మునిపల్లె సుబ్బయ్య

మునిపల్లె సుబ్బయ్య తొలి తెలుగు సినిమా కథానాయకుడు, సుప్రసిద్ధ రంగస్థల నటుడు. ఈయన అసలు పేరు వల్లూరి వెంకట సుబ్బారావు. గుంటూరు జిల్లా, మునిపల్లె గ్రామంలో జన్మించడం వలన ఆ తర్వాత మునిపల్లె సుబ్బయ్య, మునిపల్లె వెంకట సుబ్బయ్యగా వ్యవహరించబడ్డాడు.[1] ఈయన వెంకటగిరి రాజా వారిచే "నటశేఖర" బిరుదు పొందాడు. అప్పట్లో సురభి సమాజంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుడు సుబ్బయ్యనే.

భక్తప్రహ్లాదలో హిరణ్యకశపునిగా మునిపల్లె సుబ్బయ్య

1929లో తండ్రి చనిపోవడంతో సుబ్బయ్య స్వగ్రామమైన మునిపల్లెకు తిరిగివచ్చాడు. హెచ్.ఎం.రెడ్డి కోరిక మేరకు దొరస్వామి నాయుడు (భక్తప్రహ్లాద సినిమాలో ఇంద్రుడు పాత్రధారి) మునిపల్లె వెళ్ళి సుబ్బయ్యను బొంబాయికి తీసుకుని వచ్చాడు.[2]

1931లో హెచ్.ఎమ్.రెడ్డి రూపొందించిన తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాదలో హిరణ్యకశపునిగా నటించి మునిపల్లె వెంకటసుబ్బయ్య చరిత్ర సృష్టించాడు. ఈయన తొలి తెలుగు కథానాయకుడే కాక, తెలుగు సినిమాలలో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఘనత కూడా సాధించాడు. 1936లో రూపొందిన సతీ సులోచన అనే చిత్రంలో రావణబ్రహ్మగా, ఇంద్రజిత్‌గా అలరించి ఓ కొత్త ప్రక్రియకు నాంది పలికాడు.[3] ఆ తరువాత ద్రౌపదీ మానసంరక్షణం, సతీ సావిత్రి తదితర చిత్రాల్లో నటించాడు సుబ్బయ్య. హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'సతీ సావిత్రి'లో సుబ్బయ్య యమధర్మ రాజు పాత్రను పోషించాడు.

మూలాలుసవరించు