రాచవేటి వీరభద్ర స్వామి దేవాలయము

రాచవేటి వీరభద్ర స్వామి దేవాలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అన్నమయ్య జిల్లాలో రాయచోటి పక్కన ఉన్న మాండవ్య నది ఒడ్డున ఉంది. వీరశైవుల పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ దేవాలయం రాయల కాలం నుండి అత్యంత ప్రసిద్ధి గాంచింది.

రాచవీటి వీరభద్రస్వామి దేవాలయం

చరిత్ర సవరించు

పూర్వ కాలంలో సామంతరాజులు ఈ ప్రాంతానికి విచ్చేసిన సమయంలో మాండవ్య నది ఒడ్డున సేద తీరుతూ ఉండేవారని ప్రతీతి. ఆ కాలంలోనే భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయాన్ని భక్తి ప్రపత్తులతో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు మాండవ్య నది ఒడ్డున వెలసిన వీరభద్రస్వామి దేవాలయం భక్తులతో కళకళలాడుతోంది. గతంలో రాచవీడుగా పిలువబడిన నేటి రాయచోటికి పేరు ప్రఖ్యాతలు రావడానికి వీరభద్రస్వామి దేవాలయమేనని పెద్దలు పేర్కొంటున్నారు.


చోళ సామ్రాజ్య విస్తరణలో భాగంగా యుద్ధాలు చేసి ఆలసిపోయిన రాజరాజ చోళుడు మానసిక ప్రశాంతత కోసం దేశాటనకు బయలుదేరి ఇక్కడి మాండవ్య నది తీరానికి చేరుకున్నాడు. కొండల, గుట్టల నడుమ ప్రవహిస్తున్న మాండవ్య నది ఒడ్డున సాగైన పూల తోటలతో ఈ ప్రాంతం ఆయనను విశేషంగా ఆకర్షించిందని, దీంతో ఆయన ఇక్కడే తన పరివారంతో నిలిచిపోయి భద్రకాళి సమేత వీరభద్రుని కొలిచి జీర్ణావస్థలో ఉన్న ఆలయాన్ని పునః నిర్మించాడని చరిత్ర చెబుతోంది.

ఆలయ విశేషాలు సవరించు

వీరభద్ర ఆలయం వీరశైవుల పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్వయంగా వీరభద్రుడే విగ్రహ మూర్తిగా ఇక్కడ కొలువైనందున రాయచోటి వీరభద్ర ఆలయాన్ని దక్షణ భారత దేశ వీరభద్ర ఆలయానికి మూలవిరాట్‌గా పేర్కొంటుంటారు.

వీరభద్రునికి రాచరాయుడు అనే పేరు కూడా ఉంది. బ్రహ్మోత్సవాలు నిర్వహణ అనంతరం మార్చి నెలలో 21 నుండి 24వ తేదీల మధ్యలో ఎన్నో ద్వారాలు దాటుకొని సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం విశేషం. ఆలయ వాస్తు నిర్మాణ చాతుర్యానికి అది నిదర్శనమని చెప్పవచ్చు.

వీరభద్రుని హిందువులతో పాటు ముస్లింలు దర్శించుకుంటారు. ముస్లింలోని దేశముఖ్‌తేకు చెందిన వారు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి పూజా సామాగ్రి పంపుతారు. ఆలయ కమిటీ వారు వాటిని స్వీకరించి పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను తిరిగి వారికి పంపడం ఆనవాయితీగా వస్తోంది.

ఆలయ గాలిగోపురం ముందు భాగంలో 56 అడుగుల ఎత్తు గల ఏక శిలారాతి దీప స్తంభం ఉంది. ఇది ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంత పెద్ద ఏకశిల దీపస్తంభం దక్షణ భారత దేశంలోనే మరెక్కడా లేదని చెప్పవచ్చు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ స్తంభంపై భాగంలో దీపం వెలిగించి స్వామిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది.

మూలాలు సవరించు