లక్ష్మీనివాసం 1968 లో వి. మధుసూదనరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో ఎస్. వి. రంగారావు, అంజలీ దేవి, చిత్తూరు నాగయ్య, కృష్ణ, శోభన్ బాబు, వాణిశ్రీ, పద్మనాభం ముఖ్య పాత్రలు పోషించారు. వయసు మళ్లిన ముఖ్య వ్యాపారి రంగయ్య పాత్రనే కథానాయకునపాత్ర కాగా, ఈ సినిమా నిర్మాణ కాలంలో వర్ధమాన నటులుగా పేర్కనదగ్గ నటులు (తదుపరి కాలంలో నిన్నటి తరం ప్రఖ్యాతనాయకులు) ఇతర పాత్రలు పోషించారు.

లక్ష్మీనివాసం
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
నిర్మాణం టి.గోవిందరాజన్
తారాగణం ఎస్.వి.రంగారావు,
అంజలీదేవి,
ఘట్టమనేని కృష్ణ,
శోభన్ బాబు,
వాణిశ్రీ,
భారతి
పద్మనాభం
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు ఆరుద్ర
నిర్మాణ సంస్థ వీనస్ కంబైన్స్
భాష తెలుగు

చిత్రకథ

మార్చు

షాపుకారు రంగయ్య (ఎస్.వి.రంగారావు) వ్యాపారి లక్షాధికారి. భార్య (అంజలీ దేవి) మహిళా సంఘాద్యక్షురాలు. గొప్ప కోసం డబ్బుని నీళ్లలా ఖర్చుపెడుతుంది. పెద్దకొడుకు (కృష్ణ) బి.కాం. (ఆనర్స్) గ్రాడ్యుయేట్. సినిమా టిక్కెట్లు దొరక లేదని తదుపరి ఆటకు సినిమా ధియేటర్ కెపాసిటీ టిక్కెట్లు మొత్తం కొని స్నేహితులతో సినిమా చూసేటంత విలాస వంతుడు. రెండవ కొడుకు (పద్మనాభం) నాటకాల రాయుడు. అతడే నాటకం కంపెనీ నడుపుతూ తండ్రి సంపాదన తగలేస్తూ ఉంటాడు. కూతరు (భారతి) తల్లి పోకడలను పుణికి పుచ్చుకుంది. అతని వద్ద పని చేసిన గోపాలం (నాగయ్య) కు రంగయ్య అంటే ఆరాధనా భావం. అతడి కొడుకు(శోభన్ బాబు) కూతురు (వాణిశ్రీ) లను పధ్ధతిగా, బాధ్యత యుతంగా పెంచాడు. రంగయ్యకు వ్యాపారంలో నష్టం వస్తుంది. దివాళా తీసే పరిస్ధిత వస్తుంది. కొడుకులు, కూతురు తండ్రిని నిందించి ఉన్న చరాస్తులను పంచుకొని అప్పుల బాధ్యత తీసుకోరు. అప్పులకు ఇంటిని స్ధిరాస్తిని గోపాలం స్వాధీనం చేసుకుంటాడు. వ్యాపారం మొదలు పెట్టిన పెద్దకొడుకు వ్యాపార మెలకువలు తెలియక దివాళా తీస్తాడు. అతడి ద్వారా పబ్బం గడుపుకున్న స్నేహితులు ముఖం చాటేస్తారు. రెండవవాడు తన వాటా గా వచ్చిన డబ్బు నాటకం కంపెనీ లో ఖర్చు పెట్టి గోళీ సోడాలు అమ్ముకునే స్థితి కి వస్తాడు. కూతురు ఓ మోసగాడి (రామ్మోహన్) వలలో పడుతుంది. రంగయ్య భార్యతో సహా ఒక పాడు బడిన గుడిలో తల దాచుకుంటూ ప్రకృతి సిధ్దంగా లభించే చీపుర్లు, ఆకులు శ్రమ పెట్టుబడిగా మళ్లీ మొదటినుండి ప్రారంభించి చిగురు తొడుగుతాడు. పనీ పాటాలేక దుర్వ్యసనాల పాలిట పడ్డ వారికి ఒక దారి చూపుతూ తనతో పాటు పదిమందికి చేదోడు వాదోడు గా ఉండి తిరిగి డబ్బు సంపాదిస్తాడు. తమ ఈ పరిస్థితికి గోపాలమే కారణమని కొడుకులు కూతురు గోపాలం ఇంటికి వెళతారు. అక్కడ రంగయ్య భార్యఉండి వ్యాపారంలో నష్టం లేదని అప్పులనగానే భయపడి కవరు తీసుకోలేదని కవరులో నిజానికి ఆస్తుల వివరాలు ఉన్నాయని చెప్పి గోపాలం కొడుకు కూతురు రంగయ్య కొడుకు కూతుర్లు డబ్బు వృధా చేసుకోకుండా కాపాడేరని తెలుసుకుంటారు. రంగయ్య పెద్దకొడుకుకు గోపాలం కూతురుని, రెండో కొడుకుకు ఇది వరకే నాటకం లోవేషం ఆశ చూపి తల్లిని చేసిన యవతి (విజయలలిత)ను, కూతురు కు గోపాలం కొడుకుతో వివాహం జరుగి కథ సుఖాంతం అవుతుంది.

తారాగణం

మార్చు
  • రంగయ్యగా ఎస్. వి. రంగారావు
  • గోపాలంగా చిత్తూరు నాగయ్య
  • రంగయ్య భార్యగా అంజలీ దేవి
  • కృష్ణ
  • ఆనంద్ గా, శోభన్ బాబు
  • ఆశగా వాణిశ్రీ
  • భారతి
  • పద్మనాభం
  • విజయలలిత
  • రామ్మోహన్
  • బొడ్డపాటి

పాటలు

మార్చు
  1. ఇల్లే కోవెల చల్లని వలపే దేవత ఇల్లు వలపు నోచిన వనితే - ఎస్. జానకి
  2. ఓహొ ఊరించే అమ్మాయీ నేనేమి చేసేది అందాల కన్నులు - పి.బి. శ్రీనివాస్, సుశీల
  3. గువ్వలాంటి చిన్నది తారాజువ్వలాంటి చిన్నది వెతుక్కుని వస్తే - సుశీల
  4. చెయ్యి చెయ్యి కలుపు చెంప చెక్కిలి కలుపు కేరింతలతో - పి.బి.శ్రీనివాస్,సుశీల
  5. ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనట - ఘంటసాల - రచన: ఆరుద్ర
  6. నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు ఊహూ నా ఊహలు - సుశీల
  7. లక్ష్మీ నివాస నిరవర్జ్య గుణైక సింధో ( సుప్రభాతం) - ఘంటసాల
  8. లక్ష్మీ నివాస నిరవర్జ్య గుణైక సింధో ( సుప్రభాతం) - ఘంటసాల బృందం
  9. సోడా సోడా జిల్ జిల్ సోడా సోడా సోడా ఆంధ్ర సోడా గోలి సోడా - పిఠాపురం
  10. కాలేజీ జీతం కట్టమంటే ,(పద్యం) మాధవపెద్ది
  11. బోటీరో మేనకా మనకు(పద్యం)మాధవపెద్ది.

మూలాలు

మార్చు
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.