రామగిరిఖిల్లా
రామగిరి ఖిల్లా తెలంగాణ ప్రాంతంలో రామగిరి వద్ద గల విశిష్టమైన పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. [1]
ఇది అద్భుత కళా సంపదకు నిలువెత్తు నిదర్శనం. నాటి శిల్పుల నైపుణ్యతకు తార్కాణం. రామగిరి కోట గురిజాల కమ్మవంశీయులు ఈ కోటను పరిపాలించారు.[2]
విశేషాలు
మార్చుఆహ్లదపరిచే ప్రకృతి రమణీయ దృశ్యాలు ఓవైపు, ఉల్లాసాన్ని పంచే సెలయేటి గలగలలు, అబ్బురపరిచే కళాఖండాలు మరోవైపు, రాజుల ఏలుబడిలో శతాబ్దాల చరిత్ర కలిగిన రామగిరి ఖిల్లా, ప్రాచీన కళావైభవాన్ని చాటుతూ నేటకీ పర్యాటకులను అలరిస్తు విరాజిల్లుతోంది. కాకతీయుల కాలం శిల్ప కళాపోషణకు పెట్టింది పేరుగా ఉండేది. వీరి పరిపాలనలోనే రామగిరి దుర్గం పై అపురూప కట్టడాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. లక్ష్మణుడు, ఆంజనేయుడితోపాటు సీతా సమేతుడైన శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో రామగిరి దుర్గంపై విడిది చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. దీంతో రామగిరి పర్యాటక కేంద్రంగానే కాక ఆధ్యాత్మిక కేంద్రాంగాను బాసిల్లుతోంది. 200 రకాలకు పైగా వనమూలికలను కలిగివున్న ఈ ఖిల్లా ఆయుర్వేద వైద్యానికి మూలకేంద్రంగా పేరొందింది. చారిత్రాత్మక నేపథ్యంతో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
చరిత్ర
మార్చుపెద్దబొంకూర్,గుంజపడుగు గ్రామాల్లో పురావస్తు శాఖ త్రవ్వకాలలో బయటపడిన ఆధారాలు తెలుపుతున్నాయి. చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు ఈ దుర్గాన్ని అభివృద్ధిపరిచారని చరిత్ర చెబుతుంది. క్రీశ 1158 లో చాళుక్య గుండ రాజును ఓడించి కాకతీయులు రామగిరి దుర్గాన్ని స్వాధీనపరుచుకొన్నారు. రామగిరి ఖిల్లాను ప్రతాపరుద్రుడు 1195 వరకు పాలించినట్లు ఓరుగల్లు, మంత్రకూటమిల శాసనాలు తెలియపరుస్తున్నాయి. అనంతరం గురిజాల కమ్మవంశీయులు ముసునూరి కమ్మరాజుల ఆధ్వర్యములో శత్రుదుర్బేధ్యమైన కోటగా నిర్మించి పాలించారు.రామగిరి రాజధానిగా రాజు గురిజాల ముప్పభూపతి సబ్బినాడును వైభవోపేతముగా పరిపాలించాడు. మడికి సింగన ఇతని ఆస్థానంలోని కవి.వీరు 13వ శతాబ్దం నుండి 15 శతాబ్ద మద్యభాగం వరకు పాలన సాగించారు.1442 లో బహమనీ సుల్తానులు ఆక్రమించుకోగా అటుపిమ్మట 1595లో మొఘలాయిల స్వాధీనంలోకి వెల్లింది. 1606 లో గోల్కొండ నవాబుల ఈ దుర్గాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.
వారి నుండి మహమ్మదీయులు వశపరుచు కొని నైజాం కాలం వరకు పాలించినట్లు చరిత్ర చెబుతుంది. అప్పట్లో రామగిరి కోటకు ఇరువైపులా తొమ్మిది ఫిరంగులు 40 తోపులు ఉండేవి. కాలక్రమంలో వాటి సంఖ్య కుదించుకుపోయింది. ప్రస్తుతం కేవలం ఒక్క ఫిరంగి మాత్రమే ఉంది. పౌరాణికంగాకూడా రామగిరి ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకుంది. శ్రీరాముడు వనవాసం సమయంలో ఇక్కడికి వచ్చి తపస్సు చేసి ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కోటపైన సీతాసమేత శ్రీరాముడు, హనుమాన్ విగ్రహాలతో పాటు నంది విగ్రహం కూడా ఉంది. శ్రీరాముని విగ్రహం ఉన్న చోట సుమారు 1000 మంది తలదాచుకునేంత విశాల ప్రదేశం ఉండడం విశేషం. రాజులపాలనలో రామగిరిఖిల్లా పరిసర ప్రాంతానికి రామగిరి పట్టణం అనే పేరు వచ్చింది. చుట్టుపక్కల గ్రామాలన్నీ వాడలుగా ఉండేవని అంటారు. రాజుల ఆస్థానంలో సంగీత నృత్యకళాకారులుండే ప్రాంతాన్ని బోగంవాడ అనేవారట. కాలక్రమేణ అది బోగంపేట మారింది.
శ్రావణం మాసం లో సందడే సందడి
మార్చువర్షాకాలంలో పచ్చదనం పరుచుకోవడంతో... ప్రతి శ్రావణమాసంలో రామగిరిఖిల్లాపై పర్యాటకుల సందడితో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. రామగిరి దుర్గంపై ప్రకృతి అందచందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరిచిపోతారు. ఆయుర్వేద వైద్యులు ఈ ఖిల్లాపై విలువైన వనమూలికలను సేకరిస్తారు. తెలంగాణ ప్రాంతంలో ప్రాచీన కళా సంపదకు నిలయమైన రామగిరిఖిల్లా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సివుంది. పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దుతా మని పాలకులు చెబుతున్న నేటికి ఆచరణకు అమలు కాలేదు.
శిల్ప కళకు ఒడి
మార్చుకాకతీయుల కాలంలో రామగిరిపై నిర్మించిన రామగిరి కోట శిల్ప కళా సంపదతో శోభిల్లుతుంది. పర్యాటకులను ఆహ్లదపరుస్తూ అలరిస్తోంది. కాకతీయుల శిల్ప సాంస్కృతిక సంపదకు తార్కాణంగా నిలుస్తూ శ్రావణ మాసంలో వచ్చే భక్తులకు, సందర్శకులకు నిలయంగా మారింది. ఇక్కడి నిర్మింపజేసిన రాతి కట్టడాలు అప్పటి శిల్ప కళానైపుణ్యాన్ని చాటుతాయి. రాతిపై చెక్కిన సుందర దశ్యాలు పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తుంది.
రాముడు నడయాడిన నేల
మార్చువనవాసం కాలంలో శ్రీరాముడు రామగిరిపై కొద్దిరోజులు కుటీరం ఏర్పారుచుకొని సీతా లక్ష్మణులతో ఉన్నారని పెద్దలు చెబుతారు. ఈ ఖిల్లాపై సీతారామలక్ష్మణులు సంచరించినట్లు చెప్పబడుతున్న కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ చెక్కుచెదరకుండా పర్యాటకులకు దర్శనమిస్తాయి. ఖిల్లాపైన గల బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరించిన కొలనుతోపాటు శ్రీరామునితో సంచరించిన ఆంజనేయుడి విగ్రహం కూడా నెలకొల్పబడివుంది.
నాటి వాడలే నేటి పల్లెలు
మార్చురాజుల పరిపాలనాకాలంలో వాడలుగా పిలువబడిన రామగిరి దుర్గం చుట్టుపక్కల ప్రాంతాలు నేడు పల్లె సీమలుగా మారాయి. వాడల యొక్క విశిష్టతను బట్టి నేటికీ ఆ గ్రామాల పేర్లు అలాగే కొనసాగుతుండడం విశేసం. రత్నాలు విక్రయించే వీధిని రత్నాపూర్‌గా మహ్మదీయుల కాలంలో బేగాలు నివాసం ఉండేప్రాంతం నేడు బేగంపేటగా పిలవబడుతోంది. అదేవిధంగా పోతన పేరుతో ఉన్న వాడను పోతారంగా, ఆయన తల్లి లక్కమాంబ పేరుతో ఉన్న ప్రాంతాన్ని లక్కారం అని, నాగాళ్లు నిలిపేచోటును నాగెపల్లి అని, శుక్రవారం సంత జరిగేచోటును శుక్రవారం పేట అని ఆదివారం సంత జరిగేచోటు ఆదివారంపేటగా మైదపుపిండి విసురురాళ్ళు ఉండే చోటును మైదంబండ గా, గుండరాజు పేరున గుండారం అనే పేర్లు వాడుకలోకి వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
చూడాల్సిన ప్రదేశాలు
మార్చురామగిరి దుర్గం అంతర్బాగంలో సాలుకోట, సింహల కోట, జంగేకోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వశాల కోట, కొలువుశాల, మొఘల్‌శాల, చెరశాల, గజశాల, భజన శాల, సభాస్థలి వంటి వాటితో పాటు చెక్కరబావి, సీతమ్మ బావి, పసరుబావి, సీతమ్మకొలను, రహస్య మార్గాలు, సొరంగాలు లాంటి అనేక ప్రదేశాలు పర్యా టకులను ఇట్టే మైమరిచిపోయేలా చేస్తాయి.
రామగిరి చరిత్ర వెలుగులోకి వచ్చిన విధం
మార్చురామగిరి చరిత్రను వెలుగులోకి తీసుకరావడానికి పలువురు రచయితలు ఎంతో వ్యయ ప్రయాసలుకోర్చి రామగిరి చరిత్రను పుస్తకరూపంలో ప్రచురించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేటకు చెందిన యరబాటి బాబురావు, కమాన్‌పూర్ మండలానికి చెందిన మాధవ రావు, బలరాందాస్‌లు ‘రామగిరి మహత్యం’ పేరుతో ఓ గ్రంథాన్ని రాశారు. వీరికంటే ముందు రామగిరి చరిత్రను వెలికితీసిన ఘనత ఆర్.బాలప్రసాద్‌కే దక్కుతుందంటారు.
కళ’ తప్పుతోందా
మార్చుగత చరిత్ర వైభవానికి సజీవ సాక్ష్యమైన రామగిరి ఖిల్లా... ప్రభుత్వం, పురావస్తు శాఖల నిర్లక్ష్యం మూలంగా కళావిహీనమవుతోంది. ప్రాచీన సంస్కృతికి, కళావైభ వానికి అద్దంపట్టిన ఇక్కడి కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదంవుంది. ఇప్పటికైనా ఈ కళాసంపద కనుమరుగు కాకుండా ఈ చారిత్రాత్మక కళాసంపదను పరిరక్షించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అప్పటి కేంద్రహోంశాఖ సహాయ మంత్రి విద్యాసాగర్‌రావు పాదయాత్ర చేపట్టి రామగిరిఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హమీ ఇచ్చారు. అయినా ఆ హామీ, హామీగానే మిగిలిపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రామగిరిఖిల్లాను పర్యాటక కేంద్రాంగా తీర్చిదిద్ది అరుదైన కళాసంపదను కాపాడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ఖిల్లాకు వెళ్లాలంటే
మార్చుకరీంనగర్ జిల్లాకేంద్రం నుంచి తూర్పు దిశగా మంథని, కాళేశ్వరం వెళ్లే రహదారిలో 58 కిలోమీటర్ల దూరంలో వుంది రామగిరి దుర్గం. కమాన్‌పూర్ మండలంలోని నాగెపల్లి (బేగంపేట అడ్డరోడ్డు) నుంచి బేగంపేట గ్రామం మీదుగా నడుచుకుంటూ వెళితే రామగిరిఖిల్లాకు చేరుకోవచ్చు. ఈ రామగిరి ఖిల్లా సాంతం చూడాలంటే కనీ సం 16 కిలోమీటర్లు కొండపైన నడవాల్సి ఉంటుంది. రైలు మార్గం ద్వారా వచ్చే పర్యాటకులు కాజీపేట - బల్లార్షా మార్గంలోని పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో దిగి బస్సు ద్వారా మంథని మార్గంలో బేగంపేటకు చేరుకోవచ్చు.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Tourism lies in neglect". Deccanchronicle. Retrieved 15 February 2019.
- ↑ "రామగిరి ఖిల్లా". telanganatourism.gov.in. తెలంగాణ పర్యాటక శాఖా. Archived from the original on 10 ఫిబ్రవరి 2019. Retrieved 15 February 2019.