జంద్యము

(యజ్ఞోపవీతం నుండి దారిమార్పు చెందింది)

మను స్మృతి ప్రకారం ఉపనయనం (ఒడుగు) జరిగి యజ్ఞోపవీత ధారణ చేస్తే తప్ప వేదాలను అభ్యసించే అధికారం కాని, నిత్య కర్మలు (పితృ సంస్కారాలతో సహా) అనుష్ఠానం చేసే అవకాశం గాని లేదు. బ్రాహ్మణులకు తల్లి గర్భంతో కూడి 8వ ఏట, క్షత్రియులకు సూర్యవంశం రాజులు, చంద్రవంశం రాజులు, భట్ట రాజులు గర్భధారణతో కలిపి 11 ఏట, వైశ్యులకు గర్భధారణ సంవత్సరంతో కలిపి 12వ ఏట ఉపనయనం చేయాలని వేదం చెబుతోంది. యజ్ఞోపవీతాన్ని వాడుకలో జందెం, జందియం, జంద్యం అని కూడా అంటారు.

ఉపనయన కార్యక్రమంలో జంధ్యం ధరిస్తున్న బ్రాహ్మణుడు

యజ్ఞోపవీతం బ్రాహ్మణకన్య చేత భమిడి ప్రత్తితో వడక బడి బ్రాహ్మణుడి చేత మెలికలు వేయబడుతుంది. జంద్యం యొక్క ప్రతి విషయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. జంద్యం పొడవు నాలుగు వ్రేళ్ళ వెడల్పుకి 24 రెట్లు అంటే సుమారుగా సాధారణ వ్యక్తి ఎత్తుకు సమానంగా ఉంటుంది (ఆరు అడుగులు). నాలుగు వ్రేళ్ళు మనిషి యొక్క జాగరణ, స్వప్న, నిస్వపన, బ్రాహ్మ (తురీయ ) స్థితులు అనే నాలుగు ఆత్మ స్థితులను తెలియజేస్తాయి. ప్రతి జంద్యానికి మూడు పోగులు ఒక ముడి చేత కట్టబడి ఉంటాయి ఈ ముడినే బ్రహ్మ గ్రంధి అని అంటారు. ఈ మూడు పోగులు సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలను తెలియ జేస్తాయి. ఈ మూడు పోగులను ధరించినప్పుడు అవి మనకు ఋషి ఋణం, పితృ ఋణం, దేవ ఋణాలను గుర్తు చేస్తాయి. ఆ మూడు పోగులను కలిపి ముడి వేయబడిన బ్రహ్మ గ్రంథి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లను కలిసి ఏకంగా ఉండడాన్ని సూచిస్తుంది.

మామూలు సమయములోను, శుభ కార్యాలలోను యజ్ఞోపవీతాన్ని ఎడమ భుజం మీద నుండి వ్రేలాడుతూ కుడి వైపు నడుము చేరేటట్లు (సవ్యంగా) వేసుకుంటారు. అశుభ కర్మలప్పుడు కుడి భుజం మీదుగా ఎడమ వైపు నడుమును తగిలేటట్లు (ప్రాచీనావీతిగా) వేసుకుంటారు. మూత్ర, మల విసర్జన సమయాలలో మెడలో దండ లేదా తావళం (నివీతం) లాగా ఉండేటట్లు వేసుకుంటారు. సంవత్సరానికి ఒక సారైనా, శ్రావణ పూర్ణిమ నాడు తప్పకుండా నూతన యజ్ఞోపవీతధారణ చేస్తుంటారు. అందుకే ఆ రోజుకు జంద్యాల పూర్ణిమ అని పేరుకూడా వచ్చింది. పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో జంద్యాల పూర్ణిమ గురించి సవివరంగా వర్ణించాడు.[1]

యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్

ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజః

ఈ విధంగా జపిస్తూ క్రొత్త జంద్యం వేసుకోవాలి. ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితం విసృజామి యశోబ్రహ్మవర్భో దీర్ఘాయురస్తుమే ఈ విధంగా జపిస్తూ పాత జంద్యం తీసి వేయాలి.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-10-10. Retrieved 2007-10-07.
"https://te.wikipedia.org/w/index.php?title=జంద్యము&oldid=3785762" నుండి వెలికితీశారు