యామిజాల పద్మనాభస్వామి

యామిజాల పద్మనాభస్వామి బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు[1].

యామిజాల పద్మనాభస్వామి

జీవిత విశేషాలు మార్చు

ఇతడు విజయనగరం జిల్లా, గరుగుబిల్లి మండలం, శివరాంపురం గ్రామంలో 1915, జూన్ 12వ తేదీన కామేశ్వరి, లక్ష్మీనరసింహశాస్త్రి దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి లక్ష్మీనరసింహశాస్త్రి నిరతాన్నదాతగా ఆ ప్రాంతంలో ప్రసిద్ధుడు. యామిజాల పద్మనాభస్వామి చాలా చిన్నవయసులోనే ఇంటివద్ద ఉండి దేవులపల్లి సీతారామశాస్త్రి వద్ద కాళిదాస త్రయం అభ్యసించాడు. తన స్వగ్రామానికి సమీపంలో ఉన్న జామిలో మోతికుర్తి సత్యనారాయణశాస్త్రి వద్ద కౌముది నేర్చుకున్నాడు. 1930లో కడియం వెళ్లి చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి వద్ద రెండు సంవత్సరాలు శిష్యరికం చేసి కవిత్వ రహస్యాలు తెలుసుకున్నాడు. 1933లో విజయనగరం ప్ర్రాచ్యకళాశాలలో చేరి 1938వరకు అక్కడే చదివి ప్రాచ్యభాషా పట్టాను పొందాడు. ఆ సమయంలోనే ఆదిభట్ల నారాయణదాసును సేవించి జ్యోతిష శాస్త్ర పట్టులెన్నో గ్రహించాడు. ఆదిభట్ల నారాయణదాసు ఇతడిని కావ్యకంఠ గణపతిమునికి పరిచయం చేయగా అతనికి శుశ్రూష చేసి మంత్రశాస్త్రం నేర్చుకున్నాడు. గాంధీజీ ప్రభావం, తెన్నేటి విశ్వనాథం బాంధవ్యం ఇతడిని స్వాతంత్ర్యోద్యమం వైపుకు ఆకర్షించింది. స్వయంగా రచించిన దేశభక్తి గేయాలను, పద్యాలను పాడుతూ స్వైరవిహారం చేస్తున్న ఇతడిని ప్రాచ్యకళాశాలనుండి తొలగించారు. కానీ ప్రతిభావంతుడిని పోగొట్టుకోవడ ఇష్టం లేక తిరిగి విద్యార్థిగా చేర్చుకున్నారు. విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఇతనికి నెలనెలా విద్యార్థివేతనం ఇచ్చాడు. ఇతని కవితాశక్తి గురించి విన్న జయపురం మహారాజా ఇతడిని ఆహ్వానించి తన సంస్థానంలో ఆస్థానకవిగా నియమించాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు వెంట కొంతకాలం తిరిగి హరిజనసేవకు నిధులు సేకరించాడు. 1948లో మద్రాసులోని శ్రీరామకృష్ణ విద్యాసంస్థలలో ఆంధ్రోపాధ్యాయుడిగా ప్రవేశించి 1974లో పదవీ విరమణ చేశాడు. ఇతని సంపాదకత్వంలో మద్రాసు నుండి అమృతవాణి అనే సాహిత్యమాసపత్రిక కొన్నాళ్లు వెలువడింది.

రచనలు మార్చు

ఇతడు తన 15వ యేటనుండే కవిత్వం చెప్పనారంభించాడు. ఇతడు రచించిన అనేక రచనలలో కొన్ని:

  1. ఏకాంతసేవ (స్తోత్ర కావ్యం)
  2. శ్రీకృష్ణరాజ స్తవము
  3. విక్రమ ప్రకృతి
  4. శ్రీరామచంద్ర శతకము
  5. సూర్యశతకము (ఆంధ్రీకరణము)
  6. శ్రీ మహాభాగవతము (సరళవచనము)
  7. దేవీ భాగవతము (సరళవచనము)
  8. వాల్మీకి రామాయణం (సరళవచనము)
  9. కుమార సంభవము (వచనం)
  10. లక్ష్మీ నరసింహ పురాణము
  11. శ్రీ భీమేశ్వర పురాణము
  12. ఏకాదశీ మాహాత్మ్యం
  13. శ్రీ వేంకటేశ్వర సహస్రము
  14. సూర్యసహస్రము
  15. సుబ్రమణ్య సహస్రం
  16. శ్రీ కామాక్షీ సహస్రం
  17. కార్తీక పురాణము (వ్యాఖ్య)
  18. మాఘపురాణము (వ్యాఖ్య)
  19. బాలల రామాయణము
  20. బాలల భాగవతం
  21. బాలల కృష్ణలీలలు
  22. పూర్ణపురుషుడు (ఆదిభట్ల నారాయణదాసు జీవితచరిత్ర)
  23. నాయన (కావ్యకంఠ గణపతిముని జీవితచరిత్ర)
  24. శివలీలలు
  25. అన్నమాచార్య (నృత్యనాటిక)
  26. అర్ధనారీశ్వరం (నృత్య నాటిక)
  27. జ్ఞానప్రసూన
  28. కామాక్షీ పరిణయం (గేయనాటిక)

బిరుదులు మార్చు

  • కవిరత్న
  • కవికులతిలక
  • అభినవ వాల్మీకి

మూలం మార్చు

  1. "బహుముఖప్రజ్ఞాశాలి శ్రీ యామిజాల పద్మనాభస్వామి - [[రావినూతల శ్రీరాములు]] - ఆంధ్రప్రభ దినపత్రిక - తేదీ: జూన్21, 1981 - పేజీ:4". Archived from the original on 2016-03-05. Retrieved 2015-12-12.