వరదా వెంకటరత్నం
వరదా వెంకటరత్నం ప్రముఖ చిత్రకారులు. చిత్రకళకు విశేష ప్రాచుర్యం కలిగించి వందలాదిమంది శిష్యులను తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి.చిత్రకళపై ఆసక్తి ఉన్నవారికి తన చిత్రశాలలో చేర్చుకుని బీదలకు ఆర్థిక సహాయమిస్తూ చిత్ర రూపురేఖలో, వర్ణ ప్రయోగంలో, చతురతలూ, కళామెళుకువలూ బోధిస్తూ ఉత్తమ శిష్యులను తయారుచేసిన మహా తపస్వి ఆయన.
వరదా వెంకటరత్నం | |
---|---|
జననం | వరదా వెంకటరత్నం అక్టోబరు 10 1895 విశాఖపట్నం జిల్లా అలమండ |
మరణం | 1963 |
ఇతర పేర్లు | వరదా వెంకటరత్నం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | చిత్రకారులు |
జీవిత భాగస్వామి | పాపాయమ్మ |
తల్లిదండ్రులు | కీ.శే. సూర్యనారాయణ కీ.శే. అమ్మడు |
జీవిత విశేషాలు
మార్చుఈయన విశాఖపట్నం జిల్లా అలమండ గ్రామంలో సూర్యనారాయణ, అమ్మడు అనే పుణ్యదంపతులకు అక్టోబరు 10 1895 న జన్మించారు.చిన్నతనంలో తల్లి మరణించింది. తన పెద్దనాన్నగారు అయిన తమ్మయ్య గారు ఆమె సతీమణి చిట్టెమ్మ గారు ఆయనను చేరదీసి పెంచారు. తరువాత తమ్మయ్యగారు అలమండ నుండి రాజమహేంద్రవరానికి వచ్చారు. తన తండ్రి సూర్యనారాయణ ద్వితీయ వివాహం చేసుకుని అలమండ గ్రామంలో స్థిరపడ్డారు. వెంకటరత్నం గారు శ్రీ వీరేశలింగం స్కూలులో మెట్రిక్ వరకు చదివి ప్యాసయ్యారు.
చిత్రకారునిగా
మార్చు1914 లో ఆయనను రాజమహేంద్రవరం మ్యునిసిపల్ చైర్మన్ జయరామస్వామి గారు కుల్డ్రే గారి ప్రోత్సాహం వలన మ్యునిసిపల్ గరల్స్ హైస్కూలులో డ్రాయింగు ఉపాధ్యాయునిగా నియమించారు.చిన్ననాడే ఆయనకు దామెర్ల రామారావు గారితో సాహచర్యం ఏర్పడింది. వారు చిత్రాలు గీస్తుండేవారు. ప్రభుత్వ మోడల్ స్కూల్ చదువు పూర్తి చేసుకునేటప్పటికి ఆ మిత్ర ద్వయానికి వి.ఎస్.రాం గారితో పరిచయం యేర్పడింది. శ్రీ సత్యవోలు గున్నేశ్వరరావు గారి నాటక కంపెనీ వెనుక తెరలు పెయింటింగ్ చేయడానికి మద్రాసు నుండి శ్రీరాం గారు ప్రత్యేకంగా వచ్చారు. రామారావుగారు, వెంకటరత్నం గారు శ్రీరాం గారి చిత్రకళను పరిశీలించే కాలంలో ప్రఖ్యాతి చిత్రకారులు చేమకూర భాష్యకారులు, చేమకూర సత్యనారాయణ గార్ల పరిచయం యేర్పడింది. శ్రీ ఒ.జె.కుల్డ్రే గారు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గా ఉండేవారు. ఆ కళాశాలలో విద్యార్థిగా ఉన్న దామెర్ల వెంకట్రావుగారు తన తమ్ముడు రామారావు గారిని, వెంకటరత్నం గారిని కూల్డ్రే గారిని పరిచయం చేసారు. అప్పటి నుండి వీరిద్దరూ గీసిన చిత్రాలను కూల్డ్రే గారు పరిశీలించేవారు.అనుకరణ చిత్రాలు వ్రాయవద్దనీ, ప్రత్యక్షంగా చూసిన చిత్రాలనే వ్రాయమని, యదాతథంగా ఉన్న రంగులనే చిత్రించాలని సలహాలిచ్చేవారు. ఆయన ప్రోత్సాహం వారి చిత్రకళకు మెరుగులు దిద్దింది. రామారావుగారు బొంబాయిలో చిత్రకళ నేర్చుకోవడానికి వెళ్ళారు. కానీ వెంకటరత్నం ఆర్థిక పరిస్థితి బాగోలేనందున వెళ్ళలేకపోయారు.
వ్యక్తిగత జీవితం
మార్చురాజమండ్రి వాస్తవ్యులు అయిన ఇంజరపు వీరేశలింగం గారి కుమార్తె పాపాయమ్మను వివాహమాడారు. 1920 లో ప్రభుత్వ కళాశాలలో డ్రాయింగు టీచరుగా చేరారు.1921 లో రామారావు గారు బొంబాయినుండి రాజమహేంద్రవరం వచ్చారు.అసహాయుడై, దుర్బలుడై, క్రుంగి క్రుశించిపోతున్న వెంకటరత్నం గారిని అండగా ఉండి కుంచెనందించి ప్రోత్సాహపరచి చిత్రకళా వ్యాసంగం ప్రారంభించారు. వేకువజామునే ప్రకృతి దృశ్యాల ప్రతి కృతులు, ఇంటివద్ద రేఖావర్ణ చిత్రాలు, సాయంత్రం ప్రకృతి దృశ్యాల పరిశీలన చేస్తూ చిత్ర రచనను పెంపొందించుకున్నారు. రామారావు గారు 1923 లో "ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్"ను ప్రారంభించారు.
ఆ కాలంలో వెంకట రత్నం ఉబ్బసవ్యాధితో అస్పస్థులైనారు. ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. విధివైపరీత్యం వలన రామారావుగారె 8.3.1925 న మరణించారు. రామారావు భార్య సత్యవాణిగారిని వెంకటరత్నం చిత్రకళోన్నతులుగా చేసారు.ఆమెకు 1938 లో ప్రభుత్వ స్త్రీల బోధనా పాఠశాలలో చిత్రకళా ఉపాధ్యాయినిగా ఉద్యోగం వచ్చింది.ఆమె చిత్రాలు అనేక పత్రికలలో ప్రచురింపబడ్దాయి.
వెంకటరత్నం గారికి ఇద్దరు మగపిల్లలు జన్మించారు. ఆయన భార్యకు పురిటిలో మసూచి వ్యాధి సోకడం వల్ల పిల్లలూ, ఆమె కూడా 1926లో మరణించారు. ఆ బాధను మరచి పోవడానికి ఆయన చిత్రకళపై నిరంతర దృష్టి కేంద్రీకరించుకున్నారు.
చిత్రకళా బోధనాచార్యునిగా
మార్చుఆయన ఇంటివద్ద తన శిష్యులకు చిత్రకళ నేర్పుతుండేవారు. బీద విద్యార్థులకు ఆర్థిక సహాయం కూడా చేసేవారు.మిత్రుడు రామారావు పేరును చిరస్థాయిగా ఉంచాలనే తలంపుతో ఆయన 1925 లో "రామారావు ఆర్ట్ గ్యాలరీ"ని ఏర్పాటుచేసారు. ఇది రామమండ్రిలో కళాకేంద్రంగా విలసిల్లింది. రామారావు స్థాపించిన స్కూలు "రామారావు స్కూలు ఆఫ్ ఆర్ట్స్ " అనే పేరుననె వెంకటరత్నం ప్రిన్సిపాల్ గా ఉంటూ సుమారు నాలుగు దశాబ్దాలుగా తన మిత్రుని శాంతికీ, ఆశయసిద్ధికీ, అనంతరం శ్రమిస్తూ వందలాది మంది శిష్యులకు గురువులుగా-విజ్ఞాన మహా మనీషిగా ఆదర్శజీవి అయినారు.
ఆయన 1963 లో మరణించారు.[1]
చిత్రాలు
మార్చుఆయన చిత్రాలు భారతిలో 1925 ఏప్రిల్,1927 నవంబరు,1931 జనవరి,1933 అక్టోబరు లలో ప్రముఖంగా ప్రచురించబడ్దాయి.