వల్లూరి బసవరాజు

వి.బి.రాజుగానే ప్రసిద్ధులైన వల్లూరి బసవరాజు స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణా ప్రాంతంలో నైజాం పాలనకు వ్యతిరేకంగా, ఆంధ్రోద్యమకారుడు, ప్రముఖ రాజకీయనాయకుడు. హేతువాది.

1952లో హైదరాబాదు రాష్ట్ర మంత్రిగా వల్లూరి బసవరాజు

వల్లూరి బసవరాజు 1914లో బాపట్లలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. 1934లో మద్రాసు గిండిలోని ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పొందారు. చదువు పూర్తయిన తర్వాత 19 యేళ్ల వయసులో హైదరాబాదులో ఇంజనీరుగా స్థిరపడ్డాడు. హైదరాబాదులో స్థిరపడిన మొదటి ఏడాదే, 1934లోనే ఖమ్మం మెట్టులో జరిగిన మూడవ నైజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలకు ఒక సందర్శకుడుగా హాజరయ్యాడు. ఆ రోజుల్లో రాజకీయాభిప్రాయాలను వ్యక్తం చేయటానికి గాని, కనీసం సంఘ సంస్కరణలను చర్చించడానికిగాని సంస్థాన ప్రభుత్వం అనుమతి ఇచ్చేవారు కారు. అక్కడ సురవరం ప్రతాపరెడ్డితో ఏర్పడిన సాన్నిహిత్యం వి.బి.రాజుకు తెలంగాణా ప్రజలకు సంబంధించిన కీలకమైన అనేక ముఖ్య విషయాలపై నేను అభిప్రాయాలు ఏర్పరచుకొనటానికి అవకాశం కలిగించింది. 1936లో షాద్‌నగర్‌లో అయిదో ఆంధ్ర మహాసభ సభాస్థలి నిర్మాణ బాధ్యత నిర్వర్తించారు. 1937లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షులైతే వి.బి.రాజు కార్యదర్శి. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం సాహితీవేత్తలకు జాతీయవాదులకు, తెలుగు భాషా ప్రేమికులందరికీ కేంద్రంగా ఉండేది. సురవరం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో వెలువడే గోలకొండ పత్రికలో ఆయన తెలంగాణా ప్రాంతాభివృద్ధికోసం రచనలు చేశారు. ఆంధ్ర మహాసభ కార్యకర్త.

నిజాం రాష్ట్ర రైల్వే, రోడ్డు రవాణా సంస్థల కార్మిక సంఘాలకు, అఖిలభారత ఏర్‌వేస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కి ఆయన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1950 జూన్ 12న వెల్లోడీ మంత్రివర్గంలో కార్మిక పునరావాసశాఖ మంత్రి. 1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో సికిందరాబాదు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఉన్నారు. 1950లో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో ప్రణాళికా మంత్రి. దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాల్లో కూడా పదవులు నిర్వహించారు. ప్రణాళికశాఖ మంత్రిగా ఆంధ్ర ప్రదేశ్‌లో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పడటానికి కారకులయ్యారు. మంత్రి వర్గం నుండి బయటకు వచ్చాక ఆయన ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌గా నియమితులయ్యారు. రెండేళ్ళ పదవీకాలంలో మొదటిసారిగా రాష్ట్రంలో రాత్రి బస్ సర్వీసును పరిచయం చేసింది ఆయనే.[1]

1967లో పెద్దఎత్తున చెలరేగిన తెలంగాణా ఉద్యమంలో వి.బి.రాజు మనస్తాపంతో తన మంత్రి పదవి త్యజించారు. 1970నుండి రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా కూడా పనిచేశారు.

1986 డిసెంబరు తొమ్మిదో తేదీన మరణించారు.

మూలాలు

మార్చు
  1. "జ్ఞాపకాల జాడలలో ఓ క్రాంతదర్శి". సాక్షి. No. March 26, 2014. Retrieved 24 December 2014.