ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.

ఆంధ్రపత్రిక
రకంప్రతి దినం దిన పత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
సంపాదకులుకాశీనాథుని నాగేశ్వరరావు పంతులు
స్థాపించినది1908-09-09(వారపత్రిక), 1914-04-01 (దినపత్రిక)
ముద్రణ నిలిపివేసినది1991
కేంద్రంముంబై(వారపత్రిక), చెన్నై(దినపత్రిక)

1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు.

1914 సంవత్సరంలో పత్రికను మద్రాసుకు తరలించారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికగా ఏప్రిల్ 1 వ తేదీన ప్రచురణ ప్రారంభమైంది. తెలుగు పంచాంగం ప్రకారం ఆనంద నామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠి నాడు ఆంధ్రదినపత్రిక జన్మించింది.

నాగేశ్వరరావు తరువాత శివలెంక శంభుప్రసాద్ ఆంధ్రపత్రిక దిన, వార పత్రికలకు, భారతికి సంపాదకులైనారు.అతని కాలంలోనే హైదరాబాదు, విజయవాడ లలో ఆంధ్రపత్రిక ఎడిషన్లు ప్రారంభమయ్యాయి..

2017లో ఆంధ్రపత్రికను రేపల్లె నాగభూషణం అలియాస్‌ పాంచజన్య అనే సీనియర్ జర్నలిస్టు ఆధ్వర్యంలో నడిపించారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత పాంచజన్య మరణించడంతో పత్రిక నిలిచిపోయింది.తరువాత పత్రికా ప్రారంభోత్సవానికి భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరై పత్రికా పున:ప్రస్థానంలో భాగస్వాములయ్యారు.

చారిత్రిక పాత్ర సవరించు

 
కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు

ఆంధ్రపత్రిక బ్రిటీష్ పాలనలో దేశం ఉన్న స్థితిలో తెలుగువారిలో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి ఉపకరించింది. భారత జాతీయోద్యమాన్ని పత్రిక సూత్రప్రాయంగా సమర్థించడమే కాక, తొలినాళ్ళ నుంచీ గాంధేయ వాదానికి మద్దతుగా నిలిచింది. 1936 కాలంలో తెలుగునాట కమ్యూనిస్టులు పల్లెల్లోకి కమ్యూనిస్టు, సోషలిస్టు సాహిత్యం తీసుకువెళ్ళినప్పుడు ముందు ఆ ఊరిలో ఆంధ్రపత్రిక తెప్పించేవారెవరనేది కనుక్కునేవారు. ఆంధ్రపత్రిక తెప్పించేవారు కనీసం రాజకీయ, సాంఘిక విషయాల పట్ల కొంత అవగాహన అయినా కలిగివుంటారన్నది వారి అంచనా.[1]

పుస్తకాలు సవరించు

  • ఆంధ్రపత్రిక చరిత్ర - సివిరాజగోపాలరావు (2004).[2]

మూలాలు సవరించు

  1. మహీధర, రామమోహనరావు. కొల్లాయిగట్టితేనేమి? – నేనెందుకు రాశాను? (వ్యాసం).[permanent dead link]
  2. హిందూ పత్రికలో సమీక్ష (ఆంగ్లం)

బయటిలింకులు సవరించు