వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 40వ వారం

టైటానిక్ నౌక, "వైట్ స్టార్ లైన్" అనే సంస్థ కోసం "హర్లాండ్ అండ్ వోల్ఫ్" అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఒకటి. 1912 లో దానిని మొదటిసారిగా ప్రవేశ పెట్టినపుడు ప్రపంచంలో కెల్లా అదే అతి పెద్ద ప్రయాణ నౌక. దాని మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 15, 1912 వ తేదీన ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. 1517 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. దీనివలన ఇది అపకీర్తిని మూటగట్టుకోవడమే కాకుండా చరిత్రలో అతి దురదృష్టకరమైన సంఘటనలలో ఒకటిగా మిగిలిపోయింది.


దీని నిర్మాణంలో అప్పట్లో ఉండే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన అది మునిగి పోవడం అసాధ్యం అని జనాలు నమ్మేవారు. కానీ అది మునిగిపోయి అపార ప్రాణనష్టాన్ని కలిగించడం చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. టైటానిక్ బాధితుల గురించి మాధ్యమాల ప్రచారం, నౌకలో జరిగినట్లుగా చెబుతున్న ప్రధాన సంఘటనలు, ఆతరువాత కొత్తగా ప్రవేశపెట్టబడిన నౌకాయాన న్యాయ నియమాలు, 1985లో రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వం లో కనుగొనబడిన టైటానిక్ అవశేషాలు, ఈ నౌకకు అత్యంత ప్రాముఖ్యతను సంపాదించి పెట్టాయి.

టైటానిక్ నౌక మొట్టమొదట మరియు చిట్టచివరి ప్రయాణం ఇంగ్లాండులోని సౌథాంప్టన్ నుంచి న్యూయార్క్ నగరం వరకూ సాగవలసినది. ఎడ్వర్డ్.జె.స్మిత్ నావికుడిగా ఈ ప్రయాణం, 1912, ఏప్రిల్ 10 బుధవారం ఆరంభమైంది. ఏప్రిల్ 14 ఆదివారం రాత్రి. చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత. ఆరోజు దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తూ నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. రాత్రి సమయంలో టైటానిక్ నౌక పర్వతాన్ని గుద్దుకోవడంలో నౌక కుడి వైపు 300 అడుగుల పొడవు మేరకు రాపిడికి గురై రివెట్లను బయటపడేసింది. సముద్రపు నీరు ముందు భాగపు గదులను నింపేస్తుండటంతో వాటి తలుపు వాటంతట అవే మూసుకుపోయాయి. ఐదు కంపార్ట్ మెంట్లూ నీటితో నిండిపోవడం ప్రారంభించాయి. అప్పటి నియమాల ప్రకారం ఈ నౌకలో సరిపడా లైఫ్ బోట్లు ఉన్నా నౌకలోని ప్రయాణీకులందరికీ అవి సరిపడలేదు. ......పూర్తివ్యాసం: పాతవి