వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 15వ వారం

గోల్కొండ ఒక శిధిలమయిన కోట మరియు నగరము. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాదు నగరమునకు 11 కి.మీ. దూరములో ఉంది. గోల్కొండ నగరము మరియు కోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. 1143 కాలంలో ఈ ప్రాంతాన్ని కాకతీయులు పాలిస్తూ ఉండేవారు. 200 సంవత్సరముల తరువాత వారినుండి బహమనీ సుల్తాను వశము చేసుకున్నాడని కధనం. ఇది బహుమనీ సామ్రాజ్యములో రాజధానిగా (1364-1512) ఉండేది, కానీ 1512 తరువాత సుల్తానుల రాజ్యములో రాజధానిగా చేయబడినది. గోల్కొండ అధికారులు, సైన్యం, పాలకుల కుటుంబాలు నివసించేటంత పెద్దగా ఉండేది. అక్కడ మసీదులు మరియు కోటల శిధిలాలు కూడా ఉంటాయి. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్తుల పాలన 1687 లో ఔరంగజేబు విజయముతో అంతమయినది. ఆసమయములొనే ఔరంగజేబు, కోటను నాశనంచేసి, శిధిలాలను మిగిల్చాడు. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి గాను ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచప్రసిద్ద కోహినూరు వజ్రము కూడా ఇక్కడినుండే వచ్చినదని చెబుతూ ఉంటారు. గోల్కొండలోని గనుల నుండి వచ్చిన ధనము నిజాము చక్రవర్తులను సుసంపన్నం చేశాయి. నిజాములు మొగలు చక్రవర్తులనుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత హైదరాబాదును 1724 నుండి 1948లో భారత్‌లో విలీనమయ్యేంతవరకు పాలించారు.


గోల్కొండ నాలుగు వేర్వేరు కోటలు, 87 అర్ధ చంద్రాకారపు బురుజులతోకూడిన 10 కి.మీ. పొడవు గోడ కలిగి ఉంది. కొన్ని బురుజులలో ఇంకా ఫిరంగులను నిలిపిఉంచారు. ఇంకా 8 సింహద్వారములు, 4 ఎత్తగలిగే వంతెనలు (draw bridge), బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు మొదలగునవి చాలా ఉండేవి. సింహద్వారములలో అన్నిటికంటే కిందది మరియు అన్నిటికంటే బయట ఉండే ఫతే దర్వాజా (విజయ ద్వారము) నుండే మనము గోల్కొండ కోటను చూడటానికి వెళ్తాము. ఫతే దర్వాజా నిర్మించటానికి ధ్వనిశాస్త్రమును ఔపోసన పట్టినట్లున్నారు. గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు ఆవల గోల్కొండలో అతి ఎత్తయిన ప్రదేశములో ఉన్న "బాలా హిస్సారు" వద్ద చాలా స్పస్టముగా వినిపిస్తుంది. ఈ విశేషమును ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాదసంకేతములు తెలుపుటకు ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా మిగిలిపోయింది. ...పూర్తివ్యాసం: పాతవి