డా. మిరియాల రామకృష్ణ ఒక ప్రముఖ తెలుగు రచయిత, పరిశోధకుడు. వీరు సుమారు 36 సంవత్సరాలు విద్యాశాఖలో తెలుగు భాషా సాహిత్యాలు బోధిస్తున్నారు. వీరు మహాకవి శ్రీశ్రీ రచనల పై పరిశోధన చేశారు. వీరు కథలు కొన్నే రాశారు. వీరి కథలలో ఆకుపచ్చని కుక్కపిల్ల, ఆశ్చర్య చూడామణి, చెరసాలలో సరస్వతి, ఉంగరం వంటివి చెప్పుకోదగినవి. వీరు కథలనే కాక పద్యాలను, వచన కవితలను, గేయాలను, వ్యాసాలను, బాలసాహిత్యాన్ని కూడా విరివిగా వ్రాశారు. సుధాకిరణ్, ఆనందవర్ధన్ వంటి కలంపేర్లతో వీరి రచనలు వెలువడ్డాయి. వీరి రచనలు కళాకేళి, ఆంధ్ర పత్రిక, భారతి, తెలుగు విద్యార్థి, సుభాషిణి, నగారా మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వీరు 1995-96 ప్రాంతంలో గీతాంజలి పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. వీరు హిమబిందు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ అనే సంస్థను స్థాపించి మంచి కథలను గుర్తించి, రచయితలను ప్రోత్సహించడానికి ఆయా కథకులకు అవార్డులిస్తున్నారు.

రచనలుసవరించు

  • దేశం మేలుకుంది (బాలల గేయరూపకాలు)
  • బాలాభిరామం
  • రంగురంగుల రత్నదీపాలు
  • విద్యుద్వీణలు - వెన్నెల తీగలు
  • స్నేహదేహళి
  • సాహిత్య పదకోశం (ముకురాల రామారెడ్డి తో కలిసి) - తెలుగు అకాడమీ ప్రచురణ

తెలుగు భాష గురించిసవరించు

తెలుగు భాషలోని మాధుర్యాన్ని గురించి వివరిస్తూ రామకృష్ణ గారు వ్రాసిన ఆటవెలది పద్యాలు.

సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృత రాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు

ఉగ్గుపాలనుండి ఉయ్యాలలోననుండి
అమ్మ పాట పాడినట్టి భాష
తేనెవంటి మందు వీనులకును విందు
దేశభాషలందు తెలుగులెస్స!

వేనవేల కవుల వెలుగులో రూపొంది
దేశదేశములను వాసిగాంచి
వేయి యేండ్లనుండి విలసిల్లు నా “భాష”
దేశ భాషలందు తెలుగు లెస్స!

మూలాలుసవరించు

  • కథా కిరణాలు : మన తెలుగు కథకులు, పైడిమర్రి రామకృష్ణ, పైడిమర్రి కమ్యూనికేషన్స్, ఖమ్మం, 2002.