మాదయ్యగారి మల్లన

(రాజశేఖర చరిత్ర (మాదయ్యగారి మల్లన కావ్యం) నుండి దారిమార్పు చెందింది)

మాదయ్యగారి మల్లన అష్టదిగ్గజములలో ఒకడు. 16వ శతాబ్దపు తెలుగు కవి. ఇతడు శైవబ్రాహ్మణుడు. అప్పటికే మల్లన్న అని మరో కవి ఉండటంచేత ఈయన్ను తండ్రి పేరితోడగూడ జేర్చి మాదయ్యగారి మల్లన్న అని చెప్పుదురు.[1]

మల్లన 516 గద్యపద్యములతో కూడిన రాజశేఖర చరిత్ర అను మూడు అశ్వాసాల కావ్యమును రచించాడు. ప్రబంధ శైలిలో రచించబడిన రాజశేఖర చరిత్రలో అవంతీ పురాన్ని పాలించే ఒకానొక రాజశేఖరుడు అనే రాజు యొక్క యద్ధ విజయాలను, ప్రణయ విజయాలను వర్ణించాడు. ఈ గ్రంథమును ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో చేరకముందే రచించాడు. రాయలసభలో ఉన్నపుడు ఈయన ఏ రచనలు చేసిన ఆధారాలు లేవు. కనీసము సభలో చెప్పిన చాటు పద్యములు కూడా లభ్యము కాలేదు. ఈతని కవిత్వము మృదుమధుర పదగుంభనము కలదయి మనోహరముగా ఉంది.[1] సమకాలీన ప్రబంధ కవులకు భిన్నంగా, రాజశేఖర చరిత్ర యొక్క కథ పూర్తిగా మాదయ్యగారి మల్లన మేథోసృష్టే. దీనికి ఎటువంటి సంస్కృతమూలం లేదు. ఈయన సమకాలీనులతో పోలిస్తే, శృంగార వర్ణనలు చాలా సున్నితంగా, పరిమితంగా వ్రాశాడు.

రాయలతోపాటు దండయాత్ర లకు, తీర్థయాత్ర లకు తప్పకుండా వెళ్లే కవులలో మల్లన ఒకడు. రాయల కొలువులో మొదటినుండి ఉన్నా రాజశేఖర చరిత్రలో రాయల ప్రస్తావన లేదు. ఈయన తన కావ్యమును 1516 - 1520 మధ్య వినుకొండ, గుత్తి సీమలను పరిపాలించిన నాదెండ్ల అప్పమంత్రికి అంకితమిచ్చాడు. అప్పమంత్రి తిమ్మరుసు మేనల్లుడు, అల్లుడు.

ఆంధ్ర మహిళలు ఐదవతనముగా భావించే నల్లపూసలు గురించిన ప్రస్తావన సాహిత్యములో తొలిసారిగా చేసినది మల్లన్ననే. లగ్నము పెట్టడము దగ్గరినుండి గృహప్రవేశము‌ వరకు 75 గద్యపద్యములలో అనాటి పెళ్ళితంతు గురించి రాజశేఖరచరిత్ర లో వర్ణించాడు.

రాజశేఖర చరిత్ర (మాదయ్యగారి మల్లన కావ్యం) మార్చు

మల్లన తన గురించి రాజశేఖర చరిత్రలో ఎక్కడా పెద్దగా చెప్పుకోలేదు. ఈయన కృష్ణా జిల్లాలోని అయ్యంకిపురముకు చెందిన వాడని తెలుస్తున్నది అయితే కడప జిల్లాలో పెరిగినాడు. ఈయన గురువు కడప జిల్లా పుష్పగిరికి చెందిన అఘోర శివాచార్యులు.

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  • సమగ్ర ఆంధ్ర సాహిత్యము - ఆరుద్ర 7వ సంపుటం పేజీలు 54-69
  1. 1.0 1.1 కందుకూరి, వీరేశలింగం పంతులు (1949). ఆంధ్రకవుల చరిత్రము - రెండవ భాగము (మధ్యకాలపు కవులు). రాజమండ్రి: హితకారిణీ సమాజము. p. 64.[permanent dead link]


అష్టదిగ్గజములు
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు