ప్రధాన మెనూను తెరువు

మొదటి రాజేంద్ర చోళుడు

(రాజేంద్ర చోళుడు నుండి దారిమార్పు చెందింది)

రాజేంద్ర చోళుడు లేదా మొదటి రాజేంద్ర చోళుడు (1014−1044) ప్రాచీన భారతదేశాన్ని పరిపాలించిన 11వ శతాబ్దానికి చెందిన చోళ రాజు. ఈయనకు గంగైకొండ, కడారంకొండ, పండిత చోళ అనే బిరుదులు కూడా ఉన్నాయి. భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప పాలకుల్లో ఇతనిని ఒకడిగా చరిత్రకారులు పరిగణిస్తారు. ఇతను తన తండ్రి రాజరాజ చోళుడి తర్వాత సా. శ 1014 లో సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతని పరిపాలనలో చోళ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గంగానది తీరం వరకు, హిందూ మహాసముద్రం దాటి పశ్చిమానికి, ఆగ్నేయ ఆసియా వైపుకి విస్తరించింది. అందుకనే ఇది ప్రాచీన భారతీయ రాజ్యాలలో బలమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతోంది.[1][2] ఈయన జైత్రయాత్రలో భాగంగా శ్రీలంక, మాల్దీవులు జయించాడు. అంతేకాక మలేషియాలోని శ్రీవిజయ, ఆగ్నేయ ఆసియాలోని దక్షిణ థాయ్ ల్యాండ్, ఇండోనేషియా మీద కూడా దాడులు చేశాడు.[1][3] థాయ్ ల్యాండ్, కాంబోడియా రాజ్యానికి చెందిన ఖ్మేర్ ప్రాంతాల నుంచి కప్పం వసూలు చేశాడు. ప్రస్తుతం బెంగాల్, మరియు బీహార్ రాష్ట్రాల్లో విస్తరించిన గౌడ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న పాలవంశ రాజు మహిపాలుడిని ఓడించాడు. తన విజయాలకు గుర్తుగా గంగైకొండ చోళుడు (గంగానది ప్రాంతాన్ని జయించిన వాడు) అనే బిరుదు పొందాడు.[4] గంగైకొండ చోళపురం అనే కొత్త రాజధాని కూడా నిర్మించాడు.[5][6] ఈయన తన కుమార్తె అమ్మాంగ దేవిని తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుడికిచ్చి వివాహం చేశాడు. తిరువాలంగాడు, తిరుమలై శాసనాలు ఇతని విజయాలను గూర్చి వర్ణిస్తాయి. ఈయన తర్వాత ఇతని కుమారుడు రాజాధిరాజు విజయ రాజేంద్ర అనే పేరుతో రాజ్యాన్ని పరిపాలించాడు.

విజయ యాత్రలుసవరించు

మొదట పాండ్య, చేర రాజ్యాలను జయించాడు. గంగానది వరకు వెళ్ళి పాలరాజు మహీపాలుడిని ఓడించి గంగైకొండ అనే బిరుదు పొందాడు. నౌకా దండయాత్రలు చేసి శ్రీలంక శ్రీవిజయ రాజ్యాలను జయించాడు. సుమత్రా, మలయా, బోర్నియో లాంటి ప్రాంతాలను ఆ రోజుల్లో శ్రీ విజయ రాజ్యం అని పిలిచేవారు. 1025లో శ్రీవిజయ రాజు శైవేంద్రుడిని ఓడించి ఆ రాజధాని కడారం పేరు మీదుగా కడారంకొండ అనే బిరుదు పొందాడు. 1029లో సింహళ రాజు మహేంద్రుడిని ఓడించాడు. అరేబియా సముద్రంపై నౌకాదళ ఆధిపత్యాన్ని నెలకొల్పిన తొలి భారతీయ పరిపాలకుడు మొదటి రాజేంద్ర చోళుడు.

చాళుక్య రాజ్యంలో జరిగిన వారసత్వ యుద్ధాల్లో వేంగీ చాళుక్యుల పక్షాన నిలిచి రాజరాజ నరేంద్రునికి సహాయం చేశాడు. అంతేకాక అతనికి తన కూతురు అమ్మాంగి దేవినిచ్చి వివాహం చేశాడు.

ఆలయాలు, నిర్మాణాలుసవరించు

రాజేంద్ర చోళుడు శిల్పకళను బాగా ఆదరించాడు. తంజావూరులోని బృహదీశ్వరాలయం తమిళనాడులోని ఆలయాల్లోకెల్లా అతి పెద్దది. దీన్ని రాజేంద్ర చోళుడి తండ్రి రాజ రాజ చోళుడు నిర్మించాడు. రాజేంద్ర చోళుడు పాల వంశం మీద సాధించిన విజయానికి గుర్తుగా గంగైకొండ చోళపురం అనే నగరాన్ని నిర్మించి అందులో తండ్రి కట్టించిన ఆలయాన్ని పోలిఉండే మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. విస్తీర్ణపరంగా ఈ ఆలయం తంజావూర్ ఆలయం కంటే పెద్దది.[7] గంగైకొండ చోళపురం ఆగ్నేయ ఆసియా దేశాలతో వ్యాపార సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి తోడ్పడింది.

ఎన్నాయిరం వైదిక కళాశాలను నిర్మించాడు. దాని పోషణకు కొంత భూభాగాన్ని కూడా దానమిచ్చాడు. పెద్ద కృత్రిమ రిజర్వాయరు నిర్మింపజేసి కొలెరుం, వెల్లార్ నదుల నుంచి కాలువల ద్వారా నీటిని నింపాడు.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 Trade and Trade Routes in Ancient India by Moti Chandra p.213
  2. Advanced Study in the History of Medieval India by Jaswant Lal Mehta p.37
  3. Power and Plenty: Trade, War, and the World Economy in the Second Millennium by Ronald Findlay, Kevin H. O'Rourke p.67
  4. Satish., Chandra, (2007). History of medieval India : 800-1700 page-29. Hyderabad, India: Orient Longman. ISBN 8125032266. OCLC 191849214.CS1 maint: extra punctuation (link)
  5. Cultural Sociology of the Middle East, Asia, and Africa: An Encyclopedia by Andrea L. Stanton, Edward Ramsamy, Peter J. Seybolt, Carolyn M. Elliott p.18
  6. The Sea and Civilization: A Maritime History of the World by Lincoln Paine p.866
  7. "గంగైకొండ చోళపురం బృహదీశ్వరాలయం". nativeplanet.com. 29 March 2016. Retrieved 22 November 2018.