రమేష్ చంద్ర మజుందార్

రమేష్ చంద్ర మజుందార్ (ఆర్.సి.మజుందార్గా ప్రసిద్ధుడు; 4 డిసెంబరు 1888 – 11 ఫిబ్రవరి 1980) ఒక చరిత్రకారుడు, భారతీయ చరిత్ర ఆచార్యుడు.[1][2]

రమేష్ చంద్ర మజుందార్
రమేష్ చంద్ర మజుందార్


ఢాకా విశ్వవిద్యాలయం ఉపకులపతి
పదవీ కాలం
1 జనవరి 1937 – 30 జూన్ 1942
ముందు ఎ.ఎఫ్.రహ్మాన్
తరువాత మహ్మద్ హాసన్

వ్యక్తిగత వివరాలు

జననం (1888-12-04)1888 డిసెంబరు 4
ఖందపర, ఫరీద్‌పూర్, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటీష్ ఇండియా
మరణం 1980 ఫిబ్రవరి 11(1980-02-11) (వయసు 91)
కోల్‌కాతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయత భారతీయుడు
పూర్వ విద్యార్థి కలకత్తా విశ్వవిద్యాలయం

ఆరంభ జీవితం, విద్య

మార్చు

ఇతడు 1888, డిసెంబరు 4వ తేదీన ఫరీద్‌పూర్ జిల్లా (ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది) కందర్పర గ్రామంలో హలధర్ మజుందార్, బిధుముఖి దంపతులకు జన్మించాడు. ఇతని బాల్యం పేదరికంలో గడిచింది. 1905లో ఇతడు కటక్ లోని రావెన్‌షా కాలేజి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. ఇతడు ఉపకార వేతనం పొందుతూ 1907లో ఎఫ్.ఎ. పరీక్ష ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. పిదప కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు. 1909లో బి.ఎ.(ఆనర్స్) పట్టా అందుకుని, 1911లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. ఉత్తీర్డుడయ్యాడు. ఇతడు 1913లో రీసర్చ్ చేయడానికి ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ స్కాలర్‌షిప్పును గెలుచుకున్నాడు.ఈయన అన్న కూతురు ప్రముఖ స్త్రీ వాది వీణా మజుందార్

వృత్తి

మార్చు

ఇతడు ఢక్కా గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజీలో లెక్చరర్‌గా తన అధ్యాపక వృత్తిని ప్రారంభించాడు. 1914 నుండి ఏడు సంవత్సరాలపాటు కలకత్తా విశ్వవిద్యాలయంలో చరిత్ర ప్రొఫెసర్‌గా ఉన్నాడు. ఇతనికి "కార్పొరేట్ లైఫ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా"[3] అనే సిద్ధాంతగ్రంథానికి డాక్టరేట్ లభించింది. 1921లో కొత్తగా ఏర్పాటయిన "ఢాకా విశ్వవిద్యాలయం"లో హిస్టరీ ప్రొఫెసర్‌గా చేరాడు. ఆ విశ్వవిద్యాలయం ఉపకులపతి అయ్యేవరకు ఇతడు అక్కడ చరిత్రశాఖ అధిపతిగా, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌కు డీన్‌గా కూడా వ్యవహరించాడు. 1924 నుండి 1936 వరకు ఆ విశ్వవిద్యాలయంలోని "జగన్నాథ్ హాల్" కు అధికారిగా ఉన్నాడు. తరువాత ఇతడు ఢాకా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా 1937 నుండి 1942 వరకు 5 సంవత్సరాలు పనిచేశాడు. 1950 నుండి ఇతడు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని కాలేజ్ ఆఫ్ ఇండాలజీకి ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. ఇతడు ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా, యునెస్కో నెలకొల్పిన మానవజాతి చరిత్రకు సంబంధించిన అంతర్జాతీయ కమీషన్‌కు ఉపాధ్యక్షుడిగా ఎంపిక అయ్యాడు.

కార్యసాధనలు

మార్చు

మజుందార్ ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి పరిశోధించడం మొదలుపెట్టాడు. ఆగ్నేయాసియా దేశాలలో విస్తృతంగా పర్యటించి, పరిశోధించి చంపా (1927), సువర్ణద్వీప (1929), కాంభోజ దేశ సమగ్ర చరిత్రలను వ్రాశాడు. భారతీయ విద్యాభవన్ ప్రోత్సాహంతో ఇతడు బహు సంపుటాల భారతచరిత్ర బృహద్గ్రంథానికి సంపాదకుడిగా ఉన్నాడు. 1951లో ప్రారంభమైన ఈ ప్రయత్నం పూర్తి కావడానికి 26 సంవత్సరాల సమయం పట్టింది. వేదకాలం నుండి ప్రస్తుతం వరకు భారతీయుల చరిత్రను ఈ పదకొండు సంపుటాల గ్రంథంలో నిక్షిప్తం చేశాడు. చివరి సంపుటం వెలువడే నాటికి ఇతని వయసు 88 సంవత్సరాలు. ఇతడు చికాగో విశ్వవిద్యాలయం, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయాలలో భారతీయ చరిత్రను బోధించాడు. ఇతడు ఏషియాటిక్ సొసైటీకి అధ్యక్షుడిగా, బంగీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నాడు. 1967-68లో కొంతకాలం "కలకత్తా షరీఫ్"గా కూడా సేవలనందించాడు.

భారత స్వాతంత్ర్యోద్యమంపై అభిప్రాయాలు

మార్చు

భారత ప్రభుత్వం భారత దేశ స్వతంత్ర పోరాట చరిత్రను వ్రాయించ తలపెట్టి ఇతడిని సంపాదకమండలిలో ప్రధాన సంపాదకునిగా నియమించింది. అయితే సిపాయీల తిరుగుబాటు విషయమై అప్పటి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ తో వచ్చిన విభేదాల కారణంగా ఇతడు ఆ పదవి నుండి తొలగి, తన స్వంత పుస్తకం "ది సిపాయ్ మ్యూటినీ & రివోల్ట్ ఆఫ్ 1857" ను ప్రకటించాడు. ఇతని అభిప్రాయం ప్రకారం మొదటి స్వాతంత్ర్య సంగ్రామం 1905లో బెంగాల్ విభజన ఉద్యమంతో మొదలైంది. ఇతడు తన "హిస్టరీ ఆఫ్ ద ఫ్రీడం మూవ్‌మెంట్ ఇన్ ఇండియా" అనే గ్రంథంలో తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఇతడు స్వామీ వివేకానంద, రామకృష్ణ పరమహంసల ప్రబోధాలతో ఆకర్షితుడయ్యాడు.

రచనలు

మార్చు
  • ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ బెంగాల్ 1924
  • చంపా, ఏన్షియంట్ ఇండియన్ కాలనీస్ ఇన్ ద ఫార్ ఈస్ట్ వాల్యూం I 1927 ISBN 0-8364-2802-1
  • సువర్ణద్వీప, ఏన్షియంట్ ఇండియన్ కాలనీస్ ఇన్ ద ఫార్ ఈస్ట్ వాల్యూం II
  • ద హిస్టరీ ఆఫ్ బెంగాల్ 1943 Majumdar, R.c. (1943). History Of Bengal Vol.1. ISBN 81-7646-237-3. Retrieved 2020-07-13.
  • కాంబోజ దేశ్ ఆర్ ఏన్ ఏన్షియంట్ హిందూ కాలనీ ఇన్ కాంబోడియా 1944
  • ఏన్ అడ్వాన్స్‌డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా 1960 ISBN 0-333-90298-X
  • ద హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్ 1951-1977 (11 సంపుటాలలో)
  • ఏన్షియంట్ ఇండియా 1977 ISBN 81-208-0436-8
  • హిస్టరీ ఆఫ్ ద ఫ్రీడం మూవ్‌మెంట్ ఇన్ ఇండియా (మూడు సంపుటాలలో) ISBN 81-7102-099-2
  • వాకటక - గుప్తా ఏజ్ సిర్కా 200-500 ఎ.డి.ISBN 81-208-0026-5
  • మెయిన్ కరెంట్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీISBN 81-207-1654-X
  • క్లాసికల్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా
  • హిందూ కాలనీస్ ఇన్ ఫార్ ఈస్ట్ 1944 ISBN 99910-0-001-1
  • ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా 1979 ISBN 81-7018-046-5
  • ద హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ లక్షద్వీప్ 1979
  • కార్పొరేట్ లైఫ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా (పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథం)

ఇతడు 1980, ఫిబ్రవరి 11న మరణించాడు. ఇతడు మరణించేనాటికి ఇతని వయసు 92 సంవత్సరాలు. ఇతడు చివరి రోజు కూడా చరిత్ర రచన చేస్తూనే ఉన్నాడు[4].

మూలాలు

మార్చు
  1. Shobhan Saxena (17 October 2010). "Why is our past an area of darkness?". Times Of India. Archived from the original on 23 సెప్టెంబరు 2012. Retrieved 15 December 2012.
  2. "Books". Spectrum. The Sunday Tribune. 3 September 2006. Retrieved 15 December 2012.
  3. Corporate Life in Ancient India: Thesis Archived 2015-06-11 at the Wayback Machine. mcmaster.ca. Retrieved 17 November 2013
  4. వేంకటరావు (13 April 1980). "చరిత్రలో కలిసి పోయిన చరిత్రకారుడు మజుందార్". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 67, సంచిక 13. Retrieved 25 January 2018.[permanent dead link]

బయటి లింకులు

మార్చు
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.