ఆదిభట్ల నారాయణదాసు

హరికథా పితామహుడు, కవి

అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు (ఆగష్టు 31, 1864 - జనవరి 2, 1945) (Ajjada Adibhatla Narayana Dasu) హరికథా కళాకారుడు, సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని సృజించి "హరికథా పితామహ" అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు. సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్", "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.

అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు
హరికథా పితామహ
జననంసూర్యనారాయణ
ఆగష్టు 31, 1864
అజ్జాడ
మరణంజనవరి 2, 1945
నివాస ప్రాంతంవిజయనగరం
ప్రసిద్ధితెలుగు హరికథలు, సాహిత్యం
తండ్రివేంకటచయనులు
తల్లిలక్ష్మీ నరసమాంబ

తొలిజీవితం

మార్చు

1864 ఆగష్టు 31 న ఇప్పటి విజయనగరం జిల్లా, బొబ్బిలి వద్ద, ప్రస్తుతం బలిజిపేట మండలంలో ఉన్న అజ్జాడ గ్రామంలో లక్ష్మీ నరసమాంబ, వేంకటచయనులు దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు సూర్యనారాయణ. హరికథకుడిగా ప్రసిద్ధి చెందాక, ఆయన నారాయణదాసుగా ప్రఖ్యాతిగాంచాడు. పేదరికం కారణంగా చిన్నతనంలో బడికి వెళ్ళలేకపోయినా, పద్యాలు, శ్లోకాలు విని, కంఠతా పట్టి తిరిగి వల్లించేవాడు.

కేవలం ఐదేళ్ళ చిరు ప్రాయంలోనే, భాగవతం లోని పద్యాలు ఎన్నో చెప్పేవాడట. ఒకసారి వారి అమ్మగారు పిల్లవాడిని ఏదో పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళిందట. అక్కడ పుస్తకాల కొట్టులో, భాగవతం చూసి (బాల దాసు)అది కావాలి అని మారాం చేస్తుంటే, ఆ కొట్టు యజమాని, భాగవతం నీకేమి అర్థమవుతుంది అన్నాడట. అంతే ఆ కుర్రవాడు ఆపకుండా భాగవతం లోని పద్యాలు గడగడా చెప్పేశాడట. అది చూసి, ఆ కొట్టు యజమాని ఆనందంగా పిల్లవానికి ఆ పుస్తకంతో పాటు, కొంత దక్షిణ కూడా ఇచ్చి పంపించాడుట.

ఇది ఇలా ఉండగా, ఒకసారి దాసు వాళ్ళ తాతగారింటికి వెళ్ళడం జరిగింది. అక్కడ అరుగు మీద కూర్చుని రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే, అది చూసి వాళ్ళ తాతగారు ముచ్చటపడి, తన దగ్గరే ఉంచుకుని సంగీతం నేర్పుతానని వాళ్ళ అమ్మగారికి చెప్పాడట. దాంతో అప్పటిదాకా, ఎటో సాగుతున్న నావకి చుక్కాని దొరికినట్లైంది. ఒకప్రక్క సంగీత సాధన, ఇంకో ప్రక్క విద్యాభ్యాసం. ఇలా రెంటినీ అతను ఎంతో నేర్పుగా సంబాళించగలిగాడు చిన్నవయసులోనే.

తన 14 వ ఏట ఒకటవ తరగతిలో చేరాడు.

వ్యక్తిత్వం

మార్చు

వివాదాలు

మార్చు

అంతేగాక నారాయణదాసు ఈసఫ్ కథలను నూఱుగంటి పేరిట అనువదించి వీరేశలింగం ప్రచురణాలయానికి పంపగా, ఆ గ్రంథ ప్రచురణను తొక్కిపట్టి ఆ మార్గంలోనే ఈసఫ్ కథలను తానుకూడా తెనుగు చేసి ముందుగా ప్రకటించారు. అది విద్యార్థులకు పాఠ్యగ్రంథమైంది. తర్వాతే నూఱుగంటి వెలుగుచూసింది.

పాండిత్య ప్రకర్ష

మార్చు

తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పారశీకం భాషలలో ఆయన ప్రావీణ్యం సంపాదించాడు. అష్టావధానాలు చేసేవాడు. అచ్చతెలుగులోను, సంస్కృతంలోను, సంస్కృతభూయిష్టమైన తెలుగులోను కూడా వివిధ విషయాలపై శతాధిక గ్రంథాలు రచించిన మహా పండితుడు.

అంతకు ముందు తెలుగులో ఉమర్ ఖయ్యామ్ రుబాయితులను వ్రాసినవారు ఎక్కువగా ఎడ్వర్డ్ ఫిడ్జిరాల్డ్ రచించిన ఆంగ్ల రచననే మూలంగా తీసుకొన్నారు. అలా చేయడం వలన మూలగ్రంథాలలోని విషయం సరిగా చూపడం కుదరలేదని తలచాడు ఆదిభట్ల నారాయణదాసు. ఈ విషయం ఋజువు చేయడానికి ఆయన పారశీక భాష లోని మూల గ్రంథం కవితలనూ, ఫిడ్జిరాల్డ్ ఆంగ్లానువాదాన్నీ కూడా అచ్చ తెలుగులోకీ, సంస్కృతంలోకీ వేరు వేరు ఛందస్సులలో అనువదించాడు. 1932లో వెలువడిన ఈ రచన పాండిత్యానికి పరాకాష్ఠగా ఆనాటి సాహితీకారులచే మన్నింపబడింది.

మరొక గొప్ప రచన - 1922లో ప్రచురితమైన నవరస తరంగిణి - ఇందులో సంస్కృత మహాకవి, నాటక కర్త కాళిదాసు రచనలనుండి, ఆంగ్లభాషలో ప్రసిద్ధ నాటక రచయిత షేక్స్‌పియర్ రచనలనుండి నవరసాలను వర్ణించే ఖండికలను తెలుగులోకి అనువదించి చూపాడు.

కాని ఆయన రచనలలో ఉద్గ్రంథంగా చెప్పబడేది జగజ్యోతి అనే తాత్విక రచన. వివిధ భారతీయ తాత్వికుల సిద్ధాంతాలను, దృక్పథాలనూ ఈ గ్రంథంలో వివరించాడు. నాస్తిక వాదాలు కూడా విస్తృతంగా చర్చింపబడ్డాయి.

నారాయణదాసు సంస్కృత రచనలలో ముఖ్యమైనవి - మూడు హరికథల కూర్పు హరికథామృతం, స్వతంత్ర రచన తారకం, రెండు శతకాలు రామచంద్ర శతకం, కాశీ శతకం.

దశవిధ రాగ నవతి కుసుమ మంజరి అనే పాటలో మంజరీ వృత్తంలో 90 రాగాలు కూర్చాడు. అంతవరకూ ఎవరూ సాహసించని ఈ ప్రక్రియ సంగీతంలోనూ, కవితలోనూ నారాయణదాసుకు ఉన్న ప్రతిభకు తార్కాణం. ఋక్‌సంగ్రహం అనే బృహత్తర కావ్యంలో ఈయన ఋగ్వేదములోని 300 పైచిలుకు ఋక్కులకు సంగీతాన్ని సమకూర్చి, వాటిని వీణమీద వాయించడం విద్యార్థులకు నేర్పాడు. ఆ ఋక్కులను తెలుగులో గీతాలుగా అనువదించాడు.

నారాయణదాసు సంగీత ప్రతిభ ఆయన సాహితీ ప్రకర్షకు సమస్థాయిలో పరిమళించింది. ఆనాటి సంగీత విద్వాంసులు ఆయనను లయబ్రహ్మ అనీ, పంచముఖి పరమేశ్వర అనీ సన్మానించారు. ఒకేమారు ఐదు తాళాలకు అనుగుణంగా పాడడం ఆయన ప్రత్యేకత. ఈ పంచముఖి ప్రదర్శనలో నారాయణదాసు రెండు చేతులు, రెండు కాళ్ళు, తలలతో ఐదు తాళాలకూ దరువు చూపేవాడు. అప్పుడు ఆయనకు ఐదుగురు వివిధ వాద్యకారులు సహకరించేవారు. సంగీత సాహిత్య స్వర బ్రహ్మ అని ఆయనకు బిరుదు ప్రసాదించారు.

ఆనంద గజపతి నారాయణ దాసును తన ఆస్థాన విద్వాంసునిగా నియమించాడు. ఒకసారి సభలో ఆయన దాసును ఏదో రాగం పాడమని అడిగాడట. కానీ ఆయన నేను పాడను అని సభలో నుండి వెళ్ళిపోయాడట. రాజు గారు కూడా దానికి ఏమి కోపం తెచ్చుకోలేదు. ఐతే తరువాత ఆయన వ్యాయామశాలలో వ్యాయామం చేస్తున్నప్పుడు, ఎందుకో ఆ రాగం గుర్తుకు వచ్చి, పాడడం మొదలుపెట్టారట. నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి. చుట్టూరా జనాలు ఉన్నారు. కానీ ఇవేవీ పట్టించుకొనే స్థితిలో లేడు నారాయణ దాసు. చివరికి పాడడం అయినతరువాత చూసుకుంటే ఒంటి మీద కేవలం గోచీ తప్ప ఏది లేదట. ఆ రాగం విన్న ప్రజలంతా ఆనందంతో ఇంటికి వెళ్ళిపొయారు. వెళ్ళిపోయిన ఆ జనంలో, ఆనంద గజపతి రాజు కూడా ఉన్నాడట…!

హరికథా వైభవం

మార్చు
 
ఆదిభట్ల నారాయణదాసు చిత్రపటం

అయితే ఈయనకే ప్రత్యేకమైన హరికథని వెలుగులోకి తెచ్చింది మాత్రం జయంతి రామదాసు. అతని ప్రోద్బలంతో, మొదటి హరికథా కాలక్షేపానికి రంగం సిధ్ధమైంది.[1] మొదటిది రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఇప్పటిలా కరెంటు లేదు. మైకులు, సౌండ్ బాక్స్ లు లేవు. ఉన్నదల్లా, ఇసుక వేస్తే రాలనంత జనం, మధ్యలో వేదిక మీద నారాయణ దాసు. అంతే ఉన్నట్లుంది మ్రోగింది కంచు కంఠం . ఊరంతా ఉలిక్కిపడింది. గంభీరమైన ఆకారం, ఒక చేతిలో చిడతలు, కాళ్ళకి గజ్జెలు. అలా మొదటి హరికథకి అంకురార్పణ జరిగింది.

ఇక ఆ తరువాత నారాయణ దాసు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతని ఖ్యాతి వాడవాడలా వ్యాపించింది.. మైసూర్ మహారాజు గారి నుండి ఆహ్వానం అందింది. మైసూర్ రాజా హరికథకి ముగ్ధుడైపోయాడు. దీనితో పాటు, వీణాగానం కూడా అడిగి మరీ విన్నాడు. పెద్దయెత్తున బహుమతులు సమర్పించాడు.

కవిత్వం, సంగీతం, నాట్యం అనే మూడు రంగాలలోనూ తనకున్న ప్రతిభను జోడించి నారాయణదాసు హరికథ అనే కళను అత్యున్నత శిఖరాలకు కొనిపోయాడు. ఈ మూడింటి కలయికకూ భక్తి అనే భావం ప్రాణంగా హరికథలు రచించాడు, చెప్పాడు, నేర్పాడు. ఆయన హరికథ వినడం ఒక గొప్ప అనుభూతిగా అప్పటివారు చెప్పుకొనేవారు. మొత్తం ఆయన తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చతెలుగులో ఒకటి హరికథలను రచించాడు. కొన్నిమార్లు ఒక్కొక్క వర్ణన నాలుగైదు పేజీల నిడివి వరకూ సాగేవి.

ఒకమారు నారాయణదాసు కలకత్తాలో శ్రీకృష్ణజన్మ హరికథను సంస్కృతంలో గానం చేసి హిందీలో భావాన్ని వివరించాడు.

అధ్యాపకునిగా

మార్చు

1919లో అప్పటి విజయనగరం మహారాజు స్థాపించిన శ్రీ విజయరామ గాన పాఠశాలకు మొదటి ప్రధానాధ్యాపకునిగా నారాయణదాసును నియమించారు. ప్రసిద్ధ వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు ఈయనకు సహాధ్యాపకునిగా ఉన్నాడు. ఎందరో ప్రముఖ కళాకారులు ఈ విద్యాసంస్థనుండి ఆంధ్రదేశానికి లభించారు. వారిలో ఘంటసాల వెంకటేశ్వరరావు ఒకడు. నారాయణదాసు ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో చదువుకొన్నామని చెప్పుకోవడం అప్పట్లో ప్రతిష్ఠాత్మకంగా భావించేవారు.

నారాయణదాసు హిందూస్థానీ భైరవి రాగాలాపనను గురుదేవులు రవీంద్రనాథ టాగూరు ఎంతగానో ప్రశంసించాడు. ఈ విజయనగరం కళాశాల పాఠ్యాంశాలు శాంతినికేతన్లో ప్రవేశపెట్టబడ్డాయి.

ఈయన సకల కళా నైపుణ్యానికి ముచ్చటపడిన బ్రిటీష్ వారు ఆయనను నోబుల్ పురస్కారానికి నామినేట్ చేద్దామనుకున్నారట. కానీ నారాయణదాసు ఒప్పుకోలేదట. తన జీవితం మొత్తం, తాను జన్మించిన తెలుగు గడ్డకి తన వంతు సేవ చేసి, 1945, జనవరి 2వ తేదీన మరణించాడు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. భరణి, తనికెళ్ళ (2005). ఎందరో మహానుభావులు. హాసం పబ్లికేషన్స్. p. 33.
  2. భారత డిజిటల్ లైబ్రరీలో తల్లి విన్కి పుస్తక ప్రతి.

వనరులు, బయటి లింకులు

మార్చు