దళితులకు ఆశ్రయం కల్పించి దేవాలయాల ప్రవేశం గావించాడు. చాపకూటితో సహపంక్తి భోజనాలను ఏర్పాటుచేశాడు. మాల కన్నమదాసును దత్తత పొంది మాచర్ల రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా చేసి అశేష జన నీరాజనాలను అందుకున్నాడు.అందుకే కన్నమ దాసు బ్రహ్మనాయుడిని తండ్రిగా కొన్ని చోట్ల సంబోధిస్తాడు. చిన్నప్పటి నుండే కన్నమదాసు కు పట్టుదల,వీరత్వం,భయపడని గుణం తల్లి,తండ్రులు నేర్పారని చెపుతారు. పల్నాటి చరిత్ర మనకు మొదటి గా తెలిపిన శ్రీనాధ కవింసార్వభౌమ(ఆయన కాలం 1365-1441) తన పల్నాటి వీరచరిత్ర గ్రంధం లో కన్నమ దాసు అరివీర భయంకరుడుని,మహా వీరుడని తెలిపారు. ఆ రోజుల్లో కన్నమదాసు ను కన్నమనీడు,రాజామాల కన్నమ దాసు అని,గోసంఘి కన్నమ అని మూడు పేర్ల తో ప్రజలు పిలిచేవారటని తెలిపారు.1170 సంవత్సర ప్రాంతం లో కారంపూడి లో జరిగిన పల్నాటి యుద్దం,పల్నాటి వీరుల వీరత్వం గురించి వారి తదనంతరం మహాదేవి చర్ల(మాచర్ల),గురజాల,కారంపూడి ప్రజలు బుర్రకధల రూపం లోకధల రూపం లో చెప్పుకోవటం చూసి అప్పట్లో 15 వ శతాబ్దం లో పల్నాటి ప్రాంతం పక్కనే కొండవీడు రెడ్డి రాజుల వద్దా ఆస్తాన కవి గా ఉన్న శ్రీనాధుడు ఉత్తేజితుడై పల్నాడు లో పలు ప్రాంతాలు తిరిగి పల్నాటి చరిత్ర గురించి పరిశోధనలు చేసి పల్నాటి వీరచరిత్రగ్రంధం రచించారు. కన్నమదాసు కదన రంగంలో కి వస్తే శత్రు సైన్యం లక్షమంది ఉన్న చెమటలు పట్టేవట, యుద్దరంగాన ఆయన గుర్రం పరుగెత్తే గిట్టల శబ్దం కూడా శత్రువులను భయకంపింతులను చేసేది,దేవుడా ఆ మహావీరుడు మా వైపుకాక మరో వైపు వెల్లేలా చూడు అని కోరుకునేవారట. ఈయన కత్తి తో చేసే వీరవిహారం చూసే శత్రు రాజులు ఈయనకు ఎదురు కాకుండా తప్పించుకునెడివారట.పల్నాటి యుద్దంలో గొప్ప వీరులు బాలచంద్రుడు లాంటి మహావీరులు మరణించినను, కన్నమదాసు సైన్యాన్ని నడిపించి బ్రహ్మన్న గారి సహకారంతో నాగమ్మ ను ఓడించి మాచర్ల కు విజయాన్ని చేకూర్చాడు. కన్నమ దాసు రాజాజ్ఞ ను పాటించటం లో గొప్ప విధేయుడని,అత్యంత సమయస్పూర్తి గలవాడని అనేక క్లిష్ట సమయాల్లో చతురత తో వ్యవహరించి మాచర్ల పాలకులను కాపాడారని ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు రాసిన పల్నాటి వీరచరిత్ర పుస్తకం లో కన్నమదాసు ను వర్ణించారు. కన్నమ దాసు వాడిన ఆయుధాలు ఇతర ఏ వీరులు వాడలేదని ఆయన చేతిలో భయంకర ఖడ్గం ఉండేదని,దాని బరువు అధికమని ఆయనను దగ్గర నుండి చూస్తేనే శత్రువుల కు పై ప్రాణాలు,పైనే పోయేవని అంతటి గొప్ప వీరుడు పల్నాడు ప్రాంతం లో పుట్టటం ఒక చరిత్ర సృష్టించటం,ప్రజలు ఆయనను ఇప్పటికి గుర్తుంచుకోవటం గొప్ప విషయమని పల్నాటి చరిత్ర పై పరిశోధన చేసి ఎధిక్ ఆఫ్ పల్నాడు అనే పరిశోధన గ్రందాన్ని రచించిన రోగోర్ అనే విదేశీ చరిత్ర కారుడు తెలిపారు.అలాగే బ్రహ్మన్న కు శత్రువుల నుండి కలిగే ముప్పును కూడా అనుక్షణం గమనిస్తూ కంటికి రెప్పలా కాపాడే వాడని,కన్నమ దాసు పక్కన ఉండగా బ్రహ్మనాయుడు ని ఎవరు ఏమి చేయలేరనే నానుడి అప్పట్లో ఉండేదని తెలిపాడు.
మరింత సమాచారం కోసం
మార్చుమాలదాసరిపై సమగ్రంగా తెలియదలచినవారు హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఆచార్య ఆర్ వి. ఆర్ కృష్ణశాస్త్రి పర్యవేక్షణలో డా.కొంకే గౌరీశ్వరరావు /మాలదాసరుల జీవన విధానం..సాహిత్య సాంస్కృతిక అధ్యయనం/అనే సిద్ధాంత గ్రంథం సమర్పించారు. విశ్వవిద్యాలయ గ్రంధాలయంలో అందుబాటులో ఉంది.
ఇవికూడా చూడండి
మార్చు- మాల (కులం) - ఒక దళిత కులం.
- మాల జంగాలు : మన బుర్ర కథలనే ప్రత్యేక ఫక్కీలో చెపుతారు.
- మాల సింగారం - విశాఖపట్నం జిల్లా, అరకులోయ మండలానికి చెందిన గ్రామం.
- మాల గురిజాల - ఆదిలాబాదు జిల్లా, బెల్లంపల్లి మండలానికి చెందిన గ్రామం.
- మాలపిల్ల : ఉన్నవ లక్ష్మీనారాయణ నవల.
- దళితా నవలా సాహిత్యంలో వెలుగుచూసిన తొలి నవల తల్లాప్రగడ సూర్య నారాయణ రాసిన ‘‘హేలావతి’’ (1913)
మూలాలు
మార్చు- ↑ "దాసర్లు వైష్ణవం హోల్‌టైమర్స్ | జాతర | www.NavaTelangana.com". m.navatelangana.com. Retrieved 1 August 2020.
- ↑ "దాసరి బాగోతం | జాతర | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 24 డిసెంబరు 2019. Retrieved 1 August 2020.
- ↑ "ఆళ్వార్లు". Srivenkatesham. Retrieved 1 August 2020.[permanent dead link]
- ↑ లక్ష్మీకాంతరావు, పులిపాక. "మాలదాసరి కథ (ఆముక్తమాల్యద)". కావ్యమంజరీ. Retrieved 1 August 2020.
- ↑ "ఆముక్త మాల్యదలో వృత్తులూ కులాలు". www.andhrajyothy.com. Retrieved 1 August 2020.[permanent dead link]
- ↑ "KAVITHA TUTORIALS, TIRUVURU: ఆముక్తమాల్యద - కృష్ణదేవరాయల నవ్య రాజనీతి". KAVITHA TUTORIALS, TIRUVURU. 24 August 2010. Retrieved 1 August 2020.
- ↑ పాళీ, కొత్త (11 February 2007). "Classical Telugu Poetry In Translation: ఆముక్త మాల్యద: మాలదాసరి కథ - 3". Classical Telugu Poetry In Translation. Retrieved 1 August 2020.
- ↑ పులికొండ, సుబ్బాచారి. "పరిశోధనా వ్యాసం". Retrieved 1 August 2020.
- ↑ "శ్రీవారిని ఇలా సేవిస్తే సాక్షాత్కరిస్తాడు..." telugu.webdunia.com. Retrieved 1 August 2020.
- ↑ "2200 సంవత్సరాల క్రితం శ్రీవారి తిరుమల రహస్యాలు..!". telugu.nativeplanet.com. 23 November 2017. Retrieved 1 August 2020.
- ↑ "శాస్త్ర విద్యలు తెలిసిన శఠగోప సిద్ధాంతులు మిత్తిలి కళాకారులు". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. 7 April 2019. Archived from the original on 22 సెప్టెంబరు 2021. Retrieved 1 August 2020.