బాపట్ల

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా పట్టణం, బాపట్ల జిల్లా కేంద్రం

బాపట్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, బాపట్ల జిల్లా ముఖ్యపట్టణం. ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్, దక్షిణ భారతదేశపు తొలి వ్యవసాయ విద్యాలయం కలిగివుంది. ఐదో శతాబ్దం నాటిదైన భావనారాయణ స్వామి ఆలయం, దగ్గరలోని సూర్యలంక సముద్రతీరం, ప్రముఖ పర్యాటక కేంద్రాలు. 2022 ఏప్రిల్ 4కు ముందు ఈ పట్టణం, గుంటూరు జిల్లాలో భాగంగా ఉండేది.

పట్టణం
పటం
నిర్దేశాంకాలు: 15°54′18″N 80°28′05″E / 15.905°N 80.468°E / 15.905; 80.468
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంబాపట్ల మండలం
విస్తీర్ణం
 • మొత్తం17.92 km2 (6.92 sq mi)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం70,777
 • సాంద్రత3,900/km2 (10,000/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1058
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 8643 Edit this on Wikidata )
పిన్(PIN)522101 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

పట్టణ చరిత్ర సవరించు

 
బాపట్ల జనరల్ హాస్పిటల్

హోం రూలు ఉద్యమంపై బ్రిటిష్ ప్రభుత్వ దమననీతిని నిరసిస్తూ 1916లో బాపట్లలో సభ జరిగింది. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను విద్యార్థులు బహిష్కరించారు. వీరికోసం బాపట్లలో 1921 ఫిబ్రవరిలో ఒక జాతీయ కళాశాల నెలకొల్పబడింది. పాటిబండ్ల కోటమ్మ, వాసిరెడ్డి రాజ్యలక్ష్మమ్మ, మంతెన అన్నపూర్ణమ్మ, తిలక్ స్వరాజ్యనిధికి తమ బంగారునగలు సమర్పించారు. 1921లో చీరాల-పేరాల ఉప్పుసత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య బాపట్ల బోర్డు ఉన్నత పాఠశాల విద్యార్థి. తాలూకా కార్యాలయంలో గుమాస్తాగా పనిచేశారు. 1923 మే నెలలో బాపట్లకు చెందిన స్వాత్రంత్య సమరయోధుడు భట్టిప్రోలు సూర్యప్రకాశరావు నాగపూర్ వెళ్ళి నాగపూర్ జెండా సత్యగ్రహంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో ఉప్పు తయారు చేయడానికి, నిల్వచేయడానికి బాపట్ల తాలూకాలోని గణపవరం ఒక కేంద్రంగా ఎంపిక చేయబడింది. విదేశీవస్త్ర బహిష్కరణ ఉద్యమం సందర్భంగా 1920 ఏప్రిల్ 12న మాధవపెద్ది కాళిదాసు అధ్యక్షతన సమావేశమైన బాపట్ల బార్ అసోసియేషన్ సభ్యులందరు కోర్టులకు హాజరయ్యేటప్పుడు ఖద్దరు దుస్తులను ధరించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కనపర్తి వరలక్ష్మమ్మ బాపట్లలో మహిళలచేత రాట్నలక్ష్మీవ్రతం చేయించి ప్రతిరోజు నూలువడకాలని, ఖద్దరు దుస్తులనే ధరించాలని ప్రతిజ్ఞ చేయించారు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా బాపట్లలో నాళం రామచంద్రరావు, వేదాంతం వాసుదేవరావు, లక్కరాజ భార్గవి, మనోహరరావు, ఆచంట రంగనాయకులు నిర్బంధంలోకి తీసుకోబడ్డారు. వి.ఎల్.సుందరరావు, దేశిరాజు శర్మలు బాపట్ల తాలూకా ప్రాంతమంతా పర్యటించి ఈ ఉద్యమాన్ని నడిపారు. 1921 మార్చి 30న అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో పాల్గొనడానికి విజయవాడ వచ్చిన మహాత్మాగాంధీ తన పర్యటనలో భాగంగా ఏప్రిల్ 6వ తేదీన ప్రప్రథమంగా బాపట్లను సందర్శించారు. మరలా 1936లో బాపట్ల తాలూకాలో సంభవించిన తుపాను బీభత్సాన్ని చూడడానికి వచ్చారు. 1934లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు బాబురాజేంద్రప్రసాద్ బాపట్ల సందర్శించి టౌన్‌హాలులో జరిగిన సభలో ప్రసంగించారు. 1936వ సంవత్సరంలో అఖిల భారత కాంగ్రెస్ నాయకులు జవహర్‌లాల్ నెహ్రూ బాపట్లను సందర్శించి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన సభలో ప్రసంగించారు.

1911 సంవత్సరం 3 నెంబర్ క్రిమినల్ ట్రైబ్స్ ఆక్టు సెక్షన్ 16 ప్రకారం ఈ ప్రాంతంలో బ్రిటీష్ వారు నేరజాతులుగా ముద్రవేసిన కొన్ని కుటుంబాలకు సెటిల్మెంటుగా ఏర్పరిచారు. అతికఠినమైన ఈ చట్టాన్ని అమలుచేసేందుకు ఏర్పరిచిన సెటిల్మెంట్లలో ఒకటి బాపట్లలోనూ ఏర్పాటుచేశారు. ఆ చట్టంలోని సెక్షన్ 10బి ప్రకారం ఆయా జాతులవారు కుటుంబాలతో సహా ఎవరెవరు ఎక్కడ నివసిస్తున్నదీ, ఏయే ప్రాంతాలకు తమ నివాసాలు మార్చుకుంటున్నది, అందుకు గల కారణాలు, వారి కొత్త నివాసాలు స్థానిక పోలీసు అధికారులకు తెలియజేయాల్సివుండేది. చివరకు వారు ఊరు విడిచి కొద్దిరోజులు వెళ్ళాలన్నా ఆ గైర్హాజరు సమయానికి ముందుగా తెలియపరిచి అనుమతి పొందాల్సివుండేది. ఈ అతికఠినమైన చట్టాన్ని అమలుచేసేందుకు ఏర్పరిచిన సెటిల్మెంట్లలో ఈ ప్రాంతం కూడా ఒకటి.[2] 2022 ఏప్రిల్ 4కు ముందు ఈ పట్టణం, గుంటూరు జిల్లాలో భాగంగా ఉండేది.

పట్టణం పేరువెనుక చరిత్ర సవరించు

 
భావనారాయణస్వామి ఆలయ గోపురం

ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణ స్వామి పేరిట ఈ ఊరికి భావపురి అనే పేరు వచ్చింది. కాలాంతరాన ఆ పేరు రూపాంతరం చెంది భావపట్ల గా, బాపట్ల గా మారింది.

భౌగోళికం సవరించు

గుంటూరు నుండి 53 కి మీల దూరంలో గుంటూరు-చీరాల రాష్ట్ర రహదారిపై ఉన్నది.

విద్యా సౌకర్యాలు సవరించు

 
బాపట్ల ఇంజినీరింగు కళాశాల

చిరకాలముగా బాపట్ల ప్రముఖ విద్యా కేంద్రముగా విలసిల్లుచున్నది. ఆచార్య N.G.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము వారి వ్యవసాయ కళాశాల, వివిధ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ ఇంజినీరింగు కళాశాల, గృహవిజ్ఞాన కళాశాల ఇక్కడ ఉన్నాయి. ప్రైవేటు రంగంలో ఇంజనీరింగు, ఫార్మసీ మొదలైన కళాశాలలు కూడా ఇక్కడ ఉన్నాయి. వ్యవసాయ ఆధారితమైన ఎన్నో గ్రామాలకు బాపట్ల ఒక కూడలిగా, వ్యాపార కేంద్రంగా ఉంది. ఇక్కడ వ్యవసాయ కళాశాలలో అభివృద్ధి చెందిన బియ్యాన్ని బీ.పీ.టీ. రకం అంటారు.

అచార్య N.G. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గృహవిజ్ఞాన కళాశాలను బాపట్లలో 1983 లో ప్రారంభించారు. దీనిలో బి.టెక్, ఫుడ్ సైన్స్ కోర్స్ చేయవచ్చు.

పాలనా విభాగాలు సవరించు

ఇది బాపట్ల రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

శాసనసభ, లోక్ సభ నియోజకవర్గం సవరించు

పట్టణంలోని ముఖ్య ప్రాంతాలు సవరించు

పడమటి సత్రం, తూర్పు సత్రం, గడియార స్తంభం, రథం బజార్, పాత బస్టాండ్, బాలకృష్ణాపురం, దరివాడ కొత్తపాలెం, చెంగల్రాయుడుతోట, దగ్గుమల్లివారిపాలెం, హయ్యర్‌నగర్, నరాలశెట్టిపాలెం, వివేకానందకాలనీ, ఇమ్మడిశెట్టిపాలెం, విజయలక్ష్మీపురం, మాయాబజార్, ఇస్లాంపేట, రైలుపేట, జమెదార్ పేట, ఆనందనగర్,ఎస్.ఎన్.పి.అగ్రహారం.

దర్శనీయ ప్రదేశాలు సవరించు

భావనారాయణస్వామి ఆలయం సవరించు

వేణుగోపాలస్వామి అంకితమిచ్చిన ఐదో శతాబ్దం నాటిదైన భావనారాయణస్వామి దేవాలయంలో స్వయంభువుగా వెలసిన క్షీర భావనారాయణస్వామి దేవేరి సుందరవల్లితో వున్నారు. ఈ దేవాలయం భారత పురాతత్వ సర్వేక్షణ నియంత్రణలో వుంది. పవిత్రోత్సవం, రథోత్సవం పండుగలు ఘనంగా జరుపుతారు. [3]

శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయం సవరించు

స్థానిక ఎస్.ఎన్.పి.అగ్రహారంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో వైభవంగా నిర్వహిస్తారు.

సముద్రతీరం సవరించు

బాపట్లకు 9 కి.మీ దూరంలోని సూర్యలంక వద్ద నున్న బీచ్ సముద్ర స్నానాలకు అనుకూలంగా ఉండి, పరిసర ప్రాంతంలోని ప్రజలకు విహార కేంద్రంగా ఉంది. కప్పలవారిపాలెం, పిన్నిబోయినవారిపాలెం సమీపంలో నల్లమడ వాగు,తూర్పు తుంగభద్ర, గుండంతిప్ప స్ట్రెయిట్‌ కట్‌, రొంపేరు రైట్‌ ఆర్మ్‌ డ్రెయిన్లు దీనికి దగ్గరలో సముద్రంలో కలుస్తాయి.

ప్రముఖులు సవరించు

ఇవీ చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. ఏలేశ్వరపు, రామచంద్రశాస్త్రి (1916). చెన్నపట్టణం రాజధానిలో నేరములు చేయు జాతుల చరిత్రములు (PDF). విజయవాడ: బి.కె.స్వామి. Archived from the original (PDF) on 4 March 2016. Retrieved 11 April 2015.
  3. DES 2022, p. 16.

వెలుపలి లంకెలు సవరించు

DES (2022). DISTRICT HAND BOOK OF STATISTICS - Bapatla district (PDF).

"https://te.wikipedia.org/w/index.php?title=బాపట్ల&oldid=3803862" నుండి వెలికితీశారు