వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 05వ వారం
సత్య సాయి బాబా 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు. ఇతనిని 'గురువు' అనీ, 'వేదాంతి' అనీ, 'భగవంతుని అవతారం' అనీ పలువురు విశ్వసిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి. సత్యసాయి బాబాను అనుసరించే వారి సంఖ్య 60 లక్షలు అని ఒక అంచనా కాగా కొందరు భక్తులు ఈ సంఖ్యను "5 నుండి 10 కోట్ల మధ్య" అని చెబుతారు. ఇతను సాక్షాత్తు భగవంతుని అవతారమనీ, షిరిడీ సాయిబాబాయే మరల సత్య సాయిబాబాగా అవతరించాడనీ విశ్వాసం కలవారు అంటారు. అయితే సత్య సాయిబాబాను గురించి ఇందుకు పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలు కూడా బహుళంగా ఉన్నాయి. అతను ఒక 'సామాన్య వ్యక్తి' అన్న భావం నుండి 'ప్రజలను పెడమార్గం పట్టిస్తున్నాడు' అన్నంత వరకూ వ్యాఖ్యలు ఉన్నాయి.
తనను గురించి సాయిబాబా స్వయంగా చెప్పిన కొన్ని వాక్యాలు - నేను దేవుడిని. నీవు కూడా దేవుడివే. తేడా ఏమిటంటే ఈ సంగతి నాకు తెలుసు. నీకు అసలు తెలియదు. ....మీ హృదయాలలో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయడానికే నేను వచ్చాను. నేను ఏదో ఒక మతం తరపున గాని ఒక సంఘం తరపున గాని ప్రచారానికి రాలేదు. ఒక సిద్ధాంతానికి అనుయాయులను ప్రోగుచేయడానికి రాలేదు. ..... నేనేదో మహిమలు చేస్తున్నాననీ, ఇదీ అదీ సృష్టించి ఇస్తున్నాననీ విని ఉంటారు. అది ముఖ్యం కాదు. సత్వ గుణమే ముఖ్యం. మీకు నేను ఆరోగ్యైశ్వర్యాదులను నేను ప్రసాదించేది మీ అవరోధాలను తొలగించి ఆధ్యాత్మ సాధనపై మనసు లగ్నం చేయాలన్న ఉద్దేశ్యంతోనే.
సత్యసాయి బాబా , సత్యనారాయణ రాజుగా, 1926లో పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకి, ఓ వ్యవసాయ కుటుంబంలో, అనంతపురం జిల్లాలోని, పుట్టపర్తి అనే గ్రామంలో జన్మించాడు. ....పూర్తివ్యాసం: పాతవి