రాయసం వెంకట శివుడు
రాయసం వెంకట శివుడు (జూలై 23, 1870 - డిసెంబరు 24, 1953) ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకులు, సంఘ సంస్కర్త.[1]
వీరు పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి (ఇరగవరం మండలం) గ్రామంలో 1870, జూలై 23 తేదీన అనగా ప్రమోదూత నామ సంవత్సరం ఆషాఢ బహుళ దశమి శనివారం నాడు సుబ్బారాయుడు, సీతమ్మ దంపతులకు జన్మించారు. రాజమండ్రిలో చదివి బి.ఏ., ఎల్.టి పరీక్షలను ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. వీరు బి.ఏ. పరీక్ష తమ పంతొమ్మిదవ యేటనే ప్రథములుగా ఉత్తీర్ణులైనందుకు అప్పటి ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ మెట్‌కాఫ్ వీరికి అమూల్యములైన గ్రంథాలను బహూకరించారు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి తర్వాత కొంతకాలానికి కలకత్తాలో ఎం.ఏ. పూర్తిచేశారు. వీరు పర్లాకిమిడి, విజయనగరం, గుంటూరు కాలేజీలలో ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేసి ఆ తర్వాత నెల్లూరులోని వెంకటగిరి రాజావారి కళాశాలలో ప్రిన్సిపాల్ గా 1920 లో చేరి 1929 వరకు పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరి గురువులు కందుకూరి వీరేశలింగం గారు. వీరు నిరాడంబరులు. ఉద్యోగము చేయు కాలములో పేద విద్యార్థులకు ద్రవ్య సహాయము చేసి వారి చదువులకు తోడ్పడినారు. ఉద్యోగుల ఉపకార వేతనము కొరకు రాజమండ్రి గవర్నమెంటు ఆర్ట్స్ కాలేజీలో ధర్మనిధిని ఏర్పాటు చేశారు. గుంటూరులోని తమ గృహమును స్త్రీ సమాజము కొరకు దానము చేశారు. వీరు సంఘ సంస్కరణ భావాలతో 1891 నుండి 1899 వరకు స్త్రీ జనోద్ధరణ, సత్య సంవర్థినీ పత్రికలను నడిపారు. "జనానా" పత్రికను 1894లో కొనుగోలు చేసి 1907 వరకు చిలుకూరి వీరభద్రరావు గారి సహకారంతో నిర్వహించారు.[2] వీరు గుంటూరు జిల్లా గ్రంథాలయ సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. వీరు 1953, డిసెంబరు 24వ తేదీన భీమవరంలో పరమపదించారు[3].
రచనలు
మార్చు- ఆత్మచరిత్రము (1933)
- చిత్రకథా మంజరి (మూడు భాగాలు)
- కమలాక్షి
- రాజేశ్వరి
- హిందూ నారీమణుల చరిత్ర (మూడు భాగాలు)
- వ్యాసావళి (రెండు భాగాలు)
- వీరేశలింగ సంస్మృతి
- లలిత కథావళి
- సోక్రటీస్ చరిత్ర
మూలాలు
మార్చు- ↑ వెంకట శివుడు రాయసం, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, 2వ భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2205, పేజీలు: 751-2.
- ↑ వేంకటశివుడు, రాయసం (1910). "కడచిన 30 సం.ల నుండియు నాంధ్ర దేశమునందలి స్త్రీవిద్యాభివృద్ధి". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 73. Archived from the original on 28 సెప్టెంబరు 2017. Retrieved 6 March 2015.
- ↑ ఆంధ్రపత్రిక దినపత్రిక జనవరి 8, 1954 పేజీ:9 - కీ.శే.రాయసం వెంకటశివుడు గారు[permanent dead link]