మోహిని (విష్ణువు స్త్రీ రూపం)

(మొహిని అవతారము నుండి దారిమార్పు చెందింది)

అమృతం కొరకు దేవ దానవులు క్షీరసముద్రాన్ని చిలకగా అమృతం పుట్టింది. దానిని పంచుకొనుటకు దేవ, దానవులు పోటి పడతారు. అపుడు విష్ణువు వారిని మోసం చేయుటకు ఒక కృత్రిమ స్త్రీ రూపం ఎత్తాడు. ఆరూపమే మోహిని. అమృతం పుచ్చుకొనుటకు దేవతలందరూ వరుసలో నిలబడతారు. అట్లు విష్ణువు స్త్రీరూపం వహించి అసురులకు మోహమును కలగచేసి అమృతమును పుచ్చుకొని దేవతలకు ఇచ్చువేళ రాహువు దేవతల వేషం ధరించుకొని దేవతల ప్రక్కన చేరి అమృతమును తీసుకొనుటకు సిద్దపడతాడు. అది వాని ప్రక్కను ఉండిన సూర్య చంద్రులు తెలిసికొని విష్ణువునకు తెలియ చేస్తారు. అంతట విష్ణువు ఆయమృతం వాని కంఠబిలము చొరకమునుపే తన చక్రమును ప్రయోగించి రాహువు కంఠము తెగి దేహము భూమియందు పడఁగొట్టెను. వాని ముఖమును అమృతము సోకెను కావున చక్రముచే నఱకబడినను ప్రాణము పోక ఆకాశమునందే నిలిచెను. అది కారణముగా నాడు మొదలు రాహువునకును చంద్ర సూర్యులకును విరోధము శాశ్వతమై నిలిచెను. ఆవైరముతో సూర్య చందులను రాహు మ్రింగును. రాహువుకు తల మాత్రమే వున్నందున మ్రింగిన కొంత సేపటికే సూర్య చంద్రులు తిరిగి బయటకు వస్తారు. దీనినే గ్రహణము అని అంటారు. సూర్యుని మ్రింగిన దానిని సూర్య గ్రహణమనియు, చంద్రుని మ్రింగిన దానిని చంద్ర గ్రహణ మనియి అంటారు. ఇది పురాణ గాథ. మఱియు ఈమోహినీ రూపమును ఒకప్పుడు శివుడు చూచి మోహించెను అని చెప్పబడిఉన్నది.

రాజా రవివర్మ గీసిన మోహిని చిత్రం

2. బ్రహ్మ కూతురు. ఈమె బ్రహ్మ అనుమతిపడసి రుక్మాంగదుడు పూని ఉన్న ఏకాదశీ వ్రతమును తెఱుప పోయి కడపట తన యత్నమును నెఱవేర్చుకోలేక పోయెను.

3.శ్రీ మహాభాగవత ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మధన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పోరాడు కొనుచుండగా శ్రీమహావిష్ణువు లోకకళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తాడు. జగన్మోహిని అవతార సమయం లోమహేశ్వరుడు జగన్మోహినిని చూసి మోహితుడై ఆమె వెంట పడగా వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. మోహినీ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పం క్రింద పడుతుంది. ఈ పుష్పం క్రిందపడిన ప్రదేశమే ఇప్పటి ర్యాలి (ర్యాలి అంటే పడడం అని అర్థం) అని అటారు. ర్యాలి ఒక ప్రముఖ పుణ్య క్షేత్రము. జగన్మోహిని ఇక్కడ ప్రధాన దేవత. పేరుకు తగ్గట్టు ఈ రూపము చాల అందంగా వుంటుంది. ఇక్కడి విశేషం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారు ర్యాలి ప్రధాన రహదారికి ఒకరికొకరు ఎదురెదురుగా ఉండడం. ర్యాలి, ఆఁధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలానికి చెందిన గ్రామం

4.మూలవిరాట్

5 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పు గల శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి సాలిగ్రామ విగ్రహం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష స్వరూపం. * స్వామివారి ఈ విగ్రహము అతి సుందరమైనది. ప్రత్యేకముగా చెప్పుకోదగినది. ఈ విగ్రహము ఏక సాలిగ్రామ శిలతో తయారైంది. విగ్రహము ముందువైపు విష్ణువు కేశవస్వామి, వెనుకవైపున జగన్మోహినీ రూపంలో ఉన్నాడు

  • ఎదుటవైపుగా స్యామి పాదపద్మాల మధ్య ఉన్న చిన్న గంగ దేవి తల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. (విష్ణు పాద్బోవీం గంగా).
  • ముందువైపు విష్ణువు నాలుగు చేతులు కలిగి, శంఖము, చక్రము, గద, అభయహస్తము హస్తరేఖలతో ఉన్నాడు.
  • విగ్రహము పై బాగమున ఆదిశేషుడు నీడపట్టినట్లుగా ఉన్నాడు.
  • వెనుక వైపున ఇవేమీ కనుపించకుండా, రెండు చేతులు, చక్కటి జుట్టుముడి, అందమైన శరీరాకృతి, కుడికాలు పై పాదము నకు కొద్దిగా పైభాగము (పిక్క) పై నల్లని మచ్చతో ఉంటుంది.ఈ మచ్చ పద్మినీ జాతి స్త్రీకి ఉండే లక్షణాలలో ఒకటిగా చెపుతారు. అసలే నల్లని సాలిగ్రామ శిలతో తయారైనా కూడా అంతకన్నా నల్లగా ఈ మచ్చ అతి స్పష్టంగా కనుపిస్తూ ఉంటుంది.
  • మొత్తముగా ఈ విగ్రహము అత్యంత ప్రత్యేకమైనది, అద్భుతమైనది.బహుశ ఇటువంటి విగ్రహము ఇది ఒక్కటే అని చెప్పవచ్చును. అందుకే స్వామివారికి జరిగే నిత్యపూజలు, హారతి, నైవేద్యాదులు ముందువైపు, వెనుక వైపు కూడా యధావిధిగా జరుగుతాయి.