శోభన్ బాబు

ప్రముఖ సినీ నటుడు

శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు (జనవరి 14, 1937 - మార్చి 20, 2008) విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథా నాయకుడు. అధికంగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించాడు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు.

శోభన్ బాబు
జననం
ఉప్పు శోభనాచలపతి రావు

(1937-01-14)1937 జనవరి 14
మరణం2008 మార్చి 20(2008-03-20) (వయసు 71)
ఇతర పేర్లునటభూషణ
క్రియాశీల సంవత్సరాలు1959–1996
జీవిత భాగస్వామి
శాంతకుమారి
(m. 1958)
పిల్లలు4

బాల్యం

శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. జనవరి 14, 1937న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. కృష్ణా జిల్లా చిన నందిగామ ఇతని స్వగ్రామం.. తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు. మైలవరం ఉన్నత పాఠశాలలో చదివేరోజుల్లో శోభన్ బాబు నాటకాల పైన ఆసక్తి పెంచుకొని అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు. గుంటూరు ఎ.సి.కాలేజిలో 'పునర్జన్మ' వంటి నాటకాలలో మంచి పేరు సంపాదించుకొన్నాడు. ఉన్నత పాఠశాల చదువు పూర్తి అయిన తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదువు పూర్తి చేసాడు.

చిన్నప్పటినుండి సినిమాలంటే చాలా ఇష్టపడేవాడినని, తిరువూరులో కీలుగుర్రం తను చూసిన మొదటి సినిమా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. పాతాళ భైరవి, మల్లీశ్వరి, దేవదాసు తను భాల్యంలో బాగా అభిమానించిన సినిమాలని, మల్లీశ్వరి సినిమాను 22 సార్లు చూశానని చెప్పాడు.

సినీరంగ ప్రవేశం

మద్రాసులో లా కోర్సులో చేరినప్పటికీ నటన పైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఉదయం కాలేజీకి వెళ్ళి, మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవాడు. అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నాడు. పొన్నులూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు. ఆ సినిమా 17 సెప్టెంబరున 1959న విడుదల అయ్యింది కాని విజయవంతం కాలేదు. ఆ సమయంలోనే చిత్రపు నారాయణరావు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక మునికుమారునిగా నటించాడు. 1960 జూలై 15న విడుదలయిన ఆ సినిమా కాస్త విజయవంతమవ్వడంతో శోభన్ బాబు పేరు రంగంలో పరిచయమయ్యింది. అప్పటికే పెళ్ళయి భార్య పిల్లలతో ఉన్న శోభన్ బాబు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించసాగాడు. గూఢచారి 116, పరమానందయ్య శిష్యుల కథ (శివుని వేషానికి రూ. 1500 పారితోషికం), ప్రతిజ్ఞా పాలన (నారదుని వేషానికి రూ.750 పారితోషికం) ఈ సమయంలో నటించిన కొన్ని సినిమాలు. ఆ కాలంలో శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చిన పాత్రలు: అభిమన్యుడిగా నర్తనశాలలో, అర్జునుడుగా భీష్మలో, లక్ష్మణుడుగా సీతారామకల్యాణంలో, కృష్ణునిగా బుద్ధిమంతుడులో. ఈ సమయంలో సహాయ పాత్రలు లభించడంలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తనకు ఎంతో సహాయం చేశారని శోభన్ బాబు చెప్పాడు.

విజయపరంపర

శోభన్ బాబు వీరాభిమన్యు చిత్రంలో హీరోగా అభిమన్యుడి పాత్రలో తన నటనా చాతుర్యాన్ని చాటిచెప్పాడు. వెంటనే లోగుట్టు పెరుమాళ్ళకెరుక సినిమాలో సోలో హీరోగా నటించాడు. అది కూడా అంత విజయవంతం కాలేదు. పొట్టి ప్లీడరు విజయవంతమైంది. పుణ్యవతి చిత్రం బాగా ఆడకపోయినా శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చింది. బి.ఎన్.రెడ్డి తీసిన బంగారు పంజరం విమర్శకుల మన్ననలను పొందింది. 1969లో విడుదలయిన మనుషులు మారాలి సిల్వర్ జూబిలీ చిత్రం శోభన్ బాబు నట జీవితంలో మైలురాయి. ఆ చిత్రంతో హీరోగా శోభన్ బాబు స్థిరపడ్డాడని చెప్పవచ్చును. ఆ తర్వాత చెల్లెలి కాపురం, దేవాలయం, కళ్యాణ మంటపం, మల్లెపువ్వు మొదలయిన చిత్రాల ఘన విజయాలతో అగ్ర నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకొన్నాడు.

మానవుడు దానవుడు చిత్రం శోభన్ బాబుకు మాస్ ఇమేజిని తెచ్చిపెట్టింది. బాపు దర్శకత్వంలో కృష్ణునిగా బుద్ధిమంతుడు సినిమాలోను, రామునిగా సంపూర్ణ రామాయణం సినిమాలోను నటించాడు. అప్పటికే ఈ పాత్రలలో ఎన్టీయార్ స్థిరమైన ముద్ర వేసుకొన్నా ఈ చిత్రాలు విజయవంతమయ్యాయి.

వైవిధ్యం

అనతి కాలంలో దేవత, పండంటి కాపురం, కార్తీక దీపం, రఘు రాముడు వంటి కుటుంబ కథా చిత్రాలలో నటించి మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడయ్యాడు. దాదాపు అన్ని కుటుంబ చిత్రాలలో బాధ్యత గల కుటుంబ పెద్దగా, భార్యను ప్రేమించి గౌరవించే వ్యక్తిగా గౌరవప్రథమయిన పాత్రలు పోషించాడు. అప్పట్లో అమ్మాయిలు తమకు కాబోయే భర్త శోభన్ బాబులా అందగాడు మాత్రమే కాకుండా ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకొనేవారు!

రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు మొదలయిన పౌరాణికి పాత్రలే కాకుండా కొన్ని జానపద చిత్రాల్లో కూడా నటించాడు. అప్పటికే అగ్ర హీరోగా ఉన్నా, కాంబినేషన్ చిత్రాలలో ఎటువంటి భేషజాలు లేకుండా సాటి హీరోలతో నటించేవాడు. కొన్ని కాంబినేషన్ చిత్రాలు: ఎన్‌టీఆర్ తో: ఆడపడుచు, విచిత్ర కుటుంబం. అక్కినేని నాగేశ్వరరావుతో: పూలరంగడు, బుద్ధిమంతుడు. ఘట్టమనేని కృష్ణతో: మంచి మిత్రులు, ఇద్దరు దొంగలు

అతనికున్న బిరుదులు: నటభూషణ, సోగ్గాడు, ఆంధ్రా అందగాడు.

ఆణిముత్యాలు

శోభన్ బాబు నటజీవితంలో ఎన్నో చిత్రాలు ఘనవిజయం సాధించి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొన్ని తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి.

  • మనుషులు మారాలి: యావత్ తెలుగు సినీ అభిమానులను ఉలిక్కిపడేలా చేసిన ఈ సినిమాలో కార్మిక నాయకుడిగా శోభన్ బాబు నటన అద్వితీయం. ఈ సినిమా అప్పట్లో 25 వారాలు ఆడింది.
  • చెల్లెలి కాపురం: అప్పటికే అందాల నటుడిగా ఆంధ్రలోకమంతా అభిమానులను సంపాదించుకున్న శోభన్ బాబు నట జీవితంలో ఈ చిత్రం కలికితురాయి. అంద వికారుడయిన రచయితగా చెల్లెలి కోసం తాపత్రయ పడే అన్నగా ఆయన నటన చిరస్మరణీయం.
  • ధర్మపీఠం దద్దరిల్లింది: తన కన్న కొడుకులు ముగ్గురూ అవినీతికి పాల్పడుతుంటే చూసి సహించలేక ముగ్గురినీ అంతంచేసే తండ్రిగా శోభన్ బాబు ప్రదర్శించిన నటన అసామాన్యం.

అవార్డులు-రివార్డులు

  • ఫిల్మ్ ఫేర్ అవార్డు: 1971, 1974, 1976, 1979
  • ఉత్తమ నటుడిగా నంది అవార్డు: 1969, 1971, 1972, 1973, 1976
  • సినీగోయెర్స్ అవార్డు: 1970,1971,1972,1973,1974,1975,1985,1989
  • వంశీ బర్కిలీ అవార్డు: 1978, 1984, 1985
  • కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటుడు అవార్డు: బంగారు పంజరం సినిమాకు 1970లో

వ్యక్తిగత జీవితం

శోభన్ బాబు గారి భార్య కుటుంబసభ్యుల ఫొటో నెట్ లో ఎక్కడా దొరకటం లేదు. శోభన్ బాబుకు మే 15, 1958న కుమారితో వివాహమయినది. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. వారి పేర్లు : కరుణ శేషు, మృదుల, ప్రశాంతి, నివేదిత.

 
శోభన్ బాబు

సినీరంగంలో ఉన్నా శోభన్ బాబును క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఉదాహరణగా చెప్పుకుంటారు. అతను ఎన్నడూ ఎటువంటి వ్యసనాలకు లోను కాలేదు. ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ అయిన వెంటనే ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవాడు. వృత్తికంటే కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యతనిస్తూ అదే విషయాన్ని తోటినటులకు చెప్పేవాడు.

శోభన్ తన సంతానాన్ని ఎన్నడూ సినీరంగంలోకి తీసుకొని రాలేదు. వయసు పైబడుతున్నపుడు కూడా హీరోగా నటించాడే తప్ప చిన్న పాత్రలు పోషించలేదు. వ్యక్తిగా శోభన్ బాబు చాలా నిరాడంబరుడు. ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు. డబ్బును పొదుపు చేయడంలో, మదుపు చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఎందరికో సహాయాలు, దానాలు చేసినా, ఎందరికో ఇళ్ళు కట్టించినా ప్రచారం చేయించుకోలేదు.

చివరి దశ

ఎన్నటికీ ప్రేక్షకులు మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బాబు తన 59వ ఏట నటజీవితానికి స్వస్తి చెప్పాడు. 220 పైగా చిత్రాలలో నటించి 1996లో విడులయిన హలోగురూ చిత్రంతో తన 30 ఏళ్ళ నటజీవితానికి స్వస్తి చెప్పి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపేవాడు. శోభన్ బాబు 2008, మార్చి 20 ఉదయం గం.10:50ని.లకు చెన్నైలో మరణించాడు.

100 రోజులు పైన ఆడిన చిత్రాలు

నటించిన సినిమాలు

చిత్ర ప్రముఖుల నివాళులు

శోభన్ బాబు మరణ సందర్భంగా తెలుగు చలన చిత్రరంగానికి చెందినవారు ఘనంగా నివాళులు అర్పించారు. దాసరి నారాయణ రావు, చిరంజీవి, ఇంకా ఎందరో సినిమా కళాకారులు ఆ నట భూషణుని అంత్య క్రియలకు హాజరయ్యారు:

శోభన్ బాబు మృతి వార్త విని షాక్ కు గురయ్యానని అక్కినేని నాగేశ్వరరావు అన్నాడు. సినీ రంగానికి దూరమై శోభన్ బాబు భార్యాపిల్లలతో ప్రశాంతంగా ఉంటున్నారని అన్నాడు. శోభన్ బాబు మృతి సినిమా రంగానికి తీరని లోటు అని నటుడు మోహన్ బాబు అన్నాడు. శోభన్ బాబు మరణించారనే వార్తను నమ్మలేకపోతున్నానని నిర్మాత రామానాయుడు అన్నాడు. తాను శోభన్ బాబుతో ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశానని, తమ కుటుంబ సభ్యుడిగా మెలిగేవాడని అన్నాడు. శోభన్ బాబు మంచి నటుడే కాకుండా మంచి వ్యక్తి అని అన్నాడు. శోభన్ బాబు మృతికి దర్శకుడు రాఘవేంద్రరావు కూడా సంతాపం వ్యక్తం చేశాడు. దర్శకుడిగా రాఘవేంద్రరావుకు శోభన్ బాబుతో తొలి సినిమా బాబు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో కూడా శోభన్ బాబు గోరింటాకు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించాడు.

సినీ నటుడు శోభన్ బాబు మృతికి అలనాటి హీరోయిన్ వాణిశ్రీ కన్నీరు పెట్టుకుంది. శోభన్ బాబు మంచి నటుడే కాకుండా మంచి వ్యక్తి అని ఆమె అన్నది. మరో నటి శారద కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. శోభన్ బాబుతో కలిసి ఆమె బలిపీఠం వంటి హిట్ చిత్రాల్లో నటించింది. జీవన తాత్వికతను శోభన్ బాబు వివరిస్తూ ఉండేవారని వాణిశ్రీ అన్నది. శోభన్ బాబు మరణ వార్త విని సినీ పరిశ్రమ యావత్తు శోకసముద్రంలో మునిగిందని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నాడు.

తాను పెద్దన్నయ్యను కోల్పోయానని సినీ నటుడు చంద్రమోహన్ అన్నాడు. శోభన్ బాబు మరణవార్త విని ఆయన కన్నీరు మున్నీరు అయ్యాడు. జీవితంలో తనకు శోభన్ బాబు ఎంతో మేలు చేశారని, తన తల్లిదండ్రులు పోయినప్పుడు కూడా తనకు ఇంత బాధ కలుగలేదని అన్నాడు. సినీ పరిశ్రమలో శోభన్ బాబును మించిన మంచి వ్యక్తి లేడని, దేవుడిచ్చిన అన్నయ్య శోభన్ బాబు అని ఆయన అన్నాడు. తాను నిన్ననే ఫోనులో మాట్లాడానని, శోభన్ వద్దకు వెళ్లేందుకు తాను సిద్ధపడుతున్న సమయంలో ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని అన్నాడు.

మూలాలు

వనరులు