రెండవ ప్రపంచ యుద్ధం - ప్రపంచ యుద్ధంగా రూపాంతరం

ప్రధాన వ్యాసం: రెండవ ప్రపంచ యుద్ధం

1941 జూన్ ఆఖరులో జెర్మనీ ఇటలీ, ఫిన్లాండ్ లతో కలిసి సోవియెట్ యూనియన్ మీద దాడి చేసింది. ఈ పోరు మొదట్లో అక్ష రాజ్యాలు పెద్ద విజయాలనే నమోదు చేశాయి. పెద్ద ఎత్తున సోవియెట్ భూభాగాలు జెర్మనీ వశమయ్యాయి. కానీ నెలలు గడిచే కొద్దీ అక్షరాజ్యాల పురోగతి మందగించి శీతాకాలానికి పూర్తిగా ఆగిపోయింది. ఈ క్రమంలో సెప్టెంబరులో లెనిన్ గ్రాడ్, అక్టోబరులో సెవాస్టోపోల్ లను వశపరచుకోవటానికి ప్రయత్నాలు సాగాయి. రాజధాని నగరం మాస్కోపై కూడా ఇదే కాలంలో దాడులు జరిగాయి. డిసెంబరులో సోవియెట్లు జపాన్ ఆక్రమిత మంచూరియా వద్ద తమ సరిహద్దులో ఉన్న అదనపు బలగాలను వెనక్కి రప్పించి ఎదురుదాడికి దిగారు.

జెర్మనీ సోవియెట్ యూనియన్ పై దాడిలో నిమగ్నమైన కాలంలో ఇంగ్లాండ్ తమ బలగాలను పునరేకీకరించనారంభించింది. 1941 ఆగస్టులో ఇంగ్లాండ్-సోవియెట్ యూనియన్ కలిసి ఇరాన్ ని ఆక్రమించాయి. ఆ విధంగా ఇరాన్ లోని చమురు కేంద్రాలు అక్షరాజ్యాల చేజిక్కకుండా చేయటమే కాకుండా సోవియెట్ యూనియన్ కు ఇంగ్లాండ్, అమెరికాల నుండి యుద్ధ పరికరాల సరఫరా సజావుగా జరిగేలా పర్షియన్ మార్గాన్ని తమ అధీనంలో ఉంచుకున్నాయి. అంతే కాకుండా, డిసెంబరులో ఇంగ్లాండ్ ఆఫ్రికాలో అక్ష రాజ్యాలపై ప్రతి దాడి జరిపి దాదాపు జెర్మనీ, ఇటలీ స్వాధీనపరచుకున్న భూభాగాలన్నింటినీ వశ పరచుకుంది.

ముందు: అక్షరాజ్యాల ముందంజ తరువాత: మిత్రరాజ్యాల తొలి విజయం