తెలుగు అకాడమి
ఉన్నత స్థాయిలో విద్యాబోధన వాహికగానూ, పాలనా భాషగా తెలుగును సుసంపన్నం చేసేందుకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 6, 1968 న తెలుగు అకాడమి [1][2]ని స్థాపించింది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. పి.వి.నరసింహరావు దీని వ్యవస్థాపక అధ్యక్షులు. దాదాపు రెండువేల పుస్తకాలు విడుదల చేసింది. ఏటా అచ్చేసే పాఠ్యపుస్తకాలు దాదాపు 25 లక్షలు. రాష్ట్ర విభజన తర్వాత సంస్థ విభజన సమస్యలతో బలహీనమైంది.

లక్ష్యాలు సవరించు
- ఉన్నత విద్యకు సంబంధించి అన్ని స్థాయిలలో అంటే ఇంటర్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలలో తెలుగుని మాధ్యమంగా ప్రవేశపెట్టటం, తెలుగుని వ్యాప్తి చేయడంలో విశ్వ విద్యాలయాలకు సహకరించడం.
- అధికారభాషగా తెలుగుని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం.
- తెలుగు భాషను ఆధునీకరించి, సుసంపన్నం చేసే కృషిలో భాగంగా ప్రమాణీకరించడం, పరిశోధనలు నిర్వహించండం.
తెలుగులో ఉన్నతవిద్య సవరించు
ఇంటర్ లోని అన్ని గ్రూపులకు తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల పాఠ్యపుస్తకాలు, డిగ్రీ, పిజి స్థాయిలలో తెలుగు మాధ్యమపు పాఠ్యపుస్తకాలను ఈ సంస్థ అందజేస్తుంది. సామాజిక, సామాన్య శాస్త్రాల అనువాదానికి ముఖ్యంగా కావలసిన పారిభాషిక పదకోశాలను, రకరకాల నిఘంటువులను వెలువరించింది.
అధికార భాషా సేవ సవరించు
అధికారభాషా అమలుకు అవసరమయిన పదకోశాలను తయారుచేసింది.
తెలుగు భాష పరిశోధన, ఆధునీకరణ సవరించు
తెలుగులో వెలువడిన సాహిత్య సంగ్రహాలను వెలువరించే దిశగా, 1950 దాకా వెలవడిన సాహిత్యాన్ని రెండు కోశాలలో ముద్రించింది.
నిర్వహణ సవరించు
తెలుగు అకాడమీలో పాలనా సౌలభ్యత కోసం మూడు శాఖలను ఏర్పాటుచేసారు.
పరిశోధనా శాఖ సవరించు
పరిశోధనా శాఖ ప్రధాన కార్యక్రమాలు:
- ఆధునిక తెలుగు భాషకు సమగ్రమైన వర్ణనాత్మక వ్యాకరణం రూపొందించడానికి గాను సామాజిక భాషా పరిశీలన జరపడం.
- ఉపయుక్త గ్రంథ సూచికలు రూపొందించడం.
- వివిధ శాస్త్ర విషయాలలో పరిశోధనలను వివరించే సంహితాలను సంకలనం చేయడం.
- నేటి తెలుగు సాహిత్యంలో వాక్యగత వైవిధ్యాన్ని అధ్యయనం చేయడం.
- గిరిజన పరిశోధనా సంస్థ సహకారంతో గోండి, కోయ తెగల భాషాధ్యయనం చేసి, వాటికి తెలుగు లిపి వాచకాలు తయారు చేయడం.
బోధనా శాఖ సవరించు
దీని ప్రధాన ఉద్దేశాలు
- తెలుగు మాతృభాషకాని వయోజనులకు తెలుగు నేర్పించడం.
- ఒకటి నుండి ఏడవ తరగతి వరకూ విద్యార్థుల శబ్దసంపద పరిశీలన చేసి పట్టికలను తయారు చేయడం.
- ఈ శాఖకు గల ప్రత్యేక ప్రయోగశాలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం.
ప్రచురణల శాఖ సవరించు
ఈ శాఖ యొక్క కార్యక్రమాలు.
- ఇంటర్ మీడియట్, బి.ఏ., బి.కాం., బి.యస్.సి. విద్యార్థుల కోసం తెలుగులో మౌలిక పాఠ్య పుస్తకాలు రాయించి, ప్రచురించడం
- పోస్ట్ గ్రాడ్యుయేట్, వృత్తి విద్య స్థాయిలో పాఠ్య పుస్తకాలు, గ్రంథాలు ప్రచురించడం.
- జనరంజక గ్రంథాలను, పౌరశాస్త్ర విజ్ఞాన వ్యాప్తికై రిఫరెన్స్ గ్రంథాలను అనువదించి ప్రచురించడం
- శాఖ విషయాలలో మోనోగ్రాఫులు రాయించి ప్రచురించడం
- పునరభ్యాస గోష్ఠులను నిర్వహించడం, వైజ్ఞానికోపాన్యాసాలను నిర్వహించడం మొదలగునవి.
- ప్రచురించిన పుస్తకాల వివరాలు (31-09-2007 వరకు)
విభాగం | ప్రచురణల సంఖ్య |
---|---|
ఇంటర్ తెలుగు మాధ్యమము | 22 |
ఇంటర్ ఇంగ్లీషు మాధ్యమము | 22 |
భాషలు | 37 |
వృత్తి విద్యాపుస్తకాలు | 70 |
డిగ్రీ స్థాయి | 115 |
పిజీ స్థాయి | 52 |
డిఇడి | 8 |
బిఇడి | 12 |
జనరంజక గ్రంథాలు, పౌరశాస్త్ర విజ్ఞాన వ్యాప్తికై రిఫరెన్స్ గ్రంథాలు, అనువాదాలు | 202 |
మొత్తం | 540 |
ఇతర వివరాలు సవరించు
- తెలుగు పత్రిక
1973 నుండి "తెలుగు" అనే పేరుతో త్రైమాసిక పత్రికను నడుపుతున్నది. దీనిలో సామాజిక, శాస్త్ర, భాష, సాహిత్యాలపై వ్యాసాలు వుంటాయి.
- నవతరం నిఘంటువులు
నవతరం నిఘంటువులు శీర్షికన రకరకాల నిఘంటువుల నిర్మించింది. ప్రవాస తెలుగువారికి ఉపయోగపడే నిఘంటువులు కూడా ముద్రించింది. ఉదాహరణ:తెలుగు-కన్నడ నిఘంటువు, డా: జి ఉమామహేశ్వరరావు, శ్రేణి సంపాదకులు, 2004
- తెలుగు మాండలికాలు
తెలుగు మాండలికాలు అనే పేరుతో వైఎస్ఆర్ జిల్లా, విశాఖపట్నం జిల్లా, గుంటూరు జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, చిత్తూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, ఆదిలాబాదు జిల్లా, నిజామాబాదు జిల్లా, ఖమ్మం జిల్లా, రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల వారీగా ముద్రించారు.
- పోటీ పరీక్షల పుస్తకాలు
వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సరిపోయేటట్లు పుస్తకాలను ప్రచురించింది.
- విద్యార్థిపురస్కారాలు
2001 నుండి ఇంటర్మీడియెట్ తెలుగు మాధ్యమంలో చదివి రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు పురస్కారాలు అందచేస్తున్నది.
సమస్యలు సవరించు
తెలుగు అకాడమీ పుస్తకాల కాపీహక్కుల ఉల్లంఘనకు గురై, దీని ఆదాయానికి గండిపడుతున్నది. 2010 లో కొన్ని విద్యాసంస్థలు ఇంటర్మీడియట్ పుస్తకాల నకలుహక్కులు ఉల్లంఘించినట్లు వార్తలలో [3] వచ్చింది.
విభజన సవరించు
రాష్ట్ర విభజన తర్వాత, తెలుగు అకాడమీ సంస్థ ఆస్తులు, ఉద్యోగులు విభజన విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కోర్టు మెట్లెక్కాయి. అకాడమీ పనులు కుంటుబడ్డాయి. సుప్రీంకోర్టు ధర్మాసనం అక్టోబరు 28 2021లోగా ఆస్తుల విభజన పూర్తిచేయమని ఇచ్చిన తీర్పు అమలులో భాగంగా జరిగిన తనిఖీలో తెలుగు అకాడమీకి గల 60 కోట్ల బ్యాంక్ నియతకాల డిపాజిట్లు దోపిడికి గురైనట్లు తెలిసింది. [4]
ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ సవరించు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వును తెలుగు భాషాప్రేమికులు వ్యతిరేకించారు [5]
ఇతర తెలుగు అకాడమీలు సవరించు
మూలాలు సవరించు
- ↑ "తెలుగు అకాడమీ". Archived from the original on 2012-03-13. Retrieved 2010-10-04.
- ↑ "తెలుగు వెలుగుల బావుటా", డాక్టర్ గోపరాజు నారాయణరావు, ఆదివారం ఆంధ్రజ్యోతి, 24, ఫిబ్రవరి, 2008, పేజి 10-13
- ↑ హిందూ పత్రికలో తెలుగుఅకాడమీ కాపీహక్కులు ఉల్లంఘన వార్త
- ↑ "Three held for duping Telugu Academy of 60 Crores". New Indian Express. 2021-10-02. Retrieved 2021-12-30.
- ↑ "ఆంధ్రప్రదేశ్: తెలుగు అకాడమీలో సంస్కృతం ఎందుకు? ప్రభుత్వం ఏం చెబుతోంది". బీబీసీ. 2021-07-15. Retrieved 2021-12-30.
- ↑ "ఢిల్లీ తెలుగు అకాడమీ అధికారిక వెబ్ సైటు". Archived from the original on 2020-06-13. Retrieved 2021-07-17.