రాన్ ఆఫ్ కచ్
రాన్ ఆఫ్ కచ్ (కచ్చి భాష: కచ్ జో రాన్) భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. ఇది ప్రపంచంలోని అతి పెద్ద ఉప్పు ఎడారులలో ఒకటి.[1] రాన్ అంటే ఎడారి, కచ్ అంటే తాబేలు. రాన్ ఆఫ్ కచ్ మ్యాప్ తాబేలు తిరగబడినట్లు కనిపిస్తుంది. అందుకే దీనికి రాన్ ఆఫ్ కచ్ అనే పేరు వచ్చింది. ఇది ఎక్కువగా భాగం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది, కొంత భాగం పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్‌లో విస్తరించి ఉంది. ఇది గ్రేట్ రాన్, లిటిల్ రాన్‌గా విభజించబడింది. ఇది మొత్తం 26,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. దీనికి తూర్పు, పడమర అంతటా ఉప్పు నేల ఉంటుంది. ఉత్తరాన థార్ ఎడారి, దక్షిణాన పర్వతాలుంటాయి. పశ్చిమాన సింధు నది డెల్టా కూడా ఉంటుంది.[2] రాన్ ఆఫ్ కచ్‌లో బన్ని అని పిలువబడే గడ్డి భూములు ఉన్నాయి.
కచ్ ఎడారి
కచ్ జో ఎడారి | |
---|---|
సహజ ప్రాంతం | |
దేశం | భారతదేశం, పాకిస్తాన్ |
వాతావరణం
మార్చురాన్ ఆఫ్ కచ్ లో వేసవిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి. చలికాలంలో కూడా 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే రాత్రివేళ మాత్రం ఒక్కోసారి మైనస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి. అందువల్ల పర్యాటకులు అక్కడికి వార్షాకాలం తర్వాత వెళ్తుంటారు. ఇక్కడ ఫిబ్రవరి వరకు టూరిస్టుల రాక ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వర్షపాతం చాలా కాలానుగుణంగా ఉంటుంది. రాన్ ఆఫ్ కచ్ సంవత్సరంలో చాలా వరకు పొడిగా ఉంటుంది, జూన్ నుండి సెప్టెంబరు వరకు వర్షాకాలంలో వర్షపాతం కేంద్రీకృతమై ఉంటుంది. వర్షాకాలంలో, స్థానిక వర్షపాతం, నది ప్రవాహాలు రాన్‌లో ఎక్కువ భాగం 0.5 మీటర్ల లోతు వరకు ప్రవహిస్తాయి.[3] రాజస్థాన్, గుజరాత్‌లలో ఉన్న అనేక నదులు రాన్ ఆఫ్ కచ్‌లోకి ప్రవహిస్తాయి. అవి: లుని , భుకి, భరుద్, నర, ఖరోడ్, బనాస్, సరస్వతి, రూపన్, బాంబన్, మచ్చు. వేసవి కాలంలో ఇక్కడ నీరు ఆవిరైపోతుంది, తదుపరి వర్షాకాలం ప్రారంభం వరకు రాన్ పొడిగా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఎత్తు పల్లాలు లేని సమాంతరమైన తెల్లటి నేలే కనిపిస్తుంది. అది దాదాపు అరేబియా సముద్రమట్టానికి సమానంగా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో అక్కడ వరదలు కూడా వస్తాయి.
ఉప్పు తయారీ
మార్చుఒకప్పుడు రాన్ ఆఫ్ కచ్ పూర్తిగా సముద్రంలో ఉండేది. అంటే దాదాపు 20 శాతం గుజరాత్‌లో భూమి బదులు సముద్రమే ఉండేది. ఒకసారి భూకంపం రావడం వలన సముద్ర మట్టం కంటే కింద ఉండే రాన్ ఆఫ్ కచ్ భూమి ఆ భూకంపం దెబ్బకు ఒక్కసారిగా పైకి లేచింది. ఆ భూమి పలక మొత్తం పైకి లేవడంతో అక్కడి నీరంత ఎండిపోయింది. స్థానిక అగారియా ప్రజలు రాన్ ఆఫ్ కచ్‌లో ఏటా చాల టన్నుల ఉప్పును తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో వారు ఉప్పు తయారీని ప్రారంభిస్తారు. భూమిలో 40 అడుగుల లోతుకు గొయ్యి తవ్వి అత్యంత ఉప్పగా ఉండే నీటిని బయటకు తీస్తారు. ఆ నీరు సముద్ర నీరు కంటే 10 రెట్లు ఎక్కువ ఉప్పుతో ఉంటుంది. బయటకు తీసిన నీటిని ఎండబెట్టడం ద్వారా ఉప్పును తయారుచేస్తారు. ఇలా ప్రతి 15 రోజులకు 15 టన్నుల దాకా ఉప్పును సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న ఉప్పు కంపెనీలకు పంపుతారు. భారతదేశ మొత్తం ఉప్పులో 75 శాతం రాన్ ఆఫ్ కచ్ లోనే తయారుచేస్తారు.[4]
రాన్ ఆఫ్ కచ్ ఉత్సవ్
మార్చుఈ ఉత్సవం ప్రతి యేటా అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు జరుగుతుంది. ఇక్కడ స్థూపాకార మట్టి భుంగాలు (గుడిసెలు) ఉన్న గిరిజన కుగ్రామాలు ఉంటాయి. ఈ ఉత్సవంలో జానపద సంగీతం, నృత్య ప్రదర్శనల లాంటివి ఉంటాయి.[5] కచ్ ఎంబ్రాయిడరీ, టై అండ్ డై, లెదర్‌వర్క్, కుండలు, బెల్ మెటల్ క్రాఫ్ట్, ప్రసిద్ధ రోగన్ పెయింటింగ్ స్టాల్స్ ఈ ఉత్సవంలో ఉంటాయి.
పర్యావరణం
మార్చురాన్ ఆఫ్ కచ్ మొత్తం ఇండో-మలయ్ ప్రాంతంలో వరద మైదాన సముద్రతీర వృక్షసంపద ఉన్న ఏకైక పెద్ద జోన్. ఈ ప్రాంతం ఒకవైపు ఎడారి, మరోవైపు సముద్రం కలిగి ఉండటం వల్ల రాన్ ఆఫ్ కచ్‌కు మడ అడవులు, జిరోఫైటిక్ వృక్షాలతో సహా అనేక రకాల పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి. గడ్డి భూములు, ఎడారుల వంటి విస్తారమైన ప్రాంతాలు వన్యప్రాణులకు నిలయంగా ఉన్నాయి. స్థానిక, అంతరించిపోతున్న జంతు, వృక్ష జాతులు ఇక్కడ ఉన్నాయి. నీల్గాయ్ జింకలు, ఆసియాటిక్ అడవి గాడిద జాతులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. రాన్ నుండి దాదాపు 200 కి.మీ తూర్పున, లిటిల్ రాన్ ఆఫ్ కచ్ ఉంది, ఇందులో 4953-చ.కి.మీ వైల్డ్ యాస్ అభయారణ్యం ఉంది. ఇందులో చెస్ట్‌నట్-రంగు భారతీయ అడవి గాడిద (ఖుర్),[6] అలాగే బ్లూ-బుల్స్, బ్లాక్‌బక్, చింకారా జంతువులు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పు ఎడారులలో ఒకటి". Testbook. Retrieved 2023-05-21.
- ↑ "దేశంలో వింత ప్రదేశం.. రాన్ ఆఫ్ కచ్ రహస్యమేంటి?". Samayam Telugu. Retrieved 2023-05-21.
- ↑ "Southern Asia: Western India into Pakistan | Ecoregions | WWF". World Wildlife Fund. Retrieved 2023-05-21.
- ↑ Pal, Sanchari (2016-11-02). "Worth their Salt: A Fascinating Glimpse into the World of the Hardworking Salt Farmers of Kutch". The Better India. Retrieved 2023-05-21.
- ↑ "Rann Utsav". gujrattourism. Retrieved 2023-05-21.
- ↑ "Great Rann of Kutch". gujrattourism. Retrieved 2023-05-21.