వకుళాభరణం రామకృష్ణ
డాక్టర్ వకుళాభరణం రామకృష్ణ (1938-) చరిత్రపరిశోధకుడు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. ఆల్ ఇండియా హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ చరిత్రకారుల సంఘం వ్యవస్థాపకుడు. రెండువందల మంది చరిత్రకారుల సహాయంతో తాను ప్రధాన సంపాదకుడుగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర-సంస్కృతి పేరుతో 5 సంపుటాలు విడుదల చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకా పాకల ఆయన స్వగ్రామం. విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్, సి.వి.ఆర్ కాలేజ్‌లో చరిత్రలో బి. ఎ చేశాడు. వాల్తేరులో ఎం.ఏ పూర్తి కాగానే కావలి కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. ముగ్గురు పిల్లలు పుట్టారు. ఢిల్లీలోని జెఎన్‌టీయూ లో పి.హెచ్.డిలో చేరాడు. సర్వేపల్లి రాధాకృష్ణ కుమారుడు సర్వేపల్లి గోపాల్ ఈయనకు గైడ్. ఆయన సిద్ధాంత గ్రంథం ఆంధ్రదేశంలో సంస్కరణోద్యమాలు తెలుగులోకి అనువాదమై నాలుగు ముద్రణలు అయ్యింది. పీహెచ్‌డీ పూర్తి కాగానే మళ్లీ కావలికి వెళ్లి పాతికేళ్లు అక్కడే పనిచేశారు. అందులో నాలుగేళ్లు ప్రిన్సిపాల్‌గా చేశారు. హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పనిచేశారు.
భావాలు, అనుభవాలు
మార్చు- గాలివాటంగా సాగిపోయే జీవితాలకు కూడా ఎప్పడో ఒకప్పుడు తనను తాను నిరూపించుకునే అద్భుతమైన అవకాశాలు వస్తాయి. వాటిని అర్థం చేసుకుంటే గానీ, జీవితం సార్థకం కాదు.
- జెన్‌టీయూలో పిహెచ్‌డీ చేస్తున్న కాలంలోనే బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది. అప్పుడు మేము మత భావజాలానికి వ్యతిరేకంగా అక్కడ చాలా కార్యక్రమాలు చేశాం. అన్ని మతాలూ, అన్ని కులాలూ ఉన్న దేశం మనది. ఈ దేశానికి సంకీర్ణ సంస్కృతి ఒక్కటే మార్గం. అది పోగొట్టుకున్న నాడు ఈ దే శానికి ఒక వ్యక్తిత్వమే లేకుండా పోతుంది. ఈ భావజాలానికి, నా వ్యక్తిగత నిర్ణయాలకూ మధ్య ఒకసారి ఘర్షణ వచ్చింది. నా కూతురు, ఆమె భర్త ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న రోజులవి. నా కూతురు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు రంజాన్ రోజున అబ్బాయి పుట్టాడు. వాడికి ఏదైనా ఒక ముస్లిం పేరు పెట్టాలన్న ఆలోచన నాకు కలిగింది. ఈ విషయాన్నే నా కూతురు, అల్లుడి ముందు ప్రస్తావించాను. అయితే ఇది నా భావజాలాన్ని ఆ పిల్లాడి మీద రుద్దినట్టు అవుతుందేమో అని కూడా ఒకసారి ఆలోచించమని చెప్పాను. అది చాలా గొప్ప ఆలోచన. మీ భావజాలాన్ని రుద్దినట్లు కాదని ఇద్దరూ అన్నారు. నేను కొంతమంది ముస్లిం సోదరుల సలహాతో వాడికి ఇర్ఫాన్ (వివేకవంతుడు) అనే పేరు పెట్టాను. ఆ తర్వాత ఒకసారి కొడుకుతో సహా ఢిల్లీ వెళుతున్న నా కూతురును హైదరాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లి ఏపి ఎక్స్‌ప్రెస్ ఎక్కించి ఇంటికి వచ్చాను.
అయితే, రైల్లో బాంబు పెట్టారన్న వదంతి కారణంగా మార్గ మధ్యంలో ఎక్కడో రైలు ఆపేశారని నా కూతురు ఫోన్ చేసింది. ప్యాసెంజర్ల లిస్టులో నా మనవడి పేరు చూసిన పోలీసులు నా కూతురు వద్దకు వచ్చి ఆ బాంబులు పెట్టింది ముస్లింలే అన్న భావనతో ఇర్ఫాన్ ఎవరని అడిగారట. విషయం తెలిసిన మా అమ్మాయి మేము హిందువులమే. నా పేరు విద్య అని చెప్పింది. మీరు హిందువులే అయితే మీ అబ్బాయికి ఇర్ఫాన్ అని ఎందుకు పెట్టారు? అంటూ పోలీసులు నిలదీశారు. మా అమ్మాయి గట్టిగా సమాధానం చెప్పాక పోలీసులు వెళ్లిపోయారట. ఆ తర్వాత ఒకరోజు మా అల్లుడు, కూతురు సమక్షంలో మళ్లీ ఆ ప్రస్తావన తెచ్చాను. ఇలాంటి సమస్యలు మునుముందు కూడా ఎన్నో రావచ్చు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అబ్బాయి పేరు మార్చుకోవచ్చు అన్నాను. సమస్యలు వచ్చినా సరే! ఆ పేరు మార్చే ప్రసక్తే లేదంటూ వారిద్దరూ కరాఖండిగా చెప్పేశారు. నా మనమడు ఇప్పటికీ ఆ పేరుతోనే కొనసాగుతున్నాడు. నిర్ణయాలంటూ తీసుకున్నాక వాటి తాలూకు కష్టనష్టాలకు సిద్ధం కావాలి.[1]