ముఖ్యమంత్రి అల్పాహార పథకం

తెలంగాణ ప్రభుత్వ పథకం

ముఖ్యమంత్రి అల్పాహార పథకం అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ఈ పథకం రూపొందించబడింది.[1] ఈ పథకం అమలుతో పాఠశాలల్లో అల్పాహారం అందిస్తున్న దేశంలోనే రెండోరాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.[2] 2023, అక్టోబరు 6న ఈ పథకం ప్రారంభించబడింది.[3]

ముఖ్యమంత్రి అల్పాహార పథకం
తెలంగాణ ప్రభుత్వం రాజముద్ర
ప్రాంతంతెలంగాణ
దేశంభారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీవిద్యార్థులు
స్థాపన2023, అక్టోబరు 6
నిర్వాహకులు

ఏర్పాటు

మార్చు

నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతోపాటు వారికి చదువుపట్ల ఏకాగ్రతను పెంచేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు ఈ పథకం రూపొందింది. తమిళనాడులో అమలు అవుతున్న ఈ పథకం విధివిధానాలను పరిశీలించిన రాష్ట్ర ఉన్నతాధికారులు[4] ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదికను సమర్పించారు. అయితే, తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల్లోనే ఈ పథకం అమలు చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి వరకు ఒకేసారి అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

ఈ పథకం ద్వారా 27,147 ప్రభుత్వ పాఠశాలల్లోని దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుందని, ఇందుకోసం ప్రతీ సంవత్సరం దసరా కానుకగా 400 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయనుందని, ఈ పథకం అమలును పర్యవేక్షించే బాధ్యతను జిల్లా స్థాయిలో కలెక్టర్‌కు అప్పగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.[5]

ప్రారంభం

మార్చు

2023, అక్టోబరు 6న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేశారు.

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం, రావిర్యాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్‌రావు ఈ పథకాన్ని ప్రారంభించారు.[6] సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని వెస్ట్‌ మారేడుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 8.30కి రాష్ట్ర ఐటీ, పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు.[7]

అల్పాహార మెనూ

మార్చు

అల్పాహార పథకంలో భాగంగా విద్యార్థినీవిద్యార్థులకు ఈ మెనూ ప్రకారం అల్పాహారాన్ని అందిస్తారు.

  • సోమవారం - ఇడ్లీ సాంబార్‌/గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
  • మంగళవారం - పూరి, ఆలు కుర్మా/టమాటా బాత్‌, చట్నీ
  • బుధవారం - ఉప్మా,సాంబార్‌/కిచిడీ, చట్నీ
  • గురువారం - మిల్లెట్‌ ఇడ్లీ, సాంబార్‌/పొంగల్‌, సాంబార్‌
  • శుక్రవారం - ఉగ్గాని/పోహా/మిల్లెట్‌ ఇడ్లీ, చట్నీ/కిచిడీ, చట్నీ
  • శనివారం - పొంగల్‌, సాంబార్‌/వెజ్‌ పలావ్‌, రైతా/ఆలు కుర్మా

మూలాలు

మార్చు
  1. Desk, HT Telugu. "TS Breakfast Scheme : విద్యార్థులకు దసరా గిఫ్ట్, అక్టోబర్ 24 నుంచి సీఎం అల్పాహార పథకం అమల్లోకి!". Hindustantimes Telugu. Archived from the original on 2023-10-02. Retrieved 2023-10-02.
  2. "After Tamil Nadu, Telangana to launch breakfast scheme for school kids from Oct 24". India Today (in ఇంగ్లీష్). 2023-09-16. Archived from the original on 2023-09-16. Retrieved 2023-10-02.
  3. telugu, NT News (2023-10-06). "CM Breakfast | నేటి నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్‌.. 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం". www.ntnews.com. Archived from the original on 2023-10-06. Retrieved 2023-10-06.
  4. "అల్పాహార పథకం ఎలా అమలువుతోంది?". EENADU. 2023-09-01. Archived from the original on 2023-10-02. Retrieved 2023-10-02.
  5. telugu, NT News (2023-09-26). "Minister Sabitha Indra Reddy | 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం' ఏర్పాట్లు పూర్తి చేయాలి : మంత్రి సబిత". www.ntnews.com. Archived from the original on 2023-09-27. Retrieved 2023-10-02.
  6. telugu, NT News (2023-10-06). "CM Breakfast | ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి సబిత, హరీశ్‌ రావు". www.ntnews.com. Archived from the original on 2023-10-06. Retrieved 2023-10-06.
  7. telugu, NT News (2023-10-06). "Minister KTR | వెస్ట్‌మారేడుపల్లిలో 'సీఎం బ్రేక్‌ఫాస్ట్‌' ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-10-06. Retrieved 2023-10-06.