రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి

రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి (డిసెంబరు 9, 1908 - నవంబరు 19, 1995) ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకులు, సంస్కృతాంధ్ర పండితులు.[1]

వీరు పాలకొండ మండలంలోని గుడివాడ అగ్రహారంలో ముఖలింగేశ్వరుడు, సోదెమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి వద్ద రామాయణ, భారత, భాగవతాలను విని తెలుసుకున్నారు. 13వ ఏట తండ్రి మరణించగా శ్రీహరిపురం లో కొంతకాలం అధ్యాపకునిగా పనిచేశారు

విద్యాభ్యాసం

మార్చు

గొల్లాది లో గన్నవరపు అబ్బన్నశాస్త్రి వద్ద చేరి కాళిదాస త్రయాన్ని, కావ్య నాటకాలను 18 నెలలలో పూర్తిచేశారు. తర్వాత విజయనగరం లోని సంస్కృత కళాశాలలో విద్యార్ధిగా చేరారు. తాతా సుబ్బరాయశాస్త్రి, నౌడూరు వేంకటశాస్త్రి, పేరి వేంకటేశ్వరశాస్త్రి, అప్పల్ల జోగన్నశాస్త్రి, కొంపెల్ల విశ్వనాథశాస్త్రి తదితరుల వద్ద వ్యాకరణం నేర్చుకున్నారు. గంటి సూర్యనారాయణ దగ్గర మీమాంసాదులను, పరవస్తు రామానుజాచార్యులు వద్ద ఋగ్వేదం, భాషాశాస్త్రం, ఉపనిషత్తులను నేర్చుకున్నారు.

ఉద్యోగం

మార్చు

1929 లో పార్వతీపురం పాఠశాలలో సంస్కృత పండిత పదవిని చేపట్టారు. 1940 లో టెక్కలి పాఠశాలలో తెలుగు పండితునిగా చేరారు. 1951 లో విశాఖపట్నం లోని ఎ.వి.ఎన్. కళాశాలలో పండిత పదవికి ఎంపికయ్యారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో ఆంధ్ర పండిత పదోన్నతిని పొంది మూడు సంవత్సరాలు సేవలందించారు.

ప్రవచనాలు

మార్చు

పదవీ విరమణ చేసిన తర్వాత విశాఖపట్నంలో స్థిరపడ్డాడు, 1950 లో దివ్యజ్ఞాన సమాజం లో భగవద్గీత ప్రవచనం ప్రారంభించారు.1969 నుండి 1975 వరకు ద్వారకానగర్ లోని శంకరమఠంలో రామాయణ, భారత, భాగవతాలను నిరాఘాటంగా ప్రవచించారు. తర్వాత 1975 నుండి రెండు దశాబ్దాలు మధురానగర్ లో రామాయణాది పురాణాలే కాకుండా శ్రీ సీతారామాంజనేయ సంవాదం, ఉత్తర రామచరిత్ర, భాస్కర రామాయణం, వివేక చూడామణి మొదలైన గ్రంథాల సారాన్ని కూడా అందరికి ప్రవచనాల రూపంగా అందించారు.

రచనలు

మార్చు

వీరు అనర్ఘ రాఘవం, అభిజ్ఞాన శాకుంతలం, మేఘ సందేశం, విక్రమోర్వశీయం, మాళవికాగ్ని మిత్రం, రఘువంశ రత్నాలు, కాశీ శతకం, రామచంద్ర శతకం మొదలైన సంస్కృత కావ్యాలను ఆంధ్రీకరించారు. ప్రతీకారం పేరుతో సంస్కృత నాటకం రచించారు.

విశాఖపట్నంలో వీరికి 1968లో షష్టిపూర్తి ఉత్సవం వైభవంగా జరిగినది. వీరు 1995 నవంబరు 19 తేదీన పరమపదించారు.

మూలాలు

మార్చు
  1. లక్ష్మీనారాయణశాస్త్రి, రాంభొట్ల, 20 శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీలు: 610-11.