ప్రధాన మెనూను తెరువు

మొలస్కా లేదా మలస్కా (లాటిన్ Mollusca) జీవులు " మెత్తటి శరీరం " గల త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్ఠవం, విఖండ, విభక్త కుహరపు జంతువులు. ఇవి జంతు ప్రపంచంలో కీటకాల తర్వాత రెండో అతి పెద్ద వర్గాన్ని ఏర్పరుస్తాయి. ఇవి సముద్ర, మంచినీటి, భూచర పరిసరాల్లాంటి అన్ని ఆవాసాలలో నివసిస్తాయి. మనకు బాగా తెలిసిన మొలస్కా జీవులు నత్తలు, శంఖాలు, ముత్యపుచిప్పలు, స్క్విడ్ లు, ఆక్టోపస్ లాంటివి. ఇవి 0.5 మి.మీ. నుండి కొన్ని మీటర్లు పొడవుంటాయి. మలస్కా జీవులు కాంబ్రియన్ కాలములో ఆవిర్భవించింది. కర్పరమును కలిగియుండుట ఈ జీవుల ముఖ్యలక్షణము.

మొలస్కస్ అంటే లాటిన్ భాషలో - మెత్తని అని అర్ధం. మలస్కా అను పదమును ఆరిస్టాటిల్ మొట్టమొదటగా ఉపయోగించారు. కాని కువియర్ అనే శాస్త్రవేత్త దీనికి నిర్వచించెను. మలస్కా జీవుల అధ్యయనమును "మాలకాలజీ" అని మరియు కర్పరముల అధ్యయనాన్ని "కాంకాలజీ" అని అంటారు.

సాధారణ లక్షణాలుసవరించు

 • శరీరం కర్పరంతో ఆవరించి ఉంటుంది.
 • ఇవి ఎక్కువగా ద్విపార్శ్వ సౌష్టవాన్ని కనబరుస్తాయి.
 • శరీరం మూడు భాగాలుగా విభజితమై ఉంటుంది. 1. చలనపు విధులని నిర్వర్తించే ఉదరపు పెద్ద పాదం, 2. అంతరాంగ అవయవాలు గల అంతరాంగ ద్రవ్యం, 3. అంతరాంగ ద్రవ్యాన్ని కప్పుటూ ఒక బరువైన ప్రావారం అనే కణజాలం మడత ఉంటుంది. కొన్నిటిలో స్పష్టమైన తల ఉంటుంది.
 • శరీర కుహరం ఒక రక్తకుహరం. నిజశరీరకుహరం మూత్రపిండాలకు, బీజకోశాలకు, హృదయావణానికి పరిమితమై ఉంటుంది.
 • ఎక్కువ జీవులలో ఆస్యకుహరంలో రాడ్యులా అనే నికషణ పరికరం ఉంటుంది. రాడ్యులా మీద అడ్డు వరసలో ఉన్న కైటిన్ దంతాలు ఆహారాన్ని నికషణ చేయడానికి సహాయపడతాయి.
 • కంకాభాంగాలనే శ్వాసావయావాలు, ప్రావార కుహరంలో ఉంటాయి.
 • వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది.
 • నాడీసంధులు, సంధాయకాలు, సంయోజకాలతో నాడీవ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది.
 • ఓస్ఫేడియం ఒక ప్రత్యేక జ్ఞానాంగం. ఇది నీటి నాణ్యతను పరీక్షించే రసాయన గ్రహకాంగం. స్పర్శకాలు, నేత్రాలు వంటి ఇతర జ్ఞానాంగాలు అధిక మొలస్కాలలో ఉంటాయి.
 • విసర్జన నాళికాయుత అంత్యవృకాలు వల్ల జరుగుతుంది.
 • మొలస్కాలు అధికంగా ఏకలింగజీవులు.

వర్గీకరణసవరించు

 • విభాగం 1: ఏప్లాకోపోరా: ఉ. నియోమీనియం
 • విభాగం 2: పాలిప్లాకోఫోరా: ఉ. కైటాన్
 • విభాగం 3: మోనోప్లాకోఫోరా: ఉ. నియోపిలైనా
 • విభాగం 4: గాస్ట్రోపోడా: ఉ. పైలా - నత్తలు, శంఖాలు
 • విభాగం 5: స్కాఫోపోడా: ఉ. డెంటాలియమ్
 • విభాగం 6: పెలిసిపోడా: ఉ. యూనియో
 • విభాగం 7: సెఫాలోపోడా: ఉ. సెపియా - ఆక్టోపస్

బయటి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.


"https://te.wikipedia.org/w/index.php?title=మొలస్కా&oldid=2004164" నుండి వెలికితీశారు